కోరలు చాచిన కరువు రక్కసి.. రైతన్న ఉక్కిరిబిక్కిరి | Kharif crops were severely damaged due to lack of rain across Rayalaseema | Sakshi
Sakshi News home page

కోరలు చాచిన కరువు రక్కసి.. రైతన్న ఉక్కిరిబిక్కిరి

Published Sun, Nov 3 2024 5:29 AM | Last Updated on Sun, Nov 3 2024 5:29 AM

Kharif crops were severely damaged due to lack of rain across Rayalaseema

రాయలసీమ వ్యాప్తంగా వర్షాభావంతో దారుణంగా దెబ్బతిన్న ఖరీఫ్‌ పంటలు

చోద్యం చూస్తున్న చంద్రబాబు కూటమి సర్కారు

రైతన్నలను చేయి పట్టుకుని నడిపించిన గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 

రాయదుర్గం/కర్నూలు(అగ్రికల్చర్‌): రాయల­సీమ జిల్లాల్లో కరువు తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నా కూటమి సర్కార్‌ మొద్దు నిద్ర వీడటం లేదు. పైగా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది  ఖరీఫ్‌ పంటలు చాలా ప్రాంతాల్లో తుడిచి పెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులు రైతులకు గుది బండగా మారుతున్నాయి. 

రాయలసీమ జిల్లాల్లో మొత్తంగా 18 లక్షల ఎకరాలకు గాను 15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. వర్షాభావం వల్ల 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదు. సాగైన దాంట్లో దాదాపు 6–7 లక్షల ఎకరాల్లో పంటలు అతివృష్టి వల్ల దెబ్బతిన్నాయి. మిగతా చోట్ల అదునులో వర్షం కురవక పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఆదుకునే చర్యలు చేపడుతుంది. 

కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అన్నదాతల గోడు పట్టినట్టు లేదు. రాయలసీమ జిల్లాల్లో పెద్దగా కరువే లేదన్నట్టు.. కేవలం 54 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేర్చి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన మండలాల రైతులకు అన్యాయం చేశారు. కూటమి సర్కార్‌ తీరును విపక్షాలు, రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. జిల్లాలో కనీసం 31 మండలాలను కరువు జాబితాలో చేర్చాలని, లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.  

రైతుల పట్ల చంద్రబాబు చిన్నచూపు
అధిక వర్షాలు, అనావృష్టి వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. పంట దిగబడులు పడిపోయినా రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం, ధరలు పడిపోవడంతో వ్యవసాయానికి కలసి రాలేదు. స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ నియోజక­వర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. 

కర్నూలు జిల్లాలో అయితే కేవలం రెండు మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, హాలహర్వి, కొసిగి, దేవనకొండ, తుగ్గలి, పత్తికొండ, హొలగొంద, చిప్పగిరి తదతర మండలాల్లో రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. ఈ ప్రాంతం నుంచి దాదాపు 20 వేల కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లాయి. ఏ మండలంలో చూసిన బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస పోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. 

బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులు 
2014–15 నుంచి 2018–19 వరకు ప్రతి ఏటా కరువు వచ్చింది. మళ్లీ ఇప్పుడు నాటి కరువు పరిస్థితులే పునరావృతం అయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పంటలు చేతికందక, అప్పుల బాధలు పెరిగిపోవడంతో దిక్కుతో­చని రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జూన్‌ 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక్క కర్నూలు జిల్లాలోనే 18 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఒక్క సెప్టెంబరు నెలలోనే వ్యవసాయ అధికారుల సమాచారం మేరకే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట కోత ప్రయోగాల ప్రకారం పత్తి, వేరు­శనగ, మొక్కజొన్న తదితర పంట దిగుబడులు కూడా తగ్గిపోయాయి. ప్రదాన పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. వాస్తవం ఇలా ఉంటే జిల్లా యంత్రాంగం ఉద్దేశ పూర్వకంగా కరువును కప్పిపుచ్చుతోందని ఇట్టే తెలుస్తోంది. 

నాలుగేళ్లు సుభిక్షం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆశించిన రీతిలో వర్షాలు పడ్డాయి. ఏ జిల్లాలోనూ కరువు అన్న మాటే వినిపించలేదు. అయితే 2023లో దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపైనా చూపింది. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఆలోచన లేకుండా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న 1,79,815  హెక్టార్లకు సంబంధించి 1,69,970 మంది రైతులకు ఏకంగా రూ.251.21 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేశారు. 

మరో వైపు రైతు సంక్షేమానికీ పెద్దపీట వేశారు. విత్తు మొదలు పంట విక్రయం వరకు చెయ్యి పట్టి నడిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రాయితీ పరికరాలన్నీ రైతు చెంతకే చేర్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా అన్నదాతలకు అండగా నిలిచారు.

వర్షాభావం ముంచింది 
ఈ ఏడాది ఒకవైపు వర్షాభావం, మరోవైపు అధిక వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. నేను మూడున్నర ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. 

కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. పంటను అమ్మగా వచ్చిన మొత్తం పెట్టుబడికి కూడా సరిపోలేదు. కరువు తీవ్రంగా ఉన్నా. ప్రభుత్వం గుర్తించకపోవడం అన్యాయం. భూగర్భ జలాలు కూడా బాగా తగ్గిపోయాయి. తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. – సంజీవరెడ్డి, ముక్కెళ్ల,  తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా 

రైతాంగాన్ని ఆదుకోవాలి
అత్యంత వెనుకబడిన గుమ్మఘట్ట మండలాన్ని కరువు జాబితాలో చేర్చాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుని సహాయ చర్యలు చేపట్టారు. వడ్డీ లేని రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఇన్సూ­రెన్స్, వాతావారణ బీమాను సకాలంలో అందించారు. కూటమి ప్రభుత్వం కనీసం కరువు మండలంగా కూడా గుర్తించకపోవడం దారుణం. – రాముడు, చెరువుదొడ్డి, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement