నా వయసు 26 సంవత్సరాలు, తరచుగా జుట్టు ఊడుతుంది. అవాంఛిత రోమాలు వస్తున్నాయి. అండాశయంలో నీటిబుడగల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని విన్నాను. మా అమ్మ అండాశయంలో నీటిబుడగల సమస్య ఎదుర్కొంది. ఇది జెనెటికల్ ప్రాబ్లం అంటున్నారు. మా అమ్మాయికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? – కె.వందన, ఏటూరునాగారం
నీటి బుడగల సమస్య అంటే ‘పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్’ (పీసీఓడీ) అనేది జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు వంటి వాటితో పాటు ఇంకా అనేక తెలియని కారణాల వల్ల ఏర్పడుతుంది. జన్యుపరమైన కారణాల్లో తల్లిదండ్రుల్లో సుగర్ వ్యాధి ఉండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి ఉన్నట్లయితే, అది వారి పిల్లల్లో, ఆ జన్యువుల వల్ల నీటి బుడగలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు మగవారిలో ఎక్కువగా ఉండే ఎండ్రోజెన్ హార్మోన్ ఆడవారిలో ఎక్కువగా స్రవిస్తుంది. దీనివల్ల అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం, మొటిమలు, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే సమస్యను రాకుండా ఆపలేము. కాకపోతే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల వాటి లక్షణాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. దీనిలో భాగంగా ఎక్కువ బరువు పెరగకుండా నడక, వ్యాయామాలు, యోగా, ధ్యానం, మితమైన పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చెయ్యడం మంచిది. అంతేకాకుండా డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణం నిర్ధారణ చేయించుకుని, దానికి తగ్గ మందులు ఎక్కువ కాలం వాడుతూ, అవాంఛిత రోమాలకు మందులతో పాటు చర్మవ్యాధి నిపుణుల సంరక్షణలో లేజర్ వంటి కాస్మొటిక్ చికిత్సలు తీసుకోవలసి ఉంటుంది. రాకుండా ముందు జాగ్రత్తలేమీ ఉండవు.
నేను నిద్ర తక్కువగా పోతాను. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఈ సమయంలో ఎన్నిగంటలు నిద్ర పోవాలి? ఒకవేళ నిద్ర తక్కువైతే సమస్యలు ఎదురవుతాయా? మంచి నిద్ర కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో బ్యాక్‌పెయిన్, శ్వాస సమస్యల వల్ల నిద్ర సరిగ్గా పట్టదని చెబుతుంటారు. వీటికి అధిగమించడానికి ఏంచేయాలి అనేది తెలియజేయగలరు. – బి.నీరజ, హైదరాబాద్
గర్భిణులు రోజూ రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవడం మంచిది. గర్భిణులలో హార్మోన్లలో మార్పులు, శరీరంలో మార్పుల వల్ల తొందరగా అలసిపోవడం జరుగుతుంది. సరిగా నిద్రపోవడం వల్ల అలసట తగ్గుతుంది. నిద్ర తక్కువైతే రోజంతా చిరాకుగా, మగతగా ఉండటం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. గర్భం పెరిగి, పొట్ట పెరిగే కొద్దీ నడుం మీద భారం పడి, నడుము నొప్పి, అటూ ఇటూ తిరగడానికి ఇబ్బందితో నిద్ర సరిగా పట్టకపోవడం, పొట్ట, ఊపిరితిత్తుల మీద అదుముతున్నట్లయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడి నిద్ర సరిగా పట్టకపోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. రాత్రిపూట తొందరగా భోజనం చేసి కనీసం పదిహేను నిమిషాల పాటు మెల్లగా నడవడానికి ప్రయత్నించాలి. పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగడం మంచిది. దీనివల్ల బాగా నిద్రపడుతుంది. తల కింద దిండు కొద్దిగా ఎత్తుగా పెట్టుకుని పడుకుంటే, గ్యాస్ ఎక్కువ పైకి రాకుండా, ఊపిరితిత్తులు అదుముకోకుండా బాగా నిద్ర పడుతుంది.
ఓరల్ ఐరన్ థెరపీ గురించి వివరంగా తెలియజేయగలరు. ప్రెగ్సెన్సీ సమయంలో ఇది తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి?– ఎన్.సరళ, విశాఖపట్టణం
ఐరన్ మాత్రలను నోటి ద్వారా తీసుకోవడాన్ని ఓరల్ ఐరన్ థెరపీ అంటారు. సాధారణంగానే ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత తల్లి శరీరంలోని మార్పులకు, బిడ్డకు తల్లి ద్వారా పోషకాహారం వెళ్లడానికి రక్తం ఎంతో అవసరం. ఇందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకు చేరవేస్తుంది. కాబట్టి ఈ సమయంలో రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హీమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ అవసరం ఉంటుంది. ఐరన్ మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తంలోకి చేరుతుంది. ఇది ఎక్కువగా తాజా ఆకు కూరలు, బఠాణీలు, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలు, ఖర్జూరం, అంజీర, దానిమ్మ వంటి పండ్లలో, మాంసాహారంలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ తీసుకున్న ఆహారంలో కేవలం 10–20 శాతం మాత్రమే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి గర్భిణులు రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గకుండా, అలాగే రక్తహీనత ఉన్నప్పుడు కూడా రోజూ ఐరన్ మాత్రలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. హీమోగ్లోబిన్ శాతం బట్టి రోజుకు ఒకటి లేదా రెండు మాత్రలు చొప్పున సూచించడం జరుగుతుంటుంది. ఐరన్ మాత్రల వల్ల కొందరిలో మలబద్ధకం, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉండవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో ,హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment