క్లైమేట్‌కు ఏమొచ్చిందో కరుణించలేదు. పండిన పంటైనా గింజను విదిల్చలేదు.అస్సాం గ్రామాలన్నీ అలమటించాయి. అప్పుడొచ్చారు.. ‘నీడ్స్’ సంస్థ ప్రతినిధులు.మగ్గాలను బయటికి తీయించారు.మహిళల చేతికి ఇన్‌కం పగ్గాలు ఇచ్చారు. ఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.కష్టాల్లో ఫాలో అవ్వాల్సిన దారి కూడా.
ప్రకృతి మనిషికి పరీక్షలు పెడుతూనే ఉంటుంది. పయనిస్తున్న దారిలో లెక్కలేనన్ని అవాంతరాలను సృష్టిస్తూనే ఉంటుంది. ఆ పరీక్షను ఎదుర్కోలేక మరో మార్గంలో అడుగు పెడితే అక్కడ మరో రకమైన పరీక్ష ఎదురవుతుంది. అయితే ఎన్ని పరీక్షలను పెట్టినా జీవితం మీద ఆశ చావనివ్వదు ప్రకృతి. ‘ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అనే ఆశను చిగురింపచేస్తూనే ఉంటుంది.
కొంతకాలం ముందుకు నడిపిస్తుంది, మరికొంత కాలం తర్వాత ‘వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్లు’ అని యూటర్న్ చూపిస్తుంది. ప్రకృతి మనిషిని మంచి వైపు నడిపిస్తున్న టూ టర్న్. ఇప్పుడు అస్సాం మహిళల చేత అదే యూటర్న్.. పునఃయానం చేయిస్తోంది. అలా వారికి.. చేతుల్లో దాగి ఉన్న కళను ప్రదర్శించే అవకాశం మళ్లీ దొరికింది. అన్నం పెట్టడం లేదని అటకెక్కించిన చేతి మగ్గాల దుమ్ము దులిపే అవకాశం వచ్చింది.
వాళ్లు వలసకు.. వీళ్లు కూలికీ
అస్సాం రాష్ట్రంలో తిన్‌సుఖియా జిల్లా. చేనేత కుటుంబాలు లెక్కకు మించి ఉన్నాయి. మగవాళ్లు, ఆడవాళ్లందరికీ చేనేత పని వచ్చి ఉంటుంది. చేతిలో పని ఉన్నా చేతినిండా పని దొరకని స్థితి రాజ్యమేలింది కొన్నేళ్లు. సంప్రదాయ వృత్తినే నమ్ముకుంటే ఇంట్లో అందరి కంచాలు నిండే పరిస్థితి కరవైంది. అప్పుడు మగ్గాలను పక్కన పెట్టి పొలం బాట పట్టారు వాళ్లంతా. దాదాపుగా అందరికీ ఎకరమో, అరెకరమో పొలం ఉండడంతో మగవాళ్లు పొలం పనులు చేసుకుంటూ, ఆడవాళ్లు ఇంటి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీశారు. అది సరిపోదని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. దాంతో మగవాళ్లు పనుల కోసం రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. సెక్యూరిటీ గార్డులుగా, దినసరికూలీలుగా పనులు వెతుక్కున్నారు.
పొలం లేని ఇళ్లలో ఆడవాళ్లు పొద్దున్నే లేచి పనులు చేసుకుని ఊరి అడ్డ మీద చేరితే పొలం పనులకు కూలీలు అవసరమైన భూస్వాములు పనికి తీసుకుపోయేవాళ్లు. పని దొరికిన రోజు రోజుకు రెండు వందల రూపాయలు చేతిలో పడతాయి. పట్టెడన్నం పళ్లెంలో పడుతుంది. అంతో ఇంతో పొలం ఉండి, భర్తలు పొలాన్ని నమ్ముకోలేక రాష్ట్రాలు పట్టి పోయిన ఇళ్లలోని ఆడవాళ్లు స్వయంగా నారుపోసి నీరు పెట్టి సేద్యం చేశారు. ఆ ప్రయత్నమూ ఎక్కువ కాలం సవ్యంగా సాగలేదు. ఒక్కో ఏడాది వానచుక్క కరుణించదు. దగ్గర్లోనే మేఘాలయ రాష్ట్రం ఉన్నప్పటికీ అస్సాం జిల్లాల్లో వర్షాలు సరిగ్గా కురిసేవి కాదు. మరో ఏడాది అకాల వర్షం, అతివృష్టితో పంటలు కొట్టుకుపోయేవి.
పండిన పంటలోనూ గింజ లేదు!
అతివృష్టి, అనావృష్టి.. ఈ రెండూ ప్రకృతి ఎప్పుడూ రైతుకు పెట్టే పరీక్షలే. అస్సాం వాళ్లకు ఈ రెండింటితో మరో పరీక్షను కూడా పెట్టింది. ఏడాదంతా కష్టపడి, ఈ ఏడాది పంట చేతికి వస్తుందనే కొండంత ఆశతో వరి కంకిని కంటినిండుగా చూసుకున్న దులుమోని సేనాపతి అనే ఓ మహిళకు ఎందుకో సందేహం వచ్చింది. గింజ బరువుకు భారంగా తలవాల్చాల్సిన వరికంకులు నిటారుగా ఉంటున్నాయి. చేత్తో తాకి చూస్తే లోపల బియ్యపు గింజ ఉన్న ఆనవాలు పెద్దగా దొరకడం లేదు. చేతిలోకి తీసుకుని నలిచి చూస్తే.. నిజమే వడ్లలో ఎక్కువ భాగం తాలు గింజలే. పంటకోసి, నూర్చి, తూర్పారబోస్తే గట్టి గింజల కంటే తాలు గింజలే ఎక్కువ తేలాయి.
ఆమె ఉంటున్న ఒక్క సోనోవాల్ గ్రామంలోనే కాదు. అస్సాంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. వడ్లగింజలో బియ్యపు గింజలు మాయం కావడానికి కారణం వాతావరణ మార్పులేనని ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పన్నెండు హిమాలయ రాష్ట్రాల్లో వాతావరణ మార్పులకు తీవ్రంగా లోనవుతున్నది అస్సాం రాష్ట్రమేనని నిర్ధారించేశారు అధ్యయనకారులు. ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరిగిపోతే ఫలదీకరణ సజావుగా జరగదని, ధాన్యం గింజకట్టదని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చెప్పింది. ఇక దారేది? సోనోవాల్ గ్రామంలో ఉన్న ఎనభై కుటుంబాల ఆడవాళ్లు ఎనిమిది కిలోమీటర్లు నడిచి పొరుగు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కి పొలం పనులకు వెళ్లడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల పాతిక గ్రామాల మహిళలకు అదే ఉపాధి మార్గమైంది.
మగ్గాలు.. సంపాదన పగ్గాలు
వ్యవసాయానికి సెలవిచ్చి, చేతివృత్తులకు ప్రోత్సాహకాలు మొదలు పెట్టింది ప్రభుత్వం. స్టేట్ సెరికల్చర్ (పట్టుపురుగుల పెంపకం) డిపార్ట్‌మెంట్, స్థానిక స్వచ్ఛందసంస్థ నీడ్స్ (నార్త్ ఈస్ట్ అఫెక్టెడ్ ఏరియా డెవలప్‌మెంట్ సొసైటీ) కలిసి వాతావరణ మార్పులకు గురైన ప్రాంతాలను దత్తత తీసుకున్నాయి. ప్రతి ఇంటికీ మగ్గం ఉంది. పట్టు పురుగులను పెంచడం, పట్టు దారం తీయడం నేర్చుకున్నారు ఆ మహిళలు. మగ్గాలను మెరుగు పరుచుకుని, పట్టు వస్త్రాలు నేయడంలో మెళకువలు ఒంటబట్టించుకున్నారు. ‘చేనేత మా రక్తంలోనే ఉంది. కొత్త డిజైన్‌ల కోసం నీడ్స్ ఇస్తున్న సూచనలతో ఇట్టే అల్లుకుపోతున్నాం’ అంటోంది అరుణా సోన్‌వాల్ అనే గృహిణి.
ఈ తరం మహిళలకు పట్టుబడని అస్సాం సంప్రదాయ పూల డిజైన్‌లను గత తరం దగ్గర నేర్చుకుంటున్నారు. పదిహేను రోజుల పాటు పని చేస్తే రెండున్నర వేల రూపాయలు మిగులుతున్నాయని చెబుతున్నారా మహిళలు. ఇరవై ఎనిమిది గ్రామాల నుంచి రెండువేల ఐదొందల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారిప్పుడు. ప్రకృతి ఒకదారి మూసుకుపోయినప్పుడు మరోదారిని తెరుస్తుంది. ఆ దారి ఏమిటో అన్వేషించడంలోనే మనిషి మనుగడ, విజయం దాగి ఉన్నాయి.
(సౌజన్యం : థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్)
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment