మ్యారేజ్ కౌన్సెలింగ్
కలిసి ఉంటే కలదు సుఖం. మరి కలసి ఉండలేకపోతే? కష్టం తప్పదా? కష్టమే. కానీ ఏ కష్టమూ కూడా... కలిసి ‘ఉండాల్సివచ్చినంత’ కష్టం కాదు. అలాగని విడిపోయాక అంతా సుఖమేం కాదు.. విడిపోయాకా కొన్ని కష్టాలుంటాయి. ఆ కష్టాలను ఎలాగో నెగ్గుకొచ్చినా... డబ్బు కష్టం మాత్రం గట్టెక్కలేనిదిగా అనిపిస్తుంది. అలాంటి వారికి భరోసాగా చట్టం ఉంది. భరణం ఇప్పిస్తుంది. భరణం భార్య రైట్. భర్త గారి బాధ్యత.
ప్రశ్న - జవాబు
మా పెళ్లయి పదిహేనేళ్లయింది. మాకు ముగ్గురు పిల్లలు కలిగాక ప్రభుత్వోద్యోగి అయిన నా భర్త మరొకామెతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను, నా పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. అది భరించలేక పిల్లలను తీసుకుని ఎనిమిదేళ్ల క్రితం పుట్టింటికొచ్చాను. చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాళ్లని పోషించుకుంటున్నాను. అయితే ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల చదువులు తదితర ఖర్చులు భరించడం నా వల్ల కావడం లేదు. మా పుట్టింటివారికి కూడా అంత ఖర్చులు భరించే స్థోమత లేదు. ఆయన దగ్గర నుంచి ఇంతవరకూ రూపాయి కూడా నాకు భరణం అందలేదు. ఇప్పుడు నేను ఆయన నుంచి భరణం కోరవచ్చా?
- నిరుపమ, నెల్లూరు
మీ పరిస్థితి అర్థమైంది. ఉన్నతోద్యోగంలో ఉండీ మీ భర్త అలా చేయడం చాలా తప్పు. మీరు మీ పరిస్థితినంతా వివరిస్తూ, మీ ఆయన నుంచి భరణం ఇప్పించవలసిందిగా కోర్టువారిని కోరుతూ 125 సిఆర్‌పీసీ కింద అర్జీ పెట్టుకోండి. వీలయితే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద ఆయన శాలరీ స్లిప్‌ను కూడా జతచేయండి. కుదరకపోతే సంబంధిత డిపార్టుమెంట్ వారిని సాక్షులుగా పిలవండి. కోర్టు వారు ఆయన సంపాదన సామర్థ్యాన్ని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ కింద న్యాయబద్ధంగా రావలసిన మొత్తాన్ని ప్రతినెలా ఆయన జీతం నుంచి నేరుగా మీకే అందేలా ఏర్పాటు చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. నేర్పుగా వ్యవహరిస్తే, ఇంత వరకూ మీరు మీకోసం, మీ పిల్లల పోషణ కోసం పెట్టిన ఖర్చులు కూడా ఆయన నుంచి రాబట్టుకోవచ్చు.
మాకు వివాహమై తొమ్మిది సంవత్సరాలయింది. మేమిద్దరం ఓ ఏడాదిపాటు కలిసి అన్యోన్యంగా జీవించాము. తర్వాత మా అత్తమామలు మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల మా ఇద్దరికీ చీటికిమాటికీ బాగా గొడవలు అయ్యేవి. వాళ్లు నన్ను అదనపు కట్నం కోసం సూటీపోటీ మాటలనేవారు. తన వాళ్లని సంతృప్తి పరచడం కోసం మొదట మా వారు మాటలతో వేధించేవారు. తర్వాత్తర్వాత నాపై చేయి చేసుకోవడం, హింసించడం వరకూ వెళ్లింది. రెండేళ్ల క్రితం ఓ రోజు నన్ను శారీరకంగా, మానసికంగా హింసించి, నన్ను, నా ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనుంచి వెళ్లగొట్టేశారు. గత్యంతరం లేక నా ఇద్దరు పిల్లల్నీ తీసుకుని పుట్టింటికి చేరాను. నాన్న రిటైరై చాలా కాలం అయింది. పెళ్లి కావాల్సిన ఇద్దరు పిల్లల బాధ్యత ఇంకా ఆయన మీద ఉంది. దానికి తోడు నా భారం, నా పిల్లల భారం కూడా ఆయన మీద పడింది. ఇదిలా ఉండగా తనకు విడాకులు కావాలని కోరుతూ కోర్టులో కేసు వేసినట్లు సమన్లు పంపించారు. అయితే మా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా నాకు భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేదు. కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏం చేయాలి? నా పిల్లల పోషణ ఎలా?
- అనురాధ, వరంగల్
మీ వారు విడాకులు కోరుతూ కోర్టులో కేసు వేశారంటున్నారు. పైగా అది మీకిష్టం లేదంటున్నారు. సరైన సాక్ష్యాధారాలు చూపకుండా విడాకులు మంజూరు కావు. కాబట్టి మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కంజూగల్ రైట్స్ (వివాహ హక్కుల పునరుద్ధరణ కోసం) కేసు వేయండి. అప్పుడు కోర్టు వారు మీ భర్త వేసిన విడాకుల కేసు, మీరు వేసిన రెస్టిట్యూషన్ కేసు రెండూ కలిపి విచారిస్తారు. మీ పిల్లల పోషణ, మీ పోషణ కోసం మీరు కోర్టులో 125 సిఆర్‌పిసి కింద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి. మీ వారు ప్రభుత్వోద్యోగి అంటున్నారు కాబట్టి ఆయన ఆర్జిన శ క్తిని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుంది. దిగులు పడకండి. మీ సంసారం చక్కదిద్దడానికి మీ తలిదండ్రులు, మీ తరఫున ఇతర పెద్దమనుషులను తీసుకుని మీ వారి దగ్గరకు వెళ్లి ఒకసారి మాట్లాడి చూడమనండి. కోర్టులో భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి మీ వారు మనసు మార్చుకుని మీతో కాపురం చేయవచ్చునేమో ప్రయత్నించి చూడండి.
ఒకవేళ హెరాస్‌మెంట్ తట్టుకోలేన నుకుంటే 498 ఎ కింద కేసు ఫైల్ చేయవచ్చు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు డిగ్రీ చదివానంటున్నారు కాబట్టి, ఇంట్లో ఖాళీగా ఉండకుండా మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా మీకు చేతనైన ఏదో ఒక పని చేయడం ప్రారంభించండి. బెస్టాఫ్ లక్.
నేను జీవితంలో కష్టపడి పైకొచ్చాను. రాత్రిపూట పని చేస్తూ, పగలు చదువుకుంటూ, మంచి ఉద్యోగం సంపాదించి ఒక పేదింటి పిల్లను పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. ఉన్నంతలో ఆమెను బాగా చూసుకుంటున్నాను. ఒకరోజున బాగా తలనొప్పి రావడంతో ఆఫీసు నుంచి ముందే వచ్చేశాను. ఆ సమయంలో నా భార్యను మా బెడ్‌రూమ్‌లో నా చిన్ననాటి స్నేహితునితో చూడకూడని పరిస్థితుల్లో చూశాను. నాతోపాటు మా హౌస్ ఓనర్, నా ఫైల్స్ లోపల పెట్టేందుకు వచ్చిన నా కార్ డ్రైవర్ కూడా ఆ దృశ్యాన్ని చూశారు. దాంతో నా మనసు విరిగిపోయింది. జీవితం మీద విరక్తి పుట్టింది. బతకాలనిపించడం లేదు.
-దుష్యంత్, అహమ్మదాబాద్
ముందు మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఎంతో కష్టపడి మిమ్మల్ని మీరు నిరూపించుకుని సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మీరు, మీ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వల్ల ఆత్మహత్య లాంటి హీనమైన ఆలోచనలు చేయవద్దు. ఎంతో విలువైన మీ జీవితాన్ని అర్ధంతరంగా అంతం చేసుకోవాలనుకుంటున్న మీ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోండి. వెంటనే మీరు అడల్ట్రీ/క్రుయెల్టీ గ్రౌండ్ కింద డైవోర్స్ కేస్ కౌంటర్ ఫైల్ చేయండి. మీ భార్య చేసిన పనికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయంటున్నారు కాబట్టి మీకు వెంటనే విడాకులు మంజూరు అయే అవకాశం ఉంది. విడాకులు తీసుకున్నాక మీకిష్టమైన రీతిలో జీవించవచ్చు.
నిశ్చల సిద్ధారెడ్డి
అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్