నెవర్ రుక్
‘రుక్’ అంటే హిందీలో ‘ఆగు’ అని.
కానీ షారుక్ డిక్షనరీలో ఆగడం అనేది లేదు...
he never stop.
ఒక్క డైలాగుల్లో తప్ప.
అవి మాత్రం ఆగి ఆగి చెబుతాడు.
సిల్వర్ జూబ్లి కొట్టిన కెరీర్ ఇది.
ప్రొడ్యూసర్‌లకు గోల్డెన్ హ్యాండ్.
ఫ్యాన్స్‌కి అచ్చంగా డైమండే.
ఫ్యామిలీకి బాద్‌షా ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.
‘రయీస్’ కథ విన్నప్పుడు రిజల్ట్‌ని జడ్జ్ చేయగలిగారా?
ఓ సినిమా చేసేటప్పుడు మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో పని చేస్తాం. పర్టిక్యులర్‌గా ఈ సినిమా ష్యూర్‌షాట్ సక్సెస్ అవుతుందని చెప్పలేం. సక్సెస్‌కి కొలమానం ఏంటి? ఉదాహరణకు ‘ఫ్యాన్’ సినిమా. మేం ఏం అనుకుని ఆ సినిమా చేశామో అంతకంటే బాగా ఆడింది. సక్సెస్‌కి ఫార్ములా లేదు. కొంతమంది దర్శక–నిర్మాతలు, నటులకు సక్సెస్ ఫార్ములా తెలుసేమో! నాకు మాత్రం తెలీదు. హార్డ్‌వర్క్‌తో పాటు సినిమాని ఎంజాయ్ చేయడమే నా చేతుల్లో ఉంది. గత పదేళ్లలో నేను చేసిన కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ‘రయీస్’ డిఫరెంట్ మూవీ. ‘ఫ్యాన్’, ‘డియర్ జిందగీ’ వంటి ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ మినహాయిస్తే నేను ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తా. కానీ, ‘రయీస్’ ఫిఫ్టీ ఫిఫ్టీ అనొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఆర్టిస్టిక్ నేచర్ కనిపిస్తుంది. బ్యాడ్‌మ్యాన్ స్టోరీ ఇది. అందరికీ నచ్చుతుందనే నమ్మకంతోనే చేశా. నచ్చినందుకు ఆనందంగా ఉంది.
సక్సెస్‌లు మీకు కొత్త కాదు... కానీ, ‘రయీస్’ సక్సెస్‌ని స్పెషల్‌గా ఫీలవుతున్నారేమో అనిపిస్తోంది..
కరెక్ట్‌గానే ఊహించారు. ఈ సినిమాని ఎక్కువ రోజులు తీశాం. పైగా చాలా ఏళ్ల తర్వాత నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడంవల్ల ఎప్పుడెప్పుడు తెరపై సినిమాని చూసుకుందామా, రిజల్ట్ తెలుసుకుందామా.. అని ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూశాను. అందుకే ఈ విజయం నాకు చాలా చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది.
గతంలో ‘డాన్’, ఇప్పుడు ‘రయీస్’... మీరు బ్యాడ్‌మ్యాన్‌గా నటిస్తే, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరి.. మీరు?
నేను పాత్ర గుడ్డా? బ్యాడా? అని ఆలోచించను. ఏ పాత్రనైనా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ప్రేక్షకుల మైండ్‌సెట్ మారింది. గతంలో ‘నువ్వు బ్యాడ్‌మ్యాన్‌గా నటించకూడదు. ప్రేక్షకులపై తప్పుడు ప్రభావం చూపుతుంది’ అనేవారు. తప్పు ఎలా చేయాలని కొత్త కొత్త ఐడియాలు ఇచ్చినట్టు ఉందనేవారు. కానీ, అది క్యారెక్టర్ మాత్రమే. సినిమా కథలన్నీ సమాజంలోంచి పుట్టుకొచ్చేవే. సినిమాలు ప్రజలను ప్రభావితం చేస్తాయా? సమాజం సినిమాలను ప్రభావితం చేస్తుందా? అనడిగితే... సమాజానికి ప్రతిబింబమే సినిమా. ఓ మంచి ఫ్యామిలీ సినిమా వచ్చినా, చెడు వ్యక్తుల గురించి సినిమా వచ్చినా అది సమాజంలో ఓ భాగమే. సినిమా.. సమాజానికి అద్దం పడుతుంది.
మీ మూడేళ్ల కొడుకు అబ్‌రామ్‌కి ‘రయీస్’ చూపించా?
(నవ్వుతూ).. అబ్‌రామ్ చూశాడు. పిల్లలకు కథ, డైలాగులు ఏం అర్థమవుతాయి. నా ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు కళ్లు పెద్దవి చేసి చూస్తుండిపోయాడు. డ్యాన్సులు వచ్చినప్పుడైతే వాడూ డ్యాన్స్ చేశాడు. అబ్‌రామ్ అలా ఎంజాయ్ చేస్తుంటే నాకు ముచ్చటగా అనిపించింది.
‘రయీస్’లో మీ పాత్ర చనిపోతుంది. గతంలో కూడా ఇలాంటిది చేశారు.. ఫ్యాన్స్ బాధపడరా?
ఫ్యాన్స్ బాధపడతారు. ఈ సినిమాలో చని పోతే ఏం.. నెక్ట్స్ సినిమాలో బతుకుతాను కదా. కథకు ఏది అవసరమో అది చేసేయాలి. హీరో ఇమేజ్ కోసం, ఫ్యాన్స్ ఆనందం కోసం చూసుకుంటే కథ మారిపోతుంది.
హైదరాబాద్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇటీవల ఇక్కడి యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం ఎలా ఉంది?
పెద్ద గౌరవమిది. విద్యా వ్యవస్థపై నమ్మకం ఉంది. చదువుకోవడం వల్లే నేను ఇంతటివాణ్ణి అయ్యాను. నా తల్లిదండ్రులు నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. నాకు వీలు చిక్కినప్పుడల్లా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తా. అతి పెద్ద యూనివర్శిటీల్లో ఒకటైన ‘మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ’ నుంచి డాక్టరేట్ అందుకోవడం హ్యాపీ.
డాక్టర్ షారుక్, డాన్ షారుక్, రొమాంటిక్ హీరో షారుక్, ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ త్రీ కిడ్స్ షారుక్... మీకు ఏది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది.
(నవ్వుతూ) నిజం చెప్పాలంటే... ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలోనే నాకు ఎక్కువ సంతృప్తి లభిస్తుంది. ‘నేను ప్రేక్షకులకు ఇవ్వగలిగిన దానికంటే వాళ్లు నాకు ఇచ్చిన అభిమానమే ఎక్కువ’ అని నేనెప్పుడూ చెబుతుంటా. వాళ్ల దగ్గర్నుంచి నేను తీసుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలని ఎప్పుడూ ప్రయత్నిస్తా. సినిమాల ద్వారా అభిమానులను ఎక్కువ సంతోషపెట్టే అవకాశం ఉంది. నేనింకా హార్డ్‌వర్క్ చేయాలి. ప్రపంచమంతా మన దేశాన్ని గుర్తించే సినిమాలు చేయాలనేది నా కోరిక. అందుకోసం చాలా దూరం ప్రయాణించాలి. అది నేను సాధించగలిగితే గొప్ప ఘనత అవుతుందని ఆశిస్తున్నా.
మీ విద్యార్థి రోజులను మాకోసం గుర్తు చేసుకుంటారా?
స్కూలింగ్, కాలేజ్ అంతా ఢిల్లీలోనే.‘ ఐయామ్ ఎ గుడ్ స్టూడెంట్’. నాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ‘ది బెస్ట్’ నేర్చుకోవాలనేది నా పాలసీ. మాది చాలా పేద కుటుంబం. స్కూల్ ఫీజ్ కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఫీజ్ చెల్లించకపోయినా బాగా చదువుతానని స్కూల్ యాజమాన్యం నాపై దయ చూపించిన సందర్భాలు చాలా. నా తల్లిదండ్రులు నన్ను చదివించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. అందువల్ల, బాగా చదువుకోవాలనుకునేవాణ్ణి. బాగా కష్టపడి చదివా. ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. అప్పట్లో స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకున్నా. అందుకే ఎక్కువ ఆటలు కూడా ఆడేవాణ్ణి. ఇప్పుడు కొంతమంది యంగ్‌స్టర్స్ ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పి, ‘నాకు ఈ ఒక్కటి ఇష్టం’ అంటుంటారు. అది తప్పు. ప్రతి సబ్జెక్ట్‌లోనూ నాలెడ్జ్ పెంచుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. అన్ని సబ్జెక్టులూ నేర్చుకుంటే జీవితంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. నటుడిగానూ నాకు నా చదువు ఎంతో హెల్ప్ చేసింది.
స్కూల్‌లో ఎప్పుడూ చదువేనా? అల్లరి ఏమైనా?
చదువుతో పాటు చిలిపితనం కూడా ఎక్కువ. చాలాసార్లు స్కూల్ నుంచి సస్పెండ్ అయ్యాను. పనిష్‌మెంట్స్ కామనే. ‘నీది డెవిల్ స్మైల్’ అని మా టీచర్ అనేవారు. ఇప్పుడు ఈ స్మైల్ బాగుందని చాలామంది అంటున్నారు కనుక టీచర్‌ని క్షమించేయాలి (నవ్వుతూ).
స్మాల్ స్క్రీన్.. సిల్వర్ స్క్రీన్‌పైనా మీరు ఫుల్ సక్సెస్. మీ మొదటి అక్షరం ‘ఎస్’ ఫర్ సక్సెస్ అనొచ్చా?
నా సక్సెస్ క్రెడిట్ మొత్తం నేనొక్కణ్ణే తీసుకోవడం తప్పు. నాకు అదృష్టం కలిసొచ్చింది. నేనీ స్థాయికి రావడానికి చాలామంది హెల్ప్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నోళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, నాకు వచ్చినట్టు టాలెంట్ నిరూపించుకునే సరైన అవకాశాలు వాళ్లకు రాలేదు. నేను సరైన టైమ్‌లో ఎంట్రీ ఇచ్చాను. నైంటీస్ వాజ్ ఛేంజింగ్ టైమ్ ఫర్ అవర్ కంట్రీ... 1990లలో ఓ తరం మారింది. ప్రజల ఆలోచనా ధోరణి మారింది. దేశానికి ఏదైనా చేయాలనుకునేవాళ్ల సంఖ్య పెరింది. పిల్లలకు మంచి జీవితం, చదువు ఇవ్వాలని ప్రయత్నించారు. టెక్నికల్‌గా ఇంకా మెరుగైన అభివృద్ధి మొదలైంది. నా సినిమాల్లో ఈ అంశాలన్నీ కనిపించాయి. ఒకవేళ సమాజాన్ని ప్రతిబింబించే అలాంటి సినిమాల్లో నటించే అవకాశాన్ని దర్శక, నిర్మాతలు ఇవ్వకపోతే నేను అవి చేసేవాణ్ణి కాదు. ఆ విషయంలో నేను లక్కీ. అఫ్‌కోర్స్... నేనూ హార్డ్‌వర్క్ చేశాననుకోండి. విజయం అనేది నిరాటంకంగా కొనసాగే ప్రక్రియ. ఓ పనిలో సక్సెస్ అయిన తర్వాత.. ‘ఇక చాలు. సాధించేశా’ అనుకోకూడదు. వంద మీటర్ల పరుగు పందెంలో ఒక్కసారి నెగ్గిన వాళ్లను ఎప్పుడూ గౌరవించరు. క్రీడాకారుడు ఉసేన్‌బోల్ట్ పరుగు పందెంలో బెస్ట్. కానీ, బరిలో దిగిన ప్రతిసారీ అతను గెలవాల్సిందే. అలాగే సచిన్ టెండూల్కర్ ప్రతి ఆటకీ సెంచరీ, డబుల్ సెంచరీ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, సక్సెస్ ఎప్పుడూ రిపీట్ కావాలి. సినిమా ఆర్టిస్టులకూ ఇది వర్తిస్తుంది. ప్రతి సినిమా గెలవాల్సిందే.
‘దంగల్’ చూసిన సల్మాన్... ‘ఆమిర్... వృత్తిపరంగా నిన్ను ద్వేషిస్తా. వ్యకిగతంగా ప్రేమిస్తా’ అన్నారు. మీరు వృత్తిపరంగా ద్వేషించే వ్యక్తి ఎవరైనా?
సల్మాన్ సరదాగా ఆ మాట అన్నాడు. సీరియస్‌గా కాదు. అసలు వ్యక్తిగతంగానైనా, వృత్తిపరంగానైనా ఇతరులను ఎందుకు ద్వేషించాలి? నేను చాలా తక్కువ సినిమాలు చూస్తా. నా సినిమాలు కూడా సరిగా చూడను. ఎప్పుడైనా ఏదైనా సినిమా చూస్తే అందులో ఎవరి వర్క్ అయినా నచ్చితే ప్రశంసిస్తా. నాకు నటీనటులు అందరూ నచ్చుతారు. నేను అందర్నీ ప్రేమిస్తా. నాకు ఎవరితోనూ సమస్యలు లేవు.
యంగ్ హీరోల్లో మీ దృష్టిలో నెక్ట్స్ సూపర్‌స్టార్ ఎవరు?
తప్పుగా అనుకోవద్దు. మీడియా గన్ ఎక్కుపెట్టి... నెక్ట్స్ సూపర్‌స్టార్ ఎవరు? అనడిగితే, ఎవరో చెప్పేంత ఇంటిలిజెంట్ కాదు నేను. ఒక సినిమా బాగా ఆడితే, అందులో యాక్ట్ చేసిన హీరోని ‘నెక్ట్స్ సూపర్‌స్టార్’ అంటారు. ఆ రకంగా అతనిపై ఒత్తిడి పెంచేస్తున్నారు. వాళ్లకూ ఏం అర్థం కావడం లేదు.
అప్పట్లో మిమ్మల్ని ‘సూపర్ స్టార్’ అన్నప్పుడు మీకు ఒత్తిడి అనిపించేదా?
నిజాయితీగా చెప్పాలంటే... నేను సూపర్‌స్టార్ ఎలా అయ్యానో? నాకు తెలీదు. అయిపోయాను. ఒత్తిడేం అనిపించలేదు. నా గురించే నేను ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు ఫలానా హీరో నెక్స్›్టసూపర్‌స్టార్ అని ఎలా చెప్పగలను? రణబీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్ వంటి యంగ్‌స్టర్స్ బాగా నటిస్తున్నారు. హీరోయిన్స్‌లో విద్యాబాలన్, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ సూపర్. అందులో కొందరితో నేను నటించా. కొందరి వర్క్ చూశా. ఇంకా చాలా దూరం ప్రయాణించే భవిష్యత్ వాళ్లకి ఉంది. మంచి సినిమాలు, కొన్ని చెత్త సినిమాలూ చేస్తారు. చేయనివ్వండి. వాళ్లపై ఒత్తిడి పెంచకండి. వాళ్లకు పరిస్థితులు అర్థం కావాలి. మంచి ఆర్టిస్టులుగా ఎదగాలి. ‘క్లాస్‌లో ఫస్ట్ రావాలని పిల్లలపై ఒత్తిడి పెంచినట్టు, యంగ్‌స్టర్స్‌పై ఒత్తిడి పెంచకూడదు’ అనేది నా అభిప్రాయం.
మీ ముగ్గురి పిల్లల మార్కుల విషయంలో మీ ధోరణి ఎలా ఉంటుంది?
నేను నా పిల్లల రిపోర్ట్ కార్డ్ చూడను. మొన్నోసారి మా అబ్బాయి రిపోర్ట్ కార్డ్ వచ్చిందని చెప్పాడు. ‘హౌ డు యు డూ’ అనడిగా. ‘ఓకే.. ఐ డిడ్ వెల్’ అన్నాడు. ‘నీ మార్కులతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అనడిగా. ‘ఫుల్ హ్యాపీ కాదు’ అన్నాడు. అయితే ‘ఫుల్ హ్యాపీగా ఉండేలా చూసుకో’ అన్నాను. నేనెప్పుడూ వాళ్ల మార్కులు, పర్సంటేజ్‌లు అడగను. ఇప్పుడంతా స్కూల్స్‌లో అన్నీ గ్రేడ్‌లే కదా. ‘ఎ’ గ్రేడ్‌కి ఎంత పర్సంటేజ్, ‘బి’ గ్రేడ్ అంటే ఏంటి? అని కూడా నాకు తెలియదు. చదువు విషయంలో నా పిల్లలను నేను ఒత్తిడి చేయను. ‘నాకోసం కాదు.. మీ హ్యాపీనెస్ కోసం ట్రై చేయండి’ అని చెబుతుంటా. జీవితం అంటే ఏంటో? తెలుసుకునే జ్ఞానం ఉంటే చాలు. లైఫ్‌ని ఎంజాయ్ చేయగలగాలి. చదువుని ఎంజాయ్ చేయకుండా క్లాస్‌లో ఫస్ట్ వచ్చి ఏం ప్రయోజనం? ఐ హేట్ దట్.
ఫైనల్లీ.. సుమారు పాతికేళ్ల కెరీర్‌లో ఎప్పుడైనా అలసిపోయాననే భావన వచ్చిందా?
ఉదయమే నిద్రలేవాలని చెప్పినప్పుడు మాత్రమే అలసటగా అనిపిస్తుంది. ఈ మధ్య ఫుల్ బిజీ. కేవలం మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వీలు చిక్కింది. అయినా అలసట లేదు. నాకు దేవుడు ఇచ్చిన వరం ఇది. పని లేకపోతే బతకలేను. ఒక్క మూడు రోజులు గ్యాప్ వస్తే చాలు.. ఏం చేయాలో తెలియక ఇంట్లో అటూ ఇటూ పిచ్చి పట్టినవాడిలా తిరుగుతుంటాను. మావాళ్లకు ఏం అర్థం కాదు. ఈయనగారికి పని ఉంటేనే బెస్ట్ అనుకుంటారు. ఆగకుండా పని చేయాలన్నది నా లక్ష్యం (నవ్వుతూ).
కట్టప్ప గురించి సత్యరాజ్‌ని అడిగా..
గ్లోబల్‌గా మన ఇండియన్ సినిమా స్థాయి ‘బాహుబలి’ లాంటి వాటి వల్ల పెరుగుతోందంటే మీరు ఒప్పుకుంటారా?
కచ్చితంగా. పది రోజుల క్రితం ఓ వ్యక్తి ‘ఇండియన్ సినిమా అంటే ఏంటి’? అని నన్నడిగాడు. అప్పుడు నేను ఉదాహరణగా ‘బాహుబలి’ గురించి చెప్పా. ప్రతి సినిమా ‘బాహుబలి’ తరహాలో ఉండాలనడంలేదు. భవిష్యత్ భారతీయ సినిమాలకు ‘బాహుబలి’ని ఓ రోడ్ మ్యాప్ కింద నేను భావిస్తాను. ఈ సినిమాను నేను రెండుసార్లు చూశా. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. నాతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో నటిస్తున్న టైమ్‌లోనే సత్యరాజ్‌గారు ‘బాహుబలి’లో కట్టప్పగా నటిస్తున్నారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ రిలీజైంది. తర్వాత నేను ‘దిల్‌వాలే’ చేశా. అదీ రిలీజైంది. ఇప్పుడు ‘రయీస్’. సత్యరాజ్‌గారు మాత్రం ‘బాహుబలి’ చేస్తూనే ఉన్నారు. నటీనటులు, దర్శక–నిర్మాతలు, టెక్నీషియన్లు అంకితభావంతో ఆ సినిమా చేశారు. అందువల్లే, ఫలితం కూడా ఆ స్థాయిలో ఉంది. ఇటువంటి పాత్ బ్రేకింగ్ సినిమాలో నటించమని ఎవరైనా నన్ను అడిగితే తప్పకుండా నటిస్తా.
కట్టప్ప ‘బాహుబలి’ని ఎందుకు చంపాడో సత్యరాజ్ మీకు చెప్పారా?
(నవ్వుతూ..) లేదు. ఆ సీక్రెట్ చెప్పమని అడిగితే నవ్వారాయన.
ప్రజలకు తిరిగి ఇవ్వాలి..
బాలీవుడ్‌లో హయ్యస్ట్ టాక్స్ పేయర్స్‌లో ఒకరిగా ఉండటం మీకెలా ఉంటుంది?
ఆదాయం పెరగడం బాగానే ఉంటుంది. ప్రజలు నా సినిమాలు చూస్తున్నారు కాబట్టే నాకు మార్కెట్‌లో క్రేజ్ ఉంది. క్రేజ్ ఉంది కాబట్టే, నిర్మాతలు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. సంపాదించినదంతా దాచేసుకుంటే ఏం లాభం? ప్రజలకు తిరిగి ఇవ్వాలి కదా! అందుకే ఆదాయం తాలూకు లెక్కలు పర్‌ఫెక్ట్‌గా చూపించేసి, టాక్స్ కట్టేస్తా. ఇది చాలామందికి ఆదర్శంగా ఉంటుందన్నది నా ఫీలింగ్.
నా జీవితం సినిమాలకే...
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?
నేను రాజకీయాలకు పనికి రాను. ఆ రంగంలో రాణించాలంటే చాలా కెపాసిటీ కావాలి. ప్రజల కోసం ఎక్కువ టైమ్ కేటాయించగలగాలి.
ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి పట్టించుకుంటారా?
తెలుసుకుంటాను. ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియాలి కదా.
తమిళనాడులో ‘జల్లికట్టు’ కోసం ఆ రాష్ట్ర ప్రజలు ఏకం కావడం ఏమనిపించింది?
‘జల్లికట్టు’ గురించి అంతకు ముందు నేనెప్పుడూ వినలేదు. తమ సంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం తమిళనాడు ప్రజలు ముందుకు రావడం, అది కూడా శాంతియుతంగా ఉద్యమించడం అభినందనీయం. ‘పీస్‌ఫుల్’గానూ అనుకున్నది సాధించవచ్చని అక్కడివాళ్లు నిరూపించారు.
‘ఏపీ స్పెషల్ స్టేటస్’ కోసం ఆ మార్గాన్నే ఫాలో అవుతున్నారు.. మీకు తెలుసా?
తెలుసు. శాంతియుతంగానే స్పెషల్ స్టేటస్ సాధించుకోవాలనుకోవడం మంచి విషయమే. ఏది మంచిదో అది జరిగితే బాగుంటుంది. ప్రభుత్వం పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అందుకే వాళ్లు కోరుకున్నది ఇచ్చేయాలి.
– డి.జి. భవాని