
మహాభారత ఇతిహాసంలో.... భారతీయ నాగరికతలో హిందువుల పూజలలోను పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. భగవంతుడికి నివేదించే అతికొద్ది పండ్లలో రేగుపండు ఒకటి. రేగు పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. పిల్లలకు పోసే భోగిపండ్లు రేగి పండ్లే. సూర్యభగవానుడికి రేగు పండ్లంటే ఇష్టమట. రథసప్తమినాడు చిక్కుడు ఆకులతోపాటు రేగు ఆకులను కూడా తలమీద పెట్టుకుని స్నానం చేస్తారు. వినాయకుని పూజలోనూ రేగు ఆకులను సమర్పిస్తారు. బదరీనాథ్‌లో ఉన్న స్వామివారికి రేగుపండ్లంటే అమిత ఇష్టమట. అందుకే ఆయనకు బదరీనారాయణుడనే పేరు వచ్చింది. అలాగే వ్యాసుడికి బాదరాయణుడనే పేరు బదరీ ద్వీపంలో పుట్టినందువల్లే వచ్చింది.
తంత్ర శాస్త్ర గ్రంథాలలో కూడా బదరీవృక్షం ప్రసక్తి ఉంది. ఈ చెట్టు పండులోనే గాదు, ఆకులలోను బెరడులోను, చివరకు గింజల్లోకూడ ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి దీనిని వైద్యంలో వినియోగించే పద్ధతి భారత దేశంలో ఈ నాటిది కాదు. పూర్వం నుండే వాడుకలో ఉంది. మందమతులుగా ఉన్న పిల్లలచేత రోజూ కాసిన్ని రేగుపండ్లు తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట. అలాగే, దీని ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటికి పై పూతగా వాడితే త్వరగా తగ్గిపోతాయట. కొన్ని దేశాలలో వీటి లేత ఆకులను కూరగా వండుకొని తింటారు. రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి కొన్ని వంటకాలు కూడా చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment