మంచి ఆహారంతోనే ఆరోగ్యం
శిల్పాశెట్టి
ముంబై: ఆరోగ్యం అనేది మంచి ఆహారం తీసుకోవడం వల్లే సాధ్యమవుతుందని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి స్పష్టం చేస్తోంది. ‘ఫిట్‌నెస్’ మీద పట్టున్న శిల్పాశెట్టి యోగాలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. కాగా, ఆమె ఇప్పుడు ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంపై పుస్తకం రాస్తోంది. దీని కోసం గత 7 నెలలుగా ఆమె కష్టపడుతోంది. ‘మంచి ఆరోగ్యం కోసం క్రమశిక్షణతో కూడిన వ్యాయామంతోపాటు క్రమపద్ధతిలో పౌష్టకాహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను కొన్నేళ్లుగా నేర్చుకున్న, ఆచరిస్తున్న విషయాలను ఇప్పుడు పుస్తకంపై పెట్టబోతున్నాను. ప్రతిదీ మన మనసుపై ఆధారపడి ఉంటుంది.
మనం బరువు తగ్గాలి అనే విషయాన్ని మనసుకు ఎక్కించాలి.. ఆశావహ దృక్పథంతో ముందుకు వెళితే ఏ పనైనా సాధ్యమవుతుంది.. నేను నిజజీవితంలో అదే విషయాన్ని చేసి చూపిస్తున్నా..’ అని 39 యేళ్ల ఈ బ్యూటీ సెలవిస్తోంది. తనతోపాటు తన భర్త రాజ్ కుంద్రా, రెండేళ్ల కొడుకు వియాన్‌ను కూడా అదే మార్గంలో నడిపిస్తున్నట్లు శిల్ప చెప్పింది. ‘పౌష్టికాహారం అంటే చాలామందికి అర్థం తెలీదు.. చాలా మంది తల్లులు తమ పిల్లలను ఎక్కువగా తినమని బలవంతం పెడుతుంటారు. అది కరెక్టు కాదు.. నేను పుస్తకం రాస్తోంది ఒక తల్లిగా కూడా. నేను, నా కొడుకు కూడా నెయ్యి తింటాం.. నాకు ఈ డైటింగ్, ఉపవాసాలు మీద నమ్మకం లేదు..’ అని స్పష్టం చేసింది.
అలాగే మహిళలు గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా వివరంగా రాస్తున్నట్లు చెప్పింది. కాగా, పుస్తకానికి సంబంధించి చాలా భాగం పూర్తయ్యిందని వివరించింది. ఈ పుస్తకం వచ్చే ఏడాది ఇంగ్లిష్‌లో ప్రచురితమవుతోంది. ఇదిలా ఉండగా, ‘బాజీగర్’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ పొడుగు కాళ్ల సుందరి పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.. నటిస్తోంది.