తెలుగింటి ఆంగ్ల పరిమళాలు | Hema Macherla's (United Kingdom) professional profile on LinkedIn | Sakshi
Sakshi News home page

తెలుగింటి ఆంగ్ల పరిమళాలు

Published Tue, Dec 9 2014 10:52 PM | Last Updated on Wed, Apr 3 2019 4:43 PM

తెలుగింటి ఆంగ్ల పరిమళాలు - Sakshi

తెలుగింటి ఆంగ్ల పరిమళాలు

ఆంగ్లంలో రచనలు చేసే తెలుగువారు చాలా తక్కువ. వారిలో వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన హేమ మాచెర్ల ఒకరు. ఇటీవల ‘రిచర్డ్ అండ్ జూడీ’ చానల్ నిర్వహించిన నవలల పోటీలో హేమ రచించిన ‘బ్లూ ఐస్’ ఎంట్రీ సంపాదించుకుంది. లండన్‌లో ఉంటూ తనకున్న కొద్దిపాటి ఆంగ్ల పరిజ్ఞానంతోనే అప్రతిహతంగా రచనలు చేస్తున్న హేమ అక్షర ప్రస్థానం ఆమె మాటల్లోనే...
 
నా 17 వ ఏట  ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగానే నా వివాహం జరిగింది. మా వారు డాక్టర్. నాది పల్లెటూరు చదువు కావడం వల్ల పెద్దగా ఇంగ్లీషు నేర్చుకోలేదు. పెళ్లయ్యాక  కొంతకాలం వల్లభాపురంలో ఉన్నాం. ఆ తరవాత లండన్ వెళ్లిపోయాం. మా వారు ఒక రోజు నిద్రపోతుండగా ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. నాకసలే ఇంగ్లిషు రాదు, దానికి తోడు, అవతలి వాళ్లు బ్రిటిష్ యాక్సెంట్‌తో మాట్లాడారు. దాంతో వాళ్లు అడిగిన దానికి ఎస్, నో, ఆల్‌రైట్లు చెప్పి ఫోన్ పెట్టేశాను. తరవాత ఆయనే స్వయంగా ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు.

అది నాకు కాస్త చిన్నతనంగా అనిపించింది. దాంతో ఆ రోజునే అనుకున్నాను, ఎలాగైనా ఇంగ్లీషు నేర్చుకోవాలని. లైబ్రరీకి వెళ్లి నెమ్మదిగా చిన్న పిల్లల కథల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అర్థం కాని పదాలను డిక్షనరీ సహాయంతో తెలుసుకున్నాను. ఆ తరవాత పెద్దవాళ్ల కథలు, నవలలు, బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలు చదవగలిగే స్థాయికి చేరుకున్నాను. పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు పెంచుకుని, వాళ్లతో ఇంగ్లిషులో మాట్లాడటం అలవాటు చేసుకుని, ఆంగ్ల భాష మీద కొంత పట్టు సాధించాను.
 
అంకురార్పణ
లండన్‌లో ఉన్నప్పుడు ఒక గుజరాతీ పల్లె పడచుతో ఏర్పడిన పరిచయం వల్లే నేను కథలు రాయడం ప్రారంభించాను. ఆమెనే రోల్‌మోడల్‌గా తీసుకుని, నా మొట్టమొదటి నవల ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర’ రచనకు శ్రీకారం చుట్టాను. ఆడవాళ్లు ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే సందేశం ఇవ్వాలనేదే నా ఉద్దేశం. ఈ నవల రాయడానికి ముందు... భారతదేశంలోని వెనుక బడిన మహిళల కంటె, ఇంగ్లండ్‌లోని మహిళలు మరింత కష్టాలు పడుతున్నారని తెలుసుకుని, గృహహింసకు గురవుతున్న ఎందరో మహిళలను కలుసుకున్నాను.
 
లండన్‌లోని... ఫారెస్ట్ గేట్, అప్టన్ పార్క్, ఈస్ట్ హామ్ ప్రాంతాలలో ఉండే స్త్రీల స్థితిగతులను తెలుసుకుని, వారి గురించి నా కథలో అక్కడక్కడా ప్రస్తావించాను. కథ అంతా గంగాపూర్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర అయిన ‘నీల’ తన జీవితంలో ఎదురైన సమస్యలను సమర్థంగా ఎదుర్కొని, ఉన్నతస్థానానికి ఎలా ఎదిగిందో వివరించాను. తెలుగులో కాకుండా ఇంగ్లిష్‌లో రాస్తే మరింత ఎక్కువ మంది అర్థం చేసుకోగలుగుతారన్న మా వారి సలహా మేరకు నా నవలను ఇంగ్లీషులో రాశాను. అంతకు ముందు అంటే 1981 - 1990 మధ్యకాలంలో పదేళ్లపాటు తెలుగులో సుమారు 25 చిన్న కథలు రాశాను.
 
తప్పులు సరిదిద్దుకోగలిగాను!
‘బ్లూ ఐస్’ అనే నవల రాయడం ప్రారంభించి, డెబ్బై పేజీలు పూర్తయ్యాక, ‘అసలు నేను ఈ నవల సరిగా రాయగలనా? లేక అపేద్దామా?’ అని తర్జనభర్జన పడ్డాను. సరిగ్గా ఆ సమయంలోనే ‘బ్రిటిషు లోకల్ రైటింగ్ గ్రూప్’ వారు నన్ను ప్రోత్సహించారు. పుస్తకం రాయడం పూర్తయ్యేసరికి నా తప్పులు నేనే సరిచేసుకునే స్థాయికి చేరుకున్నాను. దాంతో సెకండ్ డ్రాఫ్ట్ నేనే రాసుకున్నాను. అలా పూర్తయిన నవలను ‘రిచర్డ్ అండ్ జూడీ చానల్ - 4’ వారు నిర్వహించిన పోటీకి పంపాను.

ఆ పోటీకి వచ్చిన 44000 ఎంట్రీలను ఫిల్టర్ చేసి 26 పుస్తకాలను ఎంపిక చేశారు. అందులో నా నవల ఒకటి కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. పుస్తకాన్ని ఎడిన్‌బరో లెనిన్ ప్రెస్ వారు ప్రచురించారు. దీనికి ‘నేషనల్ ఇయర్ ఆఫ్ హీరోస్’ అవార్డు వచ్చింది. శ్రీమతి గోర్డన్ బ్రౌన్ చేత ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో సత్కారం పొందాను.
 
తెలుగువారి గుర్తింపు...
ఈ రెండు పుస్తకాలు ప్రచురితమై, వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుగువాళ్ల నుంచి నాకు మంచి గుర్తింపు వచ్చింది. తాళ్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్) ప్రచురించే తెలుగు మ్యాగజీన్‌కి సంబంధించిన ఎడిటింగ్ పని అప్పగించారు. అంతేకాదు, లండన్ లైబ్రరీలో క్రియేటివ్ రైటింగ్ క్లాసులు తీసుకుంటున్నాను. అక్కడ వాళ్లు రాసిన కథలకు, వ్యాసాలకు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాను. నా మూడో నవలగా ‘ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్’ రాయబోతున్నాను. ఇందులోనూ స్త్రీ సాధికారతే ప్రధానాంశం. మహిళలకు సంబంధించిన సమస్యలను వెలికితెచ్చి అందరికీ తెలియచేయాలన్నదే నా ఆకాంక్ష.
 
అవార్డు అందుకున్నంత ఆనందం!
ఒక పాకిస్తానీ అమ్మాయి నా పుస్తకం చదివి, ధైర్యం తెచ్చుకుని ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఉద్యోగం సంపాదించుకుని, తన కాళ్ల మీద తాను నిలబడిందట. ఆ తర్వాత మరింత గుండె ధైర్యంతో కోర్టులో కేసు వేసి, భర్త నుంచి విడాకులు తీసుకుందట. ‘‘ఇప్పుడు హాయిగా నా బతుకు నేను బతుకుతున్నాను. ఊపిరి పీల్చుకోవడానికి సమయం దొరుకుతోంది. దీనికంతకూ మీ రచనలే నాకు ప్రేరణ’’ అని ఉత్తరం రాసింది.
 
ఇక ‘బ్రీజ్ ఫ్రం ది రివర్ మంజీరా’ నవలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేశారు. స్పెయిన్ వెళ్లినప్పుడు, ‘ఈ పుస్తకం ఒక ఇండియన్ విమెన్‌కి మాత్రమే పరిమితం కాదు... ప్రపంచంలోని మహిళలందరికీ ఉపయోగపడుతుంది’ అన్నారు. ఈ రెండు సంఘటనలు నాకు అవార్డు వచ్చిన దాని కన్నా రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాయి.  నా భర్త, పిల్లల ప్రోత్సాహ సహకారాలు లేకపోతే నేను ఇవన్నీ సాధించి ఉండేదాన్ని కాదేమో!
 - డా॥పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement