
అర్థవంతమైన జీవితం అంటే..?
ఆత్మీయం
నేనీ జీవితంతో విసిగిపోయాను అనో, ఈ లైఫంటే బోర్ కొడుతోంది అనో చాలామంది నోట వినిపించే మాటే. నిజానికి ఈ మాట అనడానికి వీలేలేదు. ఎందుకంటే, వినోద సాధనాలు విరివిగా ఉన్నాయి. అయినా, జీవితం విసుగు పుట్టిస్తోంది..! అందుబాటులో ఉన్న ఏ ఆధునిక వినోద సాధనమూ సంతోషాన్ని, తృప్తిని ఇవ్వడం లేదు. అందుకే ఈ జీవితానికి అర్థం ఏముంది అని నిరుత్సాహ పడటం. అసలు అలా ఎలా ఆలోచిస్తాం? జీవితంలో మనం చేసే ప్రతి పనికీ అర్థం ఉన్నప్పుడు... మన జీవితానికి మాత్రం అర్థం లేకుండా ఎలా పోతుంది? మరణం కంటే జీవితం మీదే ఇష్టం ఎక్కువ మనకు. కాకపోతే ప్రశాంతంగా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలన్నదే ఆశ. ఇది అర్థం లేని ఆశేమీ కాదు. తీరని ఆశ అంతకన్నా కాదు.
మన జీవితానికి అర్థం తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. దేవుణ్ని తెలుసుకుని, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అర్థవంతమైన జీవితం అంటే ఏంటో బోధపడుతుందని, జీవితానికి ఒక అర్థమంటూ ఏర్పడుతుందని అనేక గ్రంథాలు తెలియ చేస్తున్నాయి. నిజాన్ని తెలుసుకున్ననాడు మనం దేవునికి ఎప్పుడూ దూరం కాము. అలా కానినాడు మన జీవితం అర్థరహితమూ కాదు.
ఒక వస్తువు తాను దేనికోసం తయారు చేయబడిందో దానికి పరిపూర్ణంగా ఉపయోగించబడినప్పుడు దానికి అర్థం ఎలా ఏర్పడుతుందో, మనిషి జీవితమూ అంతే. దైవం కోసం జీవించినప్పుడు, మన జీవితాన్ని పరమాత్ముడి సేవకు అంకితం చేసినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. అర్థవంతమవుతాయి. అప్పుడు జీవితంలో విసుగు అనే పదానికి స్థానం లేకుండా పోతుంది. ఇక్కడ దైవం అంటే ఎవరో కాదు... సాటి మానవుడే దైవం. ప్రతి ప్రాణీ దైవమే!