నిను వీడని 'పీడ'ను నేనే | Nightmare Disorder | Sakshi
Sakshi News home page

నిను వీడని 'పీడ'ను నేనే

Published Thu, Jun 28 2018 1:21 AM | Last Updated on Thu, Jun 28 2018 5:20 AM

Nightmare Disorder - Sakshi

పదకొండు పీడకలలు... మళ్లీ మళ్లీ పీడించే పీడకలలు...ఇవన్నీ ‘పీడకలా’ చిత్రాలు ‘దిండు’పాళ్యాలు దీంట్లో మిమ్మల్ని వెంటాడే పీడకల ఏది?


ఆమె పరుగెత్తుతూ ఉంది. ఎవరో వెంటపడుతున్నట్లు భయపడుతూ పరిగెత్తుతూ ఉంది. తప్పించుకోవాంటే కుదరడం లేదు. అకస్మాత్తుగా ఒక అగాధం. పరుగు కంట్రోల్‌ కాలేదు. వెనకా ముందూ చూసుకోకుండా  ఆగాధంలోకి పడిపోయింది. అంతే. అంతెత్తు నుంచి అగాధంలోకి జారిపోతుండగా.... కెవ్వు... లేచి కూచుందామె. అప్పటికిగానీ తెలియలేదు... అది కల అని తాను నిద్రలో ఉందని. ఏసీలో ఉన్నా ఒళ్లంతా చెమటలు. సురక్షితంగా ఉన్నా మేనంతా వణుకు. ఇది ఆమెకు తరచూ వచ్చే కల. ఇలా అవే కలలు తరచూ వచ్చే  మానసిక సమస్య పేరే ‘పీడకలల రుగ్మత’. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’.

పీడకలలు మాటిమాటికీ ఎందుకొస్తాయి?
తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగినప్పుడు... అత్యంత వేదనాపూరితమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కలల రుగ్మతకు లోనవుతుంటారు.  జీవితంలోని ఏదో ఒక సమయంలో పీడకలలు రానివారుండరు. అయితే ఆ కలలు వారి రోజును అన్ని విధాలా దుర్భరం చేస్తున్నప్పుడు దాన్ని పీడకలల రుగ్మతగా గుర్తిస్తారు. ఈ పీడకలలు రెండు రకాలుగా వస్తుంటాయి. మొదటి రకంలో పీడకల వచ్చి ఆ వేదనతో దిగ్గున లేచి కూర్చుంటారు.  కల తీవ్రత వల్ల ఒళ్లంతా చెమటలతో తడిసిపోతూ, భయంతో వణికిపోతూ ఉంటారు. ఈ తరహా కలలు మెలకువ వచ్చాక కూడా గుర్తుంటాయి. ఇలాంటి కలలతో బాధపడే సమస్యను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’గా చెప్పవచ్చు. అయితే కొందరిలో మెలకువ వచ్చాక తమకు వచ్చిన భయంకరమైన కల ఏమాత్రం గుర్తుండదు. అయితే ఆ వేదన మాత్రం ఉండిపోతుంది. ఆ కండిషన్‌ను ‘నైట్‌ టెర్రర్‌’గా చెబుతుంటారు. కొందరు ఈ నైట్‌టెర్రర్‌ సమయంలో తీవ్రంగా భయపడినా వారికి నిద్రనుంచి మెలకువ రాకపోవచ్చు కూడా. కాస్త కదిలినా మళ్లీ వెంటనే నిద్రలోకి కూరుకుపోతారు.

ఎవరిలో ఎక్కువ...
పీడకలలు రావడం సాధారణంగా పదో ఏట నుంచి మొదలవుతుంది. యుక్తవయస్కుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. యువకులతో పోలిస్తే యువతులలో ఇవి చాలా ఎక్కువ. కొంతమందిలో ఏవైనా ఇతర మానసిక సమస్యలునప్పుడు వాటితో పాటు ఇవి కనిపిస్తుండటం చాలా సాధారణం.

