ప్రయత్నం వ్యర్థం కాదు
మామిడిపూడి ‘గీత’
శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చినట్లు వేలకొలది మనుషులలో ఒక్కడు మాత్రమే పరతత్వ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అటువంటి యత్నపరులలో కూడా ఒక్కడు మాత్రమే పరతత్వాన్ని గ్రహింపగలుగుతున్నాడు.
శ్రీ భగవాన్ ఉవాచ: బహూనాం జన్మనామంతే జ్ఞానవా న్మాం ప్రపద్యతే
వాసుదేవ స్సర్వ మితి స మహాత్మా సుదుర్లభః(7-9)
‘‘అర్జునా! అనేక జన్మలు గడిచిన తర్వాత జ్ఞాననిష్ఠుడు పరమాత్మను పొందుతున్నాడు. అటువంటి వాడు దుర్లభుడు అంటే ఎవరికీ సులభంగా లభించడు సుమా!’’
యోగులను గురించి శ్రీ కృష్ణ భగవానుడు: ‘‘అర్జునా! ప్రయత్నపరులైన యోగులు పాపరహితులై పరిశుద్ధులై అనేక జన్మల తర్వాత పరమ పదాన్ని చేరుతున్నారు’’ అని సెలవిచ్చాడు.
బహిరంతశ్చ భూతానామచరం చరమేవచ
సూక్ష్మ త్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ (13-15)
‘‘అర్జునా! పరమాత్మ సర్వజీవుల లోపలా, వెలుపలా నిండి ఉన్నప్పటికీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండటం వల్ల మనకు కనిపించడు. కాని తత్వ జ్ఞానం కలవాడు పరమాత్మను తెలుసుకోగలడు’’
అటువంటి జ్ఞానాన్ని ఆర్జించినప్పుడు పరమాత్మను వెతుకుతూ ఎక్కడో వెళ్లనక్కరలేదు.
పరమాత్మ మన లోపలే ఉన్నాడు. జ్ఞానికిగాని ఈ సత్యం తెలియదు. కాబట్టి పరమాత్మ దూరంలో ఉన్నాడని ఒకసారి, దగ్గరే ఉన్నాడని మరొకసారి చెప్పడం జరిగింది. అజ్ఞానికి దూరంగా ఉన్నాడు. జ్ఞానికి దగ్గరలోనే ఉన్నాడు. కాబట్టి పరమాత్ముని తెలుసుకోవాలనుకునేవారు జ్ఞానాన్ని సంపాదించాలి.
ఇది మనం చేయగలిగిన పనేనా? అని నిస్పృహ పొందనక్కరలేదు. శ్రద్ధతో ప్రయత్నం చేసి, చేయగలిగినంత చేసి, ఫలితాన్ని పొందవచ్చు. ప్రయత్నాలు కొనసాగకపోయినా సాగినంత వరకు మన ప్రయత్నాలు ఫలవంతమే అవుతున్నాయి కాబట్టి ప్రయత్నం వ్యర్థం కాదు.
కూర్పు: బాలు- శ్రీని
(వచ్చేవారం... కర్మయోగం)