Telugu Association of London
-
విజయవంతంగా TAL జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ సెంటర్లో మార్చి 16-, ఏప్రిల్ 6న పోటీలు నిర్వహించింది. లండన్‌తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్ డబుల్స్, మెన్స్ 40+ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, విమెన్స్ 35+ డబుల్స్, అండర్-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇందులో భాగమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు అలీ విజేతలకు బహమతులు అందజేశారు. -
టీఏఎల్ క్రికెట్ లీగ్ విజేతగా కూల్ క్రూయిర్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ చైర్మన్ కందుకూరి భారతి సాక్షి, అమరావతి: ‘ప్రైమ్ నార్త్’ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో కూల్ క్రూయిర్స్ జట్టు విజేతగా నిలిచినట్టు టీఏఎల్ చైర్మన్ కందుకూరి భారతి తెలిపారు. ఆదివారం ఇంగ్లాండ్‌లోని లాంగ్లీ స్లౌ క్రికెట్ క్లబ్ మైదానంలో ఫైనల్స్ నిర్వహించామన్నారు. ద్వితీయ స్థానంలో డీజే వారియర్స్, తృతీయ స్థానంలో వైజాగ్ బ్లూస్ జట్లు గెలుపొందాయని తెలిపారు. ఈ ఏడాది 10 జట్లతో 14 వారాల పాటు 51 మ్యాచ్‌లతో లీగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఉత్తమ బౌలర్‌గా వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్(21 వికెట్లు), ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా డీజే వారియర్స్‌కు చెందిన పవన్‌కుమార్ (274 పరుగులు)నిలిచారన్నారు. తొలిసారిగా మహిళా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఐటీ ట్రీ వారియర్స్, గెలాక్సీ గర్ల్స్ మధ్య పోటీలో గెలాక్సీ గర్ల్స్ గెలుపొందినట్టు పేర్కొన్నారు. 2008లో లండన్‌లో టీఏఎల్ క్రికెట్ లీగ్‌ని ప్రారంభించిందని, 2012లో ప్రీమియర్ లీగ్ ఫార్మాట్‌గా రూపాంతరం చెందిందన్నారు. యూకేలోని అన్ని తెలుగు కుటుంబాలను కలుపుతూ పెద్ద కమ్యూనిటీ క్రికెట్ లీగ్ అవతరించినట్టు తెలిపారు. టోర్నీ విజయవంతానికి కృషి చేసిన అనితా నోముల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్, అనిల్, కిషోర్‌లను అభినందించారు. -
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 ఘనంగా జరిగాయి. లండన్‌లోని సత్తావిస్ పటిదార్ సెంటర్లో ఏప్రిల్ 22న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లండన్, పరిసర ప్రాంతాలకుచెందిన సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాల్ కల్చరల్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉగాది కోసం ప్రత్యేకంగా మూడు నెలలపాటు నిర్వహించిన సినీ నృత్య శిక్షణ శిబిరాలలో సుమారు వంద మంది చిన్నారులు, గృహిణులు, భార్య భర్తలు పాల్గొని, ఆ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అవి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, సినీ సంగీత నృత్యాలతో, విభిన్న కార్యక్రమాలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అరిటాకులో వడ్డించారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ , కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి మరియు కిషోర్ కస్తూరి పాల్గొన్నారు. 'తాల్' ఉగాది-2023 కన్వీనర్ శ్రీదేవి అల్లెద్దుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, హీరో, డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని, తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెప్పి తెలుగువారిని, ప్రేక్షకుల్లో ఉన్న కొందరు కన్నడ వారికోసం కన్నడ డైలాగులు చెప్పి వారిని కూడా కేరింతలు కొట్టించారు. యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో 'తాల్' చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 'తాల్' వార్షిక పత్రిక “మా తెలుగు”ను సాయి కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తాల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ , బ్రిటన్ ఓబీఈ గ్రహీత, KIMS ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం పిల్లరిశెట్టికి అందించి సత్కరించారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు. అలాగే 'తాల్' చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. లండన్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ (కోఆర్డినేషన్) దీపక్ చౌదరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసి, లండన్‌లో 'తాల్' తెలుగువారి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగు వారికి భారత దౌత్య కార్యాలయం 'తాల్' సమన్వయంతో సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రముఖ పర్వతారోహకుడు, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అన్మిష్ వర్మ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశం నుంచి విచ్చేశారు. తన ఎవరెస్టు శిఖరం ఎక్కినప్పటి అనుభవాలను, రణ విద్యలలో తను గెలుచుకున్న ప్రపంచ స్థాయి పథకాల ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించి ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపారు. ప్రముఖ యాంకర్, నటి శ్యామల, కెవ్వు కార్తీక్, ఆర్జే శ్రీవల్లి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు హారిక నారాయన్, అరుణ్ కౌండిన్యలు తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో మైమరిపించడమే కాకుండా ఉర్రూతలూగించే పాటలతో ప్రేక్షకులుమైమరచిపోయారు. లండన్ బారో ఆఫ్ హన్స్లో మేయర్ రఘువీందర్ సింగ్ అతిథిగా విచ్చేసి, 'తాల్' క్రీడల పట్ల చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 'తాల్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 20-20 క్రికెట్ పోటీలు, 'తాల్' ప్రీమియర్ లీగ్ (TPL), ఈ సంవత్సరం ప్రైమ్ నార్త్ టీపీఎల్ 2023గా, మే 6 నుంచి మూడు నెలల పాటు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తూ టోర్నీకి సంబంధించిన పోస్టర్ని TPL కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, తోడ్పాటు అందించిన స్పాన్సర్లందరికీ 'తాల్' చైర్పర్సన్ భారతి కందుకూరి ధన్యవాదాలు తెలిపారు. -
లండన్‌లో బాడ్మింటన్ పోటీలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు 2022 26 మార్చిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ స్పోర్ట్స్ హాల్లో నిర్వహించింది. టోర్నీని తిలకించేందుకు లండన్ చుట్టుపక్కల ప్రాంతాలనుంచి తెలుగు క్రీడాకారులు వచ్చారు. పురుషుల డబుల్స్, పురుషుల 40 ప్లస్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్, అండర్ 13, అండర్ 16 విభాగాల్లో పోటీలు జరిగాయి. మొత్తం 175 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, స్పోర్ట్స్ ట్రసీ నోముల అనిత, సమన్వయకర్తలు బాలాజీ కల్లూరు , రాజేష్ వీరమాచనేని, ట్రెజరర్ రాజేష్ తోలేటి , ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిల్ అనంతులలు ఆటగాళ్లకు విజేతలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం అనంతరం విజేతలు, రన్నరప్‌లకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 2021 క్రిస్మస్ సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) డిసెంబర్ 4న వర్చువల్ పద్థతిలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లండన్, యూకేలోని ఇతర ప్రాంతాల్లోని చర్చిలకు సంబంధించి సుమారు 100 మంది తెలుగువారు, తాల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ స్టీఫెన్ టీమ్స్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. గత 15 సంవత్సరాలకు భిన్నంగా తాల్.. గత ఏడాది, ఈ సంవత్సరం కోవిడ్19 ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తాల్ గురించి ప్రస్తావిస్తూ.. గత 16 సంవత్సరాల నుంచి తెలుగు భాష మరియు సంస్కృతిని లండన్‌లోని తెలుగు సమాజానికి అందించే సదుద్దేశంతో కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఈ క్రిస్మస్ సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రవి మోచర్ల, జమీమ రత్నాకర్ దార, జస్టిన్, కారోల్, డానియల్ విక్టర్ తదితరులను ప్రత్యేకంగా అభినందించారు. బ్రదర్ డేవిస్ పెనియల్ క్రిస్మస్ ఆరాధనతో కార్యక్రమం ఆరంభించారు. రెవరాండ్ పాల్, పాస్టర్ డొమినిక్, బ్రదర్ డానియల్ ఇతర చర్చి నాయకులు, పెద్దలు పాల్గొని యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలకు క్విజ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. లండన్, యూకే తదితర ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు.. వారి పిల్లలతో క్రిస్మస్ పాటలను పాడించి వీక్షకులను ఆనందపరిచారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా భారత దేశపు “కల్వరి లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్” నుంచి రెవరాండ్ డాక్టర్ జో మధు మరియు రెవరాండ్ డాక్టర్ వీణ జెస్సి పాల్గొన్నారు. కరోనా కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ వేడుకల్లో తాల్ ట్రస్టీలు నవీన్ గాదంసేతి, కిషోర్ కస్తూరి, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, అనితా నోములా తదితరులు తమ సహకారాన్ని అందించారు. -
లండన్ లో ఘనంగా ఉగాది వేడుకలు
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలను 24 ఏప్రిల్ 2021న ఘనంగా జరుపుకున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా తొలిసారి అంతర్జాలంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయరచయిత భువనచంద్ర హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా సింగర్ ఎస్పీ శైలజ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తాల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోగా, ఎంపీ సీమ మల్హోత్రా యూకేలో తాల్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖచిత్రంతో ఉన్న తాల్ ‘మా తెలుగు’వార్షిక సంచికను విశిష్ట అతిథులుగా ప్రముఖ రచయిత కాళిపట్నం రామారావు, సాహితివేత్త ఓలేటి పార్వతీశం ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి హేమ మాచర్ల సంపాదకీయం వహించిన ఈ సంచిక విడుదలకు సూర్య కందుకూరి మరియు తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి సహకరించారు. ఆద్యంతం సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో, లండన్ లోని తెలుగువారే కాదు, తెలుగురాష్ట్రాల్లోని కళాకారులు అదిరే అభి, సినీ గాయకులు సాకేత్ కొమండూరిమరియు సాహితి చాగంటి, లండన్ ఆర్ జె శ్రీవల్లి, పేరడిగురుస్వామి, 4 లెగ్స్ కిరణ్, ఇమిటేషన్ రాజు వారి వారి ప్రదర్శనలతో అలరించారు. సురభి డ్రామా థియేటర్ వారి మాయాబజార్ నాటకం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాల్ కల్చరల్ సెంటర్ విద్యార్థులుప్రదర్శించిన భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు పద్యాలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో గాన గంధర్వుడు అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి తాల్ నివాళులు అర్పించింది. యూకేలోని తెలుగు గాయకులతో ఎస్ పీ శైలజ కలిసి ఎస్ పీ బాలు పాటలతో ఎస్ పీబికి స్వరాభిషేకం చేసారు. యూకే వైద్య మరియు కీలక రంగాల్లో సేవలందిస్తున్న తెలుగు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమానికి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ వేడుకల్లో తాల్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, చైర్మన్ భారతి కందుకూరి తెలుగు వారి అందరికి ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, తాల్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. అలాగే ఈ వేడుకలను ఇంత వైభవముగా నిర్వహించిన కన్వీనర్లు వెంకట్ నీల, విజయ్ బెలిదే మరియు వారి బృందంని అభినందించారు. తాల్ ట్రస్టీలు కిషోర్ కస్తూరి, నవీన్ గాదంసేతి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, అనిత నోముల, ఈ కార్యక్రమ విజయానికి కారకులయిన కళాకారులు, చిన్నారులు, సహాయ సదుపాయాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ ట్రస్టీ అనిత నోముల మాట్లాడుతూ మే 15న ప్రారంభం అయి 3 నెలల పాటు జరిగే తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) గురించి వివరించి, అందరూ పాల్గొని యూకే తెలుగు క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. సుమారు ఎనిమిది గంటలపాటు సాగిన ఈ కార్యక్రమాన్నివివిధ అంతర్జాల మాధ్యమాలలో అంతరాయం లేకుండా నిర్విరామంగా పనిచేసిన తాల్ సాంకేతిక బృంద కీలక సభ్యులు వంశీ మోహన్ సింగులూరి, కిరణ్ కప్పెటలను తాల్ సభ్యులందరూ కొనియాడారు. అన్ని వయసుల వారిని అలరించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అయిదు వేల మందికి పైగా వీక్షించారు. -
టీపీఎల్ 2018 చాంపియన్స్‌గా కూల్ క్రూజర్స్
లండన్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) ఆధ్వర్యంలో తాల్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌ను మిడిల్సెక్స్లో నిర్వహించారు. క్రాన్ ఫోర్డ్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో హెస్టన్ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో విజేతలకు స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా అవార్డులను ప్రదానం చేశారు. కూల్ క్రూజర్స్, మార్చ్ సైడ్ కింగ్స్ జట్లు ఫైనల్ వరకు చేరుకోగా, బ్లూ క్యాప్స్, యూనైటెడ్ టైటాన్స్ జట్లు మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. కూల్ క్రూజర్స్ టీపీఎల్ 2018 చాంపియన్స్‌గా నిలవగా, మార్చ్ సైడ్ కింగ్స్ రెండో స్థానం, యునైటెడ్ టైటాన్స్ మూడోస్థానంలో నిలిచాయి. టీపీఎల్‌లో పవన్ కుమార్ సీహెచ్ ఆల్‌రౌండర్‌గా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన టీపీఎల్ కమిటీ సభ్యులు సునీల్ నాగండ్ల, వంశీ రక్నర్, శ్యామ్ భీమ్‌రెడ్డి, శ్రీధర్ సోమిశెట్టి, వంశి పొన్నంలకు తాల్ స్పోర్ట్స్ ట్రస్టీ మురళీ తాడిపర్తి కృతజ్ఞతలు తెలిపారు. టీపీఎల్ సలహాదారులు రవిసుబ్బా, సంజయ్ భిరాజు, శరత్ జెట్టి, వాలంటీర్ల చేసిన కృషిని టీఏఎల్ ఛైర్మన్ శ్రీధర్ మేడిచెట్టి అభినందించారు. -
లండన్‌లో 'తాల్' ఉగాది ఉత్సవాలు
లండన్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలను లండన్‌లోని రెడ్ బ్రిడ్జ్ టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించింది. లండన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది తెలుగు కుటంబాలతో కలిసి నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ ఉగాది వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకలను తాల్ ఉగాది కన్వీనర్ శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. తాల్ కల్చరల్ సెంటర్ (టీసీసీ) లలో సంగీతం, నృత్య కళలను అభ్యసిస్తున్న చిన్నారుల నృత్యాలు, ఆటపాటలతో ఉగాది సంబరాలు మిన్నంటాయి. టీసీసీ సంగీత అధ్యాపకురాలు వీణా పాణి కీర్తనలు, జ్యోత్స్నల వయోలిన్ కచేరి, సిజ్జ్ మీనన్, అరుణి మాల నృత్య ప్రదర్శనలు, తాల్ యూత్ బృంద నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి. సినీ నేపథ్యగాయకులు గోపిక పూర్ణిమ, మల్లికార్జున వైవిధ్య భరితమైన పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. కమెడియన్లు అభి, అవినాష్‌లు తమ హాస్య ప్రదర్శనలు, అనుకరణలతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి సినీ నటి ప్రణీత, ఇల్ఫోర్డ్ ఎంపీ మైక్ గేప్స్, ఈస్ట్ హామ్ కౌన్సెలర్ పాల్ సతియానెసన్, భారత రాయబార కార్యాలయ అధికారి సౌమేంద్ర మహాపాత్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాల్ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలను ప్రణీత అభినందించారు. లండన్‌లోని పిల్లలు తెలుగులో మాట్లాడటం తనకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు. తాల్ ఛైర్మన్ సత్యేంద్ర పగడాల, వైస్ ఛైర్మన్ శ్రీధర్ మేడిచెట్టి, ట్రస్టీలు మల్లేష్ కోట, భారతి కందుకూరి, నిర్మల ధవళ, శ్రీధర్ సోమిశెట్టి, శ్రీవాస రావు కొర్నెపాటి, కిరణ్ కప్పెటలు ఈ వేడుకను విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు. ఈ ఏడాది హేమ మాచెర్ల సంపాదకీయంతో వచ్చిన తాల్ వార్షిక పత్రిక 'మా తెలుగు'ను ఆవిష్కరించారు. ప్రతిఏటా తాల్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)పేరిట నిర్వహించే క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాల్ ఉగాది 2017 ఆర్గనైజింగ్ టీం, ప్రేక్షకులు, కళాకారులు, వాలంటీర్లు, సహకరించిన ఇతర సంస్థలకు, ఆర్థికంగా సహకరించిన వ్యాపార సంస్థలకు తాల్ ఛైర్మన్ సత్యేంద్ర పగడాల కృతజ్క్షతలు తెలిపారు. -
మోహన్‌బాబుకు లండన్‌లో సత్కారం
లండన్: ప్రముఖ నటుడు మోహన్‌బాబు లండన్‌లో సత్కారం పొందనున్నారు. తెలుగు చిత్రసీమకు 40 సంవత్సరాలుగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను వచ్చే శనివారం అవార్డుతో సత్కరించనున్నట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) ప్రకటించింది. 'చిత్ర సీమలోనే కాకుండా విద్యా పరంగా, స్వచ్ఛంధ సేవల పరంగా మోహన్‌బాబు అప్రతిహత సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా తమ సంస్థ తరుపున అవార్డును అందిస్తూ సత్కారం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది' అని టీఏఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసోజు రాములు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తాను పొందబోతున్న ఈ బహుమానాన్ని తన కుటుంబానికి, స్నేహితులకు అభిమానుల, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నానని తెలిపారు. -
తెలుగింటి ఆంగ్ల పరిమళాలు
ఆంగ్లంలో రచనలు చేసే తెలుగువారు చాలా తక్కువ. వారిలో వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన హేమ మాచెర్ల ఒకరు. ఇటీవల ‘రిచర్డ్ అండ్ జూడీ’ చానల్ నిర్వహించిన నవలల పోటీలో హేమ రచించిన ‘బ్లూ ఐస్’ ఎంట్రీ సంపాదించుకుంది. లండన్‌లో ఉంటూ తనకున్న కొద్దిపాటి ఆంగ్ల పరిజ్ఞానంతోనే అప్రతిహతంగా రచనలు చేస్తున్న హేమ అక్షర ప్రస్థానం ఆమె మాటల్లోనే... నా 17 వ ఏట ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగానే నా వివాహం జరిగింది. మా వారు డాక్టర్. నాది పల్లెటూరు చదువు కావడం వల్ల పెద్దగా ఇంగ్లీషు నేర్చుకోలేదు. పెళ్లయ్యాక కొంతకాలం వల్లభాపురంలో ఉన్నాం. ఆ తరవాత లండన్ వెళ్లిపోయాం. మా వారు ఒక రోజు నిద్రపోతుండగా ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. నాకసలే ఇంగ్లిషు రాదు, దానికి తోడు, అవతలి వాళ్లు బ్రిటిష్ యాక్సెంట్‌తో మాట్లాడారు. దాంతో వాళ్లు అడిగిన దానికి ఎస్, నో, ఆల్రైట్లు చెప్పి ఫోన్ పెట్టేశాను. తరవాత ఆయనే స్వయంగా ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. అది నాకు కాస్త చిన్నతనంగా అనిపించింది. దాంతో ఆ రోజునే అనుకున్నాను, ఎలాగైనా ఇంగ్లీషు నేర్చుకోవాలని. లైబ్రరీకి వెళ్లి నెమ్మదిగా చిన్న పిల్లల కథల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అర్థం కాని పదాలను డిక్షనరీ సహాయంతో తెలుసుకున్నాను. ఆ తరవాత పెద్దవాళ్ల కథలు, నవలలు, బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలు చదవగలిగే స్థాయికి చేరుకున్నాను. పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు పెంచుకుని, వాళ్లతో ఇంగ్లిషులో మాట్లాడటం అలవాటు చేసుకుని, ఆంగ్ల భాష మీద కొంత పట్టు సాధించాను. అంకురార్పణ లండన్‌లో ఉన్నప్పుడు ఒక గుజరాతీ పల్లె పడచుతో ఏర్పడిన పరిచయం వల్లే నేను కథలు రాయడం ప్రారంభించాను. ఆమెనే రోల్‌మోడల్‌గా తీసుకుని, నా మొట్టమొదటి నవల ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర’ రచనకు శ్రీకారం చుట్టాను. ఆడవాళ్లు ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే సందేశం ఇవ్వాలనేదే నా ఉద్దేశం. ఈ నవల రాయడానికి ముందు... భారతదేశంలోని వెనుక బడిన మహిళల కంటె, ఇంగ్లండ్‌లోని మహిళలు మరింత కష్టాలు పడుతున్నారని తెలుసుకుని, గృహహింసకు గురవుతున్న ఎందరో మహిళలను కలుసుకున్నాను. లండన్‌లోని... ఫారెస్ట్ గేట్, అప్టన్ పార్క్, ఈస్ట్ హామ్ ప్రాంతాలలో ఉండే స్త్రీల స్థితిగతులను తెలుసుకుని, వారి గురించి నా కథలో అక్కడక్కడా ప్రస్తావించాను. కథ అంతా గంగాపూర్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర అయిన ‘నీల’ తన జీవితంలో ఎదురైన సమస్యలను సమర్థంగా ఎదుర్కొని, ఉన్నతస్థానానికి ఎలా ఎదిగిందో వివరించాను. తెలుగులో కాకుండా ఇంగ్లిష్‌లో రాస్తే మరింత ఎక్కువ మంది అర్థం చేసుకోగలుగుతారన్న మా వారి సలహా మేరకు నా నవలను ఇంగ్లీషులో రాశాను. అంతకు ముందు అంటే 1981 - 1990 మధ్యకాలంలో పదేళ్లపాటు తెలుగులో సుమారు 25 చిన్న కథలు రాశాను. తప్పులు సరిదిద్దుకోగలిగాను! ‘బ్లూ ఐస్’ అనే నవల రాయడం ప్రారంభించి, డెబ్బై పేజీలు పూర్తయ్యాక, ‘అసలు నేను ఈ నవల సరిగా రాయగలనా? లేక అపేద్దామా?’ అని తర్జనభర్జన పడ్డాను. సరిగ్గా ఆ సమయంలోనే ‘బ్రిటిషు లోకల్ రైటింగ్ గ్రూప్’ వారు నన్ను ప్రోత్సహించారు. పుస్తకం రాయడం పూర్తయ్యేసరికి నా తప్పులు నేనే సరిచేసుకునే స్థాయికి చేరుకున్నాను. దాంతో సెకండ్ డ్రాఫ్ట్ నేనే రాసుకున్నాను. అలా పూర్తయిన నవలను ‘రిచర్డ్ అండ్ జూడీ చానల్ - 4’ వారు నిర్వహించిన పోటీకి పంపాను. ఆ పోటీకి వచ్చిన 44000 ఎంట్రీలను ఫిల్టర్ చేసి 26 పుస్తకాలను ఎంపిక చేశారు. అందులో నా నవల ఒకటి కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. పుస్తకాన్ని ఎడిన్‌బరో లెనిన్ ప్రెస్ వారు ప్రచురించారు. దీనికి ‘నేషనల్ ఇయర్ ఆఫ్ హీరోస్’ అవార్డు వచ్చింది. శ్రీమతి గోర్డన్ బ్రౌన్ చేత ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో సత్కారం పొందాను. తెలుగువారి గుర్తింపు... ఈ రెండు పుస్తకాలు ప్రచురితమై, వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుగువాళ్ల నుంచి నాకు మంచి గుర్తింపు వచ్చింది. తాళ్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్) ప్రచురించే తెలుగు మ్యాగజీన్‌కి సంబంధించిన ఎడిటింగ్ పని అప్పగించారు. అంతేకాదు, లండన్ లైబ్రరీలో క్రియేటివ్ రైటింగ్ క్లాసులు తీసుకుంటున్నాను. అక్కడ వాళ్లు రాసిన కథలకు, వ్యాసాలకు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాను. నా మూడో నవలగా ‘ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్’ రాయబోతున్నాను. ఇందులోనూ స్త్రీ సాధికారతే ప్రధానాంశం. మహిళలకు సంబంధించిన సమస్యలను వెలికితెచ్చి అందరికీ తెలియచేయాలన్నదే నా ఆకాంక్ష. అవార్డు అందుకున్నంత ఆనందం! ఒక పాకిస్తానీ అమ్మాయి నా పుస్తకం చదివి, ధైర్యం తెచ్చుకుని ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఉద్యోగం సంపాదించుకుని, తన కాళ్ల మీద తాను నిలబడిందట. ఆ తర్వాత మరింత గుండె ధైర్యంతో కోర్టులో కేసు వేసి, భర్త నుంచి విడాకులు తీసుకుందట. ‘‘ఇప్పుడు హాయిగా నా బతుకు నేను బతుకుతున్నాను. ఊపిరి పీల్చుకోవడానికి సమయం దొరుకుతోంది. దీనికంతకూ మీ రచనలే నాకు ప్రేరణ’’ అని ఉత్తరం రాసింది. ఇక ‘బ్రీజ్ ఫ్రం ది రివర్ మంజీరా’ నవలను ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేశారు. స్పెయిన్ వెళ్లినప్పుడు, ‘ఈ పుస్తకం ఒక ఇండియన్ విమెన్‌కి మాత్రమే పరిమితం కాదు... ప్రపంచంలోని మహిళలందరికీ ఉపయోగపడుతుంది’ అన్నారు. ఈ రెండు సంఘటనలు నాకు అవార్డు వచ్చిన దాని కన్నా రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాయి. నా భర్త, పిల్లల ప్రోత్సాహ సహకారాలు లేకపోతే నేను ఇవన్నీ సాధించి ఉండేదాన్ని కాదేమో! - డా॥పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై