నీతి అయోగ్‌లో ఇంటర్న్‌షిప్‌కు తెలుగు యువకుడి యోగ్యత | Telugu Young Man Complete Internship in Niti Aayog | Sakshi
Sakshi News home page

నీతి అయోగ్‌లో ఇంటర్న్‌షిప్‌కు తెలుగు యువకుడి యోగ్యత

Published Mon, Aug 26 2019 7:31 AM | Last Updated on Mon, Aug 26 2019 7:31 AM

Telugu Young Man Complete Internship in Niti Aayog - Sakshi

∙కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌కు ఇంటర్న్‌షిప్‌ నివేదికను అందజేస్తున్న నాగశివశంకర్‌

కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామానికి చెందిన యువకుడు ఇందుగుపల్లి నాగ శివశంకర్‌. మారు మూల గ్రామంలో పుట్టిన ఈ యువకుడు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. తాను చదువుకున్న విద్య ద్వారా భారత పార్లమెంటులో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన నీతి ఆయోగ్‌లో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన తెలుగువారిలో ప్రథముడిగా అరుదైన గుర్తింపు పొందాడు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌లో కెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నాగశివశంకర్‌ది ఓ నిరుపేద కుటుంబం. తండ్రి వీరవెంకట సత్యనారాయణ, తల్లి నాగమణి, తమ్ముడు అనిల్‌ కుమార్‌. వీరి కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారం ఓ ఇటుక బట్టీ. దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తూ ఇద్దరు కుమారులను కష్టపడి చదివించాడు తండ్రి. పెద్దకొడుకు నాగశివశంకర్‌ పీజీ చేయగా, చిన్నకొడుకు అనిల్‌ కుమార్‌ బీటెక్‌ పూర్తి చేశాడు.

ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్య...
బి.దొడ్డవరంలో అప్పట్లో ఉన్న యూపీ స్కూల్లో చదువు పూర్తయిన తర్వాత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ కెమిస్ట్రీ విభాగంలో అయిదేళ్ల రసాయన శాస్త్రం (అపై్లడ్‌ కెమిస్ట్రీ) పూర్తి చేశాడు. సివిల్స్‌పై ఉన్న మక్కువతో ఢిల్లీ వెళ్లి అక్కడ కోచింగ్‌ తీసుకున్నాడు. అక్కడ ఉన్న సమయంలోనే పార్లమెంటు ఇంటర్న్‌షిప్‌లో ప్రవేశాలను ప్రకటించారు. దానికి దరఖాస్తు చేసుకున్న నాగశివశంకర్‌ సునాయాసంగా అర్హత సాధించాడు. ఎమ్మెస్సీ పీజీ పూర్తి చేయడంతో పాటు ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో ఉన్న ప్రవేశం, ఏయూలో నాగశివశంకర్‌ సాధించిన సర్టిఫికెట్లు, ఇతని ప్రతిభను కొలమానంగా తీసుకుని పార్లమెంటు ఇంటర్న్‌షిప్‌కు అతడిని ఎంపిక చేశారు.

పార్లమెంటు ఇంటర్న్‌షిప్‌ సాగింది ఇలా...
పార్లమెంటు ఇంటర్న్‌షిప్‌కు జాతీయ స్థాయిలో 50 మందిని ఎంపిక చేశారు. వారిలో తెలుగు రాష్ట్రాల తరఫున నాగశివశంకర్‌ ఒక్కడే అర్హత సాధించడం విశేషం. పార్లమెంటులో బిల్లులు ఏ విధంగా అమలు చేస్తారు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, భారత దేశ పాలన, తదితర అంశాలపై పరిశోధన చేసి మూడు నెలల్లో పార్లమెంటు స్పీకర్‌కు నివేదిక అందించారు. దానికి గాను నాగశివశంకర్‌కు సర్టిఫికెట్‌తోపాటు రూ.70 వేలు నగదు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలతో పని చేసిన అనుభవం గడించాడు నాగశివశంకర్‌.

నీతి ఆయోగ్‌ ఇంటర్న్‌షిప్‌లో ఏముంటుంది..?
ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్‌ దేశాభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖలకు సలహాలు, సూచనలు అందిస్తుంది. నీతి ఆయోగ్‌కు దేశ ప్రధానమంత్రి చైర్మన్‌గా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన యువకులు వారి సలహాలు, సూచనలను నివేదిక రూపంలో నీతి ఆయోగ్‌కు అందజేస్తారు. జూన్‌ 25న∙నీతి ఆయోగ్‌ ఇంటర్న్‌షిప్‌ మొదలు పెట్టిన ఈ బృందం ఇటీవలే నివేదికను అందించింది.

విద్యార్ధి నాయకునిగా ప్రస్థానం...
చదువుతో పాటు విద్యార్ధి నాయకునిగా పలు ఉద్యమాల్లో నాగశివశంకర్‌ ప్రముఖ పాత్ర పోషించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉప కులపతితో పలు సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించారు. ఏబీవీపీ నాయకునిగా పలు ఉద్యమాల్లో పాల్గొని పలు పర్యాయాలు అరెస్టయ్యారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ విద్యార్ధి నాయకుడిగా విశాఖపట్నంలో నిర్వహించిన పలు ఆందోళనలకు ఆయన నాయకత్వం వహించారు. ఇప్పుడు చేసిన ఇంటర్న్‌షిప్‌ శివశంకర్‌కు భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులకు బాట వేస్తుందని ఆశిద్దాం.
– ఏడిద బాలకృష్ణారావు,సాక్షి, మామిడికుదురు, తూర్పుగోదావరి జిల్లా

ఓఎస్డీగా పని చేయాలన్నది నా లక్ష్యం
కేంద్ర మంత్రిత్వశాఖలో ఓఎస్డిగా చేరి ఆ శాఖల్లో పట్టు సాధించిన అనంతరం కేంద్ర మంత్రిత్వ శాఖ సలహాదారుడిగా పని చేయాలన్నది నా లక్ష్యం. ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రాజెక్టు పూర్తి చేసిన తరువాత ఓఎస్డీగా చేరాలన్నది నా ఆలోచన. దానికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నాను. దాన్ని సాధించే దిశగా లండన్‌లోని ‘కార్డిఫ్‌’ విశ్వ విద్యాలయంలో మాస్టర్‌ డిగ్రీ చేసేందుకు నాకు అర్హత లభించింది. రూరల్‌ డెవలప్‌మెంట్, అర్బన్‌ డెవలప్‌మెంట్, వాటర్‌ రీసోర్సెస్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎన్విరాన్మెంట్‌ తదితర విభాగాల్లో నేటి పరిస్థితులకు అనుగుణంగా ఏవిధమైన మార్పులు తీసుకు రావాలన్నదే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశ్యం. నా తలిదండ్రులతో పాటు అప్పటి ఏయూ ప్రొఫెసర్‌ పీఎస్‌ అవధాని, డీన్లు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి సహకారంతోనే నేను ఈ స్థితికి చేరుకున్నాను.  – నాగశివశంకర్,నీతి అయోగ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసినతొలి తెలుగు యువకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement