సుశీలకు ఇష్టమైన ఫ్యామిలీ... | Sushila to favorites Family ... | Sakshi
Sakshi News home page

సుశీలకు ఇష్టమైన ఫ్యామిలీ...

Published Sat, Apr 2 2016 10:48 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

చెన్నైలో ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ఇష్టాగోష్ఠిలో అలనాటి నటీమణులు రాజశ్రీ, సచ్చు (సరస్వతి), కాంచనలతో   మేటి గాయనీమణి పి. సుశీల - Sakshi

చెన్నైలో ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ఇష్టాగోష్ఠిలో అలనాటి నటీమణులు రాజశ్రీ, సచ్చు (సరస్వతి), కాంచనలతో మేటి గాయనీమణి పి. సుశీల

వసంతంలో కోకిల పాటలు వినపడతాయి.
వసంతాన్ని నిత్య వసంతంగా మార్చిన గానకోకిల పి.సుశీల.
తాజాగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన సుశీలతో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనిపించింది.
ఆమె సంతోషాన్ని సాక్షి పాఠకులతో  పంచుకోవాలని ఆశ కలిగింది.
ఎవరు చేస్తే బాగుంటుంది?...
అన్న ప్రశ్నకు మంచి సమాధానమే దక్కింది.
తనకిష్టమైన వాళ్లతో చేయిస్తే బాగుంటుంది...
అదీ  ఇష్టాగోష్ఠిగా చేయిస్తే ఇంకా బాగుంటుంది...


‘మీ నేపథ్య గానం వల్లే మేము ప్రేక్షకులకు దగ్గరయ్యామని’ కాంచన, రాజశ్రీ.... ‘కాదు నా పాటకు వన్నె తెచ్చింది మీ అందమే’నని సుశీలా...  తమ గొప్పదనాన్ని ఆప్యాయంగా ఒకరికొకరు ఆపాదించుకుంటూ ఉంటే... మన కుటుంబాలు కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండు అనిపించింది.


రాజశ్రీ, కాంచన: కంగ్రాచ్యులేషన్స్... గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి, తెలుగు వారికీ, పాటకూ ఘనకీర్తిని సంపాదించి పెట్టారు... పి. సుశీలమ్మ: థ్యాంక్యూ... థ్యాంక్యూ.. కాని అసలు క్రెడిట్ మీది. మీరందరూ నా పాటకు బాగా నటించి రికార్డు మాత్రం నాకు ఇచ్చారు.

 
కాంచన
: క్రెడిట్ మాదా! ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉంటే మీరు ఎనిమిదో అద్భుతం. భానుమతి తర్వాత వచ్చిన మా తరం హీరోయిన్స్‌కు, జయప్రద, జయసుధ తరం వారికి, నిన్న మొన్న హీరోయిన్లకు కూడా పాడారంటే ఏమి చెప్పేది... మాటలు రావడం లేదు.

 
రాజశ్రీ: ఒక పాటలో మేము అందమైన బొమ్మగా కనిపించి ఉండవచ్చు కానీ ఆ బొమ్మలో జీవం రావాలంటే మీ గానంతోనే సాధ్యం. పాటను చూస్తున్నంత వరకే మేము కనపడతాము. ఇంటికి వచ్చి అదే పాటను పెట్టుకుంటే కనపడేది మీరు, మీ గొంతు. మీరు ఒప్పుకోకతప్పదు.

 
సుశీలమ్మ: సరే కాంచనా! నేను పాడిన పాటల్లో నీకు నచ్చినవాటిని చెప్పు.

 
కాంచన
: ఒకటా రెండా... ‘వీరాభిమన్యు’లో అభిమన్యుడిని యుద్ధ్దానికి వెళ్లకుండా చేయాలని ‘చల్లని స్వామివి నీవైతే’ పాట, అలాగే అదే సినిమాలో ‘చూచి వలచి... ’ పాట మరపురానివి. ‘మంచి కుటుంబం’ చిత్రంలో ‘షావుకారు’ జానకిగారితో పాటుగా నాపై చిత్రీకరించిన ‘మనసే అందాల బృందావనం’... అద్భుతం.

 
సుశీలమ్మ
: ఆ పాటలో స్వరాల వద్ద నీ లిప్ మూమెంట్, తాళం కరెక్ట్‌గా ఉంది. ఎలా చేశావ్?

 
కాంచన
: పాటను ఇంటికి తెచ్చుకుని మా అమ్మ వద్ద తాళం నేర్చుకుని మరీ నటించాను. (వెంటనే చక్కగా పాడి వినిపించడంతో సుశీలమ్మతోపాటూ రాజశ్రీ, సచ్చు చప్పట్లు కొట్టేశారు.)

 
రాజశ్రీ:
  ఆ రోజులు ఇప్పుడెక్కడ? మేమంతా రిటైర్ అయిపోయాం. మీరు ఎవర్‌గ్రీన్‌గా నిలిచి ఉన్నారు... (నవ్వుతూ)

 
సుశీలమ్మ
: నిజమే... నువ్వు చెబుతోంటే ఓ మాట గుర్తొస్తోంది. ఒకసారి సభలో ఏఎన్నార్‌గారు ‘నాతో 83 మంది హీరోయిన్స్ పనిచేశారు వారందరినీ సుశీలగారిలో చూసుకుంటున్నాను’ అని చమత్కరించారు. అయితే ఆ 83 మందితోపాటూ ఇతర ఎందరో హీరోలతో పనిచేసిన హీరోయిన్లకు కూడా పాడాను. ఇంతమందికి పాడే భాగ్యం నాకు కలిగింది.


(ఇంతలో తమిళ ప్రఖ్యాత హాస్యనటి సచ్చు (అసలు పేరు సరస్వతి) రంగప్రవేశం చేశారు. సచ్చును చూడగానే ‘హలో వాంగో, రామ్మా’ అంటూ తెలుగు, తమిళాల్లో సుశీలమ్మ ఆహ్వానించి పెద్దగా నవ్వేశారు.)

 
సచ్చు (సరస్వతి):
కంగ్రాచ్యులేషన్స్ అమ్మా! మీరు గిన్నిస్ రికార్డు సాధించడం నాకు రెండు విధాలుగా గర్వకారణం. మొదటిది నేను కూడా మీలాగే సినిమా రంగంలో ఉండటం, రెండోది నేను మీ ఇంటి పక్కనే  నివాసం ఉండటం. హ హ్హ హ్హ. మన రోజులు బంగారం. మీ పాటలు అమోఘం.

 
సుశీలమ్మ
: అవును ‘సీతారామ కల్యాణం’లో చిన్ని సీతగా వేశావు కదా!

 
సచ్చు: లేదమ్మా! ‘మాయాబజార్’లో చిన్ని శశిరేఖగా నటించాను. బాలనటిగా అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో  నటించాను. మీరు నాకు చాలా పాటలు పాడారు. అయితే వాటిల్లో ఎక్కువ తమిళం.

 
సుశీలమ్మ
: కాంచనా... నువ్వు నన్ను మొదటిసారి ఎప్పుడు చూశావు?

 
కాంచన:
‘ఇద్దరు మిత్రులు’ సినిమా శతదినోత్సవానికి ఏఎన్నార్ ఇతర టీమ్ అంతా చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళుతున్నారు. వారిలో మీరు కూడా ఉన్నారు. అదే విమానంలో నేను ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నాను. మిమ్మల్ని చూసి ఎంతో సంతోషపడ్డాను.

 
సుశీలమ్మ: నాక్కూడా గుర్తుంది. ఈ పిల్ల ఎంత అందంగా ఉంది, ఎయిర్ హోస్టెస్‌గా ఎందుకు పనిచేస్తోంది అనుకున్నాను.


కాంచన: ఆనాడు తెలుగుసినీరంగంలోని మహామహులను చూసినపుడు ఒకనాటికి నేను చిత్రసీమలోకి వస్తాను, మీరు నాకు పాడే భాగ్యం కలుగుతుందని ఊహించలేదు. ‘సువర్ణసుందరి’ నా ఫస్ట్ ఫిల్మ్. నాగకన్యగా చిన్న పాత్ర వేశాను. కాని ఆ సినిమా రిలీజైన తరువాత అందులో మీరు పాడిన ‘పిలువకురా... అలుగకురా...’ గీతాన్ని ఎంతో ఇష్టంగా ఆలపించేదాన్ని.

సుశీలమ్మ: ప్రతి సినిమా విజయానికి సంగీతం ఎంతో ముఖ్యం. నేను పాడేటపుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారో తెలియదు. సంగీత దర్శకులు, రచయితలు సూచించిన భావంతో  మీలాంటి అందమైన ఫేసులకు పాడి నా వాయిస్‌ను ప్రూవ్ చేసుకున్నాను. హీరోయిన్‌కు తగినట్టుగా వాయిస్‌ను మార్చి పాడటం నాకు రాదు. నేను అలా చేయను. సరే సచ్చూ! ఇంతకీ, నువ్వు నన్ను మొదటిసారిగా ఎక్కడ చూసావు?


