
భూమి చుట్టూ అంతరిక్షంలో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ చెత్తను నాశనం చేసేందుకు చైనా ఓ వినూత్న పద్ధతికి పదును పెడుతోంది. వివిధ దేశాలు ప్రయోగించిన ఉపగ్రహాలు, రాకెట్ల భాగాలు కొన్ని అక్కడ తిరుగుతూ చికాకు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ చెత్తను శుభ్రం చేసేందుకు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారుగానీ.. చైనా మాత్రం నేరుగా వాటిని శక్తిమంతమైన లేజర్ కిరణాలతో కాల్చేస్తే పోలా? అంటోంది. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ పద్ధతిని ఉపయోగించాలంటే ఓ ఉపగ్రహంపై లేజర్ కిరణాలను ఉత్పత్తి చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఉపగ్రమం అంతరిక్షంలోకి చేరిన తరువాత తొలగించాలనుకున్న చెత్తపై ఉపగ్రహాన్ని ఫోకస్ చేస్తారు.
కొన్ని నిమిషాలపాటు పరారుణ కాంతి కిరణాలను ఇరవైసార్లు ప్రయోగిస్తారు. దీంతో ఆ చెత్త కాస్తా ప్రమాదం లేని చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది. అయితే ఇలా లేజర్ యంత్రాలను అంతరిక్షంలోకి చేరిస్తే భవిష్యత్తులో వీటిని ఆయా దేశాలు భూమ్మీద ఉండే తమ శత్రు దేశాలపైకి ప్రయోగించే అవకాశాలు ఉంటాయని, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉపగ్రహ వ్యర్థాలపైకి లేజర్లను ప్రయోగించడం చాలా కాలంగా ఉన్న ఆలోచనే అయినప్పటికీ ఇటీవలి కాలంలో దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment