దేవుడా..! | Her dedication to God | Sakshi
Sakshi News home page

దేవుడా..!

Published Tue, Jan 24 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

దేవుడా..!

దేవుడా..!

లీగల్‌   స్టోరీస్‌

దోపిడి కోసం మగాడు ఏమైనా చేస్తాడు! ఇల్లు, వాకిలే కాదు దేవుడి కోవెల కూడా వాడికి అడ్డం రాదు! ఇలాంటి దుర్మార్గపు దోపిడీకి అందరి అంగీకారం పొందాలంటే దానికి ఆచారం అని పేరు పెడితే పోలా..! అలా ఆ దోపిడీ దురాచారాన్నే మగాడు ‘జోగిని’ అనే ఆచారంగా మార్చాడు! దాన్ని మనం మార్చుదాం. సంకల్పం ఉంటే చాలు.. చేయూతగా చట్టం ఉంది.
 
‘ఇంకొంచెం పెట్టుకో బాలమ్మా..’ అంటూ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని తింటున్న బాలమ్మ కంచంలో కొసరి కొసరి వడ్డించింది పదహారేళ్ల  సుజాత.‘ఊ.. పెట్టు’ అంటూ కంచంలోంచి తలెత్తకుండా ఆకలిగా.. ఆబగా తింటున్న బాలమ్మ కేసి జాలిగా చూసింది. ఒకప్పుడు చాలా అందగత్తె అట బాలమ్మ. ఊర్ల అందరూ అనుకుంటుండగా విన్నది మస్తుసార్లు. పద్నాలుగేళ్లకే దేవుడితో పెండ్లి చేసిండ్రట. దేవుడి పేరు మీదున్న ఆమె కోసం ఊళ్లో పెద్దపెద్దోళ్లంతా అంగలార్చేటోళ్లట. ఒక అయిదేళ్లు ఆమెదే రాజ్యం. పిల్లల్లేరు. అప్పటి సర్పంచ్‌ ఆమెను బాగానే చూసుకొని పైసలూ మంచిగనే  ఇచ్చిండట. ఆ పైసల్తోనే ఇల్లు కట్టిందని.. ఆ ఇంటిని ఆమె తమ్ముడు తన పేరు మీద చేసుకున్నాడని... ఆమెకు వయసు మీద పడంగానే ఇంట్లోంచి ఎల్లగొట్టిండని చెప్పుకుంటరు ఊర్లే. గప్పటి నుంచి ఆమె ఆడ.. ఈడ తిరిగుతూ.. ఇండ్లల్ల అడుక్కుంటూ బతుకుతోంది.‘ఏందే.. మల్లా బాలమ్మను పిల్చినవా?’ అప్పుడే బీడీ కార్ఖానా నుంచి వచ్చిన తల్లి అరుపుకి బాలమ్మ ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చింది సుజాత.‘అమ్మా.. పాపం ముసల్ది. ఆకలి అని ఇంటికొచ్చిందే..ఇంకోసారి పెట్టగని.. ఈ పూటకి తిననియ్యే’ అని తల్లిని బతిమాలుకుంటూ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.‘ఏందీ పోనీ.. ఈసారి గనుక పిల్చినవంటే సూడు మల్లా.. ’అని బిడ్డను కొరకొర చూస్తూ.. ‘ఏయ్‌ ముసల్దానా.. మల్లోపారి ఇటెంకలమర్లేవ్‌..చెప్తున్నా’ అని తర్జని చూపిస్తూ బాలమ్మను బెదిరించి లోపలికెళ్లిపోయింది.

చిన్న దొర కన్నేశాడు!
‘అక్కా.. చిన్న దొర మల్లా పిలిచిండే ఇయ్యాల?’ ఇంట్లోకి వస్తూ వస్తూనే అన్నాడు శేఖర్‌.  ఆ మాటకు గుండెలో రాయి పడ్డట్టయింది  దేవకికి. ‘ఏమన్నడ్రా?’ భయంభయంగానే అడిగింది తమ్ముడ్ని.‘ఎందుకు లేట్‌ చేస్తున్నర్రా ఇంకా? వచ్చే వారం ముహూర్తం మంచిగుంది అన్నడక్కా’.‘మొన్న నన్ను సుత సర్పంచ్‌ అటకాయించిండురా.. ఇంకా సప్పుడు చేస్తలేరేమే అని’ విచారంగా చెప్పింది దేవకి. లోపల గదిలో ఉన్న సుజాతకు ఈ మాటలు స్పష్టంగా వినపడకపోయినా వాటి భావం అర్థమవుతోంది. మనసులో ఆందోళన. తెలియని ఉక్రోషం. చేస్తున్న పనివదిలేసి విసురుగా బయటి గదిలోకి వచ్చింది.‘ఇగో మామా.. ఆ చిన్నదొరకు చెప్పు.. నాతో పెట్టుకోవద్దని! నేను సదువుకుంటా.. గిట్లాంటి ఆలోచనలు చెయ్యకుండ్రి. బలవంతం చేస్తే.. పారిపోతా.. లేకపోతే ఉరేసుకొని సస్తా ఏందనుకుంటున్నరో’ అని అల్టిమేటం ఇచ్చి అంతే విసురుగా లోపలికి వెళ్లిపోయింది సుజాత.‘హు..’ అని నిట్టూరుస్తూ ‘చూసినవ్‌ గదరా.. అదెట్ల మాట్లాడుతుందో? ఆ జోలి తీసినప్పుడల్ల గిదే వర్స. అటేమో.. ఆల్ల బలవంతం ఎక్కువైతుంది. ఏం జేయాల్నో అర్థమైతలేదు’ అంటూ తల పట్టూకూర్చుంది  దేవకి.‘అక్కా.. ఊర్ల పెద్దోళ్లు ఊరుకోరు. గాల్లు జబర్దస్తీ చేసేదాకా చూసేకంటే మనమే ముందుగల్ల ఆల్ల దార్ల వడ్డమనుకో డిమాండ్‌ చేసిన పైసలన్నా అస్తయ్‌. ఆలోచించుకో’అని చెప్పి వెళ్లిపోయాడు తమ్ముడు. తమ కులంలో ఇది కొత్తేం కాదు. తరతరాలుగా వస్తున్నది. కుటుంబంలోని పెద్ద బిడ్డ పెద్ద మనిషి కాంగనే దేవుడికిచ్చి మనువు జెయ్యాలే. ఇది తన బిడ్డకూ తప్పుతలేదు. విచారం నుంచి తేరుకొని ఒక నిర్ణయానికి వచ్చింది దేవకి.

ముహుర్తం దగ్గరపడింది
వారం రోజులు గడిచాయి. ఊర్లో పెద్దలు నిర్ణయించిన ‘దేవుడికి అంకితం’ ముహూర్తం రానే వచ్చింది. ఆ పెద్దలే ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఆర్థిక బాధ్యతను ఉదారంగా నెత్తికెత్తున్నారు. అమ్మాయికి ఖరీదైన బట్టలు, నగలు సిద్ధం చేశారు. ఆ పిల్ల కుటుంబానికి కొంత పెద్దమొత్తమే డబ్బు సమర్పించారు. అన్నిటికీ అతీతమైన దేవుడికి, ఎన్నో లక్ష్యాలు సాధించాలనే ఆరాటంతో ఉన్న సామాన్య పిల్లతో పెళ్లికి గుడిలో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

పిల్ల ఇంట్లో...
‘ఏయ్‌.. పోరీ.. చెప్పింది విను. ఈ చీర కట్టుకో. టైమ్‌ అయితుంది. పెద్దోళ్లు ఇంటి మీదికి రాకముందే తయారై గుడికి పోదాం!’ కర్కశంగానే ఉంది తల్లి గొంతు.‘నేను రాను. దేవుడితో నాకు పెళ్లేంది? సదువుకుంటా. అమ్మా.. నా బతుకు కూడా బాలమ్మ లెక్క అయితదే. నాకొద్దు. నేను సదువుకుంటా. నన్ను ఇడిచిపెట్టుండ్రే .. మీకు దండం పెడతా..!’ తల్లి కాళ్లు పట్టుకొని ఏడుస్తోంది సుజాత.‘చల్‌.. నీ యవ్వ.. కథలు వడకు. నడువ్‌ సక్కగా..’ అంటూ  మేనమామ ఎంటరయ్యాడు.‘మామా.. నీకు కాళ్లు మొక్కుతా.. మామా.. నేను సదువుకుంటా.. నేను జోగినిగా కాను మామా.. మంచిగ సదువుకొని ఉద్యోగం చేసి పైసలు సంపాదిస్తా.. మామా.. గాని గీ పనికి నన్ను వెట్టకుండ్రి మామా.. మీకు దండం పెడతా... ’ మేనమామ కాళ్ల మీద పడింది సుజాత బోరున ఏడుస్తూ!‘ఇడ.. నీ అయ్య సంపాదించి పోయిండని నిన్ను సదివిస్తం? నడువ్‌.. మర్యాదగా తయారుగా’ నిర్దయగా అనేసి.. ‘అక్కా.. లేట్‌ అయితే ఆల్లు ఇంటి మీదికొచ్చి పోరిని గుంజ్కపోతరు.. పెళ్లయినంక వచ్చే పైసలు సూత రావ్‌. నీ ఇష్టం’ దేవకిని హెచ్చరించి బయటకు వెళ్లిపోయిండు.‘ఇన్నవ్‌గదే.. ఆల్లే వచ్చి గుంజ్కపొయ్యేదాకా ఉంటవా? తయారయితవా?’ అంటూ కూతురు జుట్టు పట్టి పైకి లేపింది. ఆ పిల్ల మొహమ్మీద చీర విసిరేసి బయటకు వెళ్లిపోయింది దేవకి.

కళ్ల ముందు బాలమ్మ!
తలుపేసుకుంది సుజాత. ఆమె కళ్ల ముందు బాలమ్మ కనిపిస్తోంది. బాలమ్మలాంటి ఇంకెందరో జోగినులు బిచ్చగత్తెలుగా, మానసిక ఆరోగ్యం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతూ, ఇళ్లల్లో పాచి పని చేస్తూ.. రోగాల పుట్టలుగా మారి రోడ్ల మీద బతుకీడుస్తూ.. మనసులో మెదిలారు. తన భవిష్యత్‌ను ఊహించుకొని కంపించిపోయింది. చావనన్నా ఛస్తుంది కాని దీనికి ఒప్పుకోదు.. స్థిరంగా నిశ్చయించుకుంది. వాళ్లది రెండుగదుల ఇల్లు. ఆ రెండు గదులను కలుపుతూ తలుపుంది. వంటింటికి ముందు ద్వారం కాక వెనక దొడ్లోకి ఓ తలుపుంది. ముందు గదిలోంచి వంటింట్లోకి వెళ్లి.. బయట ద్వారానికి లోపలినుంచి గడవేసి దొడ్డి ద్వారం గుండా బటయ పడింది సుజాత. అక్కడ మొదలుపెట్టిన పరుగు ఆ ఊరి అంగన్‌వాడీ కార్యకర్తను చేరేదాకా ఆపలేదు.

గుడిలో ఆగ్రహావేశాలు
ఇక్కడ గుడిలో దేవుడి పెళ్లికి ముహూర్తం దాటిపోతున్నా సుజాత కుటుంబం జాడలేదని ఆగ్రహావేశాలతో ఇంటిమీదకు వెళ్లారు ఊరిపెద్దలు. అప్పటికే సుజాత ఇంట్లోంచి వెళ్లిపోయిన  విషయం తెలుసుకున్న దేవకి, శేఖర్‌లు వణికిపోతున్నారు పెద్దలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక. ఇక ఇంటి ముందు.. ఊహించిన ఉపద్రవం కనిపించే సరికి బిక్కచచ్చిపోయారు. ‘ఏంరా.. దేవుడినే మోసం చెయ్యాలనుకుంటున్నరా’ అంటూ శేఖర్‌ మీదకి చేయి లేపాడు చిన్న దొర. ‘దేవుడికి ఇస్తామన్న కన్యను ఇవ్వకుండా మాయం చేయడం మహాపాతకం. ఈ కుంటుంబం మీదే కాదు మొత్తం ఊరిమీదే కన్నెర్ర చేస్తాడు దేవుడు’ అంటూ ముహూర్తం పెట్టిన పూజారీ వంత పాడాడు. దాదాపు ఊరంతా ఏకమైంది సుజాత ఇంటి మీద దాడికి. ఈలోపే అంగన్‌వాడీ కార్యకర్త ఇచ్చిన కంప్లయింట్‌తో పోలీసులు రంగప్రవేశం చేశారు. సుజాత జోగినిగా మారే వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఊళ్లో పెద్దలకు, సుజాత కుటుంబానికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ అమ్మాయిని షెల్టర్‌హోమ్‌కి తరలించారు. ఎనిమిది వరకు ఆగిపోయిన  చదువును కొనసాగించింది సుజాత.

జోగినిగా మారిస్తే జైలు తప్పదు
దేవుడికి లేక దేవస్థానానికి, ప్రార్థనా ప్రదేశానికి సేవచేసే నిమిత్తం ఆడపిల్లను అంకితమిచ్చే దురాచారం మన సమాజంలో ఉంది. ఈ వ్యవహారాన్నే ప్రాంతాలను బట్టి జోగిని, దేవదాసి, బసివిని, మాతమ్మ ఆచారంగా పిలుస్తుంటారు.  దేవుడితో పెళ్లి చేస్తారు కాబట్టి ఆమె ఊరుమ్మడి సొత్తు. మిగతా స్త్రీలలా  ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని గౌరవప్రదమైన జీవితం గడిపే వీలుండదు. ఆమెను ఊళ్లో పెద్దలు తమ శారీర కోరికల కోసం ఉపయోగించుకుంటారు. దేవాలయానికి సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు, జాతర్లలో కొంత సొమ్ము ఇస్తుంటారు ఆమెకు. అదే ఆమె జీవనాధారం. పెళ్లికాకుండానే తల్లులై.. ఆ పిల్లలకు తండ్రి ఎవరో చెప్పుకోలేక దుర్భర జీవితాలు గడిపిన, గడుపుతున్న జోగినిలెందరో. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు 1988లో దేవదాసి నిషేధ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఒక స్త్రీని దేవదాసిగా చేయడం నేరం. దేవదాసికి దేవుడితో జరిగే పెళ్లి చెల్లదు. అమ్మాయిని దేవుడికి అంకితం మిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించినా, అందులో పాల్గొన్నా, దాన్ని ప్రోత్సహించినా అది నేరమే. రెండు నుంచి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. తల్లిదండ్రులే స్వయంగా తమ కూతురిని దేవదాసిగా మార్చి దేవుడికి అంకితమిస్తే ఆ శిక్ష రెండు నుంచి అయిదేళ్లు ఉంటుంది. జరిమానా కూడా విధిస్తారు.
– ఇ. పార్వతి, అడ్వకేట్‌ అండ్‌ ఫ్యామిలీ కౌన్సెలర్

– సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement