సిరిసిల్ల, న్యూస్‌లైన్: రెక్కలు ముక్కలు చేసుకుంటేనే బుక్కెడు బువ్వ దొరికే బతుకులు వారివి. భార్యాభర్తలిద్దరు శ్రమిస్తేనే ఇల్లు గడుస్తుంది. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆ నేత కార్మికుడి ఉసురు తీశాయి. అద్దకం పరిశ్రమలో శ్రమించినా బట్టకు పొట్టకు సరిపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక నేత కార్మికుడు నైట్రాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం వేకువజామున సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో జరిగిన ఈ సంఘటన చితికిపోతున్న నేత బతుకులకు అద్దం పడుతోంది. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన నరాల రమాకాంత్(40) డైయింగ్ కార్మికుడు. భార్య సువర్ణ బీడీ కార్మికురాలు. వీరికి ముగ్గురు పిల్లలు రజిని, సబిత, రాఘవేంద్ర ఉన్నారు. భార్యాభర్తలిద్దరు పని చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు.
రెండేళ్ల క్రితం మెరుగైన జీవనం కోసం ఉపాధివేటలో గల్ఫ్ వెళ్లాడు. వీసా, విమాన టికెట్ కోసం రూ.లక్ష వరకు అప్పులయ్యాయి. అబుదాబీ వెళ్లాక అక్కడ కంపెనీలో పని లేక, బయట కూలి చేసేందుకు కంపెనీ విడిచి వచ్చాడు. దురదృష్టం వెంటాడింది. అబుదాబీ ప్రభుత్వం కంపెనీ వీసాల్లేనివారు దేశం విడిచి వెళ్లాలని ఆంక్షలు విధించడంతో రమాకాంత్ ఆర్నెల్లకే సిరిసిల్లకు వచ్చాడు. అప్పుల వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని భరిస్తూ మళ్లీ డైయింగ్ కార్మికుడిగా కుసుమ లక్ష్మణ్ వద్ద పని చేస్తున్నాడు. ఏడాదిన్నరగా పని చేస్తున్న రమాకాంత్‌కు వడ్డీలతో కలిసి అప్పులు రూ.2లక్షలకు చేరాయి. అప్పులు తీర్చే దారిలేక వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడంతో మానసిక వేదనకు గురై ఆదివారం వేకువజామున ఇంట్లోనే నైట్రాప్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం వీధిన పడింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి కళ్లముందే కుప్పకూలిపోవడంతో భార్యాబిడ్డలు గుండెలు బాదుకుంటూ రోదించారు.
మనోధైర్యమివ్వని పాలకులు
సిరిసిల్ల నేత కార్మికులకు మేమున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన పాలకులు మొక్కుబడి చర్యలతో ముందుకెళ్తున్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని ఈ నెల 12వ తేదీన కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం మనోధైర్య ర్యాలీ తీసింది. కళాశాల ఆవరణలో మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. నేతన్నలకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలేవీ భరోసానివ్వలేకపోయాయి. నిజంగానే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేత కార్మిక కుటుంబాలను గుర్తించి వారికి అండగా నిలువాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి నేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అవసరమో పరిశీలించాల్సి ఉండగా, ఇప్పటివరకు అలాంటి చర్యలు లేవు. మరోవైపు ఆర్భాటంగా ర్యాలీ తీసిన అధికారులు ఆ తర్వాత నేత పరిశ్రమ, అనుబంధ రంగాల్లో కార్మికుల జీవనస్థితిని విస్మరించారు. ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఒకింత వెలుసుబాటు కల్పించే విధంగా అప్పుల వేధింపుల్లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. పుండొకచోటైతే.. మందు మరో చోట రాసినట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఇంటింటి సర్వేలు చేపట్టి నేత కార్మికులకు గుర్తింపు కార్డులిచ్చి పని భద్రత కల్పించాలి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు భరోసా చూపాలి.
మరో నేతన్న బలవన్మరణం
Published Mon, Sep 23 2013 4:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement