టీవీ వంట షోలతో ఇదేమి తంటా! | Troubles with Telugu cooking shows! | Sakshi
Sakshi News home page

టీవీ వంట షోలతో ఇదేమి తంటా!

Published Sat, Mar 12 2016 9:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

టీవీ వంట షోలతో ఇదేమి తంటా!

టీవీ వంట షోలతో ఇదేమి తంటా!

వంటల ప్రోగ్రామ్‌లో ఏం చూపిస్తారు? ఇదీ ఓ ప్రశ్నేనా వంట చేసి చూపిస్తారు అంటారు... అంతేగా! అంతే అని సింపుల్‌గా చెప్పేయడానికి లేదు. ఎందుకంటే... వంట మామూలుగా చేసి చూపించరు మన కుకరీ షోల్లో. మామూలు వంటనే స్పెషల్‌గా చేసి చూపిస్తారు. అవును. మనకు తెలియని వంటలు చేసి చూపిస్తారని మనం టీవీ ఆన్ చేస్తే... మనకు తెలిసినదాన్నే మళ్లీ మళ్లీ చేసి చూపించి మనకు రుచి చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ షోలను నిర్వహించేవాళ్లకు ఇది తెలియని సంగతి కాదు. వారి పరిమితులు ఏమైనా ఉండవచ్చు. కానీ, ప్రేక్షకులు అసంతృప్తితో ఉంటున్నారు.

ప్రతి ప్రముఖ చానెల్లోనూ తప్పకుండా ఒక వంటల ప్రోగ్రామ్ ఉంటుంది. షోలో ఓ యాంకర్, ఓ చెఫ్ ఉంటారు. కొన్నిటిలో చెఫ్‌లు మాత్రమే ఉంటారు. మరికొన్నిటిలో సెలెబ్రిటీలు వస్తుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. కానీ ఈ సందడిలో ఒకటి మాత్రం మర్చిపోతుంటారు. ప్రేక్షకులు వంటల ప్రోగ్రామ్ చూసేది కొత్త వంటకాల్ని నేర్చుకోవడం కోసం. అది చేయగలిగితే ఇంత హడావుడి అవసరం ఉండదు. కానీ చాలామంది అది చేయడం లేదు. రోజూ వండుకునే పప్పులో కాసింత నిమ్మరసం పిండి కొత్త వెరైటీ అని చెప్పడం, చపాతీలో కూరగాయ ముక్కలు పెట్టి హెల్దీ చపాతీ రోల్స్ అని నమ్మించడం లాంటి వాటికి పరిమితమవుతున్నారు. ఇక ఈ షోలతో మరో బాధ... వంటకంటే మాటలు ఎక్కువవ్వడం. చెఫ్ చెప్పే ప్రతి మాటకీ యాంకర్ ఏదో ఒక కొసమెరుపు ఇవ్వాలని ప్రయత్నించడంతో చెవులు వాచిపోతుంటాయి. ప్రేక్షకుడికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేసే ప్రయత్నంలో భాగంగా యాంకర్లు చెఫ్‌లని వేసే ప్రశ్నలు నవ్వును కూడా తెప్పిస్తాయి. ఇక ఓ చానెల్లో వచ్చే షోలో అయితే భార్యాభర్తలిద్దరూ గరిటె తిప్పుతుంటారు. చెప్పిందే చెప్పి, తిప్పి చెప్పి, అలా చెప్పీ చెప్పీ చంపేస్తుంటారు. పైగా వాళ్లు వండినదాన్ని వాళ్లే తింటూ పదే పదే వర్ణిస్తుంటే వినడం మరో హింస.

మాటల్ని తగ్గిస్తే ఇంకో వంటకం చూపించొచ్చు కదా! ఇంకా దారుణం ఏమిటంటే వండేటప్పుడు కొన్ని పదార్థాలు వేయడం మర్చిపోతుంటారు. అయ్యో ఇది మర్చిపోయాను, ఇప్పుడు వేసినా ఫర్వాలేదు అని కవర్ చేసుకుంటూ ఉంటారు. కనీసం ఎడిటింగ్‌లో దాన్ని తీసేయొచ్చుగా... లేదంటే రీషూట్ చేసుకోవచ్చుగా. అవేం చేయకుండా ఇలా ప్రేక్షకుడి సహనానికి పరీక్షలు పెట్టడం ఎందుకు! వీళ్లంతా సంజీవ్‌కపూర్, వికాస్‌ఖన్నా, రణవీర్ బ్రార్, నెగైల్లా లాసన్ లాంటి ప్రముఖ చెఫ్‌ల షోలు ఒక్కసారి చూస్తే బాగుణ్ను. అప్పుడైనా కుకరీ షో అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది!

Advertisement
Advertisement