సచ్చు: మనిద్దరం ఏవీఎం సంస్థ కళాకారులమే కదా! మిమ్మల్ని మొదటి సారి ఏవీఎం రికార్డింగు స్టూడియోలో దూరం నుండి చూశాను. అప్పుడు నాకు 15 ఏళ్లు. సినిమాలో మీ చేత ఒక ప్రేమపాట పాడించారు. నాకేమో సెట్స్‌లో లవ్వు రాలేదు. డైరక్టరేమో ‘ఏందమ్మా ఆమె ఏమో ఎంతో లవ్వుగా పాడారు, నీకేమో లవ్వు రావడం లేద’ని ఆటపట్టించారు. మీ పాటలోనే మాకు మంచి ఎక్స్‌ప్రెషన్స్ అందిస్తారు, ఆ భావాలను తెరపై వ్యక్తీకరించడమే మా పని. మాతృభాష తెలుగైనా తమిళం, కన్నడం, మలయాళం.. ఇలా అనేక భాషల్లో నేటివిటీ చెడకుండా అడేంగప్పా... అంత చక్కగా ఎలా పాడగలిగారు!

రాజశ్రీ: మీ వాయిస్ మా నటనకు ఎంతో హెల్ప్ అయింది. ‘అది ఒక ఇదిలే’ పాట లేకుంటే రాజశ్రీ లేదు (నవ్వుతూ).

 
సుశీలమ్మ: హ హ హ.  ఎంతమంది హీరోయిన్లకు, వ్యాంప్‌లకు పాడాను. ‘గుగ్గుగ్గు గుడిసుంది, మమ్మమమ్మ మంచముంది..’ అనే పాటను జయమాలిని కోసం నా చేత బలవంతంగా పాడించారు.


రాజశ్రీ: ఆ పాట పాడిన మీ గొంతు వేరు, మీరు వేరు. నేను కూడా ఏవీఎం స్టూడెంట్‌నే! మీరు ప్రివ్యూ షోలకు వచ్చేటప్పుడు చూసేదాన్ని. తల వంచుకు వచ్చేవారు. సినిమా అయిన తరువాత పలకరిద్దామంటే అలానే తలవంచుకు వెళ్లేవారు. నాలాంటి కొత్తగా వచ్చిన హీరోయిన్లకు సుశీలగారు పాడుతున్నారంటే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్లం. ఇవాళ్టి మన మీటింగ్‌కు మరో విశేషం ఉంది తెలుసా! 1964లో విడుదలైన ‘ప్రేమించి చూడు’ బ్యాచ్ ఈరోజు కలిసింది. ‘ప్రేమించి చూడు’ చిత్రంలో నేను, కాంచన తెలుగు, తమిళంలో కూడా నటిస్తే... సచ్చు ‘కాదలిక్క నేరమిల్లై’ తమిళంలో మాతో కలిసి నటించింది.

సాక్షి: మీ చిన్నప్పటి రోజుల గురించి కొంచెం వివరిస్తారా?

 
సుశీలమ్మ: చదువు ఒంటబట్టలేదు. సరిగా చదువుకోవడం లేదని 8,9 ఏళ్లపుడు పనిష్మెంటుగా మలమల మాడే ఎండలో అ..ఆలు దిద్దించేవారు. అయినా ప్చ్... అయితే స్కూల్ రోజుల నుండి పాటే ప్రాణంగా ఎదిగాను.


కాంచన : గాయనిగా సినీరంగ ప్రవేశం గురించి ఒక్కసారి గుర్తుచేసుకుంటారా?

 
సుశీలమ్మ
: మొదట ఆలిండియా రేడియోలో బాలానందం కార్యక్రమం నిర్వహిస్తుండగా సినిమా సెలక్షన్స్‌కు పిలిపించారు. 1951లో ‘కన్నతల్లి’ అనే తెలుగు చిత్రంలో గజేంద్ర మోక్షంలోని ‘లావొక్కింతయు  లేదు...’ అనే పద్యంతో నా ప్రయాణం ప్రారంభం అయింది. ఏవీఎం స్టాఫ్ ఆర్టిస్టుగా మూడేళ్లు అగ్రిమెంటుపై పనిచేశాను. నెలజీతం రూ.500, ఆ కాలంలో అదే పెద్ద వేతనం.

 
కాంచన:  మీకు ఇష్టమైన సంగీత దర్శకులు, గాయనీమణి?

 
సుశీలమ్మ
: సంగీత దర్శకుల్లో ఎవరు ఇష్టమంటే ఏమీ చెప్పను. అందరూ మహానుభావులే. అయితే గాయని గీతాదత్ అంటే మాత్రం మహా ఇష్టం.

 
రాజశ్రీ: మీకు నటిగా కూడా అవకాశం వచ్చిందట కదా? 

 
సుశీలమ్మ: అవును. కర్పగం స్టూడియో గోపాలకృష్ణగారు ఒక తమిళ సినిమా కోసం మీరాబాయిగా నటించమని అడిగారు. కోటి రూపాయలు ఇచ్చినా యాక్ట్ చేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాను.

 
రాజశ్రీ:
మీది ప్రేమ వివాహమా?

 
సుశీలమ్మ
: నా సోదరుడి కోసం మోహన్‌రావు అనే వ్యక్తి వచ్చేవారు. ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. నేను అప్పటికే పాటలు పాడుతుండటంతో ముందు నా అభిమాని అయ్యారు. తరువాత నా భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్.

 
సచ్చు: గాయనిగా రికార్డింగుకు ముందు తీసుకునే జాగ్రత్తలు? 

 
సుశీలమ్మ
: పుట్టినప్పటి నుంచి గొంతులో టాన్సిల్స్ ఉన్నాయి. వాటిని తొలగించవచ్చని వైద్యులు సూచించగా మావారు ఒప్పుకోలేదు. అంతేగాదు, ఒక వైద్యుడు ఆ టాన్సిల్స్ వల్లనే ఆమె గొంతు మరింత శ్రావ్యంగా మారిందని చెప్పడంతో ఇక ఆ విషయం జోలికి వెళ్లలేదు. అయితే రికార్డింగుకు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నేను, ఎస్పీబాలు కలిసి ట్రాక్‌ల ద్వారా ఒకే రోజు 11 పాటలు పాడినంత బిజీ షెడ్యూల్ ఉంది.

 
సాక్షి:
  రామకృష్ణతో డ్యూయెట్లు పాడారు. మీకేమైనా ఇబ్బంది అనిపించలేదా?  


సుశీలమ్మ: రామకృష్ణ మా అక్క కొడుకు. కుమారుని వరుసే! అలాగని డ్యూయట్ పాడక తప్పదు. కళాకారులకు వృత్తివేరు, బంధుత్వం వేరు.

 సాక్షి: గాయనిగా మీ వారసురాలు ఎవరైనా ఉన్నారా?

 
సుశీలమ్మ: నా కోడలు జేకే సంధ్యకు మంచి వాయిస్ ఉంది. గజల్స్ సహా అనేక పాటలు పాడుతోంది. నా వారసురాలిగా ఎదిగితే మంచిదే.

 
సాక్షి
: మీ సేవా కార్యక్రమాలు?...

 కళాకారిణిగా తోటి పేదకళాకారులను ఆదుకోవాలనే తలంపుతో 20 మందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాను. ప్రముఖ నేపథ్యగాయకులు దివంగత పిఠాపురం నాగేశ్వరరావుగారి 70 ఏళ్ల కుమారునికి సైతం ఆర్థికసాయం అందజేయడంపై బాధపడాలో ఆనందించాలో అర్థం కావడంలేదు.

 
సాక్షి: గిన్నిస్ రికార్డు సాధించినా ఇంకా ఏమైనా తీరనిలోటు ఉందా?

 
సుశీలమ్మ:  ఎక్కడో విజయనగరంలో పల్లెటూర్లో పుట్టి ఇక్కడకు వచ్చి ఇంతమంది అభిమానాన్ని పొందాను. ఇంకేం కావాలి? 

 
సచ్చు
: ఈ రోజు మీలాంటి గాయని పక్కన కూర్చోవడమే మా అదృష్టం. దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాం.

 
సుశీలమ్మ
: మీకు కూడా. హీరోయిన్లు లేకపోతే నేను లేను. ఈ విషయంలో మనమంతా రాజీపడిపోదాం! (నవ్వులు...)  

 - కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

 

 

మరచిపోలేని జ్ఞాపకం?
సుశీలమ్మ: ‘నీవుండే... దా కొండపై ఓ స్వామి నేనుండేదీ నేలపై’ పాట పాడిన కొత్తల్లో మా నాన్న చనిపోయారు. రిజర్వేషన్ లేకుండా థర్డ్‌క్లాస్ కంపార్టుమెంటులో అందరం హడావిడిగా విజయనగరం బయలుదేరాం. ఒక భిక్షగాడు అదే పాటను పాడుకుంటూ నా వద్దకు వచ్చాడు. ఆనందించనా? దుఃఖించనా? అది మరచిపోలేని సంఘటన.

 
80 ఏళ్ల వయస్సులోనూ మీలోని ఉత్సాహం, గ్లామర్ వెనక ఉన్న రహస్యం?

సుశీలమ్మ: నా గ్లామర్, ఆరోగ్య రహస్యం 24 గంటలు దైవ ధ్యానమే.

 
మీ హాబీలు?
సుశీలమ్మ: షాపింగ్ అంటే మహా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా నగలు, చీరలు కొనేందుకు వెళుతుంటాను.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement