చంద్రయాన్ –2.. అనుకున్న లక్ష్యం నెరవేర్చినా.. వేర్చకపోయినా..ఆ వార్తలను అందించడంలో మాత్రం ఒక వర్గానికి స్పేస్ ఇచ్చింది!పనిలో.. పనిచోట ‘ఈక్వల్ రెస్పెక్ట్’ అనే కాన్సెప్ట్‌ను స్థిరం చేసింది!అలా ఓ ట్రాన్స్ ఉమన్‌ను ఇక్కడ పరిచయం చేసుకోవడానికిఓ సందర్భాన్నీ తెచ్చింది!
ఆ అమ్మాయి పేరు హైదీ సాదియా. వయసు ఇరవై రెండేళ్లు. కేరళలోని ‘కైరాళి’ అనే మలయాళం వార్తా చానెల్‌లో బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్‌గా పనిచేస్తోంది. కిందటి నెల (ఆగస్ట్) 31వ తేదీనే ఆ చానెల్‌లో జర్నలిస్ట్‌గా చేరింది. వెంటనే ఆమె తీసుకున్న అసైన్‌మెంట్.. చంద్రయాన్ 2ను రిపోర్ట్ చేయడం. స్క్రీన్ మీద ఆమె ఇచ్చిన ప్రెజెంటేషన్‌కు కేరళ ప్రేక్షకులతోపాటు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి కేకే శైలజ కూడా ముగ్ధులయ్యారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. చావక్కాడ్ నివాసి అయిన సాదియా ‘‘త్రివేండ్రం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం’’లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. కైరాళి టీవీలో ఇంటర్న్‌గా చేరింది. వృత్తి పట్ల ఆమె జిజ్ఞాస, ఉత్సాహాన్ని పసిగట్టిన అధికార సిబ్బంది వారం రోజుల్లోనే ఉద్యోగ అవకాశం ఇచ్చారు ‘‘న్యూస్ ట్రైనీ’’గా.
ఆ వెంటనే చంద్రయాన్ 2 అసైన్‌మెంట్‌ను అప్పజెప్పారు. బెదురు, బెరుకు లేకుండా చక్కగా ప్రెజంట్ చేసింది న్యూస్‌ను. ‘‘ఈ అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. న్యూస్‌రూమే నా సెకండ్ హోమ్. ఎల్‌జీబీటీక్యూ పట్ల వివక్ష చూపని ప్రొఫెషనంటే జర్నలిజమే. ఫ్యూచర్‌లో మా కమ్యూనిటీకి ఇలాంటి చోట మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను’’ అని చెప్తున్న సాదియా ‘‘ఇంట్లో మాత్రం నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. దేశంలోని చాలా చోట్ల ట్రాన్స్‌విమెన్ జీవన శైలి చూసి నా విషయంలోనూ అలాంటి భావనతోనే ఉండి ఉంటారు. ఈ విషయంలో వాళ్లనేం తప్పుపట్టట్లేదు నేను’’ అంటారు. జీవితంలో చాలా పోరాడి ఈ స్థాయికి చేరుకున్న సాదియా.. సినిమారంగంలోనూ అడుగిడాలనుకుంటోంది. నటన, దర్శకత్వం రెండింటిలోనూ తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటోంది. బెస్ట్ ఆఫ్ లక్ సాదియా!
Comments
Please login to add a commentAdd a comment