పీసీఓడీ... పర్యవసానాలు
ప్రస్తుత అధ్యయనాల ప్రకారం ప్రతి పదిమంది మహిళల్లో ముగ్గురు నుంచి నలుగురు పీసీఓడీ అనే సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ప్రతిమహిళలలోనూ రుతుసమయంలో అండాశయంలో పరిపక్వత చెంది నెల తర్వాత అండం విడుదల అవుతుంది. నెలసరి తర్వాత పది నుంచి పద్నాల్గవ రోజుల మధ్యన ఈ అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. కానీ పీసీఓడీ అనే వ్యాధితో బాధపడుతున్న స్త్రీలలో అండం పరిపక్వత చెందకపోవడం వల్ల అవి అండాశయంలో నీటి బుడగల రూపంలో ఉండిపోతాయి. కొన్నిసార్లు అవి ఒకటి, రెండు... మొదలుకొని చాలా ఎక్కువ సంఖ్యలోనూ ఉండవచ్చు. ఈ కండిషన్‌ను ‘పాలీ సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్-(పీసీఓడీ) అంటారు.
పీసీఓడీతో సమస్యలు...
ఈ సమస్య ఉన్నవారిలో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టెరాన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు వారి ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఊబకాయం, నెలసరి క్రమం తప్పడం, కొందరిలో నెలసరి రెండు లేదా మూడు నెలలకోసారి రావడం, రుతుసమయంలో రక్తస్రావం తక్కువగా జరగడం జరుగుతుంది. మరికొందరు స్త్రీలలో రుతుక్రమం కచ్చితంగా వచ్చినా రక్తస్రావం ఎక్కువగా జరగవచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో అండం సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల సంతానం కలగడానికి ఇది ఆటంకంగా పరిణమించవచ్చు.
ఈ వ్యాధి ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రభావం వల్ల చాలామందిలో అవాంఛిత రోమాలు పెరుగుతాయి. యుక్తవయసులో వారికి మొటిమలు అధికంగా వస్తాయి. జుట్టురాలిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒత్తిడికి గురికావడం వంటివి జరగవచ్చు.
పీసీఓడీ లక్షణాలు యుక్తవయసు నుంచి కనిపించవచ్చు అయితే వీటి తీవ్రత అందరిలోనూ ఒకేలా లేకపోవచ్చు. కొందరిలో కేవలం అవాంఛిత రోమాలు మాత్రమే ఉండవచ్చు. లేదా మరికొందరిలో మొటిమలు మాత్రమే బాధించవచ్చు. ఇంకొందరిలో రుతుక్రమ సమస్యలు మాత్రమే ఉండవచ్చు. కొందరిలో పీసీఓడీ సమస్యతో పాటు హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు కూడా తీవ్రమవుతాయి. ఈ సమస్యతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నవారిలో టైప్-2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశం ఎక్కువ. గర్భం ధరించినప్పుడు మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. నిర్ధారణ: పీసీఓడీని నిర్ధారణ చేయడానికి అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ పెల్విస్ పరీక్షతోపాటు కొన్ని రకాల రక్తపరీక్షలు... ముఖ్యంగా టీఎస్‌హెచ్, ఆర్‌బీఎస్, పీఆర్‌ఎల్, డీహెచ్‌ఈఏ, టెస్టోస్టెరాన్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ వంటివి చేయాల్సి ఉంటుంది.
నివారణ / చికిత్స: సరైన వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతో దీన్ని నివారించవచ్చు. బరువు తగ్గడం కోసం వ్యాయామం/యోగా, ఆహారంలో ఆకుకూరలు, దంపుడుబియ్యం, బ్రౌన్‌రైస్, ఓట్స్, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే స్వీట్స్, కేక్స్, ఐస్‌క్రీమ్స్, శీతలపానీయాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రోగి లక్షణాలను, వ్యక్తిగత ప్రవర్తనను బట్టి జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ పద్ధతుల్లో ప్రకృతి నియమాలను అనుసరించి సరైన హోమియో వైద్యవిధానం ద్వారా వైద్యం చేయించుకోవడం వల్ల ఈ హార్మోన్లలోని సమతౌల్యతను నిర్వహించడానికి వీలవుతుంది.