ఆ అమ్మాయి ఆనందంతో ఏడ్చేసింది! | The girl cried with joy! | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి ఆనందంతో ఏడ్చేసింది!

Published Wed, Nov 23 2016 8:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

ఆ అమ్మాయి ఆనందంతో ఏడ్చేసింది!

ఆ అమ్మాయి ఆనందంతో ఏడ్చేసింది!

రేడియో జ్ఞాపకాలు

ఒకసారి ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో బాలమురళి నేషనల్ ప్రోగ్రాం. అప్పుడన్నీ ప్రత్యక్ష ప్రసారాలే. ముందుగా రికార్డు చేయటమనేది లేదు. కార్యక్రమ పరిమితి గంటన్నర. కార్య క్రమంలో చివర మూడు లేక నాలుగు నిమిషాలకు ఆఖరి అంశం ఒక తిల్లానా. కచ్చేరీ ప్రారంభం అయి నడుస్తోంది. గడియారాల గల్లంతు ఏమైందో తెలియదు. మురళి పాడుతుంటే ఎదురుగా అనౌన్సర్ బూత్‌లోంచి కార్యక్రమ నిర్వాహకుడు ఒకాయన ఇంక 5 నిమిషాలే ఉంది అంటూ సంజ్ఞ చేశారు. సరే మురళి పాడుతున్న కీర్తనని అందంగా ముగించి, తిల్లానా ఆరంభించారు.

సగం అయిన తర్వాత గాభరాగా అవతల అద్దంలోంచి ఒకటే సంజ్ఞలు - ‘ఆపవద్దని, ఇంకా 15 నిముషాలు టైం ఉందనీ!’ లైవ్ స్టూడియోలోకి వెళ్ళి చెప్పడానికి వీలులేదు. విషయం గ్రహించిన మురళి ఏ తొట్రుపాటు గాని, చిరాకు గాని ప్రదర్శించకుండా ఆ తిల్లానా అప్పటికప్పుడు రకరకాల తాళగ తులతో, రకరకాల విన్యాసాలతో ఎంతోకాల కష్టపడి ఏర్చికూర్చి తయారుచేసి, ఎంతో సాధన చేసి పాడుతున్న రచనలా, పాడింది పాడకుండా, అడుగడుగునా నవ్యత స్ఫురిస్తూ, సుమారు 20 నిమిషాలు పాడారు. ఆ తిల్లానా మురళి పాడిన తీరు అనితరసాధ్యం అని ఆనాడు మురళి కచ్చేరీకి మృదంగం వాయించిన దండమూడి రామమోహనరావు నాతో అన్నారు.

ఆయన హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత ప్రయోక్తగా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు సాయంకాలం 5 గంటలకు ఇంటికి వెళ్లేముందు స్టూడియోలోకి వచ్చారు. నేను కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాను. విషయం ఏమిటి? అని ఆయన అడిగితే ‘5.30కి లలిత సంగీతం లైవ్ ప్రోగ్రామ్ ఉంది. ఆర్టిస్టు వచ్చి స్టూడియోలో కూచుంది. డ్యూటీ వేసిన వయొలినిస్టు రాలేదు’’ అని నేను చెప్పగానే ఆయన ఇన్‌స్ట్రుమెంట్స్ రూమ్ ఎక్కడ ఉందో చూపించమంటూ నాతో వచ్చి, బీరువాలో ఉన్న వయొ లిన్‌తీసి ‘పదండి’ అంటూ నాతో వచ్చి, ఆర్టిస్టు కూచున్న  స్టూడియోకి వచ్చి ఆర్టిస్టు పక్కన కూర్చుని, వయొలిన్ శ్రుతి చేసి, ‘ఏమి పాడుతావమ్మా‘ అని చనువుగా అడిగేటప్పటికి, ఆ అమ్మాయికి తన పాట సంగతి అటుంచి నోట మాట రాలేదు.

తనలాంటి చిన్న లైట్ మ్యూజిక్ ఆర్టిస్టుకి, బాల మురళిగారు వయొలిన్ వాయించడమా! చిరునవ్వుతో ఆ అమ్మాయి కంగారు పోగొట్టి, ప్రోత్సాహపరచి, పక్కన అనుకూలంగా వయొలిన్ వాయించారు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆ అమ్మాయి ఆయన కాళ్ల మీద పడి ‘ఎవరికీ దొరకని అదృష్టం దొరికింది. నాకు జన్మంతా జ్ఞాపకం ఉంటుంది ఈ సంఘటన’’ అంది కంటినిండా నీళ్లతో.

ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు!
‘‘జాతస్యహి ధ్రువో మృత్యుః... పుట్టినవారు మరణించక మానరు. కానీ, బాలమురళి గారు పోయారంటే, ఇది నిజం కాకుండా ఉంటే బాగుండనిపిస్తోంది. నాకు నోట మాట రావడం లేదు. ఆయనతో పాడిన పాటలు, ఆ క్షణాలు అన్నీ గుర్తొస్తున్నాయి. నేనిప్పుడు పుట్టపర్తిలో దేవుడి దగ్గర ఉన్నాను. బాలమురళి గారు ఆ దేవదేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు.’’ 
- ‘పద్మభూషణ్’ పి. సుశీల ప్రముఖ సినీ నేపథ్య గాయని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement