P. Susheela
-
ప్రముఖ గాయని పి.సుశీలను అవార్డ్‌తో సత్కరించిన తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గాన కోకిల పి.సుశీల, ప్రొఫెసర్, రచయిత, కవి మహ్మద్ మెహతాలను అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఏటా జూన్ 3న ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తమిళ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించినవారిని సత్కరించే క్రమంలో పి. సుశీల పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ (కరుణానిధి స్మారక కళారంగ మాంత్రికులు) పురస్కారాన్ని గాయని పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. చెన్నైలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు పురస్కారంతో పాటు రూ.10లక్షల బ్యాంకు చెక్, జ్ఞాపికను స్టాలిన్ అందజేశారు.ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించిన పి. సుశీల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. దీంతో ఆమెను గౌరవించే విధంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్వీన్ ఆఫ్ మెలోడి, గాన కోకిలగా కొనియాడుతున్న ఆమెను ఇలా సత్కరించినందుకు సంతోషంగా ఉందని అభిమానులు తెలుపుతున్నారు. -
క్షేమంగా ఇంటికి చేరుకున్న గాయని పి.సుశీల.. వీడియో విడుదల
ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. తాను క్షేమంగా ఉన్నానంటూ అభిమానుల కోసం తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. రెండురోజుల క్రితం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స తీసుకున్న సుశీల క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.తాజాగా ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు. 'ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు. మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి. దేవుడిని నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు. నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు. నన్ను అభిమానించే వారందరికీ నా కృతజ్ఞతలు. మీరందరూ ఎప్పుడూ చల్లగా ఉండాలి.' అని ఆమె కోరుకున్నారు.క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల.. అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు. కావేరి ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో 45వేలకు పైగా పాటలు పాడారు. కోట్ల సంఖ్యలు అభిమానులను సుశీల సంపాధించుకున్నారు. -
మెలోడీ క్వీన్, లెజెండ్రీ సింగర్స్, ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు నేపథ్య సంగీతంలో ఆమె గళం అమరం. భావితరాలకు మెలోడీ క్వీన్ పాటే కొండంత వెలుగు..ఒక పాఠశాల. ఏ దేశమేగినా అని దేశభక్తిని పొంగించినా.. మీర జాలగలడా నా ఆనతి అని పాడినా.. వస్తాడు నా రాజు అంటూ ఆమె గళమెత్తినా, ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’, ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని రేడియోలో పాట ప్రసారం కాని లేని దీపావళి లేదు. ముత్యముంతా పసుపు ముఖమంతా ఛాయ అన్నా, ఝుమ్మంది నాదం సై అంది పాదం అని మురిపించినా ఆమెకు ఆమే సాటి. లతాజీతో గురుబంధం తనకు ఇష్టమైన గాయని లతా మంగేష్కర్ అని స్వయంగా సుశీలమ్మ గారే చాలా సందర్భంగా గర్వంగా ప్రకటించారు. ఆమె పాటలు వింటూ ఎదిగిన తాను, ఆమె గొంతును దొంగిలించాను అంటారామె. అలా లతాజీ తన మానసిక గురువు ఆమె అని చెబుతారు. అలాగే లతాజీ కూడా సుశీలమ్మను తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు. అలాగే ముంబాయి వెళితే లతాజీని కలవకుండాక రారు సుశీలమ్మ. అంతటి స్నేహం, గురుభావం ఇద్దరి మధ్య ఉంది. హిందీ సినిమాలలో లతా మంగేష్కర్ ‘మహల్’ (1949) సినిమాతో స్టార్డమ్లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్డమ్లోకి వచ్చారు. సుశీలమ్మను సౌత్ ఇండియా లతా మంగేష్కర్ అని కూడా పిలుచుకుంటారట. వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదట. ముఖ్యంగా 1969లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ ఉత్తమ గాయనిగా సుశీల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన తోటిగాయనిని ప్రత్యేకంగా సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అలాగే ఒకసారి చెన్నై వచ్చి సుశీలమ్మ తలుపు తట్టి ఆశ్చర్యపరిచారట లతా మంగేష్కర్. సుశీలమ్మ బయోపిక్, ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకుడు , ఆస్కార్ విన్నర్ ఏఆర్రహమాన్ ఇటీవల వెల్లడించారు. తొలి ప్రొడక్షన్ , క్లాసిక్ మూవీ ‘‘99 సాంగ్స్’’ ప్రమోషన్లో భాగంగా సుశీల తన బయోపిక్‌ను తీయాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు రెహమాన్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన అనంతరం దీనఇన ఓటీటీలో కూడా విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌పై ఈఏడాది మేలో ట్విటర్ స్పేస్ సెషన్లో రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 99 సాంగ్స్ చూశారా అని అడిగినపుడు చూడలేదని చెప్పారని, అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను చూడాలని కోరినట్టు తెలిపారు. తన కోరిక మేరకు సినిమా చూసిన సుశీలమ్మ సినిమా చాలా బాగుందని ప్రశంసించడంతోపాటు, తన తన కథను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మీరు సహాయం చేస్తారా? అని అడిగారని ఆ సందర్భంగా రివీల్ చేశారు. అంతేకాదు తన ఫ్యావరెట్ సింగర్ తన సినిమాకి ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. దీంతో తమ అభిమాన గాయని బయోపిక్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జానకికి తొలి అవార్డు జానకితోపాటు, తోటిగాయనీ మణులందరితోనూ కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు సుశీల. ముఖ్యంగా తన పేరిట తీసుకొచ్చిన తొలి అవార్డును ఎస్ జానకికి ఇచ్చి సత్కరించడాన్ని ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటారు. రెండో ఏడాది గానగంధర్వుడు ఎస్ పీ బాలూకి, మూడవ ఏడాది కేజే ఏసుదాసుగారికి ఇచ్చారు. అంతేకాదు కొన్నివేల మంది గాయకులకు 2 వేలు పెన్షన్ అందిస్తున్నారు. ఫ్యామిలీ సుశీలమ్మగారి సోదరుడి కోసం వచ్చిన మోహన్‌రావు గారు సుశీలమ్మను చూసి ఇష్టపడ్డారు. ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. అయితే అప్పటికే పాటలు పాడుతున్న సుశీలగారు అభిమాని కావడంలో ఆశ్చర్యమేముంది. అలా ఆ తరువాత భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్. సుశీల భర్త వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు.. జయశ్రీ- శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ `ఇరువర్` అనే తమిళ చిత్రంలో ఏఆర్ రహమాన్‌తో కలసి అరంగేట్రం చేశారామె. అలా రెహామాన్కి సుశీలమ్మ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉంది. -
నేను క్షేమంగానే ఉన్నా: పి.సుశీల
సాక్షి, తమిళసినిమా(చెన్నై): ప్రఖ్యాత గాయని పి.సుశీల మరణించారం టూ వాట్సాప్‌లో ఓ ఆకతాయి దుష్ప్రచారం చేయడంతో.. తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. వాట్సాప్‌లో వచ్చిన పోస్టింగ్‌లో నిజం లేదనీ, అది వట్టి వదంతేనంటూ ఓ సెల్ఫీ వీడియోను శుక్రవారం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. -
ఆ అమ్మాయి ఆనందంతో ఏడ్చేసింది!
రేడియో జ్ఞాపకాలు ఒకసారి ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో బాలమురళి నేషనల్ ప్రోగ్రాం. అప్పుడన్నీ ప్రత్యక్ష ప్రసారాలే. ముందుగా రికార్డు చేయటమనేది లేదు. కార్యక్రమ పరిమితి గంటన్నర. కార్య క్రమంలో చివర మూడు లేక నాలుగు నిమిషాలకు ఆఖరి అంశం ఒక తిల్లానా. కచ్చేరీ ప్రారంభం అయి నడుస్తోంది. గడియారాల గల్లంతు ఏమైందో తెలియదు. మురళి పాడుతుంటే ఎదురుగా అనౌన్సర్ బూత్‌లోంచి కార్యక్రమ నిర్వాహకుడు ఒకాయన ఇంక 5 నిమిషాలే ఉంది అంటూ సంజ్ఞ చేశారు. సరే మురళి పాడుతున్న కీర్తనని అందంగా ముగించి, తిల్లానా ఆరంభించారు. సగం అయిన తర్వాత గాభరాగా అవతల అద్దంలోంచి ఒకటే సంజ్ఞలు - ‘ఆపవద్దని, ఇంకా 15 నిముషాలు టైం ఉందనీ!’ లైవ్ స్టూడియోలోకి వెళ్ళి చెప్పడానికి వీలులేదు. విషయం గ్రహించిన మురళి ఏ తొట్రుపాటు గాని, చిరాకు గాని ప్రదర్శించకుండా ఆ తిల్లానా అప్పటికప్పుడు రకరకాల తాళగ తులతో, రకరకాల విన్యాసాలతో ఎంతోకాల కష్టపడి ఏర్చికూర్చి తయారుచేసి, ఎంతో సాధన చేసి పాడుతున్న రచనలా, పాడింది పాడకుండా, అడుగడుగునా నవ్యత స్ఫురిస్తూ, సుమారు 20 నిమిషాలు పాడారు. ఆ తిల్లానా మురళి పాడిన తీరు అనితరసాధ్యం అని ఆనాడు మురళి కచ్చేరీకి మృదంగం వాయించిన దండమూడి రామమోహనరావు నాతో అన్నారు. ఆయన హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత ప్రయోక్తగా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు సాయంకాలం 5 గంటలకు ఇంటికి వెళ్లేముందు స్టూడియోలోకి వచ్చారు. నేను కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాను. విషయం ఏమిటి? అని ఆయన అడిగితే ‘5.30కి లలిత సంగీతం లైవ్ ప్రోగ్రామ్ ఉంది. ఆర్టిస్టు వచ్చి స్టూడియోలో కూచుంది. డ్యూటీ వేసిన వయొలినిస్టు రాలేదు’’ అని నేను చెప్పగానే ఆయన ఇన్స్ట్రుమెంట్స్ రూమ్ ఎక్కడ ఉందో చూపించమంటూ నాతో వచ్చి, బీరువాలో ఉన్న వయొ లిన్తీసి ‘పదండి’ అంటూ నాతో వచ్చి, ఆర్టిస్టు కూచున్న స్టూడియోకి వచ్చి ఆర్టిస్టు పక్కన కూర్చుని, వయొలిన్ శ్రుతి చేసి, ‘ఏమి పాడుతావమ్మా‘ అని చనువుగా అడిగేటప్పటికి, ఆ అమ్మాయికి తన పాట సంగతి అటుంచి నోట మాట రాలేదు. తనలాంటి చిన్న లైట్ మ్యూజిక్ ఆర్టిస్టుకి, బాల మురళిగారు వయొలిన్ వాయించడమా! చిరునవ్వుతో ఆ అమ్మాయి కంగారు పోగొట్టి, ప్రోత్సాహపరచి, పక్కన అనుకూలంగా వయొలిన్ వాయించారు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆ అమ్మాయి ఆయన కాళ్ల మీద పడి ‘ఎవరికీ దొరకని అదృష్టం దొరికింది. నాకు జన్మంతా జ్ఞాపకం ఉంటుంది ఈ సంఘటన’’ అంది కంటినిండా నీళ్లతో. ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు! ‘‘జాతస్యహి ధ్రువో మృత్యుః... పుట్టినవారు మరణించక మానరు. కానీ, బాలమురళి గారు పోయారంటే, ఇది నిజం కాకుండా ఉంటే బాగుండనిపిస్తోంది. నాకు నోట మాట రావడం లేదు. ఆయనతో పాడిన పాటలు, ఆ క్షణాలు అన్నీ గుర్తొస్తున్నాయి. నేనిప్పుడు పుట్టపర్తిలో దేవుడి దగ్గర ఉన్నాను. బాలమురళి గారు ఆ దేవదేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు.’’ - ‘పద్మభూషణ్’ పి. సుశీల ప్రముఖ సినీ నేపథ్య గాయని -
ఇక...‘స్వర సామ్రాజ్ఞి’
సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని ‘పద్మభూషణ్’ పి. సుశీల విమల గాంధర్వ గాత్రానికి కోట్ల సంఖ్యలో అభిమాను లున్నారు. ఆ గాత్ర మాధుర్యానికి పరవశించి, దేశ విదేశాల్లో ఇప్పటి దాకా ఎన్నో సత్కారాలు, మరెన్నో బిరుదాలు దక్కాయి. వేల సంఖ్య లో పాటలు పాడిన ఈ గాయనీమణి పేరు ఇటీవలే ‘గిన్నిస్ బుక్’ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకీ ఎక్కింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆమెకు ఘన సత్కారం జరగనుంది. ఈ గానకోకిల కీర్తికిరీటంలో ‘స్వర సామ్రాజ్ఞి’ అనే మరో కొత్త బిరుదు వచ్చి చేరనుంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే భారీ వేడుకలో ఈ బిరుదు ప్రదానం జరగనుంది. ‘‘సుశీలగారి ముందు, తరువాతి తరాల గాయనీ గాయకుల మొదలు సినీ, రాజకీయ, సాంస్కృతిక, కళా రంగాల ప్రముఖులెంతో మంది ఈ సన్మానంలో పాలుపంచుకొంటారు’’ అని ఈ సత్కార నిర్వాహకులు, ‘సంగమం’ వ్యవస్థాపకులు సంజయ్ కిశోర్ తెలిపారు. -
సుశీలకు ఇష్టమైన ఫ్యామిలీ...
వసంతంలో కోకిల పాటలు వినపడతాయి. వసంతాన్ని నిత్య వసంతంగా మార్చిన గానకోకిల పి.సుశీల. తాజాగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన సుశీలతో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆమె సంతోషాన్ని సాక్షి పాఠకులతో పంచుకోవాలని ఆశ కలిగింది. ఎవరు చేస్తే బాగుంటుంది?... అన్న ప్రశ్నకు మంచి సమాధానమే దక్కింది. తనకిష్టమైన వాళ్లతో చేయిస్తే బాగుంటుంది... అదీ ఇష్టాగోష్ఠిగా చేయిస్తే ఇంకా బాగుంటుంది... ‘మీ నేపథ్య గానం వల్లే మేము ప్రేక్షకులకు దగ్గరయ్యామని’ కాంచన, రాజశ్రీ.... ‘కాదు నా పాటకు వన్నె తెచ్చింది మీ అందమే’నని సుశీలా... తమ గొప్పదనాన్ని ఆప్యాయంగా ఒకరికొకరు ఆపాదించుకుంటూ ఉంటే... మన కుటుంబాలు కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండు అనిపించింది. రాజశ్రీ, కాంచన: కంగ్రాచ్యులేషన్స్... గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి, తెలుగు వారికీ, పాటకూ ఘనకీర్తిని సంపాదించి పెట్టారు... పి. సుశీలమ్మ: థ్యాంక్యూ... థ్యాంక్యూ.. కాని అసలు క్రెడిట్ మీది. మీరందరూ నా పాటకు బాగా నటించి రికార్డు మాత్రం నాకు ఇచ్చారు. కాంచన: క్రెడిట్ మాదా! ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉంటే మీరు ఎనిమిదో అద్భుతం. భానుమతి తర్వాత వచ్చిన మా తరం హీరోయిన్స్‌కు, జయప్రద, జయసుధ తరం వారికి, నిన్న మొన్న హీరోయిన్లకు కూడా పాడారంటే ఏమి చెప్పేది... మాటలు రావడం లేదు. రాజశ్రీ: ఒక పాటలో మేము అందమైన బొమ్మగా కనిపించి ఉండవచ్చు కానీ ఆ బొమ్మలో జీవం రావాలంటే మీ గానంతోనే సాధ్యం. పాటను చూస్తున్నంత వరకే మేము కనపడతాము. ఇంటికి వచ్చి అదే పాటను పెట్టుకుంటే కనపడేది మీరు, మీ గొంతు. మీరు ఒప్పుకోకతప్పదు. సుశీలమ్మ: సరే కాంచనా! నేను పాడిన పాటల్లో నీకు నచ్చినవాటిని చెప్పు. కాంచన: ఒకటా రెండా... ‘వీరాభిమన్యు’లో అభిమన్యుడిని యుద్ధ్దానికి వెళ్లకుండా చేయాలని ‘చల్లని స్వామివి నీవైతే’ పాట, అలాగే అదే సినిమాలో ‘చూచి వలచి... ’ పాట మరపురానివి. ‘మంచి కుటుంబం’ చిత్రంలో ‘షావుకారు’ జానకిగారితో పాటుగా నాపై చిత్రీకరించిన ‘మనసే అందాల బృందావనం’... అద్భుతం. సుశీలమ్మ: ఆ పాటలో స్వరాల వద్ద నీ లిప్ మూమెంట్, తాళం కరెక్ట్‌గా ఉంది. ఎలా చేశావ్? కాంచన: పాటను ఇంటికి తెచ్చుకుని మా అమ్మ వద్ద తాళం నేర్చుకుని మరీ నటించాను. (వెంటనే చక్కగా పాడి వినిపించడంతో సుశీలమ్మతోపాటూ రాజశ్రీ, సచ్చు చప్పట్లు కొట్టేశారు.) రాజశ్రీ: ఆ రోజులు ఇప్పుడెక్కడ? మేమంతా రిటైర్ అయిపోయాం. మీరు ఎవర్‌గ్రీన్‌గా నిలిచి ఉన్నారు... (నవ్వుతూ) సుశీలమ్మ: నిజమే... నువ్వు చెబుతోంటే ఓ మాట గుర్తొస్తోంది. ఒకసారి సభలో ఏఎన్నార్‌గారు ‘నాతో 83 మంది హీరోయిన్స్ పనిచేశారు వారందరినీ సుశీలగారిలో చూసుకుంటున్నాను’ అని చమత్కరించారు. అయితే ఆ 83 మందితోపాటూ ఇతర ఎందరో హీరోలతో పనిచేసిన హీరోయిన్లకు కూడా పాడాను. ఇంతమందికి పాడే భాగ్యం నాకు కలిగింది. (ఇంతలో తమిళ ప్రఖ్యాత హాస్యనటి సచ్చు (అసలు పేరు సరస్వతి) రంగప్రవేశం చేశారు. సచ్చును చూడగానే ‘హలో వాంగో, రామ్మా’ అంటూ తెలుగు, తమిళాల్లో సుశీలమ్మ ఆహ్వానించి పెద్దగా నవ్వేశారు.) సచ్చు (సరస్వతి): కంగ్రాచ్యులేషన్స్ అమ్మా! మీరు గిన్నిస్ రికార్డు సాధించడం నాకు రెండు విధాలుగా గర్వకారణం. మొదటిది నేను కూడా మీలాగే సినిమా రంగంలో ఉండటం, రెండోది నేను మీ ఇంటి పక్కనే నివాసం ఉండటం. హ హ్హ హ్హ. మన రోజులు బంగారం. మీ పాటలు అమోఘం. సుశీలమ్మ: అవును ‘సీతారామ కల్యాణం’లో చిన్ని సీతగా వేశావు కదా! సచ్చు: లేదమ్మా! ‘మాయాబజార్’లో చిన్ని శశిరేఖగా నటించాను. బాలనటిగా అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. మీరు నాకు చాలా పాటలు పాడారు. అయితే వాటిల్లో ఎక్కువ తమిళం. సుశీలమ్మ: కాంచనా... నువ్వు నన్ను మొదటిసారి ఎప్పుడు చూశావు? కాంచన: ‘ఇద్దరు మిత్రులు’ సినిమా శతదినోత్సవానికి ఏఎన్నార్ ఇతర టీమ్ అంతా చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళుతున్నారు. వారిలో మీరు కూడా ఉన్నారు. అదే విమానంలో నేను ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నాను. మిమ్మల్ని చూసి ఎంతో సంతోషపడ్డాను. సుశీలమ్మ: నాక్కూడా గుర్తుంది. ఈ పిల్ల ఎంత అందంగా ఉంది, ఎయిర్ హోస్టెస్‌గా ఎందుకు పనిచేస్తోంది అనుకున్నాను. కాంచన: ఆనాడు తెలుగుసినీరంగంలోని మహామహులను చూసినపుడు ఒకనాటికి నేను చిత్రసీమలోకి వస్తాను, మీరు నాకు పాడే భాగ్యం కలుగుతుందని ఊహించలేదు. ‘సువర్ణసుందరి’ నా ఫస్ట్ ఫిల్మ్. నాగకన్యగా చిన్న పాత్ర వేశాను. కాని ఆ సినిమా రిలీజైన తరువాత అందులో మీరు పాడిన ‘పిలువకురా... అలుగకురా...’ గీతాన్ని ఎంతో ఇష్టంగా ఆలపించేదాన్ని. సుశీలమ్మ: ప్రతి సినిమా విజయానికి సంగీతం ఎంతో ముఖ్యం. నేను పాడేటపుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారో తెలియదు. సంగీత దర్శకులు, రచయితలు సూచించిన భావంతో మీలాంటి అందమైన ఫేసులకు పాడి నా వాయిస్‌ను ప్రూవ్ చేసుకున్నాను. హీరోయిన్‌కు తగినట్టుగా వాయిస్‌ను మార్చి పాడటం నాకు రాదు. నేను అలా చేయను. సరే సచ్చూ! ఇంతకీ, నువ్వు నన్ను మొదటిసారిగా ఎక్కడ చూసావు? సచ్చు: మనిద్దరం ఏవీఎం సంస్థ కళాకారులమే కదా! మిమ్మల్ని మొదటి సారి ఏవీఎం రికార్డింగు స్టూడియోలో దూరం నుండి చూశాను. అప్పుడు నాకు 15 ఏళ్లు. సినిమాలో మీ చేత ఒక ప్రేమపాట పాడించారు. నాకేమో సెట్స్‌లో లవ్వు రాలేదు. డైరక్టరేమో ‘ఏందమ్మా ఆమె ఏమో ఎంతో లవ్వుగా పాడారు, నీకేమో లవ్వు రావడం లేద’ని ఆటపట్టించారు. మీ పాటలోనే మాకు మంచి ఎక్స్ప్రెషన్స్ అందిస్తారు, ఆ భావాలను తెరపై వ్యక్తీకరించడమే మా పని. మాతృభాష తెలుగైనా తమిళం, కన్నడం, మలయాళం.. ఇలా అనేక భాషల్లో నేటివిటీ చెడకుండా అడేంగప్పా... అంత చక్కగా ఎలా పాడగలిగారు! రాజశ్రీ: మీ వాయిస్ మా నటనకు ఎంతో హెల్ప్ అయింది. ‘అది ఒక ఇదిలే’ పాట లేకుంటే రాజశ్రీ లేదు (నవ్వుతూ). సుశీలమ్మ: హ హ హ. ఎంతమంది హీరోయిన్లకు, వ్యాంప్‌లకు పాడాను. ‘గుగ్గుగ్గు గుడిసుంది, మమ్మమమ్మ మంచముంది..’ అనే పాటను జయమాలిని కోసం నా చేత బలవంతంగా పాడించారు. రాజశ్రీ: ఆ పాట పాడిన మీ గొంతు వేరు, మీరు వేరు. నేను కూడా ఏవీఎం స్టూడెంట్‌నే! మీరు ప్రివ్యూ షోలకు వచ్చేటప్పుడు చూసేదాన్ని. తల వంచుకు వచ్చేవారు. సినిమా అయిన తరువాత పలకరిద్దామంటే అలానే తలవంచుకు వెళ్లేవారు. నాలాంటి కొత్తగా వచ్చిన హీరోయిన్లకు సుశీలగారు పాడుతున్నారంటే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్లం. ఇవాళ్టి మన మీటింగ్‌కు మరో విశేషం ఉంది తెలుసా! 1964లో విడుదలైన ‘ప్రేమించి చూడు’ బ్యాచ్ ఈరోజు కలిసింది. ‘ప్రేమించి చూడు’ చిత్రంలో నేను, కాంచన తెలుగు, తమిళంలో కూడా నటిస్తే... సచ్చు ‘కాదలిక్క నేరమిల్లై’ తమిళంలో మాతో కలిసి నటించింది. సాక్షి: మీ చిన్నప్పటి రోజుల గురించి కొంచెం వివరిస్తారా? సుశీలమ్మ: చదువు ఒంటబట్టలేదు. సరిగా చదువుకోవడం లేదని 8,9 ఏళ్లపుడు పనిష్మెంటుగా మలమల మాడే ఎండలో అ..ఆలు దిద్దించేవారు. అయినా ప్చ్... అయితే స్కూల్ రోజుల నుండి పాటే ప్రాణంగా ఎదిగాను. కాంచన : గాయనిగా సినీరంగ ప్రవేశం గురించి ఒక్కసారి గుర్తుచేసుకుంటారా? సుశీలమ్మ: మొదట ఆలిండియా రేడియోలో బాలానందం కార్యక్రమం నిర్వహిస్తుండగా సినిమా సెలక్షన్స్‌కు పిలిపించారు. 1951లో ‘కన్నతల్లి’ అనే తెలుగు చిత్రంలో గజేంద్ర మోక్షంలోని ‘లావొక్కింతయు లేదు...’ అనే పద్యంతో నా ప్రయాణం ప్రారంభం అయింది. ఏవీఎం స్టాఫ్ ఆర్టిస్టుగా మూడేళ్లు అగ్రిమెంటుపై పనిచేశాను. నెలజీతం రూ.500, ఆ కాలంలో అదే పెద్ద వేతనం. కాంచన: మీకు ఇష్టమైన సంగీత దర్శకులు, గాయనీమణి? సుశీలమ్మ: సంగీత దర్శకుల్లో ఎవరు ఇష్టమంటే ఏమీ చెప్పను. అందరూ మహానుభావులే. అయితే గాయని గీతాదత్ అంటే మాత్రం మహా ఇష్టం. రాజశ్రీ: మీకు నటిగా కూడా అవకాశం వచ్చిందట కదా? సుశీలమ్మ: అవును. కర్పగం స్టూడియో గోపాలకృష్ణగారు ఒక తమిళ సినిమా కోసం మీరాబాయిగా నటించమని అడిగారు. కోటి రూపాయలు ఇచ్చినా యాక్ట్ చేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాను. రాజశ్రీ: మీది ప్రేమ వివాహమా? సుశీలమ్మ: నా సోదరుడి కోసం మోహన్‌రావు అనే వ్యక్తి వచ్చేవారు. ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. నేను అప్పటికే పాటలు పాడుతుండటంతో ముందు నా అభిమాని అయ్యారు. తరువాత నా భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్. సచ్చు: గాయనిగా రికార్డింగుకు ముందు తీసుకునే జాగ్రత్తలు? సుశీలమ్మ: పుట్టినప్పటి నుంచి గొంతులో టాన్సిల్స్ ఉన్నాయి. వాటిని తొలగించవచ్చని వైద్యులు సూచించగా మావారు ఒప్పుకోలేదు. అంతేగాదు, ఒక వైద్యుడు ఆ టాన్సిల్స్ వల్లనే ఆమె గొంతు మరింత శ్రావ్యంగా మారిందని చెప్పడంతో ఇక ఆ విషయం జోలికి వెళ్లలేదు. అయితే రికార్డింగుకు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నేను, ఎస్పీబాలు కలిసి ట్రాక్‌ల ద్వారా ఒకే రోజు 11 పాటలు పాడినంత బిజీ షెడ్యూల్ ఉంది. సాక్షి: రామకృష్ణతో డ్యూయెట్లు పాడారు. మీకేమైనా ఇబ్బంది అనిపించలేదా? సుశీలమ్మ: రామకృష్ణ మా అక్క కొడుకు. కుమారుని వరుసే! అలాగని డ్యూయట్ పాడక తప్పదు. కళాకారులకు వృత్తివేరు, బంధుత్వం వేరు. సాక్షి: గాయనిగా మీ వారసురాలు ఎవరైనా ఉన్నారా? సుశీలమ్మ: నా కోడలు జేకే సంధ్యకు మంచి వాయిస్ ఉంది. గజల్స్ సహా అనేక పాటలు పాడుతోంది. నా వారసురాలిగా ఎదిగితే మంచిదే. సాక్షి: మీ సేవా కార్యక్రమాలు?... కళాకారిణిగా తోటి పేదకళాకారులను ఆదుకోవాలనే తలంపుతో 20 మందికి నెలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాను. ప్రముఖ నేపథ్యగాయకులు దివంగత పిఠాపురం నాగేశ్వరరావుగారి 70 ఏళ్ల కుమారునికి సైతం ఆర్థికసాయం అందజేయడంపై బాధపడాలో ఆనందించాలో అర్థం కావడంలేదు. సాక్షి: గిన్నిస్ రికార్డు సాధించినా ఇంకా ఏమైనా తీరనిలోటు ఉందా? సుశీలమ్మ: ఎక్కడో విజయనగరంలో పల్లెటూర్లో పుట్టి ఇక్కడకు వచ్చి ఇంతమంది అభిమానాన్ని పొందాను. ఇంకేం కావాలి? సచ్చు: ఈ రోజు మీలాంటి గాయని పక్కన కూర్చోవడమే మా అదృష్టం. దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాం. సుశీలమ్మ: మీకు కూడా. హీరోయిన్లు లేకపోతే నేను లేను. ఈ విషయంలో మనమంతా రాజీపడిపోదాం! (నవ్వులు...) - కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై మరచిపోలేని జ్ఞాపకం? సుశీలమ్మ: ‘నీవుండే... దా కొండపై ఓ స్వామి నేనుండేదీ నేలపై’ పాట పాడిన కొత్తల్లో మా నాన్న చనిపోయారు. రిజర్వేషన్ లేకుండా థర్డ్‌క్లాస్ కంపార్టుమెంటులో అందరం హడావిడిగా విజయనగరం బయలుదేరాం. ఒక భిక్షగాడు అదే పాటను పాడుకుంటూ నా వద్దకు వచ్చాడు. ఆనందించనా? దుఃఖించనా? అది మరచిపోలేని సంఘటన. 80 ఏళ్ల వయస్సులోనూ మీలోని ఉత్సాహం, గ్లామర్ వెనక ఉన్న రహస్యం? సుశీలమ్మ: నా గ్లామర్, ఆరోగ్య రహస్యం 24 గంటలు దైవ ధ్యానమే. మీ హాబీలు? సుశీలమ్మ: షాపింగ్ అంటే మహా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా నగలు, చీరలు కొనేందుకు వెళుతుంటాను. -
గిన్నీస్లో గాన కోకిల
ప్రముఖ సినీ నేపథ్య గాయని పి. సుశీల కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో కొత్త రత్నం వచ్చి చేరింది. ఇప్పటికి ఆరు దశాబ్దాల పైగా దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురా లైన ఈ గానకోకిల పేరు తాజాగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎక్కారు. ‘‘2016 జనవరి 28 నాటికి ధ్రువీ కరించిన సమాచారం ప్రకారం పులపాక సుశీలా మోహన్ (జననం 1935 - ఇండియా) 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలు రికార్డ్ చేశారు’’ అని గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు పేర్కొన్నారు. 1952లో తమిళ చిత్రం ‘పెట్రతాయి’ (తెలుగులో ‘కన్నతల్లి’) ద్వారా సినీ సీమకు గాయనిగా పరిచయమైన ఆమె ఇప్పటి దాకా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 40 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అంతటి ఈ ‘గాన సరస్వతి’కి భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవిం చాయి. ‘ఝుమ్మంది నాదం...’ (చిత్రం ‘సిరిసిరి మువ్వ’), ‘ప్రియే చారుశీలే...’ (చిత్రం ‘మేఘ సందేశం’) సహా వివిధ గీతాలు పాడినందుకు గాను ఇప్పటికి 5సార్లు ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఆమెను జాతీయ అవార్డులు వరించాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషాసీమల రాష్ట్రప్రభుత్వ సినీ అవార్డులు వెతు క్కుంటూ వచ్చాయి. కొంత కాలంగా సినీ నేపథ్య గానానికి దూరంగా ఉన్న ఆమె ఎనిమి దేళ్ళుగా ‘పి. సుశీల ట్రస్ట్’ ద్వారా అవసరంలో ఉన్న సంగీత కళా కారుల్ని ఆదుకుంటూ వస్తున్నారు. నాకు పలు జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. కానీ, ఇప్పుడిలా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కడం మాత్రం వినూత్నమైన అనుభూతి. ఇది గ్రేటే. ఎందుకంటారా? ఈ అరుదైన ఘనత అందరికీ దక్కదు కదా! పైగా, ఏవేవో సిఫార్సులు, పైరవీలు చేస్తే ఇది వచ్చేది కూడా కాదు. నిజానికివాళ ఉదయమే శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చా. ఇంటికి వచ్చేసరికి పోస్ట్‌లో గిన్నీస్‌బుక్ వారి నుంచి ఈ సర్టిఫికెట్ వచ్చి ఉంది. ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అందుకే, ఈ విషయాన్ని సంగీతప్రియులతో, నా అభిమానులతో పంచుకోవాలనుకున్నా. నిజానికి, ఈ ఘనత నాది కాదు. నన్ను ఆదరించిన సినీ పరిశ్రమది. నన్ను అభిమానించిన ప్రేక్షకులది. అమెరికా, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న నా వీరాభిమానులు ఏడుగురు నా పేరు మీద వెబ్సైట్ పెట్టి, నేను పాడిన పాటలన్నీ సేకరించి, అందులో అప్లోడ్ చేశారు. ఆ ఏడుగురిలో ఇద్దరు మహిళాఫ్యాన్స్. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) ఎన్నేసి పాటలు పాడానో, డేటా అంతా వాళ్ళు సేకరించారు. గిన్నీస్ వాళ్లు 1960 నుంచి పాటలు తీసుకున్నారు. కానీ, 1951 నుంచే పాటలు పాడాను. అవీ కలిపితే, పాతికవేలు దాటేస్తాయి. ఇక, ప్రైవేట్ భక్తిగీతాలు కొన్ని వేలున్నాయి. కొద్ది నెలల క్రితమే ‘బొమ్మల రామారాం’ అనే సిన్మాలో పాడాను. ఇప్పటికీ దర్శక, నిర్మాతలు పాడించాలనుకుంటే నేను రెడీ. (నవ్వుతూ) ఐనా, కొత్త సింగర్స్కీ ఛాన్స్ ఇవ్వాలి కదా! - ‘సాక్షి’తో ‘పద్మభూషణ్’ పి. సుశీల -
గిన్నిస్‌లోకి ప్రఖ్యాత గాయనీమణి
సాక్షి, చెన్నై: పలు భాషలలో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న గానకోకిల పి.సుశీల ప్రపంచ రికార్డు సాధించారు. ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఎన్నో మధుర గీతాల మణిహారం సుశీల. 60 ఏళ్ల సంగీత ప్రవాహంలో ఈ గానకోకిల ఆలపించినన్ని పాటలు ప్రపంచంలో ఏ గాయనీ పాడలేదు. అందుకే ఆమె అత్యధిక పాటలు ఆలపించిన గాయనీమణిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇప్పటి వరకూ అధిక పాటలు పాడిన గాయనీగా గిన్నిస్‌లోకి ప్రఖ్యాత గాయనీమణి ఆశాభోంస్లే రికార్డును బద్దలు కొట్టి తన పేరును నమోదు చేసుకున్నారు. దీన్ని ధ్రువపరుస్తూ గిన్నిస్‌బుక్ నిర్వాహకులు పి.సుశీలకు ధ్రువ పత్రాన్ని అందించారు. పలు భాషలలో 18330 పాటలు పాడిన ఏకైక గాయనీమణిగా ఏషియన్ బుక్ రికార్డులోనూ తన పేరును నమోదు చేసుకున్నారు. ఈ ఘనత తనకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించిన దివంగత సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు, అప్పరాజు, ఎస్.రాజేశ్వరరావులాంటి వారికే దక్కుతుందని పి.సుశీల మంగళవారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. -
వాణీజయరాంకు పి.సుశీల అవార్డ్
ప్రఖ్యాత గాయని పి.సుశీల పేరిట ప్రతి ఏడాదీ అందించే ‘పి.సుశీల అవార్డు’ను ఈ ఏడాది మరో ప్రఖ్యాత గాయని వాణీజయరాం అందుకోనున్నారు. గాయని రావు బాలసరస్వతీదేవి అధ్యక్షురాలిగా, గాయని జమునారాణి, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్ సభ్యులుగా ఏర్పడిన జ్యూరీ... ఆమెను ఎంపిక చేశారు. అవార్డు పేరిట లక్ష రూపాయిలు నగదు, జ్ఞాపిక, నూతన వస్త్రాలు బహుకరించబడతాయని, ఈ నెల 9న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం మొదలవుతుందని అవార్డు కమిటీ తెలిపింది. ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్పీ శైలజ, ఎం.ఎం.శ్రీలేఖ, సునీత, కౌశల్య తదితర ప్రముఖ గాయనీమణులచే సంగీత విభావరి కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మండలి బుద్ధప్రసాద్, జమున, తనికెళ్ల భరణి, మంజుభార్గవి ఈ కార్యక్రమానికి అతిథులుగా రానున్నారు. -
అపురూపం: తియ్యని స్వరానుబంధం
లతామంగేష్కర్ - పి.సుశీల నైటింగేల్స్ ఆఫ్ ఇండియా. జాతి గర్వపడే కోయిలలు. ఒకరు ఉత్తరాన్ని ఏలితే ఇంకొకరు దక్షిణాది సంగతి చూసుకున్నారు. అనుకరణకు ఏమాత్రం వీలు కాని తియ్యటి గొంతులు వారివి. భాష ఉచ్ఛారణలో, భావ ప్రకటనలో ఇప్పటివారికి వారే డిక్షనరీ! లతాజీకి సుశీలగారంటే ఎంతో అభిమానం. అలాగే సుశీలగారికి లతాజీ అంటే గురుభావం! గాత్రం రీత్యా, రూపం రీత్యా ఇద్దరికీ దగ్గర పోలికలు ఉండటంతో అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. లతాజీ కూడా సుశీలగారిని తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు లతాజీ. అలాగే బొంబాయి వెళితే లతాజీని కలవకుండా వచ్చేవారు కాదు సుశీల! ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ గాయిని... ఇలా వ్యక్తిగత అవార్డులను భారత ప్రభుత్వం 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పి.సుశీలగారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు చెన్నైలో సుశీలగారికి పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన సాటి గాయనికి దక్కిన ఈ గౌరవానికి లతాజీ పొంగిపోయి బొంబాయి నుండి ప్రత్యేకంగా వచ్చి సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అది ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ సందర్భంగా వారిద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటున్న స్టిల్(పైన) అప్పటిదే. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం సుశీలగారికి పద్మభూషణ్ ప్రదానం చేసిన సందర్భంలో తన మానసిక గురువు అయిన లతాజీ ఆశీస్సులు తీసుకోవడానికి బొంబాయి వెళ్లినప్పుడు వారిరువురూ కాఫీ సేవిస్తూ కబుర్లాడుకుంటున్న దృశ్యాన్నీ (కింది ఫొటో) చూడవచ్చు. సంవత్సరాలు మారాయి! కానీ వారి మధ్య సంబంధాలు మారలేదు! వారి అనుబంధం, స్వర బంధం అంత తియ్యనిదీ, చెరగనిదీ, తరగనిదీ కాబట్టే ఇన్నేళ్లయినా... ఎన్నాళ్లయినా అలా కొనసాగుతూనే ఉంది... ఉంటుంది!! - ఫొటోలు, రచన: సంజయ్ కిషోర్