ఏమంటారు బాయ్స్‌? | special interview with pooja hegde | Sakshi
Sakshi News home page

ఏమంటారు బాయ్స్‌?

Published Sun, Oct 22 2017 12:31 AM | Last Updated on Sun, Oct 22 2017 10:52 AM

special interview with pooja hegde

ఒక అమ్మాయిది కష్టం.. ఒక అమ్మాయిది వేదన ఒక అమ్మాయిది రోదన.. ఇంకో అమ్మాయిది సంఘర్షణ మరి.. బాయ్స్‌కి ఏమీ ఉండవా? పెయిన్, గిల్ట్, రిగ్రెట్‌... అదేనండీ... ‘తప్పు చేస్తున్నాము’ అన్న ఫీలింగ్‌ బాయ్స్‌కి ఉండదా? అమ్మాయిలే జాగ్రత్తపడాలా? బాయ్స్‌ గౌరవంగా ఉండకూడదా? కమాన్‌ బాయ్స్‌... నాట్‌ ఫెయిర్‌... బీ గుడ్‌ టు గర్ల్స్‌.. ఏమంటారు బాయ్స్‌?

‘‘అవును... నాకూ అన్యాయం జరిగింది’’ అన్న #meetoo క్యాంపైన్‌ని  పూజా హెగ్డే పూర్తిగా సమర్థిస్తున్నారు.


సోషల్‌ మీడియాలో మీరు యాక్టివ్‌గా ఉంటారు. ‘మీ టూ’ అంటూ అమ్మాయిలు తాము ఎదుర్కొన్న లైంగిక దాడులను షేర్‌ చేసుకుంటున్నారు.. గమనిస్తున్నారా?
సమాజంలో జరిగే మార్పులను గమనిస్తుంటాను. కొంతమంది అమ్మాయిలు తామెంత హింసకు గురయ్యారో చెబుతుంటే బాధ అనిపిస్తోంది. వీళ్లకు ఇది జరిగి ఉండాల్సింది కాదు అనుకుంటుంటా.

ఒకప్పుడు ఇలాంటి విషయాలు ఓపెన్‌గా చెబితే.. అమ్మాయిలనే అనుమానించేవారు.. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చినందుకు ఎలా అనిపిస్తోంది?
కరెక్టేనండి. బయటకు చెబితే చెడుగా అనుకుంటారేమోనని లోలోపల దాచేసుకుని కుమిలిపోయేవారు. ఇప్పుడు ఎట్‌లీస్ట్‌ చెప్పే స్వేచ్ఛ అయినా దొరికినందుకు ఆనందపడాలి. అయితే, అసలు దాడులు జరగకపోతే చెప్పుకోవాల్సిన పరిస్థితే రాదు కదా. వస్తున్నందుకు బాధపడాలి.

మీ సంగతేంటి.. సినిమా ఇండస్ట్రీలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ పేరుతో హీరోయిన్ల పట్ల కొందరు అమానుషంగా ప్రవరిస్తారట.. మీకేమైనా?
లక్కీగా నాకలాంటి బ్యాడ్‌ ఎక్స్‌పీరి యన్సెస్‌ ఏవీ లేవు. ఇప్పటివరకూ నావి ఐదు సినిమాలు రిలీజయ్యాయి. చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. పాస్ట్‌ అండ్‌ ప్రెజంట్‌ నాకు మంచి మంచి యూనిట్‌ మెంబర్స్‌ దక్కడం అదృష్టం.

ఒకవేళ దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలంటే ‘మార్షల్‌ ఆర్ట్స్‌’ లాంటివి నేర్చుకోవాలేమో..
అవును. సెల్ఫ్‌ డిఫెన్స్‌ ముఖ్యం. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటే మంచిదే. అమ్మాయిలకు జాగ్రత్తలు నేర్పించడం మాత్రమే కాదు.. అబ్బాయిలు ఎలా ఉండాలో కూడా ఇంట్లోవాళ్లు నేర్పించాలి. అప్పుడే నా అక్కాచెల్లెళ్లు, నేను... మేమంతా సురక్షితంగా ఉండగలుగుతాం.

ఓకే.. ఇంత స్లిమ్‌గా ఉన్నారు. వారానికి ఎన్ని రోజులు వర్కవుట్స్‌ చేస్తారేంటి?
సిక్స్‌ డేస్‌ కంపల్సరి అండీ. థ్రెడ్‌ మిల్‌ నుంచి కార్డియో దాకా ఏమేం చేయగలనో అన్నీ చేసేస్తాను. నాకు ఇద్దరు ట్రైనర్లు ఉన్నారు. వాళ్ల సమక్షంలోనే వర్కవుట్స్‌ చేస్తా. నేను డైటింగ్‌ చేయను. శరీరానికి శక్తి కావాలంటే కడుపు నిండా తినాలి. కేలరీలు కరిగించడానికి వర్కవుట్స్‌ చేయాలి. ఇదే నా పాలసీ.



బాగుంది...  ‘ఏరియల్‌ యాక్రోబాటిక్స్‌’ కూడా చేస్తున్నారు. తలకిందులుగా వేలాడటం, క్లాథ్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ, గాల్లో కూర్చోవడం.. చాలా టఫ్‌ కదా?
టఫ్‌ అనుకుంటే ఏదీ చేయలేం. మన శరీరానికి మనం ఛాలెంజ్‌ ఇచ్చుకోవాలి. ఏరియల్‌ యాక్రోబాటిక్స్‌ వల్ల శరీరాకృతి బాగుండటమే కాదు.. మనసుకి కూడా మంచిది. ఎందుకంటే, బ్యాలెన్సింగ్‌ నేర్చుకుంటాం. జీవితంలో ఏ విషయంలోనైనా బ్యాలెన్సింగ్‌గా ఉంటే బాగుంటుందని నేను నమ్ముతాను.

మరి.. జయాపజయాలకు కూడా మీ రియాక్షన్‌ బ్యాలెన్సింగ్‌గానే ఉంటుందా?
ఉండాలి. లేకపోతే కష్టం. సినిమా కోసం టీమంతా ఏడెనిమిది నెలలు కష్టపడతాం. ప్రేక్షకులు జస్ట్‌ ఒక్క రోజులో తేల్చేస్తారు. జరిగేది జరగక మానదు. సక్సెస్, ఫ్లాప్‌ ఎవరి చేతుల్లోనూ ఉండవు. అందుకే, ఏ సినిమా చేసినా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బాగుండాలని కోరుకుంటాను. అనుకున్నట్లు సినిమా కూడా హిట్టయితే డబుల్‌ హ్యాపీ.

మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?
నేను ముంబయ్‌లో పుట్టాను. కానీ, మా అమ్మానాన్నలది కర్ణాటకలోని మంగళూరు. మా మాతృభాష తుళు. ఇంట్లో అందరూ తుళు మాట్లాడతారు. కన్నడ కూడా వచ్చు. నేను చిన్నప్పట్నుంచి ముంబయ్‌లో పెరగడం వల్ల హిందీ, మారాఠీ, ఇంగ్లీష్‌ బాగా మాట్లాడతాను. ప్రస్తుతం మా ఫ్యామిలీ ముంబయ్‌లోనే సెటిల్‌ అయ్యింది. అమ్మ పేరు లత. లా చదివారు. ఇప్పుడు హౌస్‌ వైఫ్‌. నాన్న పేరు మంజునాథ్‌. ఆయన క్రిమినల్‌ లాయర్‌. నాకో అన్నయ్య ఉన్నాడు. పేరు రిషబ్‌ హెగ్డే. తను డాక్టర్‌. మా ఫ్యామిలీకి సినిమాలతో సంబంధం లేదు.



ఫర్‌ ఎగ్జాంపుల్‌ ‘మొహెంజోదారో’ కోసం పడిన రెండేళ్ల కష్టానికి సక్సెస్‌ రూపంలో ప్రతిఫలం రాలేదు.. పైగా ఆ సినిమా కోసం మీరు రెండు మూడు సినిమాలు కూడా వదిలేసుకున్నారు. పశ్చాత్తాపం ఏదైనా?
పశ్చాత్తాపం అస్సలు లేదు. ‘మొహెంజోదారో’ లాంటి గ్రాండ్‌ స్కేల్‌ మూవీస్‌ అరుదుగా వస్తాయి. ఆ సినిమా నటిగా నాకో మంచి ఎక్స్‌పీరియన్స్‌. నిజానికి ఆ మూవీ కమిట్‌ అయినప్పుడే అంత టైమ్‌ పడుతుందన్నారు. ఓకే అన్నాను. సినిమా కమిట్‌ అయినప్పుడు ఆనందపడి, అనుకున్న రిజల్ట్‌ రాకపోతే ‘ఎందుకు చేశామా?’ అని పశ్చాత్తాపపడటం కరెక్ట్‌ కాదు కదా.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. చాన్సులు వదులుకోకుండా చకాచకా సినిమాలు చేయడం హీరోయిన్లకు మంచిదేమో...
కరెక్టే. హీరోయిన్ల కెరీర్‌కి లాంగ్విటీ తక్కువ. బ్రేక్‌ లేకుండా సినిమాలు చేయాలి. అయితే ఒక్కోసారి మనం డిజైన్‌ చేసినట్లుగా జరగదు. అయినా నాకు పెద్ద బ్రేక్స్‌ ఏవీ లేవు. కాకపోతే, ఒక గ్రాండ్‌ స్కేల్‌ మూవీతో ఎటాచ్‌ అయినప్పుడు దాంతో పాటు వేరే సినిమా చేయలేం. అదే రెగ్యులర్‌ మూవీస్‌ అనుకోండి... ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసే స్కోప్‌ ఉంటుంది.

అవునూ.. స్కూల్లో మీరు బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ కదూ!
అదేంటండీ.. అలా అనేశారు. వెనక బెంచీలో కూర్చుని టీచర్‌ చూడనప్పుడు చల్లగా క్లాసులోంచి జారుకునే అమ్మాయిలా కనిపిస్తున్నానా?

లేదు.. లేదు.. మంచి హైట్‌ కదా.. అందుకని బ్యాక్‌ బెంచ్‌లో కూర్చునేవారేమో అనుకున్నా?
ఆల్వేస్‌ ఫస్ట్‌ బెంచ్‌. నేను బాగా హైట్‌ ఉన్నట్లు కనిపిస్తా. నా హైట్‌ 5.8 ఇంచెస్‌. అది నార్మల్‌ అనుకుంటున్నా.

మరి.. స్కూల్‌ డేస్‌లో ఎవరైనా ‘ఐ లవ్‌ యు’ చెప్పిన సందర్భాలు?
నాకు తెలిసి ప్రతి అమ్మాయి లైఫ్‌లో ప్రపోజల్స్‌ కామన్‌. నా స్కూల్‌ డేస్‌లో ఒక అబ్బాయి నన్ను ఫాలో అయ్యేవాడు. నేనేమో టామ్‌బాయ్‌ టైప్‌. రఫ్ఫాడించేసేలా ఉండేదాన్ని. అందుకని నాకు ప్రపోజ్‌ చేయడానికి భయపడ్డాడేమో (నవ్వుతూ). ఒకరోజు ధైర్యం చేసుకుని, విషయం చెప్పడానికి వచ్చాడు. నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్‌ ఒక్కసారిగా నవ్వేశారు. అతను చెప్పడానికి ఇబ్బందిపడిపోయి, వెళ్లిపోయాడు.

ఇప్పుడేమైనా మీరు లవ్‌లో...?
నో ఛాన్స్‌ అండి. నా లైఫ్‌లో ఎవరూ లేరు. సినిమాలను లవ్‌ చేస్తున్నా.

ఇంతకీ హీరోయిన్‌ అవ్వాలని చిన్నప్పుడే అనుకున్నారా?
చెబితే నవ్వుతారేమో... ఒక్కోసారి ఒక్కోటి అవ్వాలనుకునేదాన్ని. ఫర్‌ ఎగ్జాంపుల్‌ ‘పోస్ట్‌మాన్‌’ అయితే బాగుంటుందనుకున్నా. ఆ జాబ్‌ కూల్‌గా ఉంటుందనుకునేదాన్ని. పెద్దయ్యాక తెలిసింది... ఏ జాబ్‌కి ఉండాల్సిన ప్రెజర్స్‌ దానికి ఉంటాయని. ఒకసారి లాయర్‌ అవ్వాలనుకున్నా. ఇంకోసారి ఏదైనా క్రియేటివ్‌ ఫీల్డ్‌ అయితే బాగుంటుందనుకున్నా. అయితే హీరోయిన్‌ అవుతాననుకోలేదు. అనుకోకుండా అందాల పోటీల్లో పాల్గొన డం, ఆ తర్వాత మోడలింగ్‌.. అట్నుంచి సినిమాలు.. కలలా జరిగిపోయింది.

అందాల పోటీల్లో పాల్గొన్నారు కదా.. మీ అందం మీద మీకెంత కాన్ఫిడెన్స్‌ ఉండేది?
నేను అస్సలు బాగుండనని అనుకునేదాన్ని. నా ఫ్రెండ్స్‌ మాత్రం ‘నీలో మంచి హీరోయిన్‌ ఉంది. చాలా అందంగా ఉంటావ్‌’ అనేవారు. స్కూల్‌ డేస్‌లో నేను టామ్‌ బాయ్‌లా ఉండేదాన్నని చెప్పా కదా. అప్పట్లో హెయిర్‌ షార్ట్‌గా కత్తిరించుకునేదాన్ని. దాంతో నాకు నేను బాగున్నట్లు అనిపించేది కాదు. అందాల పోటీల్లో పాల్గొన్నప్పుడు కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అది ఏర్పడటానికి కారణం మా అమ్మగారు.

అందంగా ఉన్న మీరు.. ఒకవేళ క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే... డీ–గ్లామరైజ్డ్‌గా కనిపించడానికి రెడీనా?
అలాంటి క్యారెక్టర్స్‌ వస్తే హ్యాపీగా ఒప్పేసుకుంటా. అసలు మేకప్‌ చేసుకోకూడదన్నా ఓకే. లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ వచ్చినా చేస్తా. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి కొన్ని సినిమాలైనా ఉండాలి కదా.

అటు నార్త్‌ ఇటు సౌత్‌ మూవీస్‌ చేస్తున్నారు కదా.. ఎక్కడ బాగుంది?
‘ఐయామ్‌ ఎ ఫిల్మ్‌ లవర్‌’. హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. సౌత్‌ సినిమాలు చేస్తూ పెరుగుతున్నా (నవ్వుతూ). రెండు చోట్లా నాకు బాగుంది.

డ్రీమ్‌ రోల్‌ ఏదైనా?
చాలా ఉన్నాయి. హీరోయిన్‌ అయి ఇంకా చాలా సంవత్సరాలు కాలేదు కదా. అప్పుడే డ్రీమ్‌ రోల్స్‌ రావాలని కోరుకోలేం. ప్రస్తుతానికి చేస్తున్నవన్నీ డ్రీమ్‌ రోల్స్‌లానే అనుకుంటున్నా.

ఓకే.. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తోన్న ‘సాక్ష్యం’లో మీ రోల్‌?
‘డీజే’కి కంప్లీట్‌ డిఫరెంట్‌ రోల్‌. ట్రెడిషనల్‌గా కనిపిస్తా. ఫుల్‌ డీటైల్స్‌ రిలీజ్‌ అప్పుడు చెబుతా.

మీలో మంచి డ్యాన్సర్‌ ఉంది. ‘ముకుంద’లో ‘గోపికమ్మా..’, ‘డీజే’లో ‘అస్మైక యోగ...’ పాటలకు బాగా డ్యాన్స్‌ చేశారు. ఫార్మల్‌ ట్రైనింగ్‌ ఏమైనా తీసుకున్నారా?
థ్యాంక్స్‌. ఈ రెండు డ్యాన్సులను నేను చాలా ఎంజాయ్‌ చేశా. ‘గోపికమ్మా...’ ట్రెడిషనల్‌ డ్యాన్స్‌. ‘అస్మైక’ మోడ్రన్‌. చిన్నప్పుడు నేను కొన్నేళ్లు భరతనాట్యం నేర్చుకున్నా. అది ఎంతో కొంత హెల్ప్‌ అయిందని నా ఫీలింగ్‌.

సో.. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌తో చేయబోతున్న స్పెషల్‌ సాంగ్‌లో డ్యాన్స్‌ ఇరగదీస్తారని ఊహించవచ్చు...
లుకింగ్‌ ఫార్వాడ్‌ టు ఇట్‌. ప్రస్తుతానికి ఇంతే (నవ్వేస్తూ).

– డి.జి. భవాని   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement