సాక్షి, విజయవాడ: విద్యా అమృత్ మహోత్సవం అమలులో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది. అనంతి కాలంలోనే అధిక వీడియోలు, ప్రాజెక్టులు అప్‌లోడ్ చేశారు ఏపీ ఉపాధ్యాయులు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 'శిక్షక్ పర్వ్' వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అమలులో ఏపీ ఉపాధ్యాయులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.
అనతికాలంలో అధిక వీడియోలు, ప్రాజెక్టులు అప్‌లోడ్ చేయడంతో.. ఏపీకి రెండో స్థానం దక్కింది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని, సంబంధిత సిబ్బందిని ఆయన అభినందించారు. వినూత్న, వైవిధ్య విద్యా అంశాలతో పిల్లల మనసుని ఆకట్టుకునేలా చిన్నచిన్న అద్భుతమైన ఆలోచనలని దృశ్య రూపంగా మార్చేసి.. బోధనా అభ్యసనకు తగిన 1,00,758 ప్రాజెక్టులను విద్యా అమృత్ మహోత్సవం కోసం అప్ లోడ్ చేశారు ఏపీ ఉపాధ్యాయులు.
ఈ కార్యక్రమం అమలులో.. ప్రథమ స్థానం సాధించిన బిహార్, ఇతర రాష్ట్రాల్లో మూడు నెలలు ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ, ఏపీ మాత్రం కేవలం ఒక నెలలోనే అధికంగా ప్రాజెక్టులు అప్ లోడ్ చేసి.. దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. దీనివెనుక.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ అధ్యాపకులు, సముదాయ పర్యవేక్షణ (స్కూల్ కాంప్లెక్స్) సభ్యులు, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, సీమ్యాట్, ఎస్సీఈఆర్టీ సిబ్బంది కృషి ఎంతగానో ఉందని సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు బీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఉపాధ్యాయులు ఆధునిక సాంకేతికతను జోడించి మరింత బోధన నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు గొప్ప వేదికగా సద్వినియోగ పడతాయని.. ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు కూడా వీటిని సద్వినియోగపరుచుకోవచ్చని అధికారులు ఈ సందర్భంగా ఆ ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా జాతీయస్థాయిలో పది వీడియోలను ఎంపిక చేసి దేశమంతా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment