వెలగబెట్టండి | special on velaga kaya | Sakshi
Sakshi News home page

వెలగబెట్టండి

Published Sat, Sep 9 2017 12:14 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

వెలగబెట్టండి

వెలగబెట్టండి

వెలగపండు... పేరుకి పండే. కానీ ఒలిచి తిందామంటే... ఉహూ! కుదరనే కుదరదు.  పగలగొట్టాలి...  గుజ్జు తీయాలి. ఆ తర్వాత...  పచ్చడి, జ్యూస్, జామ్, రైస్‌...  ఎలా వండుతామన్నా వద్దనదు. కిమ్మనకుండా వంటింట్లో ఒదిగిపోతుంది.  ఇంకెందుకు ఆలస్యం... వన్‌.. టూ.. త్రీ.. బ్రేక్‌!!!

వెలగ పండు జ్యూస్‌
కావలసినవి : లగ పండు – 1; బెల్లం తురుము – 4 టేబుల్‌ స్పూన్లు; నిమ్మ రసం – అర టీ స్పూను; నల్ల మిరియాల పొడి – పావు టీ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను

తయారి : వెలగ పండును పగులగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి (గింజలు వేరుచేయనక్కరలేదు) ∙గుజ్జు అంతా మునిగేవరకు రెండు గ్లాసుల చల్లటి నీరు పోసి బాగా కలిపి, ఒక వస్త్రం పైన వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి ∙బెల్లం తురుమును కప్పుడు చల్లటి నీళ్లలో వేసి బాగా కలపాలి ∙వాడుకోవడానికి ఐదు నిమిషాల ముందు వెలగ పండు గుజ్జును బయటకు తీసి బాగా మెత్తగా చేయాలి. గుజ్జంతా నీళ్లలో కలిసే వరకు కలపాలి ∙పల్చటి వస్త్రంలో వడకట్టి, బెల్లం కరిగిన నీటిలో వేసి బాగా కలపాలి ∙మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసి, ఒక బౌల్‌ లోకి తీసుకోవాలి నిమ్మరసం, నల్లమిరియాల పొడి వేసి కలపాలి. వెంటనే తాగొచ్చు లేదా రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసుకోవచ్చు.

వెలగ రైస్‌
కావలసినవి : వెలగ పండు గుజ్జు – కప్పు; బియ్యం – 3 కప్పులు; పచ్చి సెనగపప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; వేయించిన పల్లీలు –2 టేబుల్‌ స్పూన్లు; పసుపు – కొద్దిగా; పచ్చిమిర్చి – 4; ఎండు మిర్చి – 2; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు

తయారి : ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, తగినంత నీరు జత చేసి ఉడికించాలి ∙బాణలిలో నూనె కాగాక మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి,  కరివేపాకు వరసగా వేసి వేయించాలి ∙వెలగ పండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి ∙చల్లార్చిన అన్నంలో ఈ మిశ్రమం వేసి బాగా కలపాలి (పులిహోరలా ఉంటుంది).

వెలగ పండు కాల్చిన పచ్చడి
కావలసినవి : వెలగ పండు – 1; నువ్వుల పొడి – టేబుల్‌ స్పూను; బెల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – టేబుల్‌ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – కొద్దిగా; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పచ్చి సెనగపప్పు – టీస్పూను; మినప్పప్పు – టీ స్పూను; పచ్చి మిర్చి – 3; ఎండు మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు

తయారి  :  వెలగపండును స్టౌ మీద సన్నని మంట మీద కాల్చాలి ∙చల్లారిన తరవాత పండును పగులగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, చేతితో బాగా మెత్తగా అయ్యేవరకు మెదపాలి ∙బెల్లం తురుము, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగిన తరవాత పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి తీసి చల్లార్చాలి ∙మిక్సీలో ముందుగా పోపు సామాను వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి ∙వెలగపండు గుజ్జు, కొత్తిమీర వేసి మరోమారు తిప్పాలి ∙బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా తిప్పి తీసేయాలి ∙నువ్వుల పొడి, నూనెలో వేయించిన కరివేపాకు పైన చల్లాలి ∙వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెలగపండు బీరపొట్టు పచ్చడి
కావలసినవి : వెలగ పండు గుజ్జు – 2 టేబుల్‌ స్పూన్లు; బీర పొట్టు –  పావు కప్పు; కొబ్బరి తురుము – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 4; మినప్పప్పు – 2 టీస్పూన్లు; అల్లం తురుము – కొద్దిగా; ఉప్పు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – కొద్దిగా


తయారి : ∙బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ఎండు మిర్చి ఇంగువ వేసి వేయించి తీసేయాలి ∙మినప్పప్పు వేసి వేయించాలి ∙అల్లం తురుము జత చేసి మరోమారు వేయించి తీసేయాలి ∙బీర పొట్టు వేసి బాగా వేయించాలి. అవసరమనుకుంటే మరి కాస్త నూనె జత చేయాలి ∙మెత్తగా అయ్యేవరకు ఉంచి దించేయాలి ∙మిక్సీలో ముందుగా ఎండుమిర్చి, మినప్పప్పు వేసి మెత్తగా చేయాలి ∙బీరపొట్టు జత చేసి మెత్తగా చేయాలి ∙కొబ్బరి తురుము, వెలగపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా చేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి.

వెలగ పండు జామ్‌
కావలసినవి :  వెలగపండు – 1  బెల్లం తురుము – 4 టేబుల్‌ స్పూన్లు ఏలకుల పొడి –  అర టీ స్పూను

తయారి :  బాగా పండిన వెలగపండులోని గుజ్జును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. బెల్లం తురుము,  ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. చల్లగా  సర్వ్‌  చేయాలి.

వెలగ పండు పెరుగు పచ్చడి
కావలసినవి :  పచ్చి వెలక్కాయ – ఒకటి; టొమాటో తరుగు – అర కప్పు; పెరుగు – కప్పు; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా కట్‌ చేయాలి); కొత్తిమీర – చిన్న కట్ట; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; కరివేపాకు – ఒక రెమ్మ; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీ స్పూను ఎండు మిర్చి – 4

తయారి : ముందుగా వెలక్కాయను పగలగొట్టి, గుజ్జును పాత్రలోకి తీసి, చేతితో మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వరసగా వేసి వేయించాలి ∙టొమాటో తరుగు జత చేసి బాగా కలిపి, ఉప్పు, పసుపు వేసి మరోమారు కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ∙ఒక పాత్రలో పెరుగు వేసి గిలకొట్టి, కొద్దిగా నీరు జతచేయాలి ∙వెలగపండు గుజ్జు వేసి కలపాలి ∙మగ్గించి ఉంచుకున్న టొమాటో మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కరివేపాకు, కొత్తిమీద తరుగుతో అలంకరించాలి ∙(ఇష్టపడేవారు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు)

వెలగ ఉపయోగాలు
వెలగ ఆకుల రసాన్ని వడగట్టి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. చిన్న పిల్లలకు అజీర్తిగా ఉంటే, వెలగ చిగుళ్లు కాని లేత వెలగ ఆకులను కాని రసం తీసి, ఆ రసంలో పాలు, చక్కెర కలిపి తాగించాలి. వెలగపండు గుజ్జులో తేనె కలిపి తింటే అధిక దాహం తగ్గుతుంది.
– సేకరణ: డా. వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement