ఊరంతటికీ ఒక్కడే! | One and only in villege Man | Sakshi
Sakshi News home page

ఊరంతటికీ ఒక్కడే!

Published Sun, May 1 2016 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

ఊరంతటికీ ఒక్కడే!

ఊరంతటికీ ఒక్కడే!

ఔరూరా!
ఊరికొక్కడు అంటారు సరే... ఆ ఊళ్లో ఉండేది మాత్రం అతడొక్కడే! ఇంకెవరూ ఉండరక్కడ. ఇంకోలా చెప్పాలంటే ఆ ఊరి జనాభా ఒక్క మనిషి మాత్రమే! ఏమా ఊరు? ఏమా కథ... అనుకుంటున్నారా? అలాంటి ఊరు ఏదో ఒక ఒంటరి దీవిలో ఉంటుందనుకుంటున్నారా? ఆగండాగండి... ఆ ఊరు ఏ ఒంటరి దీవిలోనో లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో ఉంది. ఆ ఊరి పేరు జువెన్‌షాన్షె. ఆ ఊళ్లో ఉండే ఒకే ఒక్కడి పేరు లియు షెంగ్జియా.
 
ఇరవయ్యేళ్ల కిందట ఆ ఊళ్లోనూ మనుషులు ఉండేవారు. అప్పట్లో దాదాపు ఇరవై కుటుంబాలు ఉండేవి. కరువు కాలం దాపురించడంతో ఒక్కొక్కరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇంకొందరు ఊళ్లోనే కన్నుమూశారు. పదేళ్ల కిందట... అంటే 2006 నాటికి చూసుకుంటే ఆ ఊళ్లో లియు కుటుంబం ఒక్కటే మిగిలింది. అప్పట్లో మంచాన పడ్డ లియు తల్లి, అతడి తమ్ముడు కూడా అతడితో ఆ ఇంట్లోనే ఉండేవారు. ఏడాది గడిచేలోగానే వారిద్దరు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆ ఊళ్లో లియు ఒక్కడే మిగిలాడు. ఊళ్లో ఒక్కడూ మిగిలిన కొత్తలో తనకు రాత్రి సరిగా నిద్రపట్టేది కాదని, అయితే, క్రమంగా అలవాటైపోయిందని లియు చెబుతాడు.

ఇప్పుడు అతడు ఆ ఊరికి సమీపంలోని అడవికి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ ఉద్యోగం ద్వారా అతడికి నెలకు 700 యువాన్లు (107 డాలర్లు) వస్తాయి. తిండి కోసం, నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, అయితే, ఇది తనకు పెద్ద సమస్య కాదని చెబుతాడు లియు. ఊళ్లో ఏ ఇంట్లో కావాలంటే ఆ ఇంట్లో ఉండగలనని, ఇక్కడ తనకు చాలా ప్రశాంతంగా ఉందని అంటాడు అతడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement