పక్కింటావిడ దొంగలాగా వచ్చి తొంగి చూస్తుంది. ‘అన్నయ్యగారు ఊర్నుంచి రాలేదా వొదినా’ అంటుంది. తల అడ్డంగా ఊపాల్సి వస్తుంది. ఎదురింటావిడ పోలీసులాగా జబర్దస్తీగా దూరుతుంది. ‘అయితే మా తమ్ముడు ఫలానా ఊర్లో బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడంటావ్’ అని గోడ మీద ఫొటో ఏమైనా దొరుకుతుందేమో అన్నట్టు మెడ అటూ ఇటూ తిప్పుతుంది. హౌస్ ఓనర్ భార్య ‘అమ్మాయ్... ఈసారి కూడా నువ్వే వెళతావా... మీ ఆయన రాడా?’ అని ఆదరంగా కూపీ లాగుతుంది. హౌస్ ఓనర్‌కు ఈ ములాజా కూడా లేదు. ‘ఫలానా తేదీ లోపల మీ ఆయన్ను ప్రవేశ పెట్టకపోతే ఇంటి నుంచి వెళ్లగొడతా’ అని అల్టిమేటమ్ జారీ చేస్తాడు. అందరికీ సున్నా కావాలి. ఒకటి పక్కన సున్నా. తను పుట్టింది. మనిషి. చదువుకుంది. మనిషి. ఉద్యోగం చేయగలదు. మనిషి. జీవితాన్ని తన పద్ధతిలో తాను ఎదుర్కోగలదు. మనిషి. తనకో విలువుంది. మనిషి. ఆమెకై ఆమె ఒకటి. కాని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి ఆమె సున్నా అయిపోయింది.
ఆ సున్నా పక్కన మొగుడు అనే ఒకటి ఉంటేనే దానికి విలువ. మొగుడు నిలబడితేనే ఆమె పది. లేకపోతే సున్నా. కాని వాడో సన్నాసి వెధవ. నాలుగేళ్లు రాచి రంపాన పెట్టాడు. పేరుకు సంసారం. ఇంట్లో ఉంటేగా. పేరుకు కాపురం. బాధ్యత తీసుకుంటేగా. వాడున్నప్పుడు కూడా తను ఒకటిలానే ఉంది. తనే గుట్టుగా సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. డెలివరీ బిల్లుకు డబ్బు తెస్తానని పత్తా లేకుండా పోతే ఉన్న ఒక గాజును అమ్మి బయటపడింది. వాడొక సున్నా. వాడేనా? లోకంలో ఎన్ని సున్నాలు. అనుమానించే సున్నాలు. పో... మీ పుట్టింటికి పోయి డబ్బు పట్రా అనే సున్నాలు. తాగొచ్చి పడిపోయే సున్నాలు. తందనాలాడే సున్నాలు. జీవితంలో ఒక్కసారి కూడా భోజనం చేశావా అని అడగని ఏబ్రాసి సున్నాలు.
అలాంటి సున్నాలతో గుణకారం జరిగితే తన జీవితం నిండు సున్నా అని కనిపెట్టింది. వదిలేసి వచ్చేసింది. ఆరేళ్ల కొడుకు అప్పుడప్పుడు అడుగుతాడు– ‘నాన్న ఏడమ్మా?’ ‘నాన్న రాడమ్మా. నాన్నకూ మనకూ కటీఫ్’. ‘నాన్న ఎలా ఉంటాడమ్మా?’ ‘నువ్వు పెద్దయ్యాక చూద్దువులే నాన్నా’. నాన్నొక వెధవ అని తెలియడం కన్నా నాన్న ఎలా ఉంటాడో తెలియకపోవడం మేలు కదా అనుకుంది. కాని లోకం ఊరుకుంటుందా? ఒంటరి ఆడది జీవిస్తుందంటే అదీ మొగుడి ప్రమేయం లేకుండా జీవిస్తుంది అంటే దానికి సయించదు. అలా ఒంటరిగా జీవించేవాళ్లు సంసారులు కారు. ఎందుకు కారో. సింగిల్ ఉమన్ అంటే కచ్చితంగా బహిష్కృతురాలే. ఈ బహిష్కారం ఎవరు విధించారో? ఓయ్... ఇది నేను. ఈజీవితమే సత్యం. ఇలా సత్యంగా బతకడమే నా జీవితపు సత్యం అంటే వినరు. అబద్ధం చెప్పాలి.
మా ఆయన లండన్‌లో ఉన్నాడు. అబద్ధం చెప్పాలి. మా ఆయన దుబాయ్‌లో ఉన్నాడు. అబద్ధం చెప్పాలి. మా ఆయనకు సెలవు దొరకదు. అబద్ధం చెప్పాలి. మా ఆయన దగ్గరకు నేనే వెళ్లి రావాలి. అబద్ధం చెప్పాలి. స్త్రీని అబద్ధంగా మార్చే ఈ సంఘనీతి మారదా? ఈ అబద్ధాన్ని చెప్పీ చెప్పీ, చెప్పలేక వాళ్లెలా కోత అనుభవిస్తారో లోకం చూడదా? సున్నాలను వెతికే పెద్దలారా ఒకటిని ఒకటిగా ఉండనివ్వండి. కథ ముగిసింది. కొండేపూడి నిర్మల రాసిన ‘అబద్ధం’ కథ ఇది. వివక్ష అంటే పుట్టుకలోనూ పెంపకంలోనూ పెరుగుదలలోనూ సకల అవకాశాలలోనూ ప్రదర్శించేది మాత్రమే కాదు. జీవన సందర్భాలలోనూ ప్రదర్శించి హింసించేది వివక్ష.
టూలెట్ బోర్డులు మనం ఎన్ని చూస్తుంటాం. ‘ఫ్యామిలీకి మాత్రమే’ అని ఉంటుంది. ‘సింగిల్ ఉమన్‌కు మాత్రమే’ అని ఎప్పుడైనా చూడగలమా? పిల్లాడి స్కూల్ అడ్మిషన్‌లో తండ్రి పేరు రాయకపోతే అడ్మిషన్ దొరికే రోజులు చూస్తున్నామా? మెట్టెలు మంగళసూత్రాలు లేకపోతే చాలు అర్ధరాత్రి మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు అని మగాళ్లు స్వీయ అనుమతి తీసుకోని రోజులు చూస్తున్నామా? ఆమెకో ఇల్లుంటే ఏమిటి నష్టం? ఆమెకో జీవితం ఉంటే ఏమిటి నష్టం? ఇంకోణ్ణి చేసుకుంటే వాడు మొదటివాడులా ఉండడని గ్యారంటీ ఏమిటనే భయంతో ఆమె అలాగే ఉండిపోతే ఏమిటి నష్టం. సున్నాలు చుట్టడం మానండి. ఒకటిని దిద్దండి.
- కొండేపూడి నిర్మల
Comments
Please login to add a commentAdd a comment