కారణాలు
తీవ్రమైన ఒత్తిడి లేదా యాంగై్జటీ కారణంగానే అవి వస్తుంటాయి
తీవ్రమైన జ్వరంతో బాధపడేవారిలో
కుటుంబంలో ప్రియమైన వ్యక్తి చనిపోయినప్పుడు
ఏదైనా మందుల దుష్ప్రభావం వల్ల
నిద్రమాత్రలు వాడి మానేశాక లేదా బాగా ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు మానేశాక విత్‌డ్రావల్‌ సింప్టమ్‌గా
గురక పెట్టడం (స్లీప్‌ ఆప్నియా)తో పాటు నిద్రరుగ్మతలు (స్లీప్‌ డిజార్డర్స్‌) ఉన్నవారిలో
నిద్రకు ఉపక్రమించడానికి కాసేపు ముందే తిని పడుకున్నవారిలో (ఇలా తిన్నప్పుడు వారి జీవక్రియలు వేగం పుంజుకోవడం, మెదడు చురుగ్గా ఉండటం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది).

తరచూ కనిపించే పీడకలలివి...
మానసిక నిపుణులు, స్లీప్‌ స్పెషలిస్టులు సాధారణంగా వచ్చే పదకొండు రకాల  పీడకలలను గుర్తించి, వాటిని విశ్లేషించారు. చాలామందిలో కనిపించే అవి...

1 . సాలీళ్ల కల
కొందరి కలల్లో సాలీళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎవరో పెద్దవయసు వారు తమను కట్టడి చేసేందుకు  ఆకర్షణీయమైన వలపన్నుతున్నట్లుగా తాము ఆ వల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఈ కల సాగుతుంటుంది. నిజ జీవితంలో తమకు అన్నీ తెలుసుననుకునే పెద్దలెవరో ఆంక్షలు విధిస్తున్నప్పుడు ఈ సాలీళ్ల కల ఎక్కువగా వస్తుంటుంది. కలలో కొందరు ఆ సాలెగూడులోంచి
తప్పించు కుంటారు. కొందరు తప్పించుకోరు. ఈ  కల సమాజంలోని 10% మందిలో వస్తుంటుంది.

2 . సముద్రపు అలల్లో కొట్టుకు పోతున్నట్లుగా వచ్చే కల
ఏదో అంతులేని సముద్రంలో మునిగిపోతున్నట్లు, ఒడ్డు తెలియని  కడలి అలల్లో కొట్టుకుపోతున్నట్లు కొందరిలో కలలు వస్తుంటాయి. ఎంత చేసినా తరగని పనిలో మునిగిపోతుండేవారిలో ఈ  తరహా కల సాధారణంగా వస్తుంటుంది. శ్వాససంబంధమైన సమస్యతో బాధపడుతూ ఊపిరి సరిగా తీసుకోలేని ఆరోగ్య సమస్యలున్నవారిలోనూ ఈ కల కనిపిస్తుంది.

3 . ఎత్తు నుంచి పడుతున్నట్లుగా వచ్చే కల
చాలామందిలో తాము ఎల్తైన ప్రదేశం నుంచి వేగంగా కిందికి పడిపోతున్నట్లు కల వస్తుంటుంది.  జీవితంలో ఏదో వైఫల్యాన్ని ఊహిస్తూ బెంబేలెత్తే వారిలో, ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా విషమమైన పరిస్థితుల్లోకి తాము వెళ్తున్నట్లుగా ఆందోళన చెందేవారిలో ఈ కల వస్తుంటుంది. ఎంతగా ప్రయత్నించినా పరిస్థితులు తమ చెప్పుచేతల్లోకి రావడం లేదంటూ ఆందోళన చెందేవారిలో ఈ కల తరచూ వస్తుంటుంది. పట్టుజారిపోతున్న పరిస్థితికి ఈ కల అద్దం పడుతుంది.

4 . పళ్లు ఊడిపోతున్నట్లు వచ్చే కల
కొందరిలో పళ్లు ఊడిపోటున్నట్లు వచ్చే కలలకు వారిలోని అభద్రత పరిస్థితే కారణం. తమ ప్రతిష్ఠకు భంగం కలుగబోతున్నందున తమకు ఇష్టం లేకపోయినా కొన్ని పరిస్థితులకు లోబడి తాము సమాధానపడిపోతున్నప్పుడు ఈ తరహా కలలు వస్తుంటాయి. తమ అందాన్ని ఇష్టపడేవారు, తమను తాము చాలా ప్రేమించుకునేవారు తమకేదో హాని చేకూరబోతోందని ఆందోళన చెందినప్పుడు ఈ కల వస్తుంటుందని ఫ్రాయిడ్‌ స్వప్నశాస్త్రం పేర్కొంటోంది.

5 . వెంటాడుతున్నట్లుగా వచ్చే కల
తమను ఎవరో వెంటాడుతున్నట్లుగా, పరుగెత్తిస్తున్నట్లు కొందరిలో కలలు వస్తుంటాయి. వాస్తవ జీవితంలో వారు ఎదుర్కొనేందుకు ఇష్టపడని ఏదో అప్రియమైన పరిస్థితిని ఎంతగా అవాయిడ్‌ చేయాలన్నా చేయలేని సందర్భాల్లో ఈ తరహా కల వస్తుంటుంది.  ఈ కల ఎదుట ఉన్న పరిస్థితిని ఎదుర్కోవడమా లేక దాన్నుంచి తప్పించుకోవడమా అన్న (ఫైట్‌ – ఫ్లైట్‌) కండిషన్‌ను ప్రేరేపిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం 26% మందికి ఈ కల వస్తుందని తేలింది.

6 . ఆలస్యం అయిపోతున్నట్లుగా వచ్చే కల
ఒకరు తాను హాజరు కావాల్సిన చోటికి చేరడానికి బాగా ఆలస్యం అవుతున్నట్లుగా కలలు వస్తుంటాయి. ఎంత ప్రయత్నించినా అక్కడికి చేరలేకపోతున్నట్లు, తద్వారా తాను జీవితంలో చాలా ముఖ్యమైనదాన్ని కోల్పోతున్నట్లుగా ఆ కలలు ఉంటాయి. తాము నిర్వహించాల్సిన ఏదైనా ఒక అంశం కోసం తాము సన్నద్ధం కాకపోవడం వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగా ఈ తరహా కలలు వస్తాయని జర్మన్లపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

7 . గడ్డకట్టుకుపోతున్నట్లుగా...
తాము ఒకచోట మంచులో కూరుకుపోయి అక్కడే గడ్డకట్టుకుపోతున్నట్లుగా (ఫ్రోజెన్‌ స్టేట్‌కు చేరుకున్నట్లుగా) కొందరిలో కలలు వస్తాయి. తీవ్రమైన ఆశాభంగానికి గురైనవాళ్లకూ,  అందివచ్చిన  అవకాశానికి చేరకుండా తీవ్రంగా అణచివేతకు గురైనవాళ్లకూ ఈ తరహా కలలు వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్లీప్‌ పెరాలసిస్‌ అనే కండిషన్‌కు గురైన 5 శాతం మందిలో ఈ తరహా కల వస్తుందన్నది నిపుణుల మాట.

8 . పరీక్షకు హాజరవుతున్నట్లుగా
తాము ఏదో పరీక్షకు హాజరు కావాల్సి ఉందనీ, అయితే ఆ పరీక్షకు గాను తమవైపు నుంచి ఎలాంటి ప్రిపరేషన్‌ లేకపోవడంతో అందులో తాము విఫలం కావడం ఖాయమంటూ  ఆందోళనపడుతున్నట్లుగా కల వస్తుంటుంది.  బాధ్యతల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే ఆందోళన ఉన్నప్పుడు ఇలాంటి కల వస్తుంది. అలాగే స్కూలు íపిల్లల విషయంలో కలల నిపుణుల మాట కాస్త వేరుగా ఉంటుంది. తాము చదివిన అంశాలు మెదడులో కేటలాగ్‌ అవుతున్న సమయంలో ఈ కల వస్తుందంటున్నారు.

9 . పదిమందిలో నగ్నంగా ఉన్నట్లు వచ్చే కల
తమ లుక్స్‌ గురించి, తమ స్వీయ అంశాల గురించి తీవ్రమైన ఆందోళన పడేవారిలో ఈ తరహా కల వస్తుంటుంది. తమ శరీరాకృతి కారణంగా కామెంట్స్‌ ఎదుర్కొంటున్న వారిలో ఈ తరహా కల చాలా ఎక్కువగా వస్తుంటుంది. సెల్ఫ్‌ కాన్షియస్‌గా ఉంటూ తాము చాలా తేలిగ్గా ఇతరుల బారిన పడుతున్నామంటూ, తమను తాము వల్నరబుల్‌గా భావించేవారిలో ఈ తరహా కల వస్తుంటుంది.

10 . వాహనం మీద నియంత్రణ కోల్పోయినట్లుగా వచ్చే కల
తాము నడుపుతున్న వాహనంపై పూర్తిగా నియంత్రణ కోల్పోగాఅది పూర్తిగా అదుపు తప్పినట్లుగా కొందరు కలగంటుంటారు. తాము పూర్తిగా నిస్సహాయులుగా మిగిలిపోయిన సందర్భాల్లో ఈ కల వస్తుంటుంది. మీరు ఒక బాధ్యతలో కొందరితో కలిసి పనిచేస్తున్నట్లయితే ఆ బాధ్యతల భారాన్ని మరొకరికి అప్పగించాలని అనుకున్నప్పుడు ఈ కల వస్తుంటుంది. ‘పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’కు గురైనప్పుడు కూడా ఈ కల వస్తుంటుంది.

11 . చనిపోతున్నట్లుగా వచ్చే కల
జీవితంలో ఏదైనా ఊహించని చాలా పెద్ద మార్పు సంభవించాక ఏర్పడిన ఒత్తిడి వల్ల ఈ కల వస్తుందంటున్నారు నిపుణులు. అంటే ఆ మార్పు తర్వాత సంభవించిన కొత్త జీవితానికి ప్రతీక ఆ కల. సాధారణంగా ఒక కొత్త రిలేషన్‌ ఏర్పడినప్పుడు, కొత్త జాబ్‌లోకి వెళ్లినప్పుడు ఇలాంటి కల రావడం సాధారణం అంటున్నారు. రాబోయే ఆ కొత్తజీవితపు ఒత్తిడిని తెలియజేసే ప్రతీకగా ఈ కల వస్తుందంటున్నారు కలల నిపుణులు.

కలల రుగ్మత నిర్ధారణ ఇలా...
కలల రుగ్మత నిర్ధారణకు ప్రత్యేకంగా నిర్దిష్టంగా ఒక పరీక్ష అంటూ లేదు. అయితే రోగి వైద్యచరిత్ర, లక్షణాలతో పాటు... అతడి విషయంలో కనిపించే కొన్ని అంశాలలో పరీక్షించడంతో పాటు... ఆ కల వల్ల అతడిలో కలిగే యాంగై్జటీ, మానసిక బాధ, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నిద్రసంబంధిత రుగ్మతలు ఉన్నాయా, అతడి కల తీవ్రతతో నిత్యజీవితంలో అతడి రోజువారీపనులు ఏ మేరకు ప్రభావితమవుతున్నాయి, నిద్ర సమయంలో అతడు ప్రవర్తించే తీరు వంటి అంశాలను సాధారణంగా అతడి కుటుంబ సభ్యులు లేదా వివాహితులైతే అతడి జీవిత భాగస్వామి నుంచి సేకరించిన అంశాల ఆధారంగా రుగ్మతను నిర్ధారణ చేస్తారు.

పాలీసోమ్నోగ్రఫీ: కొందరిలో రాత్రంతా అతడు నిద్రిస్తున్న పద్ధతి, నిద్రలో కలిగే అంతరాయాలు, కల వచ్చే సమయంలో ప్రవర్తిస్తున్న తీరు వంటి అంశాలను తెలుసుకోడానికి ‘నాక్టర్నల్‌ స్లీప్‌ స్టడీ’ అని పిలిచే పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష నిర్వహిస్తారు. పేషెంట్‌ శరీరంలోని వేర్వేరు ప్రదేశాల్లో అమర్చిన రకరకాల సెన్సర్స్‌ ఆధారంగా అతడి మెదడులోని తరంగాలు (బ్రెయిన్‌వేవ్స్‌), రక్తంలోని ఆక్సిజన్‌ మోతాదులు, గుండె స్పందనల రేటు, శ్వాసతీసుకునే తీరు, కళ్లు, కాళ్ల కదలికలు... ఈ పరీక్షలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరీక్ష సమయంలో అతడి స్లీప్‌ సైకిల్స్‌లో వచ్చే మార్పులను గమనించడానికి వీడియో తీసి, అధ్యయనం చేస్తారు.


పీడకలలు రాకూడదంటే...
నిద్రకు ఉపక్రమించే ముందర కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, చాకొలెట్, డైట్‌డ్రగ్స్, కెఫిన్‌ ఎక్కువగా ఉండే సాఫ్ట్‌డ్రింక్స్, నాన్‌–హెర్బల్‌ టీ వంటివి తీసుకోకూడదు. అలాగే కొన్ని పెయిన్‌రిలీవర్‌ మందులకూ దూరంగా ఉండాలి. ఇక పొగతాగడం కూడా సరికాదు. ఎందుకంటే పొగతాగేవారికి పీడకలలు రావడంతో పాటు  సాధారణంగా వేకువ సమయంలో ఇంకా చీకటి ఉండగానే నిద్ర ఎగిరిపోయి.. ఇక  తర్వాత ఇక నిద్రపట్టదు. అలాగే ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కూడా గాఢ నిద్ర, కలలు వచ్చే ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఆర్‌ఈఎమ్‌) దశ దెబ్బతింటాయి.
వేణ్ణీళ్లతో స్నానం చేసి, మెత్తటి పడక మీద హాయిగా నిద్రించేలా మీ పడక ఉండాలి.
పీడకలలు వచ్చేవారు వేకువజామునే ఇంకా చీకటితో ఉండగానే నిద్రలేవడం కంటే... కాస్త వెలుగు తీక్షణమయ్యేదాక పడుకుంటేనే మేలు. సూర్యుడి ఈ తీక్షణ కాంతితో మెదడులోని జీవగడియారంలో కాంతివేళలు సెట్‌ అవుతాయి. అంతేకాదు.. అన్ని రకాల నిద్రరుగ్మతలకు వేకువ వెలుగు వచ్చాక ఒక గంటపాటు నిద్రపోవడమే మంచి మందు అని నిపుణులు అంటున్నారు.
నిద్రకు ఉపక్రమించాక వెంటనే పడుకోవడం మంచిది. అలా నిద్రపట్టకపోతే అటు ఇటు పక్కలకు తిరుగతూ బెడ్‌మీదే ఉండకండి.  ఆహ్లాదకరమైన సంగీతం వినండి. నిద్రపట్టే సమయంలోనే బెడ్‌మీదకు వెళ్లండి. లేదంటే... నిద్రపట్టడం లేదనే యాంగై్జటీతో నిద్రలేమి సమస్య మరింత ఎక్కువవుతుంది.
గది ఉష్ణోగ్రత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉండాలి.

చికిత్స
చాలా సందర్భాల్లో ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’ సమస్యకు మందుల అవసరం ఉండకపోవచ్చు. పేషెంట్‌కు ధైర్యం చెప్పడం, సాంత్వన కలిగించడం, తనకు యాంగై్జటీ, ఒత్తిడి కలిగించే అంశాలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం వంటి చర్యలతో దీనికి చికిత్స అందిస్తారు. అయితే కొంతమందిలో మాత్రం అతడిలోని ఈ తరహా కలలకు కారణమైన అండర్‌లైయింగ్‌ మెడికల్‌ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక పేషెంట్‌కు ఉన్న స్ట్రెస్‌ తొలగించడానికి అవసరమైన ఒత్తిడి తగ్గించడానికి మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్‌ రెడ్యూసింగ్‌ టెక్నిక్‌లను అవలంబించి చికిత్స అందిస్తారు.

ఇవేగాక... తీవ్రమైన వేదన కలిగించే సంఘటన తర్వాత ‘పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌’కు లోనైన కొందరిలో ‘ఇమేజరీ రిహార్సల్‌ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు.ఈ తరహా చికిత్సలో తనకు వచ్చిన పీడకల చివర్లో అంతా సుఖాతంగా ముగిసినట్లుగా అతడి మైండ్‌లో నాటుకునేలా చేస్తారు. దాంతో అతడికి వచ్చే పీడకలలు క్రమంగా తగ్గిపోతాయి.

- డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి ,కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Advertisement