ఆ నేడు 8 అక్టోబర్, 1992
నా నేల...నా ప్రజలు
డెరిక్ వాల్కొట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురైన రోజు. ఆయన కవిత్వాన్ని మళ్లీ ఇష్టంగా చదువుకున్న రోజు. డెరిక్ అల్టాన్ వాల్కొట్ సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న విషయం ప్రపంచాన్ని తాకిన రోజు. సెయింట్ లూసియా దీవిలో పుట్టి పెరిగిన డెరిక్ ఆ మట్టిపరిమళాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు. ఆ దేశ నినాదం ‘మన భూమి, మన ప్రజలు, మన వెలుగు’.
డెరిక్ కవిత్వంలో ఆ భూమి పరిమళం తీయగా వినిపిస్తుంది. ఆ సంస్కృతి వెలుగు అందంగా గోచరిస్తుంది. తన ప్రజల ఆనందం, ఆవేశం, ఆవేదన... ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. అతడి తడి కళ్లలో ఎన్నో కవితలు దర్శనమిస్తాయి.‘ఇన్ ఏ గ్రీన్ నైట్’, ‘ఎనదర్ లైఫ్’, ‘సీ గ్రేప్స్’... కవిత్వమైతేనేం... ‘వైన్ ఆఫ్ ది కంట్రీ’, ‘డ్రమ్స్ అండ్ కలర్స్’... నాటకం అయితేనేం... డెరిక్ పదం అచ్చంగా జనస్వరాన్ని వినిపిస్తుంది. ఏది తేల్చుకోవాలనే అనే సందిగ్ధాన్ని మెరుపు కాలంలో చిత్తు చేసి, అవసరమయ్యే దారిని, పదిమందికి మేలుచేసే దారిని ఎంచుకుంటుంది.