Weaving Worker
-
బ్రాండ్ సిరిసిల్ల కావాలి
సిరిసిల్ల/తంగళ్లపల్లి: దేశంలోనే సిరిసిల్ల వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా నాణ్యత, నవ్యతతో వస్త్రాలను ఉత్పత్తి చేయాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నడూలేని విధంగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడచులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ ఉండేలా ఆధునికతను సంతరించుకునేలా వస్త్రాలు తయారు చేయాలని మంత్రి కోరారు. నేత కార్మికులు ఆత్మగౌరవంతో జీవించే విధంగా వేతనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తోందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల మహిళలకు ఉపాధి కల్పించేందుకు రెడీమేడ్ వస్త్రాల తయారీ కేంద్రాన్ని (అపెరల్ పార్కు) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, ఈ విషయాన్ని ఏ నేత కార్మికుడిని అడిగినా చెబుతాడని కేటీఆర్ పేర్కొన్నారు. పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు, జౌళి రంగానికి చేయూత అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాశామన్నారు. కార్యక్రమంలో జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. మంత్రి పర్యటనలో పలువురి నిరసన కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో వెంకటేశ్ టెక్స్టైల్స్ యజమాని దొంతుల నరహరి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లను, పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు మంత్రి తంగళ్లపల్లిలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మీడియాను అనుమతించక పోవడంతో పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. -
మగ్గం మళ్లీ చేతికొచ్చింది
క్లైమేట్కు ఏమొచ్చిందో కరుణించలేదు. పండిన పంటైనా గింజను విదిల్చలేదు.అస్సాం గ్రామాలన్నీ అలమటించాయి. అప్పుడొచ్చారు.. ‘నీడ్స్’ సంస్థ ప్రతినిధులు.మగ్గాలను బయటికి తీయించారు.మహిళల చేతికి ఇన్‌కం పగ్గాలు ఇచ్చారు. ఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.కష్టాల్లో ఫాలో అవ్వాల్సిన దారి కూడా. ప్రకృతి మనిషికి పరీక్షలు పెడుతూనే ఉంటుంది. పయనిస్తున్న దారిలో లెక్కలేనన్ని అవాంతరాలను సృష్టిస్తూనే ఉంటుంది. ఆ పరీక్షను ఎదుర్కోలేక మరో మార్గంలో అడుగు పెడితే అక్కడ మరో రకమైన పరీక్ష ఎదురవుతుంది. అయితే ఎన్ని పరీక్షలను పెట్టినా జీవితం మీద ఆశ చావనివ్వదు ప్రకృతి. ‘ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది’ అనే ఆశను చిగురింపచేస్తూనే ఉంటుంది. కొంతకాలం ముందుకు నడిపిస్తుంది, మరికొంత కాలం తర్వాత ‘వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్లు’ అని యూటర్న్ చూపిస్తుంది. ప్రకృతి మనిషిని మంచి వైపు నడిపిస్తున్న టూ టర్న్. ఇప్పుడు అస్సాం మహిళల చేత అదే యూటర్న్.. పునఃయానం చేయిస్తోంది. అలా వారికి.. చేతుల్లో దాగి ఉన్న కళను ప్రదర్శించే అవకాశం మళ్లీ దొరికింది. అన్నం పెట్టడం లేదని అటకెక్కించిన చేతి మగ్గాల దుమ్ము దులిపే అవకాశం వచ్చింది. వాళ్లు వలసకు.. వీళ్లు కూలికీ అస్సాం రాష్ట్రంలో తిన్‌సుఖియా జిల్లా. చేనేత కుటుంబాలు లెక్కకు మించి ఉన్నాయి. మగవాళ్లు, ఆడవాళ్లందరికీ చేనేత పని వచ్చి ఉంటుంది. చేతిలో పని ఉన్నా చేతినిండా పని దొరకని స్థితి రాజ్యమేలింది కొన్నేళ్లు. సంప్రదాయ వృత్తినే నమ్ముకుంటే ఇంట్లో అందరి కంచాలు నిండే పరిస్థితి కరవైంది. అప్పుడు మగ్గాలను పక్కన పెట్టి పొలం బాట పట్టారు వాళ్లంతా. దాదాపుగా అందరికీ ఎకరమో, అరెకరమో పొలం ఉండడంతో మగవాళ్లు పొలం పనులు చేసుకుంటూ, ఆడవాళ్లు ఇంటి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీశారు. అది సరిపోదని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. దాంతో మగవాళ్లు పనుల కోసం రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు. సెక్యూరిటీ గార్డులుగా, దినసరికూలీలుగా పనులు వెతుక్కున్నారు. పొలం లేని ఇళ్లలో ఆడవాళ్లు పొద్దున్నే లేచి పనులు చేసుకుని ఊరి అడ్డ మీద చేరితే పొలం పనులకు కూలీలు అవసరమైన భూస్వాములు పనికి తీసుకుపోయేవాళ్లు. పని దొరికిన రోజు రోజుకు రెండు వందల రూపాయలు చేతిలో పడతాయి. పట్టెడన్నం పళ్లెంలో పడుతుంది. అంతో ఇంతో పొలం ఉండి, భర్తలు పొలాన్ని నమ్ముకోలేక రాష్ట్రాలు పట్టి పోయిన ఇళ్లలోని ఆడవాళ్లు స్వయంగా నారుపోసి నీరు పెట్టి సేద్యం చేశారు. ఆ ప్రయత్నమూ ఎక్కువ కాలం సవ్యంగా సాగలేదు. ఒక్కో ఏడాది వానచుక్క కరుణించదు. దగ్గర్లోనే మేఘాలయ రాష్ట్రం ఉన్నప్పటికీ అస్సాం జిల్లాల్లో వర్షాలు సరిగ్గా కురిసేవి కాదు. మరో ఏడాది అకాల వర్షం, అతివృష్టితో పంటలు కొట్టుకుపోయేవి. పండిన పంటలోనూ గింజ లేదు! అతివృష్టి, అనావృష్టి.. ఈ రెండూ ప్రకృతి ఎప్పుడూ రైతుకు పెట్టే పరీక్షలే. అస్సాం వాళ్లకు ఈ రెండింటితో మరో పరీక్షను కూడా పెట్టింది. ఏడాదంతా కష్టపడి, ఈ ఏడాది పంట చేతికి వస్తుందనే కొండంత ఆశతో వరి కంకిని కంటినిండుగా చూసుకున్న దులుమోని సేనాపతి అనే ఓ మహిళకు ఎందుకో సందేహం వచ్చింది. గింజ బరువుకు భారంగా తలవాల్చాల్సిన వరికంకులు నిటారుగా ఉంటున్నాయి. చేత్తో తాకి చూస్తే లోపల బియ్యపు గింజ ఉన్న ఆనవాలు పెద్దగా దొరకడం లేదు. చేతిలోకి తీసుకుని నలిచి చూస్తే.. నిజమే వడ్లలో ఎక్కువ భాగం తాలు గింజలే. పంటకోసి, నూర్చి, తూర్పారబోస్తే గట్టి గింజల కంటే తాలు గింజలే ఎక్కువ తేలాయి. ఆమె ఉంటున్న ఒక్క సోనోవాల్ గ్రామంలోనే కాదు. అస్సాంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. వడ్లగింజలో బియ్యపు గింజలు మాయం కావడానికి కారణం వాతావరణ మార్పులేనని ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పన్నెండు హిమాలయ రాష్ట్రాల్లో వాతావరణ మార్పులకు తీవ్రంగా లోనవుతున్నది అస్సాం రాష్ట్రమేనని నిర్ధారించేశారు అధ్యయనకారులు. ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరిగిపోతే ఫలదీకరణ సజావుగా జరగదని, ధాన్యం గింజకట్టదని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పింది. ఇక దారేది? సోనోవాల్ గ్రామంలో ఉన్న ఎనభై కుటుంబాల ఆడవాళ్లు ఎనిమిది కిలోమీటర్లు నడిచి పొరుగు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కి పొలం పనులకు వెళ్లడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల పాతిక గ్రామాల మహిళలకు అదే ఉపాధి మార్గమైంది. మగ్గాలు.. సంపాదన పగ్గాలు వ్యవసాయానికి సెలవిచ్చి, చేతివృత్తులకు ప్రోత్సాహకాలు మొదలు పెట్టింది ప్రభుత్వం. స్టేట్ సెరికల్చర్ (పట్టుపురుగుల పెంపకం) డిపార్ట్మెంట్, స్థానిక స్వచ్ఛందసంస్థ నీడ్స్ (నార్త్ ఈస్ట్ అఫెక్టెడ్ ఏరియా డెవలప్మెంట్ సొసైటీ) కలిసి వాతావరణ మార్పులకు గురైన ప్రాంతాలను దత్తత తీసుకున్నాయి. ప్రతి ఇంటికీ మగ్గం ఉంది. పట్టు పురుగులను పెంచడం, పట్టు దారం తీయడం నేర్చుకున్నారు ఆ మహిళలు. మగ్గాలను మెరుగు పరుచుకుని, పట్టు వస్త్రాలు నేయడంలో మెళకువలు ఒంటబట్టించుకున్నారు. ‘చేనేత మా రక్తంలోనే ఉంది. కొత్త డిజైన్ల కోసం నీడ్స్ ఇస్తున్న సూచనలతో ఇట్టే అల్లుకుపోతున్నాం’ అంటోంది అరుణా సోన్వాల్ అనే గృహిణి. ఈ తరం మహిళలకు పట్టుబడని అస్సాం సంప్రదాయ పూల డిజైన్లను గత తరం దగ్గర నేర్చుకుంటున్నారు. పదిహేను రోజుల పాటు పని చేస్తే రెండున్నర వేల రూపాయలు మిగులుతున్నాయని చెబుతున్నారా మహిళలు. ఇరవై ఎనిమిది గ్రామాల నుంచి రెండువేల ఐదొందల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారిప్పుడు. ప్రకృతి ఒకదారి మూసుకుపోయినప్పుడు మరోదారిని తెరుస్తుంది. ఆ దారి ఏమిటో అన్వేషించడంలోనే మనిషి మనుగడ, విజయం దాగి ఉన్నాయి. (సౌజన్యం : థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్) – మంజీర -
అన్నీ మేమే ఇస్తే.. మీరేం చేస్తారు..?
సిరిసిల్ల: ప్రభుత్వమే భూమి ఇచ్చి.. షెడ్డు నిర్మించి, రోడ్లు వేసి, సాంచాలు అందజేసి, వస్త్రోత్పత్తి ఆర్డర్లు కేటాయించి, బట్ట కొనుగోలు చేస్తే.. ఇక మీరేం చేస్తారు..? అని నేతకార్మికులను రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేత బజారులో శనివారం ‘వర్కర్ టూ ఓనర్’పథకంపై నేత కార్మికులతో ఆమె సమీక్షించారు. ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులను యజమానులుగా మార్చేందుకు పథకాన్ని రూపొందించిందని చెప్పారు. ఈ క్రమంలో బిట్ల దుర్గయ్య ‘‘కార్మికులకు నెలకు రూ.15 వేల జీతం వచ్చే విధంగా చూడాలని, ఈ పథకం మళ్లీ యజమానులకే లాభం చేస్తుందని’’చెప్పాడు. దీనికి కార్మికులు చప్పట్లు కొట్టడాన్ని శైలజారామయ్యర్ తప్పు పట్టారు. కార్మికులను యజమానులుగా చేయడానికి ప్రభుత్వం రూ.200 కోట్లు వెచ్చిస్తుండగా.. ఇంకా కార్మికులుగానే ఉంటామని చప్పట్లు కొట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ పథకం వద్దంటే చెప్పండి.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరో పథకానికి ఆ నిధులు ఖర్చు చేయాలని నివేదిక ఇస్తామని చెప్పారు. 20 శాతం పెట్టుబడి సమకూర్చుకుంటే కార్మికులు యాజమానులుగా మారుతారని వివరించారు. కార్మికుడి పెట్టుబడి ఐదు శాతానికి తగ్గించాలని కార్మిక నాయకులు కోరారు. -
మరో నేతన్న బలవన్మరణం
సిరిసిల్ల, న్యూస్‌లైన్: రెక్కలు ముక్కలు చేసుకుంటేనే బుక్కెడు బువ్వ దొరికే బతుకులు వారివి. భార్యాభర్తలిద్దరు శ్రమిస్తేనే ఇల్లు గడుస్తుంది. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆ నేత కార్మికుడి ఉసురు తీశాయి. అద్దకం పరిశ్రమలో శ్రమించినా బట్టకు పొట్టకు సరిపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక నేత కార్మికుడు నైట్రాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం వేకువజామున సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో జరిగిన ఈ సంఘటన చితికిపోతున్న నేత బతుకులకు అద్దం పడుతోంది. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన నరాల రమాకాంత్(40) డైయింగ్ కార్మికుడు. భార్య సువర్ణ బీడీ కార్మికురాలు. వీరికి ముగ్గురు పిల్లలు రజిని, సబిత, రాఘవేంద్ర ఉన్నారు. భార్యాభర్తలిద్దరు పని చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం మెరుగైన జీవనం కోసం ఉపాధివేటలో గల్ఫ్ వెళ్లాడు. వీసా, విమాన టికెట్ కోసం రూ.లక్ష వరకు అప్పులయ్యాయి. అబుదాబీ వెళ్లాక అక్కడ కంపెనీలో పని లేక, బయట కూలి చేసేందుకు కంపెనీ విడిచి వచ్చాడు. దురదృష్టం వెంటాడింది. అబుదాబీ ప్రభుత్వం కంపెనీ వీసాల్లేనివారు దేశం విడిచి వెళ్లాలని ఆంక్షలు విధించడంతో రమాకాంత్ ఆర్నెల్లకే సిరిసిల్లకు వచ్చాడు. అప్పుల వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని భరిస్తూ మళ్లీ డైయింగ్ కార్మికుడిగా కుసుమ లక్ష్మణ్ వద్ద పని చేస్తున్నాడు. ఏడాదిన్నరగా పని చేస్తున్న రమాకాంత్‌కు వడ్డీలతో కలిసి అప్పులు రూ.2లక్షలకు చేరాయి. అప్పులు తీర్చే దారిలేక వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడంతో మానసిక వేదనకు గురై ఆదివారం వేకువజామున ఇంట్లోనే నైట్రాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం వీధిన పడింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి కళ్లముందే కుప్పకూలిపోవడంతో భార్యాబిడ్డలు గుండెలు బాదుకుంటూ రోదించారు. మనోధైర్యమివ్వని పాలకులు సిరిసిల్ల నేత కార్మికులకు మేమున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన పాలకులు మొక్కుబడి చర్యలతో ముందుకెళ్తున్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని ఈ నెల 12వ తేదీన కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం మనోధైర్య ర్యాలీ తీసింది. కళాశాల ఆవరణలో మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. నేతన్నలకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలేవీ భరోసానివ్వలేకపోయాయి. నిజంగానే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేత కార్మిక కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలువాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి నేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అవసరమో పరిశీలించాల్సి ఉండగా, ఇప్పటివరకు అలాంటి చర్యలు లేవు. మరోవైపు ఆర్భాటంగా ర్యాలీ తీసిన అధికారులు ఆ తర్వాత నేత పరిశ్రమ, అనుబంధ రంగాల్లో కార్మికుల జీవనస్థితిని విస్మరించారు. ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఒకింత వెలుసుబాటు కల్పించే విధంగా అప్పుల వేధింపుల్లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. పుండొకచోటైతే.. మందు మరో చోట రాసినట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఇంటింటి సర్వేలు చేపట్టి నేత కార్మికులకు గుర్తింపు కార్డులిచ్చి పని భద్రత కల్పించాలి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు భరోసా చూపాలి.