‘తాల్‌’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు  | Ugadi Celebrations Ended successfully by Telugu Association of London | Sakshi
Sakshi News home page

 ‘తాల్‌’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు 

Published Mon, Apr 24 2023 6:21 PM | Last Updated on Mon, Apr 24 2023 6:32 PM

Ugadi Celebrations Ended successfully by Telugu Association of London - Sakshi

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 ఘనంగా జరిగాయి.  లండన్‌లోని సత్తావిస్ పటిదార్ సెంటర్‌లో ఏప్రిల్ 22న ఘనంగా  జరిగాయి. ఈ వేడుకల్లో లండన్, పరిసర ప్రాంతాలకుచెందిన సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తాల్ కల్చరల్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉగాది కోసం ప్రత్యేకంగా మూడు నెలలపాటు నిర్వహించిన సినీ నృత్య శిక్షణ శిబిరాలలో సుమారు వంద మంది చిన్నారులు, గృహిణులు, భార్య భర్తలు పాల్గొని, ఆ నృత్యాలను ఈ కార్యక్రమంలో  ప్రదర్శించారు. అవి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, సినీ సంగీత నృత్యాలతో, విభిన్న కార్యక్రమాలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అరిటాకులో వడ్డించారు.  

తాల్ చైర్‌పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ , కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి మరియు కిషోర్ కస్తూరి  పాల్గొన్నారు. 'తాల్' ఉగాది-2023 కన్వీనర్ శ్రీదేవి అల్లెద్దుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, హీరో, డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని, తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెప్పి తెలుగువారిని, ప్రేక్షకుల్లో ఉన్న కొందరు కన్నడ వారికోసం కన్నడ డైలాగులు చెప్పి వారిని కూడా కేరింతలు కొట్టించారు. యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో 'తాల్' చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 'తాల్' వార్షిక పత్రిక “మా తెలుగు”ను  సాయి కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

తాల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ , బ్రిటన్ ఓబీఈ గ్రహీత, KIMS ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం పిల్లరిశెట్టికి అందించి సత్కరించారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు. అలాగే 'తాల్' చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు.

లండన్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ (కోఆర్డినేషన్) దీపక్ చౌదరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసి, లండన్‌లో 'తాల్' తెలుగువారి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగు వారికి భారత దౌత్య కార్యాలయం 'తాల్' సమన్వయంతో సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు.

ప్రముఖ పర్వతారోహకుడు, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అన్మిష్ వర్మ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశం నుంచి విచ్చేశారు. తన ఎవరెస్టు శిఖరం ఎక్కినప్పటి అనుభవాలను, రణ విద్యలలో తను గెలుచుకున్న ప్రపంచ స్థాయి పథకాల ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించి ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపారు.

ప్రముఖ యాంకర్, నటి శ్యామల, కెవ్వు కార్తీక్, ఆర్‌జే శ్రీవల్లి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు హారిక నారాయన్, అరుణ్ కౌండిన్యలు తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో మైమరిపించడమే కాకుండా ఉర్రూతలూగించే  పాటలతో ప్రేక్షకులుమైమరచిపోయారు. లండన్ బారో ఆఫ్ హన్స్లో మేయర్ రఘువీందర్ సింగ్ అతిథిగా విచ్చేసి, 'తాల్' క్రీడల పట్ల చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు.

ప్రతి సంవత్సరం 'తాల్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 20-20 క్రికెట్ పోటీలు, 'తాల్' ప్రీమియర్ లీగ్ (TPL), ఈ సంవత్సరం ప్రైమ్ నార్త్ టీపీఎల్ 2023గా, మే 6 నుంచి మూడు నెలల పాటు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తూ టోర్నీకి సంబంధించిన పోస్టర్ని TPL కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, తోడ్పాటు అందించిన స్పాన్సర్‌లందరికీ 'తాల్' చైర్‌పర్సన్ భారతి కందుకూరి ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement