అణువణువునా అదే స్ఫూర్తి | inspiration to others | Sakshi
Sakshi News home page

అణువణువునా అదే స్ఫూర్తి

Published Mon, Jan 20 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

అణువణువునా అదే స్ఫూర్తి

అణువణువునా అదే స్ఫూర్తి

చింతామణి నాగేశ రామచంద్రరావు.. డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు. రసాయనశాస్త్రంలో ఆయన పరిశోధనలు మైలురాళ్లు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ఆరు దశాబ్దాలుగా పరిశోధనా ప్రపంచంలో మునిగితేలుతున్న రావును అనేక అవార్డులు, పురస్కారాలు, పదవులూ వరించాయి. శాస్త్రసాంకేతిక అంశాల్లో భారత ప్రధానికి సలహాలు, సూచనలు అందించే ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రావును ఇటీవల భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. సైన్స్‌తోనే సుస్థిర భవిష్యత్తు అంటున్న సి.ఎన్.ఆర్.రావుతో.. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
     సైన్స్ రంగంలో అడుగుపెట్టడానికి కారణం?
     పదిహేడేళ్ల వయసులో 1951లో బీఎస్సీ పూర్తి కాగానే సైన్స్ కోర్సును లక్ష్యంగా ఎంచుకున్నాను. బెంగళూరులో 1951లో కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు.. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సి.వి.రామన్ నాకు గొప్ప స్ఫూర్తి. ఎమ్మెస్సీ చదివేటప్పుడు ప్రముఖ శాస్త్రవేత్త లినస్ పాలింగ్ గురించి తెలిసింది. కెమిస్ట్రీలో సంచలనం సృష్టించిన, ఆయన రాసిన ‘ద నేచర్ ఆఫ్ ది కెమికల్ బాండ్’ చదివాను. ఈ పుస్తకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. దాంతో పరిశోధనల విషయంలో నాకు పూర్తి స్పష్టత వచ్చింది.
 
     రసాయన శాస్త్రమే ఎందుకు?
     రసాయన శాస్త్రం అంతా కణాలు, పదార్థాల సమ్మేళనమే. విశ్వం అంతా వీటితో కూడి ఉంటుంది. ఒక నిర్దిష్ట అవధిలో కణాలు, పదార్థాల ఆకృతి వెనుకుండే రహస్యాన్ని బంధన అణువుల ఆధారంతో కనుగొనాలని, అదే విధంగా నిర్దిష్ట ఆకృతి సంబంధిత పరమాణు ధర్మాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో రసాయన శాస్త్రాన్ని ఎంచుకున్నాను.
 
     పరిశోధనల విషయంలో మీకెదురైన ఇబ్బందులు?
     దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికి అప్పుడే కాలేజీలో అడుగుపెట్టాను. సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేవి. అమెరికాలోని పర్‌డ్యూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసుకుని 1959లో స్వదేశానికి తిరిగొచ్చినా.. దాదాపు అదే పరిస్థితి. నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పొచ్చు.
 
     దేశంలో ప్రస్తుతం పరిశోధనలపై మీ అభిప్రాయం?
     పరిశోధనల పరంగా దేశం బాగా ముందడుగు వేస్తోంది. ప్రధానంగా గత పదేళ్లలో పరిశోధనల పరంగా సదుపాయాలు ఎంతో మెరుగయ్యాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నాయి. నా వ్యక్తిగత పరిశోధనల పరంగా చెప్పాలంటే.. గత పది, పదిహేనేళ్లలో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితిలో మొదలైన నా పరిశోధనలు.. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సాగుతున్నాయి.
 
     ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి చైర్మన్‌గా తీసుకుంటున్న చొరవ?
     శాస్త్రీయ సలహా మండలి తరఫున సైన్స్, కార్యాచరణ, నిధుల కేటాయింపు వంటి ఎన్నో అంశాలపై ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి సిఫార్సులు చేశాం. వీటిలో అధిక శాతం ఆమోదం పొందడంతోపాటు అమల్లోకి కూడా వచ్చాయి. ఉదాహరణకు.. కొత్తగా ఏర్పాటైన ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లు సలహా మండలి సిఫార్సుల మేరకు జరిగినవే. అదే విధంగా యువతను పరిశోధనలవైపు ఆకర్షించేందుకు రామానుజం ఫెలోషిప్స్, ఇతర కొత్త ఫెలోషిప్స్ అందుబాటులోకి తేవడం కూడా శాస్త్రీయ సలహా మండలి సూచనలతోనే.
 
     సైన్స్‌పై యువతలో అంతగా ఆసక్తి పెరగట్లేదు. దీనిపై మీ అభిప్రాయం?
     నిజమే. గత కొన్నేళ్లుగా యువతలో సైన్స్ అంటే ఆసక్తి సన్నగిల్లుతున్న మాట వాస్తవమే! దీనికి సహచరులు, సమాజం కూడా కారణం. సైన్స్‌ను గౌరవించాలి. చక్కటి పనితీరు ప్రదర్శించే యువ శాస్త్రవేత్తలు కచ్చితంగా అద్భుత అవకాశాలు అందుకుంటారు. ఈ క్రమంలో గత రెండు మూడేళ్లుగా చేపడుతున్న చర్యల ఫలితంగా పరిస్థితి కొంత ఆశాజనకంగా మారుతోంది.
 
     పరిశోధనల విషయంలో ప్రైవేటు సంస్థలు చొరవ చూపాలని మీరు అన్నారు. ఇది సాధ్యమేనా?
     వాస్తవానికి మన దేశంలో సైన్స్ రంగం అభివృద్ధి అంతా ప్రభుత్వం మద్దతుతో సాగుతోంది. కానీ అమెరికాలో, జపాన్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేటు సంస్థలు కూడా చొరవ చూపడానికి ఇదే సరైన సమయం. అప్పుడే.. ఇతర దేశాల్లో మాదిరిగా.. సైన్స్ పరిశోధనల కోసం జీడీపీలో 2 నుంచి 3 శాతం కేటాయింపులను ఆశించేందుకు వీలవుతుంది.
 
     దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అభివృద్ధి దిశగా మీ సలహా?
     సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల అభివృద్ధికి మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలి. తద్వారా రానున్న 15- 20 ఏళ్లలో దేశం గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని అభిలషిస్తున్నాను. నేటి యువత చక్కటి అవకాశాలు అందుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఇందుకోసం ఎంతో ముందస్తు ప్రణాళిక అవసరం. వాస్తవానికి.. ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం తగినన్ని మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లు ప్రస్తుతం మన దేశంలో లేవు. వీటిని ఏర్పాటు చేసి.. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల పట్ల ఆసక్తి కలిగేలా చేయాలి. విద్యార్థులు కూడా సైన్స్ పట్ల ఆసక్తి చూపాలి. ఇదే నా సలహా!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement