looms
-
మగ్గం మళ్లీ చేతికొచ్చింది
క్లైమేట్కు ఏమొచ్చిందో కరుణించలేదు. పండిన పంటైనా గింజను విదిల్చలేదు.అస్సాం గ్రామాలన్నీ అలమటించాయి. అప్పుడొచ్చారు.. ‘నీడ్స్’ సంస్థ ప్రతినిధులు.మగ్గాలను బయటికి తీయించారు.మహిళల చేతికి ఇన్‌కం పగ్గాలు ఇచ్చారు. ఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.కష్టాల్లో ఫాలో అవ్వాల్సిన దారి కూడా. ప్రకృతి మనిషికి పరీక్షలు పెడుతూనే ఉంటుంది. పయనిస్తున్న దారిలో లెక్కలేనన్ని అవాంతరాలను సృష్టిస్తూనే ఉంటుంది. ఆ పరీక్షను ఎదుర్కోలేక మరో మార్గంలో అడుగు పెడితే అక్కడ మరో రకమైన పరీక్ష ఎదురవుతుంది. అయితే ఎన్ని పరీక్షలను పెట్టినా జీవితం మీద ఆశ చావనివ్వదు ప్రకృతి. ‘ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అనే ఆశను చిగురింపచేస్తూనే ఉంటుంది. కొంతకాలం ముందుకు నడిపిస్తుంది, మరికొంత కాలం తర్వాత ‘వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్లు’ అని యూటర్న్ చూపిస్తుంది. ప్రకృతి మనిషిని మంచి వైపు నడిపిస్తున్న టూ టర్న్. ఇప్పుడు అస్సాం మహిళల చేత అదే యూటర్న్.. పునఃయానం చేయిస్తోంది. అలా వారికి.. చేతుల్లో దాగి ఉన్న కళను ప్రదర్శించే అవకాశం మళ్లీ దొరికింది. అన్నం పెట్టడం లేదని అటకెక్కించిన చేతి మగ్గాల దుమ్ము దులిపే అవకాశం వచ్చింది. వాళ్లు వలసకు.. వీళ్లు కూలికీ అస్సాం రాష్ట్రంలో తిన్‌సుఖియా జిల్లా. చేనేత కుటుంబాలు లెక్కకు మించి ఉన్నాయి. మగవాళ్లు, ఆడవాళ్లందరికీ చేనేత పని వచ్చి ఉంటుంది. చేతిలో పని ఉన్నా చేతినిండా పని దొరకని స్థితి రాజ్యమేలింది కొన్నేళ్లు. సంప్రదాయ వృత్తినే నమ్ముకుంటే ఇంట్లో అందరి కంచాలు నిండే పరిస్థితి కరవైంది. అప్పుడు మగ్గాలను పక్కన పెట్టి పొలం బాట పట్టారు వాళ్లంతా. దాదాపుగా అందరికీ ఎకరమో, అరెకరమో పొలం ఉండడంతో మగవాళ్లు పొలం పనులు చేసుకుంటూ, ఆడవాళ్లు ఇంటి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీశారు. అది సరిపోదని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. దాంతో మగవాళ్లు పనుల కోసం రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. సెక్యూరిటీ గార్డులుగా, దినసరికూలీలుగా పనులు వెతుక్కున్నారు. పొలం లేని ఇళ్లలో ఆడవాళ్లు పొద్దున్నే లేచి పనులు చేసుకుని ఊరి అడ్డ మీద చేరితే పొలం పనులకు కూలీలు అవసరమైన భూస్వాములు పనికి తీసుకుపోయేవాళ్లు. పని దొరికిన రోజు రోజుకు రెండు వందల రూపాయలు చేతిలో పడతాయి. పట్టెడన్నం పళ్లెంలో పడుతుంది. అంతో ఇంతో పొలం ఉండి, భర్తలు పొలాన్ని నమ్ముకోలేక రాష్ట్రాలు పట్టి పోయిన ఇళ్లలోని ఆడవాళ్లు స్వయంగా నారుపోసి నీరు పెట్టి సేద్యం చేశారు. ఆ ప్రయత్నమూ ఎక్కువ కాలం సవ్యంగా సాగలేదు. ఒక్కో ఏడాది వానచుక్క కరుణించదు. దగ్గర్లోనే మేఘాలయ రాష్ట్రం ఉన్నప్పటికీ అస్సాం జిల్లాల్లో వర్షాలు సరిగ్గా కురిసేవి కాదు. మరో ఏడాది అకాల వర్షం, అతివృష్టితో పంటలు కొట్టుకుపోయేవి. పండిన పంటలోనూ గింజ లేదు! అతివృష్టి, అనావృష్టి.. ఈ రెండూ ప్రకృతి ఎప్పుడూ రైతుకు పెట్టే పరీక్షలే. అస్సాం వాళ్లకు ఈ రెండింటితో మరో పరీక్షను కూడా పెట్టింది. ఏడాదంతా కష్టపడి, ఈ ఏడాది పంట చేతికి వస్తుందనే కొండంత ఆశతో వరి కంకిని కంటినిండుగా చూసుకున్న దులుమోని సేనాపతి అనే ఓ మహిళకు ఎందుకో సందేహం వచ్చింది. గింజ బరువుకు భారంగా తలవాల్చాల్సిన వరికంకులు నిటారుగా ఉంటున్నాయి. చేత్తో తాకి చూస్తే లోపల బియ్యపు గింజ ఉన్న ఆనవాలు పెద్దగా దొరకడం లేదు. చేతిలోకి తీసుకుని నలిచి చూస్తే.. నిజమే వడ్లలో ఎక్కువ భాగం తాలు గింజలే. పంటకోసి, నూర్చి, తూర్పారబోస్తే గట్టి గింజల కంటే తాలు గింజలే ఎక్కువ తేలాయి. ఆమె ఉంటున్న ఒక్క సోనోవాల్ గ్రామంలోనే కాదు. అస్సాంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. వడ్లగింజలో బియ్యపు గింజలు మాయం కావడానికి కారణం వాతావరణ మార్పులేనని ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పన్నెండు హిమాలయ రాష్ట్రాల్లో వాతావరణ మార్పులకు తీవ్రంగా లోనవుతున్నది అస్సాం రాష్ట్రమేనని నిర్ధారించేశారు అధ్యయనకారులు. ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరిగిపోతే ఫలదీకరణ సజావుగా జరగదని, ధాన్యం గింజకట్టదని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పింది. ఇక దారేది? సోనోవాల్ గ్రామంలో ఉన్న ఎనభై కుటుంబాల ఆడవాళ్లు ఎనిమిది కిలోమీటర్లు నడిచి పొరుగు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కి పొలం పనులకు వెళ్లడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల పాతిక గ్రామాల మహిళలకు అదే ఉపాధి మార్గమైంది. మగ్గాలు.. సంపాదన పగ్గాలు వ్యవసాయానికి సెలవిచ్చి, చేతివృత్తులకు ప్రోత్సాహకాలు మొదలు పెట్టింది ప్రభుత్వం. స్టేట్ సెరికల్చర్ (పట్టుపురుగుల పెంపకం) డిపార్ట్మెంట్, స్థానిక స్వచ్ఛందసంస్థ నీడ్స్ (నార్త్ ఈస్ట్ అఫెక్టెడ్ ఏరియా డెవలప్మెంట్ సొసైటీ) కలిసి వాతావరణ మార్పులకు గురైన ప్రాంతాలను దత్తత తీసుకున్నాయి. ప్రతి ఇంటికీ మగ్గం ఉంది. పట్టు పురుగులను పెంచడం, పట్టు దారం తీయడం నేర్చుకున్నారు ఆ మహిళలు. మగ్గాలను మెరుగు పరుచుకుని, పట్టు వస్త్రాలు నేయడంలో మెళకువలు ఒంటబట్టించుకున్నారు. ‘చేనేత మా రక్తంలోనే ఉంది. కొత్త డిజైన్ల కోసం నీడ్స్ ఇస్తున్న సూచనలతో ఇట్టే అల్లుకుపోతున్నాం’ అంటోంది అరుణా సోన్వాల్ అనే గృహిణి. ఈ తరం మహిళలకు పట్టుబడని అస్సాం సంప్రదాయ పూల డిజైన్లను గత తరం దగ్గర నేర్చుకుంటున్నారు. పదిహేను రోజుల పాటు పని చేస్తే రెండున్నర వేల రూపాయలు మిగులుతున్నాయని చెబుతున్నారా మహిళలు. ఇరవై ఎనిమిది గ్రామాల నుంచి రెండువేల ఐదొందల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారిప్పుడు. ప్రకృతి ఒకదారి మూసుకుపోయినప్పుడు మరోదారిని తెరుస్తుంది. ఆ దారి ఏమిటో అన్వేషించడంలోనే మనిషి మనుగడ, విజయం దాగి ఉన్నాయి. (సౌజన్యం : థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్) – మంజీర -
మారని చేనే‘తలరాత’
సాక్షి, అనంతపురం : చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, యాడికి, రాయదుర్గం, అనంతపురం రూరల్, రాప్తాడు ప్రాంతాల్లో 1.50 లక్షల చేనేత మగ్గాలు ఉన్నాయి. ఒక్కో మగ్గానికి ముగ్గురు కార్మికుల చొప్పున 4.50 లక్షల మంది వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే పట్టుచీరలకు అచ్చులు అతికేవారు ఏడు వేల మంది, డోలు చుట్టేవారు తొమ్మిది వేల మంది, జాకార్డులు చేసే కార్మికులు ఎనిమిది వేల మంది, రిపేరీ చేసే వారు వెయ్యి మంది, రంగుల అద్దకం పనివారు తొమ్మిది వేల మంది, రేషం వ్యాపారులు మూడు వేల మంది, జరీ వ్యాపారులు వెయ్యి మంది, మగ్గం సామగ్రి తయారీ కార్మికులు వెయ్యి మంది, శిల్క్‌హౌస్ వ్యాపారులు తొమ్మిది వేల మంది, శిల్క్‌హౌస్ గుమస్తాలు 12 వేల మంది, డిజైనర్లు రెండు వేల మంది, అట్టలు కొట్టే కార్మికులు వెయ్యి మంది, పట్టచీరలపై జరీ పోసే వారు రెండు వేల మంది, రేషం వైండింగ్ కార్మికులు ఐదు వేల మంది, బోట్లు కార్మికులు ఆరు వేల మంది, వార్పులు పోసే వారు రెండు వేల మంది దాకా చేనేతనే నమ్ముకుని ఉన్నారు. అయితే.. పవర్‌లూమ్స్ రంగప్రవేశంతో చేనేత కార్మికులకు, ఈ రంగాన్ని నమ్ముకున్న వారికి నష్టం కలుగుతోంది. పవర్‌లూమ్స్ యజమానులు చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చేనేతకు రిజర్వ్ చేసిన 11 రకాల చీరలను పవర్స్లూమ్స్పై యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. వారితో చేనేత కార్మికులు పోటీపడలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది చేనేత రంగాన్ని వదిలి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లిలో పలువురు చేనేత కార్మికులు తాపీ మేస్త్రీలుగాను, ఆటోడ్రైవర్లు, ఉపాధికూలీలు, హోటళ్లలో సర్వర్లుగానూ మారిపోయారు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 50 వేల మగ్గాలకు పైగా అటకెక్కాయి. రుణమాఫీపై సన్నగిల్లుతున్న ఆశలు చేనేత కార్మికుల కష్టాలను చూసి చలించి పోయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన హయాంలో వారిని రుణవిముక్తుల్ని చేశారు. అప్పట్లో అనంతపురం జిల్లాలోనే 12 వేలమంది చేనేత కార్మికులకు రూ.14.80 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అయితే..ఇప్పుడు రుణమాఫీకి చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో చేనేతల పరిస్థితి దయనీయంగా మారింది. రుణమాఫీ చేస్తారని నమ్మిన నేతన్నలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో సహకార సంఘాలు మినహాయిస్తే పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి, ఆర్టిజన్ క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాలకు సంబంధించి దాదాపు రూ.33 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని చంద్రబాబు ప్రభుత్వం ఏమేరకు మాఫీ చేస్తాదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మాఫీ చేయాల్సిందే.. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చేనేతల రుణాలు మాఫీ చేయాల్సిందే. లేనిపక్షంలో ఉద్యమించాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసి ఒక్కొక్క చేనేత కార్మికునికి రూ.లక్ష రుణమివ్వాలి. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. 45 శాతం రేషంను ఉపయోగించి పవర్‌లూమ్స్‌పై చీరలు తయారు చేయొచ్చని 1996లో జారీ చేసిన యాక్టును వెంటనే రద్దు చేయాలి. 50 శాతం సబ్సిడీపై ముడిసరుకులను అందించాలి. - పోలా రామాంజినేయులు, ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఆధారమేదీ..
చీరాల, న్యూస్‌లైన్ : దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్దది చేనేత రంగం. అంతటి చరిత్ర ఉన్న చేనేత రంగం నిర్వీర్యమవుతోంది. ‘చేనేత రంగానికి కాలం చెల్లింది. గుంట మగ్గాలు ఇంకెంతకాలం’ అన్న చంద్రబాబు మాటలు మాత్రం నిజం కాలేదు. నేటికీ చేనేత రంగం బతికే ఉంది. అందుకు చేయూతనిచ్చింది వైఎస్ ప్రభుత్వమేనని కచ్చితంగా చెప్పవచ్చు. చేనేతలకు చంద్రబాబు చేసిందేమిటి? చేనేత బతుకులను బుగ్గిచేసే పవర్‌లూమ్‌లను ప్రోత్సహించి 2003లో టెక్స్టైల్స్ పార్కులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు కావడంతో చేనేతలకు పనిలేకుండా పోయింది. చేనేతలకు ఆసరాగా ఉండే ఆప్కోకు నిధులు కేటాయించకపోవడంతో చేనేత బట్టకొనుగోలు చేసే దిక్కులేక, చేసేందుకు పనులు లేక అప్పులు, అనారోగ్యాల బారినపడిన కార్మికులు పిట్టల్లా రాలిపోయారు. చిలుపనూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించడంతో నూలు కొనుగోలు చేయడం నేతన్నకు భారంగా మారింది. ఫలితంగా నూలు కొనలేక మగ్గం నడిచే పరిస్థితి ఉండేది కాదు. దీనిపై చీరాలలో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైల్‌రోకో చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో సైతం ఆందోళన చేపట్టారు. అయినా ఫలితం లేదు. చేనేతలకు వైఎస్ఆర్ చేసిందిదీ.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పోచంపల్లి, సిరిసిల్ల వంటి చేనేత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన మొట్టమొదటి సభలో చేనేత రంగానికి చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే వారికి ఆసరాగా నిలిచారు. - చేనేత రుణమాఫీ కింద జిల్లాలో 1520 మంది లబ్దిదారులకు * 3.23 కోట్ల రుణాలు రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో... - 2003-04లో రూ.195.37 కోట్లు (చేనేత బడ్జెట్) - ఏఏవై పథకం లేదు - 65 ఏళ్లు నిండిన వారికే వృద్ధాప్య పింఛన్, సమష్ట అమ్మక కేంద్రాలు లేవు. - నూలుపై సబ్సిడీ లేదు, చిలపల నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ - ఆప్కో అమ్మకాలు రూ.86.85 కోట్లు - పింఛన్ 75 రూపాయలు - జనతా పథకం రద్దు - నూలు మిల్లుల మూసివేత - చేనేత మహిళలకు ఒక్క పథకం కూడా లేదు. వైఎస్సార్ హయాంలో... - 2008-09లో రూ.325.32 కోట్లు (చేనేత బడ్జెట్) - 2005-06లో ఏఏవై పథకం అమలు - 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ - 2006-07 నుంచి క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం ప్రవేశపెట్టారు - 200 కోట్ల రూపాయల ఆప్కో అమ్మకాలు, చేనేత పార్కుల ఏర్పాటు - చేనేతలకు పావలా వడ్డీ రుణాలు - రూ.312 కోట్ల చేనేత రుణాల మాఫీ - రంగు, రసాయనాలు, చిలప నూలుపై 10 శాతం సబ్సిడీ - వీవర్స్ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీలేని రుణాలు - చిలప నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ రద్దు మహానేత మరణం తరువాత... - చేనేతలకు ప్రత్యేకంగా పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానన్న కిరణ్ సర్కారు హామీ నెరవేర్చలేదు. - నూలు డిపోల ఏర్పాటు హామీ కూడా కాగితాలకే పరిమితమైంది. - మూడేళ్లలో నూలు ధరలు 30 నుంచి 55 శాతం పెరిగాయి. దీంతో చాలా మంది కార్మికులు నూలు కొనుగోలు చేసే శక్తిలేక మగ్గాలను మూలనపెట్టారు. - వీవర్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకం కూడా అమలుకు నోచుకోలేదు. కార్మికులు నెలకు 80 చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. క్లైంల విషయంలో అనేక ఆంక్షలు విధించడంతో కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు. - జిల్లాలో 70 వేల మందికిపైగా చేనేతలున్నప్పటికీ చేనేత క్రెడిట్ కార్డు పథకం కింద 5 వేల మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. - నూలు, రంగులు, రసాయనాలపై పది శాతం సబ్సిడీ వైఎస్ అమలు చేస్తే తరువాత వచ్చే పాలకులు మాత్రం ఆ ఊసే ప్రస్తావించకుండా చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా చేనేతలు అప్పుల్లో కూరుకుని అల్లాడుతున్నారు. ఆదరవునిచ్చే నేత కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చేనేతల కోసం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిందిదీ.. - 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న * 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. - చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. - కిరణ్ సర్కారు రద్దు చేసిన హౌస్ కం వర్క్ షెడ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని జగన్ ప్రకటించారు. - కోస్తా తీర ప్రాంతాల్లో ఏటా సంభవించే ప్రకృతి వైపరీత్యాలకు గుంటమగ్గాల్లో పనిచేసే చేనేత కార్మికులకు ఎక్కువ నష్టం జరుగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు గుంటమగ్గాల స్థానంలో ‘ఫ్రేమ్ లూమ్స్’ను అందజేస్తామని హామీ ఇచ్చారు. - అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల యూనిఫాంలు, విద్యార్థుల యూనిఫాంలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. - అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1.50 లక్షలతో ఉచితంగా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.