ఇది నీకు తగునా శిల్పా!
యోగా అనగానే గ్లామర్ ప్రపంచంలో మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు శిల్పాశెట్టి. ఈ పొడుగు కాళ్ల సుందరి పుణ్యమా అని ఎందరో యోగా ప్రేమలో పడిపోయారు. శిల్పా యోగా డీవీడీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. యోగా చేయడంలోనే కాదు... దాని గురించి మాట్లాడడంలోనూ శిల్పా శెట్టి నిపుణురాలు. యోగా గురించి ఒక్క ప్రశ్న అడిగితే చాలు.. వంద ప్రశ్నలకు సరిపడ సమాధానం ఇచ్చేంత ఓపిక ఆమెది.
అలాంటి శిల్ప ఇప్పుడు యోగాను కూడా డబ్బు కోణంలో చూస్తుందా?
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక స్వచ్ఛందసంస్థ యోగా ఉత్సవాల్లో పాల్గొనవ లసిందిగా అడిగిందట. తాము కోరితే ఎందరో సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, శిల్పా శెట్టిని రైట్ ఛాయిస్‌గా భావించి ఆహ్వానించారట. అయితే ఆమె నుంచి ఊహించన స్పందన ఎదురైనట్లు సమాచారం. యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఆమె బారీ మొత్తంలో డబ్బులు అడిగిందట. యోగా కంటే డబ్బులు ముఖ్యమని చెప్పకనే చెప్పిందట. దీంతో ఖంగు తిన్న సంస్థ ప్రతినిధులు చేసేదేమీ లేక నిరాశతో వెనుతిరిగారట!