మారని చేనే‘తలరాత’ | Cenetalarata eternal ' | Sakshi
Sakshi News home page

మారని చేనే‘తలరాత’

Published Mon, Sep 22 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

మారని చేనే‘తలరాత’

మారని చేనే‘తలరాత’

సాక్షి, అనంతపురం :
 చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, యాడికి, రాయదుర్గం, అనంతపురం రూరల్, రాప్తాడు ప్రాంతాల్లో 1.50 లక్షల చేనేత మగ్గాలు ఉన్నాయి. ఒక్కో మగ్గానికి ముగ్గురు కార్మికుల చొప్పున 4.50 లక్షల మంది వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే పట్టుచీరలకు అచ్చులు అతికేవారు ఏడు వేల మంది, డోలు చుట్టేవారు తొమ్మిది వేల మంది, జాకార్డులు చేసే కార్మికులు ఎనిమిది వేల మంది, రిపేరీ చేసే వారు వెయ్యి మంది, రంగుల అద్దకం పనివారు తొమ్మిది వేల మంది, రేషం వ్యాపారులు మూడు వేల మంది, జరీ వ్యాపారులు వెయ్యి మంది, మగ్గం సామగ్రి తయారీ కార్మికులు వెయ్యి మంది, శిల్క్‌హౌస్ వ్యాపారులు తొమ్మిది వేల మంది, శిల్క్‌హౌస్ గుమస్తాలు 12 వేల మంది, డిజైనర్లు రెండు వేల మంది, అట్టలు కొట్టే కార్మికులు వెయ్యి మంది, పట్టచీరలపై జరీ పోసే వారు రెండు వేల మంది, రేషం వైండింగ్  కార్మికులు ఐదు వేల మంది, బోట్లు కార్మికులు ఆరు వేల మంది, వార్పులు పోసే వారు రెండు వేల మంది దాకా చేనేతనే నమ్ముకుని ఉన్నారు. అయితే.. పవర్‌లూమ్స్ రంగప్రవేశంతో చేనేత కార్మికులకు, ఈ రంగాన్ని నమ్ముకున్న వారికి నష్టం
 కలుగుతోంది. పవర్‌లూమ్స్ యజమానులు  చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చేనేతకు రిజర్వ్ చేసిన 11 రకాల చీరలను పవర్స్‌లూమ్స్‌పై యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. వారితో చేనేత కార్మికులు పోటీపడలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది చేనేత రంగాన్ని వదిలి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లిలో పలువురు చేనేత కార్మికులు తాపీ మేస్త్రీలుగాను, ఆటోడ్రైవర్లు, ఉపాధికూలీలు, హోటళ్లలో సర్వర్లుగానూ మారిపోయారు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా  50 వేల మగ్గాలకు పైగా అటకెక్కాయి.
 రుణమాఫీపై సన్నగిల్లుతున్న ఆశలు
 చేనేత కార్మికుల కష్టాలను చూసి చలించి పోయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన హయాంలో వారిని రుణవిముక్తుల్ని చేశారు.
 అప్పట్లో అనంతపురం జిల్లాలోనే 12 వేలమంది చేనేత కార్మికులకు రూ.14.80 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అయితే..ఇప్పుడు రుణమాఫీకి  చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో చేనేతల పరిస్థితి దయనీయంగా మారింది. రుణమాఫీ చేస్తారని నమ్మిన నేతన్నలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో  కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో సహకార సంఘాలు మినహాయిస్తే పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి, ఆర్టిజన్ క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణాలకు సంబంధించి దాదాపు రూ.33 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని చంద్రబాబు ప్రభుత్వం ఏమేరకు మాఫీ చేస్తాదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
 మాఫీ చేయాల్సిందే..
 చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చేనేతల రుణాలు మాఫీ చేయాల్సిందే.  లేనిపక్షంలో ఉద్యమించాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసి ఒక్కొక్క చేనేత కార్మికునికి రూ.లక్ష రుణమివ్వాలి. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. 45 శాతం రేషంను ఉపయోగించి పవర్‌లూమ్స్‌పై చీరలు తయారు చేయొచ్చని 1996లో జారీ చేసిన యాక్టును వెంటనే రద్దు చేయాలి. 50 శాతం సబ్సిడీపై ముడిసరుకులను అందించాలి.    
 - పోలా రామాంజినేయులు, ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు



 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement