పిల్లలకు ఊహాశక్తి సహజంగానే ఉంటుంది. ఊహలకు ఊతమిచ్చే కథలను వాళ్లు ఇష్టపడతారు. పాఠశాలలు కొనసాగుతున్నంతసేపూ సిలబస్ రద్దీలో వాళ్ల ఊహలకు ఊపిరాడే పరిస్థితి ఉండదు. పరీక్షలు ముగిసి, ఇలా వేసవి సెలవులొస్తేనే పిల్లలకు కొంత ఆటవిడుపు. సెలవుల్లో లేనిపోని కోచింగ్‌ల పేరుతో పిల్లలను ఇబ్బందిపెట్టే బదులు వారికి కొన్ని కథల పుస్తకాలు ఇవ్వండి. స్వయంగా చదువుకోలేని చిన్నారులకు కథలు చదివి వినిపించండి. చదువుకోగల పిల్లలను ఆ కథలను స్వయంగా చదువుకునేలా ప్రోత్సహించండి. కథలూ కాకరకాయలూ వృథా కాలక్షేపమని కొట్టిపారేయకండి. పసివయసులో తెలుసుకొనే కథలు ఊహలకు రెక్కలిస్తాయి. ఆలోచనలను పదునెక్కిస్తాయి. బతుకుబాటను సుగమం చేస్తాయి. ఈ వేసవి కానుకగా ఫన్‌డే సూచిస్తోన్న కొన్ని పిల్లల పుస్తకాలివి...
బాలల బొమ్మల రామాయణం బాలల బొమ్మల భారతం బాలల బొమ్మల భాగవతం అష్టాదశ పురాణాలు, అనేక ఉపపురాణాలు ఎన్ని ఉన్నా, ఆబాల గోపాలానికీ బాగా తెలిసినవి రామాయణ, మహాభారత, భాగవతాలే. ఇవి చాలా భాషల్లోకి అనువాదమయ్యాయి. వాల్మీకి రచించిన రామాయణం భారతీయ ఆదికావ్యం. చాలామంది తెలుగు రచయితలు రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని సులభశైలిలో పిల్లలకు అర్థమయ్యేలా సంక్షిప్తంగా రాశారు. తొలిసారిగా మాగంటి బాపినీడు 1948లో బాలల బొమ్మల భారతాన్ని ప్రచురించారు. ఆ తర్వాత అదే ఒరవడిలో చాలామంది ప్రచురణకర్తలు చిన్న చిన్న తరగతులు చదువుకునే పిల్లలు కూడా తేలికగా చదువుకునేందుకు వీలుగా బొమ్మలతో తీర్చిదిద్ది వీటిని ప్రచురిస్తూ వస్తున్నారు. బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం పుస్తకాలు తరతరాలుగా తరగని జనాదరణ పొందుతూనే ఉన్నాయి. రామాయణ, భారత, భాగవత గాథలు టీవీ సీరియళ్లుగా, సినిమాలుగా కూడా వచ్చాయి. అనేక సాహితీ, కళా ప్రక్రియల్లోనూ ఇవి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఈ కథలు మన సంప్రదాయానికి, సంస్కృతికి పట్టుగొమ్మలు. ఏ వయసు పిల్లలనైనా వీటిలోని కథలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకాలు దాదాపు ప్రతిచోటా దొరుకుతాయి. వేసవి సెలవుల్లో వీటిని పిల్లల చేతికిస్తే చాలు, వారికి చక్కని కాలక్షేపం. పిల్లల్లో పఠనాభిలాషను రేకెత్తించడానికి ఈ పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయి.
పంచతంత్రం
చాలాకాలంగా ప్రచారంలో ఉన్న నీతి కథలను క్రీ.పూ. 300లో ‘పంచతంత్రం’ పేరుతో సంకలించారు. ఇందులోని పాత్రలన్నీ జంతువులే. విష్ణుశర్మ అనే గురువు, లోకజ్ఞానం లేని, బుద్ధి వికసించని రాజకుమారులను పాలనాదక్షులుగా తీర్చిదిద్దటానికి కథల రూపంలో చేసిన నీతిబోధ ఇది. ఈ సంస్కృత గ్రంథం సుమారు వెయ్యేళ్లనాడే అనేక ప్రపంచ భాషల్లోకి అనువదితమైంది. ఐదు భాగాలుగా, అనేక అధ్యాయాలతో ఉంటుందిది.
1. మిత్ర భేదం: మిత్రుల మధ్య పొరపొచ్చాలు రావటం, మిత్రులను పోగొట్టుకోవటం మనకు నష్టం చేకూరుస్తుందన్నది ఇందులోని కథల సారాంశం.
2. మిత్రలాభం లేక మిత్ర సంప్రాప్తి : స్నేహితులే నిజమైన బలం. సైనిక బలగాలు, ఆయుధాల కన్నా స్నేహితుల తోడు మనకు పెట్టని కోట.
3. కాకోలూకీయం : కాకులు, గుడ్లగూబలు ఇందులోని పాత్రలు. ‘యుద్ధము – శాంతి’ అన్న విషయాలు ఇందులోని కథా వస్తువు.
4. లబ్ధప్రనాశం: లాభ నష్టాలు, సంపాదించుకోవటం, పోగొట్టుకోవటం – గురించిన నీతిబోధ.
5. అపరీక్షిత కారకం : ‘నిదానమే ప్రధానం. ఆలోచించి అడుగెయ్యి. తొందర పాటు మనకు నష్టం చేకూరుస్తుంది.’ అన్న కథాంశంతో ఉంటాయి ఈ కథలు.
తెలుగువాళ్లకు పంచతంత్రం కథలు సుపరిచితమే. పందొమ్మిదవ శతాబ్దంలో చిన్నయసూరి (1807–1861) దీన్ని ‘నీతిచంద్రిక’గా అనువదించాడు. కానీ ఆ శైలి, గ్రాం«థికం ఇప్పటి పిల్లలకు కొరుకుడు పడకపోవచ్చు. సులభంగా భావించగలిగిన పంచతంత్ర కథల పుస్తకాలు కోకొల్లలుగా లభ్యమవుతున్నాయి.
అక్బర్ – బీర్బల్ కథలు
మొగల్ చక్రవర్తి అక్బర్ కొలువులో ఉన్న ఒక హిందూ సలహాదారు బీర్బల్. ఇతడి అసలు పేరు మహేశ్ దాస్ (1528–1586). ఈయనకు మరో పేరు బీర్బల్. హాస్య ప్రియుడైన మహేశ్ దాస్ మంచి కవి, గాయకుడు కూడా. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలుగా పిలువబడే ఉన్నతోద్యోగులలో ఒకడు. చక్రవర్తి ఆదేశాన ఒక యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు. ఇది చరిత్ర. అయితే మనం చెప్పుకుంటున్న అక్బర్ – బీర్బల్ కథలు తెనాలి రామకృష్ణుడు, కృష్ణదేవరాయల కథల వంటివి. అమాయకుడైన అక్బర్‌ను నొప్పించకుండా బీర్బల్ ఎలా ఆయన తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపాడన్నదే హాస్యస్ఫోరకంగా ఉన్న ఈ కథల్లోని ప్రధానాంశం. మనం ఇప్పటికే చెప్పుకున్నట్టుగా అనేక మంది కథకులు తమకు తోచిన కథల్ని బీర్బల్‌కు ఆపాదించి ప్రచారంలో పెట్టారు. అయితేనేమి! నవ్వుకోవటానికి అదేమీ అడ్డంకి కాదు కదా!
పేదరాశి పెద్దమ్మ కథలు
జానపద కథలు ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు అని అడగకూడదు. భాషంత ప్రాచీనమైనవివి. పేదరాశి పెద్దమ్మ కథలు కూడా ఈ కోవకు చెందినవే. పదకొండవ శతాబ్దానికి చెందిన నన్నె చోడుని కుమార సంభవంలో జానపద సాహిత్య ప్రస్తావన ఉంది. తరతరాలుగా జనాన్ని అలరిస్తున్న ఈ కథలను పిల్లలు తప్పక ఆనందిస్తారు.
ముల్లా నసీరుద్దీన్ కథలు
టర్కీకి చెందిన సూఫీ తత్వవేత్త ముల్లా నసీరుద్దీన్ (1208–1284)కు మాటకారిగా, ఎంతటివాళ్లనైనా తన వాక్చాతుర్యంతో బురిడీ కొట్టించగల పుడింగిగా పేరుంది. సహజంగానే ఆయనకు ఆపాదించిన కథల్లో అన్నీ నిజంగా జరిగినవై ఉండకపోవచ్చు. కానీ ఆ గోల మనకెందుకు? కడుపుబ్బ నవ్వుకోవాలంటే ముల్లా నసీరుద్దీన్‌ను నమ్ముకోవచ్చు.
ఈసప్ కథలు
ఈసప్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. లిడియా, సామోస్, మెసెంబ్రియా లేదా కోటియంలో ఎక్కడో ఒకచోట క్రీ.పూ. 620 ప్రాంతంలో బానిసగా జన్మించాడు. ఆ తర్వాత, జాడ్మస్ సేవలో గడుపుతున్నప్పుడు, యజమాని అతడికి స్వేచ్ఛను ప్రసాదించాడు. తర్వాత తత్వవేత్తగా పేరుగడించి, మాత్రలు చేసే క్రమంలో పండిత పోషకుడైన లిడియా రాజు చెంత చేరి, సార్డిస్‌లో నివాసమేర్పరచుకొని అనేక రాచకార్యాలను నిర్వహించాడు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలను దర్శించి, పరస్పరం కలహించుకుంటున్న స్థానిక నాయకులకు, సామంత రాజులకు తన నీతి కథలు చెప్పి రాజీ కుదిర్చాడు. ఇతని ఫేబుల్స్‌లో కూడా పాత్రలన్నీ జంతువులే. అంటే, ఆనాటి కథకులు, మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి, అన్యాపదేశంగా చెప్పిన లోకనీతి, లోకరీతి ఇది. పిల్లలు, పెద్దలు కూడా తప్పకుండా చదవాల్సిన కథలివి.
తెనాలి రామలింగని కథలు
రామలింగడు, రామకృష్ణుడు ఒకరే. ‘పాండురంగ మహాత్మ్యం’ రాసిన రామకృష్ణుడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడంటారు. ఈయనకు వికటకవి అనే బిరుదు ఉంది. రాయల ఆస్థానంలో ఉన్నప్పుడు ఆయన తన సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో, తెలివితేటలతో, ఎలా అనేక సమస్యల నుంచి గట్టెక్కాడో, ఎంతమంది అహంభావుల గర్వమణచాడో కథలు కథలుగా చెప్పుకుంటారు. అన్నీ హాస్యరస ప్రధానమైనవే. ఇందులో ఎన్ని నిజమో, ఎన్ని నిజమైన కవికి ఆపాదించబడినవో తెలియదు గాని పిల్లలు చదువుకోవటానికి, నవ్వుకోవటానికి బాగుంటాయి.
భేతాళ – విక్రమార్క కథలు
సోమదేవభట్టు అనే కవి, 2500 సంవత్సరాల కిందట భేతాళ పంచవింశతి (25) కథలు రాశాడు. రాజు విక్రమాదిత్యుడికీ, శవంలో ప్రవేశించిన భేతాళుడికీ మధ్య జరిగిన మే«ధాపాటవ పరీక్ష రూపంలో ఉంటాయివి – అంటే మెదడుకు మేత. ఒక రుషి ఆదేశం ప్రకారం, విక్రముడు, కీకారణ్యంలో, చెట్టుకు వేలాడుతున్న శవాన్ని తీసుకురావడానికి వెళతాడు. (ఆ శవంలో ఉంటాడు బేతాళుడు). శవాన్ని తీసుకొని తిరిగి వచ్చే సమయంలో, బేతాళుడు, విక్రమునికి అలసట తెలియకుండా ఉండటానికి ఓ కథ చెబుతాడు. అయితే, మధ్యలో విక్రముడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడినా, బేతాళుడు తిరిగి చెట్టు మీదకు వెళ్లిపోతాడు. కథ చివరన బేతాళుడు కథ గురించి అడిగిన ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. సరైన జవాబు తెలిసినా చెప్పకపోతే విక్రముని తల వెయ్యి ముక్కలవుతుందని హెచ్చరిస్తాడు బేతాళుడు. అదీ పాఠకులతో రచయిత ఆడుకునే ఆట. కథ విన్న విక్రముడు, సరైన జవాబు తెలుసు గనక చెప్పక తప్పదు. జవాబు ముగియగానే బేతాళుడు చెట్టు మీదకు వెళ్లిపోతాడు. విక్రముడు తిరిగి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకొని నడక ప్రారంభిస్తాడు. సోమధేవభట్టు రాసిన ఇరవై అయిదు కథలు ఎటుపోయాయో కానీ, వందలాదిగా ఈ పజిల్ కథలు పాఠకులను అలరించాయి. కొంతకాలం కిందట ఇవి దూరదర్శన్‌లో సీరియల్‌గా కూడా వచ్చాయి. ఇక పుస్తకాలంటారా? ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయి.
అరేబియన్ నైట్స్ కథలు
అరబిక్ భాషలో దీని పేరు ‘‘అల్ఫ్ లేలా వాలేలా’’ అంటే వెయ్యినొక్క రాత్రులు. భారతదేశంతో సహా అనేక దేశాల నుంచి కొన్ని శతాబ్దాలపాటు సేకరించిన కథలను గ్రంథస్థం చేశారు.
షెహర్యార్ అనబడే రాజు, రోజూ ఒక యువతిని వివాహమాడి, రాత్రంతా ఆమెతో గడిపి, తెల్లవారగానే శిరచ్ఛేదనం చేస్తుండటంతో ఒక మంత్రిగారి కూతురైన షెహ్రాజేడ్, తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం, తెల్లవారే ముందు రాజుకో కథ చెప్పటం ప్రారంభిస్తుంది. రాచకార్యాలు నిర్వహించవలసిన ప్రభువు, కథనక్కడే వదిలి తిరిగి, రాత్రికి కథ చెప్పమంటాడు. అలా, వెయ్యినొక్కరాత్రులపాటు కథలు చెబుతూనే ఉంటుంది షెహ్రాజేడ్. ఆమె కథాకథన చాతుర్యానికి సంతసించిన రాజు ఆమెను తన రాణిని చేసుకుంటాడు. (ఇలా కథలో కథ చెప్పటాన్ని ఫ్రేమ్ స్టోరీ అంటారు.) ‘అల్లావుద్దీన్ అద్భతదీపం’, ‘ఆలీబాబా నలభై దొంగలు’, ‘సింద్‌బాద్ సాహసయాత్రలు’, ‘ఎగిరే తివాచీ’ వంటి కథలు పిల్లలకూ, పెద్దలకు సుపరిచితం. ‘అరేబియన్ నైట్స్’ చాలా పెద్ద పుస్తకం. అనేక సంపుటాల్లో ఉన్నాయి కథలు. కాని కొన్ని ముఖ్యమైన కథలతో ఒక సంపుటాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో ప్రచురించింది. ఇవి కాకుండా, విడివిడిగా కథలతో బొమ్మల పుస్తకాలు చాలా లభ్యమవుతున్నాయి. అంటే, అరేబియన్ నైట్స్ కథలు చదువుకున్న వాళ్లకు చదువుకున్నంత. అరేబియన్ నైట్స్ తరహాలోనిదే అయిన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ కూడా చదవండి.
బుడుగు
అక్షరాలలో ముళ్లపూడి వెంకటరమణ, రేఖల్లో బాపు సృష్టించిన బుడుగు ఒక తరం ఆంధ్రపత్రిక పాఠకులను నవ్వుల కడలిలో ఓలలాడించాడు. ఆ తర్వాత బుడుగు ఇతర పత్రికల్లో కూడా తన అల్లరి కొనసాగించాడు. నవ్వుకు మారుపేరు బుడుగు. ఇప్పుడు బుడుగు పుస్తకాలు అనేకం మార్కెట్లో ఉన్నాయి. వెళ్లండి. కొనండి. నవ్వుకోండి.
బాలసాహిత్యంలో నాటి పత్రికల కృషి
పిల్లలను అలరించే రచనలు అందుబాటులోకి రావడం పత్రికలతోనే ప్రారంభమైంది. తెలుగులో తొలిసారిగా ‘జనవినోదిని’ పత్రిక (1875–85) బాలల కోసం ప్రత్యేక రచనలను ప్రచురించింది. మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ వారు ఈ పత్రికను ప్రచురించేవారు. ఇందులో ‘చిట్ల పొట్లకాయ’, ‘రుంగు రుంగు బిళ్ల’ వంటి చిన్నారులు సరదాగా పాడుకునేందుకు అనువైన గేయాలను ప్రచురించారు. ఆ తర్వాత గుంటూరు నుంచి క్రైస్తవ మిషనరీలు ప్రచురించిన ‘వివేకవతి’ (1908– 1910) మాసపత్రికలో పిల్లల కథలను సరళమైన భాషలో ప్రచురించారు. కాకినాడ నుంచి వింజమూరి వెంకటరత్నమ్మ నడిపిన ‘అనసూయ’ (1914–19) మహిళల పత్రికలో ఆమె సోదరుడు, సుప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన బాలగేయాలను ప్రచురించారు. ‘దేశోద్ధారక’ కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ప్రారంభించిన ఆంధ్ర పత్రికలోనూ పిల్లల రచనలు విరివిగా ప్రచురితమయ్యాయి. ఆంధపత్రిక ఆధ్వర్యంలోనిదే అయిన సాహితీపత్రిక ‘భారతి’లో గిడుగు వెంకట సీతాపతి పిల్లల కోసం ప్రత్యేకంగా ‘బాలానందం’ అనే శీర్షికను నిర్వహించేవారు.
బాలల పత్రికలు
నాటి పత్రికలు పిల్లలకు సంబంధించిన రచనలను విరివిగా ప్రచురిస్తూ వచ్చినా, అచ్చంగా పిల్లల కోసమే ప్రత్యేకమైన పత్రికలేవీ లేకపోవడం లోటుగా ఉండేది. ఆ లోటును తీర్చడానికే మేడిచర్ల ఆంజనేయమూర్తి 1940లో ‘బాలకేసరి’ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ‘రేడియో అన్నయ్య’గా ప్రసిద్ధి పొందిన న్యాయపతి రాఘవరావు 1945లో ‘బాల’ మాసపత్రికను ప్రారంభించి, బాల సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత చక్రపాణి–నాగిరెడ్డి 1947లో ‘చందమామ’ను ప్రారంభించారు. చందమామ బాలసాహిత్యానికి చేసిన సేవ వెలకట్టలేనిది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని కథలూ సీరియల్స్‌గా వచ్చినవే. అప్రతిహతంగా సాగిన చందమామ ప్రస్థానం 2013లో ముగియటం ఒక విషాదం. ఇప్పటికీ పాత పుస్తకాల షాపులో, పేవ్‌మెంట్లమీద పాత చందమామలు కొనేవాళ్లకు కొదవలేదు. ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోనూ ప్రచురింపబడిన ఈ పిల్లల కథల కాణాచిని ఇప్పుడు ఆన్‌లైన్లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పిల్లలకు, పాత జ్ఞాపకాలను మరచి పోలేని పెద్దలకు ఇది వరం. ‘చందమామ’ తర్వాత ‘బాలమిత్ర’, ‘బొమ్మరిల్లు’, ‘బుజ్జాయి’ వంటి అనేక పత్రికలు పిల్లలను అలరించాయి. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ 1979లో అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా ‘బాలచంద్రిక’ మాసపత్రికను ప్రారంభించింది. తెలుగులో దాదాపు నలభైకి పైగా బాలల పత్రికలు వచ్చాయి.
బాలల పద్యాలూ, గేయాలూ
తెలుగులోని ప్రాచీన పద్యసాహిత్యం చాలానే ఉన్నా, బాలల కోసం ప్రత్యేకమైన పద్యాలు కొంత తక్కువే. వేమన శతకం, సుమతీ శతకం వంటివి పిల్లలకు నేర్పిస్తారు. అయితే, నీతిని, లోకరీతిని తెలిపే ఈ శతకాలను అచ్చంగా బాలసాహిత్యంగా పరిగణించలేం. ఆధునిక కవులు కొందరు ఈ లోటు తీర్చడానికి ప్రయత్నించారు. చిల్లా వెంకట కృష్ణయ్య ‘కుమార శతకం’ (1915), సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి ‘కుమారీ శతకం’ (1920), ముళ్లపూడి వెంకటరమణ ‘బాలశతకం’ (1946) వంటివి అచ్చమైన బాల శతకాలు. కరుణశ్రీ ‘తెలుగుబాల’ (1953), నార్ల చిరంజీవి ‘తెలుగుపూలు’ (1954), బృందావనం రంగాచార్య ‘తెలుగుబోధ’ (1954) వంటివి బాలల పద్య సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి.
బాల సాహిత్యానికి సుప్రసిద్ధుల సేవ
తెలుగు రచయితల్లో చాలామంది సుప్రసిద్ధులు బాల సాహిత్యానికి ఎనలేని సేవలందించారు. న్యాయపతి రాఘవరావు–కామేశ్వరి, ఏటుకూరి వెంకట నర్సయ్య, చింతా దీక్షితులు, నార్ల చిరంజీవి, ఏడిద కామేశ్వరరావు, మండా సూర్యనారాయణ, నండూరి రామమోహనరావు, వేజెండ్ల సాంబశివరావు, వెలగా వెంకటప్పయ్య, మహీధర నళినీమోహన్, రావూరి భరద్వాజ, ఇల్లిందల సరస్వతీదేవి, తురగా జానకీరాణి, మిరియాల రామకృష్ణ వంటి వారు బాలల కోసం కూడా ప్రత్యేకమైన రచనలు విరివిగా చేశారు. మహాకవి శ్రీశ్రీ సైతం ‘కప్ప వైద్యుడు’ అనే గేయ కథను పిల్లల కోసం ప్రత్యేకంగా రాశారు. ప్రముఖ కవి ఆలూరి బైరాగి ‘వేటగాని సాహసం’, ‘స్నేహధర్మం’, ‘కలవారి అబ్బాయి’ వంటి గేయకథలను రాశారు. బాలాంత్రపు రజనీకాంతరావు ‘జేజిమామయ్య పాటలు’ రాశారు. బోయి భీమన్న, మధురాంతకం రాజారాం, ఎల్లోరా, బి.వి.నరసింహారావు వంటి ఎందరో ప్రసిద్ధ సాహితీవేత్తలు బాలల కోసం గేయకథలు రాశారు.
పిల్లల కథలు, నవలలు
బాలల పత్రికల్లో వచ్చినవే కాకుండా పిల్లల కోసం కొందరు రచయితలు ఆసక్తికరమైన కథలను సంపుటాలుగా వెలుగులోకి తెచ్చారు. అలాగే, కొందరు పిల్లల కోసం ప్రత్యేకంగా నవలలు రాశారు. కందుకూరి వీరేశలింగం పంతులు పిల్లల కోసం ‘ఈసోప్ కథలు’ వెలుగులోకి తెచ్చారు. ఈ కథలను ఆయన ‘నీతికథా మంజరి’ పేరిట రెండు సంపుటాలుగా ప్రచురించారు. వావిలికొలను సుబ్బారావు ‘ఆర్యకథా నిధి’ పేరిట నీతికథలను రాశారు. వేంకట పార్వతీశ్వర కవులు, కనుపర్తి వరలక్ష్మమ్మ, గిడుగు వెంకట సీతాపతి, భమిడిపాటి కామేశ్వరరావు, నార్ల చిరంజీవి, చింతా దీక్షితులు తదితరులు పిల్లల కోసం నీతి కథలతో పాటు అద్భుతాలతో కూడిన ఆసక్తికరమైన అనేక కథలు రాశారు. ఇల్లిందల సరస్వతీదేవి ‘మూడు పిల్లికూనలు’, తురగా జానకీరాణి ‘బొమ్మలపెళ్లి’, చాపరాల సరళ తిలక్ ‘చిన్నారి గూఢచారి’ వంటి కథల పుస్తకాలు పిల్లలను ఆకట్టకునేలా రాశారు. ఇవికాకుండా, చింతా దీక్షితులు ‘గోపీ మోహిని’, శ్రీవాత్సవ ‘జలతారు జాబిలి’, దిగవల్లి వెంకట శేషగిరిరావు ‘విచిత్రలోకం’, కె.సభా ‘మత్స్యకన్యలు’, అంతటి నరసింహం ‘కోటవీరన్న సాహసం’, నండూరి రామమోహనరావు ‘మయూరకన్య’ వంటి నవలలు రాశారు.
– ముక్తవరం పార్థసారథి
Comments
Please login to add a commentAdd a comment