ramayanamam
-
Lord Ram: రాముడిపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వారికి.. కొందరు దేవుడు ఉన్నాడని నమ్మితే.. మరికొందరూ లేడని వాదిస్తారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. రాముడి విషయంలో బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు. ఆ పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, అందులో మంచి విషయాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తమకు తులసీదాస్, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. దేశంలో రెండే కులాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే రామాయణంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నారని పురాణ కాలం నుంచి వింటున్నాం. అయితే, మేము కొరికిన పండ్లను మీరు(పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి) తినరు, ముట్టుకోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. #WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, "Ram wasn't a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created 'kavya' & 'mahakavya' with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram.." pic.twitter.com/ayrQvSfdH1 — ANI (@ANI) April 15, 2022 -
Hanuman Jayanti 2021: జై భజరంగ భళి అంటే ఏంటో తెలుసా?
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం అంటూ శ్రీ ఆంజనేయుడిని స్మరించిన వెంటనే విచక్షణా జ్ఞానం లభిస్తోందని భక్తులు నమ్ముతుంటారు. హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తివంతమైన హనుమంతుడి నామస్మరణ చేస్తే భయం, మానసిక ఆందోళన తొలగి బలం, కీర్తి వరిస్తాయి. భయం తొలిగిపోతుంది. మానసిక ఆందోళన నుంచి భయటపడవచ్చు. మరి అంతటి మహిమాన్వితుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. హనుమంతుడు శివుడి అవతారం ఒకప్పుడు స్వర్గంలో నివసించిన "అంజన అనే అప్సర ఒకరిని ప్రేమిస్తుంది. దీంతో అంజనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ రుషి అంజన మొహం వానరం అవతారంలా మారిపోవాలని శపిస్తారు. అయితే రుషి శాపంతో భయాందోళనకు గురైన అంజన ఆ శాపం నుంచి తనని రక్షించాలని బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది. దీంతో బ్రహ్మదేవుడు ఆమెకు భూమిపై మానవునిగా జన్మించే వరాన్ని ప్రసాదిస్తారు. ఇక బ్రహ్మదేవుడి వరంతో అంజనా భూలోకంలో జన్మిస్తుంది. రాజవంశానికి చెందిన కేసరితో ప్రేమలో పడుతుంది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. శివుని భక్తురాలైన అంజన వివాహం తరువాత శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన మైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుతో ప్రత్యక్షమైన శివుడిని.. తనకు అత్యంత ధైర్యశాలి అయిన కుమారుడు జన్మించేలా వరం ఇవ్వాలని కోరుకుంటుంది. అందుకు శివుడు అంగీకరిస్తాడు. కొద్ది రోజుల తరువాత దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం ముగిసిన తరువాత యాగం కోసం తయారు చేసిన ప్రసాదాన్ని భార్యలకు పంచిపెట్టాడు. రాణి కౌశల్యకు ఓ డేగ ద్వారా ప్రసాదాన్ని పంచుడుతాడు. ప్రసాదం తీసుకొని డేగ కౌశల్య దగ్గరకు వెళుతుండగా శివుడి ఆజ్ఞతో డేగ చేతిలో ఉన్న ప్రసాదం అంజన చేతిలో పడుతుంది. అయితే ప్రసాదాన్ని శివుడే పంపించాడని, ఆ ప్రసాదం తిన్న అంజన శివుడి అవతారమైన హనుమంతునికి జన్మనిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడిని జై భజరంగభళి అని ఎందుకు పిలుస్తారు ఓ రోజు సీతమ్మవారు తన నుదుటున కుంకుమ పెట్టుకునే సమయంలో సీతమ్మవారిని హనుమంతుడు అమ్మా.. నుదుటున కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు అని అడిగినప్పుడు.. అందుకు సీతమ్మ వారు హనుమ.. నా భర్త శ్రీరాముడు సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటూ కుంకుమతో బొట్టుపెట్టుకుంటున్నానని చెప్పిందట. దీంతో సీతాదేవి సమాధానానికి ముగ్ధుడైన హనుమంతుడు.. అప్పుడు నేను కుంకుమను శరీరం మొత్తం పూసుకుంటే శ్రీరాముడి జీవితకాలం ఎన్నోరేట్లు పెరుగుతుంది కదమ్మా అని అన్నాడు. ఆ తరువాత కుంకుమను హనుమంతుడు శరీరం అంతా పూసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కుంకుమను భజరంగ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి హనుమంతుడిని ‘భజరంగ్ భళి’ అని పిలుస్తారు. ఆయనను పూజించినప్పుడల్లా కుంకుమతో అలంకరిస్తారు. సంస్కృతంలో "హనుమంతుడు" అంటే "వికృత దవడ" సంస్కృత భాషలో, "హను" అంటే "దవడ" మరియు "మన" అంటే "వికృతమైనది అని అర్ధం. హనుమంతుడిని బాల్యంలో మారుతి అని పిలిచే వారు. అయితే హనుమంతుడు బాల్యంలో సూర్యుడిని ఒక పండుగా తిన్నాడు. దీంతో ప్రపంచం అంతా చీకటి మయం అవుతుంది. హనుమ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంద్రుడు.. హనుమంతుడిని మెరుపుతో దండించారని, అలా ఇంద్రుడు హనుమంతుడిని దండించడంతో దవడ విరిగి అపస్మారక స్థితిలో వెళ్లారు. ఈ సంఘటన తరువాత హనుమంతుడు తన దవడను కోల్పోయాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు బ్రహ్మచారే, అయినప్పటికీ ఒక కొడుక్కి తండ్రే హనుమంతుడు బ్రహ్మచారి. అయితే ఆ చిరంజీవికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు "మకరధ్వాజ". లంకా దహనం అనంతరం హనుమంతుడు తన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు తోకను సముద్రంలో ముంచాడు. అదే సమయంలో ఓ చేప హనుమంతుడిని చెమటను మింగడవల్ల.. ఆ చేప గర్భం దాల్చి మకర ధ్వాజకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. చదవండి : హనుమజ్జయంతి ప్రత్యేకత ఏంటో తెలుసా? -
కరోనా: ప్రజల ముందుకు మరో సీరియల్!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో.. ప్రజలంతా ఇంటే పరిమితమైయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల కాలక్షేపం కోసం భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణంను కేంద్రం దూరదర్శన్‌లో ప్రసారం చేస్తోంది. అయితే ప్రజలకు డిమాండ్ మేరకు ప్రజల ఆదరాభిమానాలు పొందిన మరిన్ని సీరియల్స్‌ను బుల్లి తెరపైకి తీసుకురావాలని కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖ సంకల్పించింది. దీనిలో భాగంగానే చిన్నపిల్లలకి ఇష్టమైన శక్తిమాన్ సీరియల్‌ను ప్రజల ముందుకు తీసుకురానుంది. (ప్రజల ముందుకు రామాయణం) ఈ మేరకు శక్తిమాన్ హీరో ముఖేష్‌కన్నా మాట్లాడుతూ ‘కరోనా వచ్చిన ఇటువంటి కష్టకాలంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మీ అందరికీ భారత ఇతిహాస గ్రంథమైన రామాయణం ఒకేసారి చూసే అవకాశం మరోసారి లభించింది. దీంతోపాటు మీ అందరికి ఎంతో నచ్చిన శక్తిమాన్ కూడా దూరదర్శన్‌లో ప్రసారం కాబోతుంది. అయితే ఎప్పటి నుంచి ఏ సమయంలో ప్రసారం కాబోతుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తూ ఉండండి’ అని తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. కాగా శక్తిమాన్ తొలిసారి 1997లో ప్రారంభమై 2005 వరకు ప్రసారమైన విషయం తెలిసిందే. -
‘మనది భారతదేశం.. అతడిని అభినందించాలి’
లక్నో : కొందరు మంత్రులు చెలాయిస్తున్న అధికార దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. ప్రభుత్వాధికారి చేత షూలేస్ కట్టించుకోవడమే కాక రామయణాన్ని తెర మీదకు తెచ్చి మరి దాన్ని సమర్థించుకున్నాడో మినిస్టర్. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మినిస్టర్ లక్ష్మీ నారాయణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాజహాన్పూర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు మినిస్టర్ షూ లేస్ ఊడిపోయింది. దాంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వెంటనే వెళ్లి అమాత్యుల వారి షూలేస్ కట్టి తన ప్రభు భక్తిని చాటుకున్నాడు. వారించాల్సిన మినిస్టర్ కాస్తా దర్జాగా నిల్చూని ప్రభుత్వ ఉద్యోగి చేత సేవ చేపించుకుని తరించారు. #WATCH: UP Minister Laxmi Narayan gets his shoelace tied by a government employee at a yoga event in Shahjahanpur, yesterday. pic.twitter.com/QbVxiQM7bI — ANI UP (@ANINewsUP) June 22, 2019 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో లక్ష్మీ నారాయణ్‌ని, ఉద్యోగిని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సంఘటన గురించి లక్ష్మీ నారాయణ్‌ని ప్రశ్నించగా.. ఆయన సిగ్గుపడకపోగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘షూ లేస్ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను. భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ రాముని బదులు ఆయన పాదరక్షలు 14 ఏళ్ల పాటు పాలన చేశాయి. మన పురాణాల్లో పాద రక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి చెప్పులు ధరించే విషయంలో నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను’ అంటూ రామయణాన్ని తెరమీదకు తెచ్చి పొంతన లేని వాదనను వినిపించాడు. అయితే ఇలా తలా తోకా లేకుండా మాట్లాడటం సదరు మినిస్టర్‌కు కొత్త కాదు. గతంలో హనుమంతుడు జాట్ల తెగకు చెందిన వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మి నారాయణన్. -
‘కాంగ్రెస్‌కు ఓటేసే వాళ్లు రావణుడి భక్తులు’
జైపూర్ : రామ భక్తులు బీజేపీకి ఓటేస్తారు.. రావణుడి అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కి ఓటేస్తారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. ఈ సందర్భంగా రామాయణాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు. ‘హనుమాన్ గిరిజనుడు. అడవుల్లోనే తిరిగారు. రాముని కోరిక మేరకు హనుమంతుడు నలుదిక్కులను ఏకం చేసి ఈ అఖండ భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేశారు. ఇప్పుడు మేము కూడా ఈ ఆశయాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నామం’టూ యోగి వ్యాఖ్యానించారు. అంతేకాక రాముడిని కొలిచేవారంతా బీజేపీకి ఓటేస్తారని.. రావణాసురిని అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేస్తారని యోగి ఆరోపించారు. రాజస్తాన్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓ వైపు యోగి హిందువులను, దళిత ఓటర్లను ఆకర్షించే పనిలో ఉండగా.. మరోవైపు మోదీ అభివృద్ధి తనవల్లే సాధ్యమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. -
బదరీ నారాయణుడు
మహాభారత ఇతిహాసంలో.... భారతీయ నాగరికతలో హిందువుల పూజలలోను పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. భగవంతుడికి నివేదించే అతికొద్ది పండ్లలో రేగుపండు ఒకటి. రేగు పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. పిల్లలకు పోసే భోగిపండ్లు రేగి పండ్లే. సూర్యభగవానుడికి రేగు పండ్లంటే ఇష్టమట. రథసప్తమినాడు చిక్కుడు ఆకులతోపాటు రేగు ఆకులను కూడా తలమీద పెట్టుకుని స్నానం చేస్తారు. వినాయకుని పూజలోనూ రేగు ఆకులను సమర్పిస్తారు. బదరీనాథ్‌లో ఉన్న స్వామివారికి రేగుపండ్లంటే అమిత ఇష్టమట. అందుకే ఆయనకు బదరీనారాయణుడనే పేరు వచ్చింది. అలాగే వ్యాసుడికి బాదరాయణుడనే పేరు బదరీ ద్వీపంలో పుట్టినందువల్లే వచ్చింది. తంత్ర శాస్త్ర గ్రంథాలలో కూడా బదరీవృక్షం ప్రసక్తి ఉంది. ఈ చెట్టు పండులోనే గాదు, ఆకులలోను బెరడులోను, చివరకు గింజల్లోకూడ ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి దీనిని వైద్యంలో వినియోగించే పద్ధతి భారత దేశంలో ఈ నాటిది కాదు. పూర్వం నుండే వాడుకలో ఉంది. మందమతులుగా ఉన్న పిల్లలచేత రోజూ కాసిన్ని రేగుపండ్లు తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట. అలాగే, దీని ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటికి పై పూతగా వాడితే త్వరగా తగ్గిపోతాయట. కొన్ని దేశాలలో వీటి లేత ఆకులను కూరగా వండుకొని తింటారు. రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి కొన్ని వంటకాలు కూడా చేస్తారు. -
‘కత్తిని ఈ మధ్యే చూస్తున్నాను’
సాక్షి, హైదరాబాద్: రామాయణంపై, సీతారాముల పవిత్ర బంధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై బీజేపీ శాసనపక్ష నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రచారం కోసం కొందరు వ్యక్తులు మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘కొందరు స్వయం ప్రకటిత మేధావులు రాముడి మీద, రామాయణం మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తామ’ని హెచ్చరించారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారు మరో మతంపై ఇలా నోరు జారగలరా..! అని ప్రశ్నించారు. ‘కత్తి మహేశ్‌ను ఈ మధ్యే చూస్తున్నాను. నువ్ ఏమన్నా మాట్లాడుకో. కానీ, దేవుళ్ల మీద, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంద’ని అన్నారు. హిందువులను కించ పరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. -
‘టెస్ట్ ట్యూబ్ బేబీకి ఉదాహరణ సీత’
లక్నో : రామయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా మొదలైందంటూ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు అంటుంటారని దీన్ని బట్టి టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా రామాయణ కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. మహాభారత కాలం నాటి నుంచే పాత్రికేయం ఉన్నదని గురువారం శర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసందే. హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరైన శర్మ నూతన ఆవిష్కరణలను పురాతన భారత్‌తో పోల్చుతూ లైవ్ టెలికాస్ట్ మహాభారత కాలంలో ఉందని పేర్కొన్నారు. ‘గూగుల్ ఇప్పుడు మొదలైంది. మన గూగుల్ ఎప్పుడో మొదలైంది. నారద మహర్షి సమాచార చేరవేతకు ఓ ఉదాహరణ.’ అని శర్మ వ్యాఖ్యానించారు. -
చందామామ రావే...కథలెన్నో తేవే...
పిల్లలకు ఊహాశక్తి సహజంగానే ఉంటుంది. ఊహలకు ఊతమిచ్చే కథలను వాళ్లు ఇష్టపడతారు. పాఠశాలలు కొనసాగుతున్నంతసేపూ సిలబస్ రద్దీలో వాళ్ల ఊహలకు ఊపిరాడే పరిస్థితి ఉండదు. పరీక్షలు ముగిసి, ఇలా వేసవి సెలవులొస్తేనే పిల్లలకు కొంత ఆటవిడుపు. సెలవుల్లో లేనిపోని కోచింగ్‌ల పేరుతో పిల్లలను ఇబ్బందిపెట్టే బదులు వారికి కొన్ని కథల పుస్తకాలు ఇవ్వండి. స్వయంగా చదువుకోలేని చిన్నారులకు కథలు చదివి వినిపించండి. చదువుకోగల పిల్లలను ఆ కథలను స్వయంగా చదువుకునేలా ప్రోత్సహించండి. కథలూ కాకరకాయలూ వృథా కాలక్షేపమని కొట్టిపారేయకండి. పసివయసులో తెలుసుకొనే కథలు ఊహలకు రెక్కలిస్తాయి. ఆలోచనలను పదునెక్కిస్తాయి. బతుకుబాటను సుగమం చేస్తాయి. ఈ వేసవి కానుకగా ఫన్డే సూచిస్తోన్న కొన్ని పిల్లల పుస్తకాలివి... బాలల బొమ్మల రామాయణం బాలల బొమ్మల భారతం బాలల బొమ్మల భాగవతం అష్టాదశ పురాణాలు, అనేక ఉపపురాణాలు ఎన్ని ఉన్నా, ఆబాల గోపాలానికీ బాగా తెలిసినవి రామాయణ, మహాభారత, భాగవతాలే. ఇవి చాలా భాషల్లోకి అనువాదమయ్యాయి. వాల్మీకి రచించిన రామాయణం భారతీయ ఆదికావ్యం. చాలామంది తెలుగు రచయితలు రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని సులభశైలిలో పిల్లలకు అర్థమయ్యేలా సంక్షిప్తంగా రాశారు. తొలిసారిగా మాగంటి బాపినీడు 1948లో బాలల బొమ్మల భారతాన్ని ప్రచురించారు. ఆ తర్వాత అదే ఒరవడిలో చాలామంది ప్రచురణకర్తలు చిన్న చిన్న తరగతులు చదువుకునే పిల్లలు కూడా తేలికగా చదువుకునేందుకు వీలుగా బొమ్మలతో తీర్చిదిద్ది వీటిని ప్రచురిస్తూ వస్తున్నారు. బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం పుస్తకాలు తరతరాలుగా తరగని జనాదరణ పొందుతూనే ఉన్నాయి. రామాయణ, భారత, భాగవత గాథలు టీవీ సీరియళ్లుగా, సినిమాలుగా కూడా వచ్చాయి. అనేక సాహితీ, కళా ప్రక్రియల్లోనూ ఇవి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఈ కథలు మన సంప్రదాయానికి, సంస్కృతికి పట్టుగొమ్మలు. ఏ వయసు పిల్లలనైనా వీటిలోని కథలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకాలు దాదాపు ప్రతిచోటా దొరుకుతాయి. వేసవి సెలవుల్లో వీటిని పిల్లల చేతికిస్తే చాలు, వారికి చక్కని కాలక్షేపం. పిల్లల్లో పఠనాభిలాషను రేకెత్తించడానికి ఈ పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయి. పంచతంత్రం చాలాకాలంగా ప్రచారంలో ఉన్న నీతి కథలను క్రీ.పూ. 300లో ‘పంచతంత్రం’ పేరుతో సంకలించారు. ఇందులోని పాత్రలన్నీ జంతువులే. విష్ణుశర్మ అనే గురువు, లోకజ్ఞానం లేని, బుద్ధి వికసించని రాజకుమారులను పాలనాదక్షులుగా తీర్చిదిద్దటానికి కథల రూపంలో చేసిన నీతిబోధ ఇది. ఈ సంస్కృత గ్రంథం సుమారు వెయ్యేళ్లనాడే అనేక ప్రపంచ భాషల్లోకి అనువదితమైంది. ఐదు భాగాలుగా, అనేక అధ్యాయాలతో ఉంటుందిది. 1. మిత్ర భేదం: మిత్రుల మధ్య పొరపొచ్చాలు రావటం, మిత్రులను పోగొట్టుకోవటం మనకు నష్టం చేకూరుస్తుందన్నది ఇందులోని కథల సారాంశం. 2. మిత్రలాభం లేక మిత్ర సంప్రాప్తి : స్నేహితులే నిజమైన బలం. సైనిక బలగాలు, ఆయుధాల కన్నా స్నేహితుల తోడు మనకు పెట్టని కోట. 3. కాకోలూకీయం : కాకులు, గుడ్లగూబలు ఇందులోని పాత్రలు. ‘యుద్ధము – శాంతి’ అన్న విషయాలు ఇందులోని కథా వస్తువు. 4. లబ్ధప్రనాశం: లాభ నష్టాలు, సంపాదించుకోవటం, పోగొట్టుకోవటం – గురించిన నీతిబోధ. 5. అపరీక్షిత కారకం : ‘నిదానమే ప్రధానం. ఆలోచించి అడుగెయ్యి. తొందర పాటు మనకు నష్టం చేకూరుస్తుంది.’ అన్న కథాంశంతో ఉంటాయి ఈ కథలు. తెలుగువాళ్లకు పంచతంత్రం కథలు సుపరిచితమే. పందొమ్మిదవ శతాబ్దంలో చిన్నయసూరి (1807–1861) దీన్ని ‘నీతిచంద్రిక’గా అనువదించాడు. కానీ ఆ శైలి, గ్రాం«థికం ఇప్పటి పిల్లలకు కొరుకుడు పడకపోవచ్చు. సులభంగా భావించగలిగిన పంచతంత్ర కథల పుస్తకాలు కోకొల్లలుగా లభ్యమవుతున్నాయి. అక్బర్ – బీర్బల్ కథలు మొగల్ చక్రవర్తి అక్బర్ కొలువులో ఉన్న ఒక హిందూ సలహాదారు బీర్బల్. ఇతడి అసలు పేరు మహేశ్ దాస్ (1528–1586). ఈయనకు మరో పేరు బీర్బల్. హాస్య ప్రియుడైన మహేశ్ దాస్ మంచి కవి, గాయకుడు కూడా. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలుగా పిలువబడే ఉన్నతోద్యోగులలో ఒకడు. చక్రవర్తి ఆదేశాన ఒక యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు. ఇది చరిత్ర. అయితే మనం చెప్పుకుంటున్న అక్బర్ – బీర్బల్ కథలు తెనాలి రామకృష్ణుడు, కృష్ణదేవరాయల కథల వంటివి. అమాయకుడైన అక్బర్‌ను నొప్పించకుండా బీర్బల్ ఎలా ఆయన తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపాడన్నదే హాస్యస్ఫోరకంగా ఉన్న ఈ కథల్లోని ప్రధానాంశం. మనం ఇప్పటికే చెప్పుకున్నట్టుగా అనేక మంది కథకులు తమకు తోచిన కథల్ని బీర్బల్‌కు ఆపాదించి ప్రచారంలో పెట్టారు. అయితేనేమి! నవ్వుకోవటానికి అదేమీ అడ్డంకి కాదు కదా! పేదరాశి పెద్దమ్మ కథలు జానపద కథలు ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు అని అడగకూడదు. భాషంత ప్రాచీనమైనవివి. పేదరాశి పెద్దమ్మ కథలు కూడా ఈ కోవకు చెందినవే. పదకొండవ శతాబ్దానికి చెందిన నన్నె చోడుని కుమార సంభవంలో జానపద సాహిత్య ప్రస్తావన ఉంది. తరతరాలుగా జనాన్ని అలరిస్తున్న ఈ కథలను పిల్లలు తప్పక ఆనందిస్తారు. ముల్లా నసీరుద్దీన్ కథలు టర్కీకి చెందిన సూఫీ తత్వవేత్త ముల్లా నసీరుద్దీన్ (1208–1284)కు మాటకారిగా, ఎంతటివాళ్లనైనా తన వాక్చాతుర్యంతో బురిడీ కొట్టించగల పుడింగిగా పేరుంది. సహజంగానే ఆయనకు ఆపాదించిన కథల్లో అన్నీ నిజంగా జరిగినవై ఉండకపోవచ్చు. కానీ ఆ గోల మనకెందుకు? కడుపుబ్బ నవ్వుకోవాలంటే ముల్లా నసీరుద్దీన్‌ను నమ్ముకోవచ్చు. ఈసప్ కథలు ఈసప్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. లిడియా, సామోస్, మెసెంబ్రియా లేదా కోటియంలో ఎక్కడో ఒకచోట క్రీ.పూ. 620 ప్రాంతంలో బానిసగా జన్మించాడు. ఆ తర్వాత, జాడ్మస్ సేవలో గడుపుతున్నప్పుడు, యజమాని అతడికి స్వేచ్ఛను ప్రసాదించాడు. తర్వాత తత్వవేత్తగా పేరుగడించి, మాత్రలు చేసే క్రమంలో పండిత పోషకుడైన లిడియా రాజు చెంత చేరి, సార్డిస్‌లో నివాసమేర్పరచుకొని అనేక రాచకార్యాలను నిర్వహించాడు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలను దర్శించి, పరస్పరం కలహించుకుంటున్న స్థానిక నాయకులకు, సామంత రాజులకు తన నీతి కథలు చెప్పి రాజీ కుదిర్చాడు. ఇతని ఫేబుల్స్లో కూడా పాత్రలన్నీ జంతువులే. అంటే, ఆనాటి కథకులు, మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి, అన్యాపదేశంగా చెప్పిన లోకనీతి, లోకరీతి ఇది. పిల్లలు, పెద్దలు కూడా తప్పకుండా చదవాల్సిన కథలివి. తెనాలి రామలింగని కథలు రామలింగడు, రామకృష్ణుడు ఒకరే. ‘పాండురంగ మహాత్మ్యం’ రాసిన రామకృష్ణుడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడంటారు. ఈయనకు వికటకవి అనే బిరుదు ఉంది. రాయల ఆస్థానంలో ఉన్నప్పుడు ఆయన తన సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో, తెలివితేటలతో, ఎలా అనేక సమస్యల నుంచి గట్టెక్కాడో, ఎంతమంది అహంభావుల గర్వమణచాడో కథలు కథలుగా చెప్పుకుంటారు. అన్నీ హాస్యరస ప్రధానమైనవే. ఇందులో ఎన్ని నిజమో, ఎన్ని నిజమైన కవికి ఆపాదించబడినవో తెలియదు గాని పిల్లలు చదువుకోవటానికి, నవ్వుకోవటానికి బాగుంటాయి. భేతాళ – విక్రమార్క కథలు సోమదేవభట్టు అనే కవి, 2500 సంవత్సరాల కిందట భేతాళ పంచవింశతి (25) కథలు రాశాడు. రాజు విక్రమాదిత్యుడికీ, శవంలో ప్రవేశించిన భేతాళుడికీ మధ్య జరిగిన మే«ధాపాటవ పరీక్ష రూపంలో ఉంటాయివి – అంటే మెదడుకు మేత. ఒక రుషి ఆదేశం ప్రకారం, విక్రముడు, కీకారణ్యంలో, చెట్టుకు వేలాడుతున్న శవాన్ని తీసుకురావడానికి వెళతాడు. (ఆ శవంలో ఉంటాడు బేతాళుడు). శవాన్ని తీసుకొని తిరిగి వచ్చే సమయంలో, బేతాళుడు, విక్రమునికి అలసట తెలియకుండా ఉండటానికి ఓ కథ చెబుతాడు. అయితే, మధ్యలో విక్రముడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడినా, బేతాళుడు తిరిగి చెట్టు మీదకు వెళ్లిపోతాడు. కథ చివరన బేతాళుడు కథ గురించి అడిగిన ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. సరైన జవాబు తెలిసినా చెప్పకపోతే విక్రముని తల వెయ్యి ముక్కలవుతుందని హెచ్చరిస్తాడు బేతాళుడు. అదీ పాఠకులతో రచయిత ఆడుకునే ఆట. కథ విన్న విక్రముడు, సరైన జవాబు తెలుసు గనక చెప్పక తప్పదు. జవాబు ముగియగానే బేతాళుడు చెట్టు మీదకు వెళ్లిపోతాడు. విక్రముడు తిరిగి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకొని నడక ప్రారంభిస్తాడు. సోమధేవభట్టు రాసిన ఇరవై అయిదు కథలు ఎటుపోయాయో కానీ, వందలాదిగా ఈ పజిల్ కథలు పాఠకులను అలరించాయి. కొంతకాలం కిందట ఇవి దూరదర్శన్‌లో సీరియల్‌గా కూడా వచ్చాయి. ఇక పుస్తకాలంటారా? ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయి. అరేబియన్ నైట్స్ కథలు అరబిక్ భాషలో దీని పేరు ‘‘అల్ఫ్ లేలా వాలేలా’’ అంటే వెయ్యినొక్క రాత్రులు. భారతదేశంతో సహా అనేక దేశాల నుంచి కొన్ని శతాబ్దాలపాటు సేకరించిన కథలను గ్రంథస్థం చేశారు. షెహర్యార్ అనబడే రాజు, రోజూ ఒక యువతిని వివాహమాడి, రాత్రంతా ఆమెతో గడిపి, తెల్లవారగానే శిరచ్ఛేదనం చేస్తుండటంతో ఒక మంత్రిగారి కూతురైన షెహ్రాజేడ్, తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం, తెల్లవారే ముందు రాజుకో కథ చెప్పటం ప్రారంభిస్తుంది. రాచకార్యాలు నిర్వహించవలసిన ప్రభువు, కథనక్కడే వదిలి తిరిగి, రాత్రికి కథ చెప్పమంటాడు. అలా, వెయ్యినొక్కరాత్రులపాటు కథలు చెబుతూనే ఉంటుంది షెహ్రాజేడ్. ఆమె కథాకథన చాతుర్యానికి సంతసించిన రాజు ఆమెను తన రాణిని చేసుకుంటాడు. (ఇలా కథలో కథ చెప్పటాన్ని ఫ్రేమ్ స్టోరీ అంటారు.) ‘అల్లావుద్దీన్ అద్భతదీపం’, ‘ఆలీబాబా నలభై దొంగలు’, ‘సింద్బాద్ సాహసయాత్రలు’, ‘ఎగిరే తివాచీ’ వంటి కథలు పిల్లలకూ, పెద్దలకు సుపరిచితం. ‘అరేబియన్ నైట్స్’ చాలా పెద్ద పుస్తకం. అనేక సంపుటాల్లో ఉన్నాయి కథలు. కాని కొన్ని ముఖ్యమైన కథలతో ఒక సంపుటాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో ప్రచురించింది. ఇవి కాకుండా, విడివిడిగా కథలతో బొమ్మల పుస్తకాలు చాలా లభ్యమవుతున్నాయి. అంటే, అరేబియన్ నైట్స్ కథలు చదువుకున్న వాళ్లకు చదువుకున్నంత. అరేబియన్ నైట్స్ తరహాలోనిదే అయిన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ కూడా చదవండి. బుడుగు అక్షరాలలో ముళ్లపూడి వెంకటరమణ, రేఖల్లో బాపు సృష్టించిన బుడుగు ఒక తరం ఆంధ్రపత్రిక పాఠకులను నవ్వుల కడలిలో ఓలలాడించాడు. ఆ తర్వాత బుడుగు ఇతర పత్రికల్లో కూడా తన అల్లరి కొనసాగించాడు. నవ్వుకు మారుపేరు బుడుగు. ఇప్పుడు బుడుగు పుస్తకాలు అనేకం మార్కెట్లో ఉన్నాయి. వెళ్లండి. కొనండి. నవ్వుకోండి. బాలసాహిత్యంలో నాటి పత్రికల కృషి పిల్లలను అలరించే రచనలు అందుబాటులోకి రావడం పత్రికలతోనే ప్రారంభమైంది. తెలుగులో తొలిసారిగా ‘జనవినోదిని’ పత్రిక (1875–85) బాలల కోసం ప్రత్యేక రచనలను ప్రచురించింది. మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ వారు ఈ పత్రికను ప్రచురించేవారు. ఇందులో ‘చిట్ల పొట్లకాయ’, ‘రుంగు రుంగు బిళ్ల’ వంటి చిన్నారులు సరదాగా పాడుకునేందుకు అనువైన గేయాలను ప్రచురించారు. ఆ తర్వాత గుంటూరు నుంచి క్రైస్తవ మిషనరీలు ప్రచురించిన ‘వివేకవతి’ (1908– 1910) మాసపత్రికలో పిల్లల కథలను సరళమైన భాషలో ప్రచురించారు. కాకినాడ నుంచి వింజమూరి వెంకటరత్నమ్మ నడిపిన ‘అనసూయ’ (1914–19) మహిళల పత్రికలో ఆమె సోదరుడు, సుప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన బాలగేయాలను ప్రచురించారు. ‘దేశోద్ధారక’ కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ప్రారంభించిన ఆంధ్ర పత్రికలోనూ పిల్లల రచనలు విరివిగా ప్రచురితమయ్యాయి. ఆంధపత్రిక ఆధ్వర్యంలోనిదే అయిన సాహితీపత్రిక ‘భారతి’లో గిడుగు వెంకట సీతాపతి పిల్లల కోసం ప్రత్యేకంగా ‘బాలానందం’ అనే శీర్షికను నిర్వహించేవారు. బాలల పత్రికలు నాటి పత్రికలు పిల్లలకు సంబంధించిన రచనలను విరివిగా ప్రచురిస్తూ వచ్చినా, అచ్చంగా పిల్లల కోసమే ప్రత్యేకమైన పత్రికలేవీ లేకపోవడం లోటుగా ఉండేది. ఆ లోటును తీర్చడానికే మేడిచర్ల ఆంజనేయమూర్తి 1940లో ‘బాలకేసరి’ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ‘రేడియో అన్నయ్య’గా ప్రసిద్ధి పొందిన న్యాయపతి రాఘవరావు 1945లో ‘బాల’ మాసపత్రికను ప్రారంభించి, బాల సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత చక్రపాణి–నాగిరెడ్డి 1947లో ‘చందమామ’ను ప్రారంభించారు. చందమామ బాలసాహిత్యానికి చేసిన సేవ వెలకట్టలేనిది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని కథలూ సీరియల్స్‌గా వచ్చినవే. అప్రతిహతంగా సాగిన చందమామ ప్రస్థానం 2013లో ముగియటం ఒక విషాదం. ఇప్పటికీ పాత పుస్తకాల షాపులో, పేవ్మెంట్లమీద పాత చందమామలు కొనేవాళ్లకు కొదవలేదు. ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోనూ ప్రచురింపబడిన ఈ పిల్లల కథల కాణాచిని ఇప్పుడు ఆన్లైన్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిల్లలకు, పాత జ్ఞాపకాలను మరచి పోలేని పెద్దలకు ఇది వరం. ‘చందమామ’ తర్వాత ‘బాలమిత్ర’, ‘బొమ్మరిల్లు’, ‘బుజ్జాయి’ వంటి అనేక పత్రికలు పిల్లలను అలరించాయి. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ 1979లో అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా ‘బాలచంద్రిక’ మాసపత్రికను ప్రారంభించింది. తెలుగులో దాదాపు నలభైకి పైగా బాలల పత్రికలు వచ్చాయి. బాలల పద్యాలూ, గేయాలూ తెలుగులోని ప్రాచీన పద్యసాహిత్యం చాలానే ఉన్నా, బాలల కోసం ప్రత్యేకమైన పద్యాలు కొంత తక్కువే. వేమన శతకం, సుమతీ శతకం వంటివి పిల్లలకు నేర్పిస్తారు. అయితే, నీతిని, లోకరీతిని తెలిపే ఈ శతకాలను అచ్చంగా బాలసాహిత్యంగా పరిగణించలేం. ఆధునిక కవులు కొందరు ఈ లోటు తీర్చడానికి ప్రయత్నించారు. చిల్లా వెంకట కృష్ణయ్య ‘కుమార శతకం’ (1915), సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి ‘కుమారీ శతకం’ (1920), ముళ్లపూడి వెంకటరమణ ‘బాలశతకం’ (1946) వంటివి అచ్చమైన బాల శతకాలు. కరుణశ్రీ ‘తెలుగుబాల’ (1953), నార్ల చిరంజీవి ‘తెలుగుపూలు’ (1954), బృందావనం రంగాచార్య ‘తెలుగుబోధ’ (1954) వంటివి బాలల పద్య సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. బాల సాహిత్యానికి సుప్రసిద్ధుల సేవ తెలుగు రచయితల్లో చాలామంది సుప్రసిద్ధులు బాల సాహిత్యానికి ఎనలేని సేవలందించారు. న్యాయపతి రాఘవరావు–కామేశ్వరి, ఏటుకూరి వెంకట నర్సయ్య, చింతా దీక్షితులు, నార్ల చిరంజీవి, ఏడిద కామేశ్వరరావు, మండా సూర్యనారాయణ, నండూరి రామమోహనరావు, వేజెండ్ల సాంబశివరావు, వెలగా వెంకటప్పయ్య, మహీధర నళినీమోహన్, రావూరి భరద్వాజ, ఇల్లిందల సరస్వతీదేవి, తురగా జానకీరాణి, మిరియాల రామకృష్ణ వంటి వారు బాలల కోసం కూడా ప్రత్యేకమైన రచనలు విరివిగా చేశారు. మహాకవి శ్రీశ్రీ సైతం ‘కప్ప వైద్యుడు’ అనే గేయ కథను పిల్లల కోసం ప్రత్యేకంగా రాశారు. ప్రముఖ కవి ఆలూరి బైరాగి ‘వేటగాని సాహసం’, ‘స్నేహధర్మం’, ‘కలవారి అబ్బాయి’ వంటి గేయకథలను రాశారు. బాలాంత్రపు రజనీకాంతరావు ‘జేజిమామయ్య పాటలు’ రాశారు. బోయి భీమన్న, మధురాంతకం రాజారాం, ఎల్లోరా, బి.వి.నరసింహారావు వంటి ఎందరో ప్రసిద్ధ సాహితీవేత్తలు బాలల కోసం గేయకథలు రాశారు. పిల్లల కథలు, నవలలు బాలల పత్రికల్లో వచ్చినవే కాకుండా పిల్లల కోసం కొందరు రచయితలు ఆసక్తికరమైన కథలను సంపుటాలుగా వెలుగులోకి తెచ్చారు. అలాగే, కొందరు పిల్లల కోసం ప్రత్యేకంగా నవలలు రాశారు. కందుకూరి వీరేశలింగం పంతులు పిల్లల కోసం ‘ఈసోప్ కథలు’ వెలుగులోకి తెచ్చారు. ఈ కథలను ఆయన ‘నీతికథా మంజరి’ పేరిట రెండు సంపుటాలుగా ప్రచురించారు. వావిలికొలను సుబ్బారావు ‘ఆర్యకథా నిధి’ పేరిట నీతికథలను రాశారు. వేంకట పార్వతీశ్వర కవులు, కనుపర్తి వరలక్ష్మమ్మ, గిడుగు వెంకట సీతాపతి, భమిడిపాటి కామేశ్వరరావు, నార్ల చిరంజీవి, చింతా దీక్షితులు తదితరులు పిల్లల కోసం నీతి కథలతో పాటు అద్భుతాలతో కూడిన ఆసక్తికరమైన అనేక కథలు రాశారు. ఇల్లిందల సరస్వతీదేవి ‘మూడు పిల్లికూనలు’, తురగా జానకీరాణి ‘బొమ్మలపెళ్లి’, చాపరాల సరళ తిలక్ ‘చిన్నారి గూఢచారి’ వంటి కథల పుస్తకాలు పిల్లలను ఆకట్టకునేలా రాశారు. ఇవికాకుండా, చింతా దీక్షితులు ‘గోపీ మోహిని’, శ్రీవాత్సవ ‘జలతారు జాబిలి’, దిగవల్లి వెంకట శేషగిరిరావు ‘విచిత్రలోకం’, కె.సభా ‘మత్స్యకన్యలు’, అంతటి నరసింహం ‘కోటవీరన్న సాహసం’, నండూరి రామమోహనరావు ‘మయూరకన్య’ వంటి నవలలు రాశారు. – ముక్తవరం పార్థసారథి -
అది రామసేతువే!
‘రామసేతు’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీరాముడు వానర సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఒకవైపు.. వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమన్న వాదన మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికాకు చెందిన సైన్స్ చానెల్ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ.. ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది. వివాదం పూర్వాపరాలతో కథనం.. రామాయణంలో ఉన్నట్లుగా తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలో మీటర్ల దూరంపాటు సముద్రంలో నిజంగా శ్రీరాముడు వంతెన నిర్మించాడా? రామసేతువు, ఆడమ్ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలు తాజాగా మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు కారణం అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన ‘సైన్స్ చానల్’ రూపొందించిన ఓ కార్యక్రమం. రామసేతువు నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని ఆ కార్యక్రమం చెబుతోంది. నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి తాము ఈ నిర్ధారణకు వచ్చామంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఈ కార్యక్రమంలో చెబుతున్నారు. రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్ చానల్ పేర్కొంది. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్త చెల్సియా రోస్ చెప్పారు. ఐసీహెచ్ఆర్ ద్వారా పరిశోధన రామసేతువు నిర్మాణానికి కారణమైన ద్వీపాలు చారిత్రకంగా ఉన్నాయా లేక మానవనిర్మితాలా అన్న అంశాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టు భవితవ్యం గురించి ప్రభుత్వం చేసే ఆలోచనలపై తమ పరిశోధన ప్రభావం చూసే అవకాశం ఉందని ఈ ఏడాది మార్చి నెలలో ఐసీహెచ్ఆర్ చైర్మన్ వై. సుదర్శన్‌రావు అభిప్రాయపడ్డారు. రామసేతువు సహజసిద్ధమైనదా లేదా మానవనిర్మితమా అన్నది నిర్ధారించే అంశాలపై తాము దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000– క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణిస్తున్నట్టు, అందువల్లే ఈ కాలాన్ని మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు సైన్స్ చానల్ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు మొదలుపెట్టింది. ఇందుకు కారణం గతంలో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాలే. ప్రస్తుతం నౌకలు దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి రావాలంటే శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది. అందుకు కారణం రామసేతువు వంతెన ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతంలో సముద్రం ఎక్కువ లోతు లేకపోవడమే. ఆ ప్రాంతంలో మట్టిని తవ్వి, సముద్రాన్ని మరింత లోతుగా చేస్తే నౌకలు అక్కడ నుంచే రాకపోకలు సాగించవచ్చనీ, తద్వారా 350 నాటికల్ మైళ్ల దూరం, దాదాపు 30 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చంటూ అప్పట్లో కాంగ్రెస్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మిత్రపక్షం డీఎంకే వాదనతో కాంగ్రెస్ అంగీకరిస్తూ ‘అక్కడ వంతెన అనేదే లేదు. అది మానవనిర్మితం కాదు. ఒకవేళగతంలో ఎవరైనా దానిని నిర్మించి ఉంటే వారే దానిని నాశనం కూడా చేసి ఉండొచ్చు. రామసేతువు ఈ మధ్యే పూజ్యనీయ ప్రాంతంగా మారింది’ అని సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే ప్రజల విశ్వాసాలను గౌరవించాలని కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ నాడు సుప్రీంకోర్టులో అన్నారు. మరోవైపు సీతను రక్షించేందుకు ‘రామసేతువు’ మార్గాన్ని శ్రీరాముడు సృష్టించాడన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసమనీ, అందువల్ల ఆ మార్గంలో ఉన్న ద్వీపాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ గట్టిగా వాదించింది. తాజాగా సైన్స్ చానల్ కథనం ఆధారంగా పలువురు బీజేపీ మంత్రులు కాంగ్రెస్‌పై విమర్శలు ప్రారంభించారు. ‘రామసేతువు అంశంపై బీజేపీ వైఖరి సరైనదేనని సైన్స్ ఛానల్ పరిశోధన నిరూపించింది. రామాయణంలో పేర్కొన్న మేరకు సీతను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు వంతెనను నిర్మించాడనే ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ యూపీఏ పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వారిప్పుడు మాట్లాడాలి. మన సాంస్కృతిక వారసత్వంలో రామసేతువు ఒక భాగం’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ అన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ Are the ancient Hindu myths of a land bridge connecting India and Sri Lanka true? Scientific analysis suggests they are. #WhatonEarth pic.twitter.com/EKcoGzlEET — Science Channel (@ScienceChannel) December 11, 2017 -
పఠించడం కాదు... పారాయణం చేయాలి!
రామాయణం జీవనధర్మ పారాయణం. అందులోని విషయాలు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. రాముని వంటి (పితృవాక్య) పరిపాలకుడు, సీతవంటి మహాసాధ్వి, వశిష్ఠుని వంటి గురువు, సుమంత్రుని వంటి మంత్రి, లక్ష్మణ భరత శతృఘ్నుల వంటి సోదరులు, గుహుని వంటి ఉదారుడు, హనుమంతుని వంటి బంటు, సుగ్రీవుని వంటి స్నేహితుడు, విభీషణుని వంటి శరణార్థి, రావణ బ్రహ్మ వంటి ప్రతినాయకుడు మరే ఇతర కావ్యంలోనూ కాదు... కాదు ఈ విశ్వవిశాల ప్రపంచంలోనే కానరారు. రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటిరాజుకోసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరు దాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామ మయం’’ అని ప్రస్తుతించారు. లక్ష్మణుడు కైక మీద కోపంతో ఆమెను నిందిస్తుంటే ‘వివేకం కలవారెవరయినా తమకు ఎవరిమీద అభిమానం ఉంటుందో వారిని ప్రశంసించాలే కాని ఇతరులను నిందించడం ధర్మం కాదు’ అని శ్రీరాముడు లక్ష్మణునికి హితవు చెబుతాడు. అంతేకాక ఒకరి గొప్పతనాన్ని ఎక్కువ చేసి చెప్పడానికి, మరొకరిలో ఉన్న అవలక్షణాలనూ, క్రూరత్వాన్ని బయటపెట్టడం కూడా సక్రమమార్గం కాదని లక్ష్మణునికి రామచంద్రుడు వివరించాడు. ఈ బోధ దేశకాలాతీతంగా మానవత్వం ఉన్న వారందరూ మననం చేసుకుని ఆచరించాలి. ఇలా మన నిత్యజీవితంలో ఆదర్శంగా నడవడానికీ లోక కల్యాణానికి వినియోగపడే రీతిలో బ్రతకడానికి అవశ్యమయిన అనేకానేక ధర్మసూక్ష్మాలు, నీతివాక్యాలూ రామాయణ సాగరంలో దొరికే ముత్యాలు. -
సుందరకాండ... రామాయణానికి హృదయకాండ
బ్రహ్మాండపురాణం రామాయణాన్ని ఒక మహామంత్రంగా గుర్తించింది. రామాయణాంతర్భాగమైన సుందరకాండలో ఇహపర తారకాలైన శాస్త్ర రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో కీ.శే. గుంటూరు శేషేంద్రశర్మ చెప్పిన ఒకటి రెండు అంశాలను పరిశీలిద్దాం. వాల్మీకి రామాయణానికి హృదయం సుందరకాండం. రామాయణమంతా పారాయణం చేసేవారు కొందరే ఉండవచ్చు కానీ, సుందరకాండను పారాయణ చేసేవారు అనేకులున్నారు. ఎందుకంటే రామాయణానికంతటికీ ఇది బీజకాండం. సుందరకాండంతో సమానమైన మంత్రం లేదు. దాన్ని పారాయణ చేస్తే తప్పక సిద్ధి కలుగుతుంది. సుందరకాండలో సీతకు వాడిన ఉపమానాలన్నీ పరాశక్తిపరంగా అన్వయిస్తాయి. కొన్ని భావాలు కుండలినీశక్తి పరంగా అన్వయిస్తాయి. వేదాంతశాస్త్ర ప్రతిపాదితమైన శ్రవణ మననాది అష్టాంగయోగం, యోగశాస్త్ర ప్రతిపాదితమైన , తంత్రశాస్త్ర ప్రతిపాదితాలైన మంత్రోపాసన, కుండలినీ విద్య రామాయణంలో ధ్వనించాయి. సీతారాములకు అభేద ప్రతిపత్తి చేత రాముని పరాశక్తిగా భావించి పారాయణం చేసే పద్ధతి సుందరకాండకుంది. రాముడు సుందరుడు. సుందరమైన సీతను సతిగా కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ. సుందర హనుమంతుడంటే దేవీ భక్తుడైన హనుమ అని అర్థం. కాబట్టి సుందరకాండలో పరాశక్తి తత్త్వమే ప్రతిపాదింపబడింది. హనుమ నిరంతర దేవీ ధ్యాన, జప, యోగాల కలబోతే సుందరకాండగా దర్శనమిస్తుంది. త్రిజట స్వప్నంలో గాయత్రీమంత్రాన్ని దర్శించడం అద్భుతం. త్రిజటకు కలలో రాముడు నాలుగుసార్లు నాలుగు విధాలుగా కనిపించాడు. మొదటిసారి ఏనుగు దంతాలతో చేసిన వేయిహంసలు పూన్చి, ఆకాశంలో అలా సాగిపోతూన్న శిబిక (పల్లకి) ను ఎక్కి రాముడు కనిపించాడు. రెండోసారి నాలుగు దంతాలున్న మహాగజాన్ని అంటే ఐరావతాన్ని ఎక్కి కనిపిస్తే, మూడోసారి తెల్లటి ఎనిమిది వృషభాలను పూన్చిన రథం ఎక్కి రాముడు సీతతో కూడి వచ్చాడు. నాలుగోసారి తెల్లటి దండలు, వస్త్రాలు ధరించి, లక్ష్మణునితో పుష్పక విమానం ఎక్కి వచ్చాడు. మొదటిదానిలో రామునికి, గాయత్రీమంత్రాధిష్ఠాన దైవతమైన పరబ్రహ్మానికి అభేదం చెప్పబడింది. రెండోదృశ్యంలో ఆ మంత్రానికి నాలుగుపాదాలు ఉన్నాయని చెప్పబడింది. మూడోదానిలో పరబ్రహ్మంలో రమించడం, నాలుగోదానిలో నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదన ఉంది. ఈ నాలుగు దృశ్యాలలో మొదటి మూడింటిలో త్రిపదా గాయత్రి సగుణ బ్రహ్మాత్మకం, చివరిపాదం నిర్గుణ బ్రహ్మాత్మకం. ఇలా త్రిజట స్వప్నంలో గాయత్రీ మంత్రాన్ని, మంత్రాధిదేవతల వర్ణనను ధ్వనింపజేశాడని తన ‘షోడశి’ గ్రంథంలో శేషేంద్ర పేర్కొన్నారు. సుందరకాండను ఊరికే పారాయణ చేయకుండా దానిలో ఉండే అంతరార్థాన్ని గ్రహించాలి. - డా. బ్రాహ్మణపల్లి జయరాములు