
శ్రీకాకుళం జిల్లా పేరును అంతర్జాతీయ క్రీడా వేదికపై ‘లిఫ్ట్’ చేసిన నాటి క్రీడాకారిణులు కరణం మల్లేశ్వరి, పూజారి శైలజల బాటలోనే పయనిస్తున్నారు పాలకొండకు చెందిన అక్కచెల్లెళ్లు. అరుణా రాణి, ఉషారాణి, లలితారాణి. స్థానిక రైతు గార తిరుపతిరావు, చిన్నమ్మడు దంపతుల కుమార్తెలు అయిన ఈ ముగ్గురూ తండ్రి నుంచి స్ఫూర్తిని పొందినవారే. తిరుపతిరావు తన చిన్నతనం నుంచీ సంగిడీలు ఎత్తుతూ గ్రామీణ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన పిల్లల్ని కూడా క్రీడలవైపే మళ్లించారు. ఆ క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన వెనుకంజ వేయలేదు. పిల్లలు కూడా తండ్రినే తొలి గురువుగా భావించారు.
పెద్ద కుమార్తె అరుణా రాణి స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని క్రీడా మైదానంలో చిన్నచిన్న బరువులు ఎత్తుతూ తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. 2002లో క్రీడా పాఠశాలలో చేరిన అరుణ అక్కడ ఎస్.ఎ.సింగ్, మాణిక్యాలరావు వద్ద తర్ఫీదు పొందుతూ 2003–07 సంవత్సరాల మధ్య వివిధ జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై వెయిట్ లిఫ్టింగ్‌లో వరుస పతకాలు కైవసం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో రూరల్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో, కడపలో అత్యుత్తమ లిఫ్టర్‌గానూ బంగారు పతకాలు దక్కించుకున్నారు. ముంబయిలో మూడు వెండి, మూడు రజత పతకాలు పొందారు. లక్నోలో ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచారు. రాజమండ్రిలో రాష్ట్రస్థాయి సీనియర్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత, విశాఖలో వెండి పతకాలతో పాటు, ఛత్తీస్‌గఢ్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. ఏలూరు సబ్‌జూనియర్, సీఎం ట్రోఫీలో బంగారు పతకాలు దక్కించుకున్నారు. చెన్నైలో మూడు రజతాలు, మణిపూర్‌లో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. జోర్డాన్‌లో జరిగిన నాలుగు దేశాల క్రీడాకారుల పోటీలలో 80 కేజీల స్నేచ్, 110 కిలోల క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మూడు బంగారు పతకాలు కైవసం చేసుకుని మహిళాక్రీడావనికే కాకుండా తన చెల్లెళ్లలోనూ స్ఫూర్తిని నింపారు. ప్రస్తుతం అరుణా రాణి స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. గత మూడేళ్లుగా కోల్‌కతా రైల్వేలో టెక్నీషియన్‌గా కొనసాగుతున్నారు.
పీఈటీగా ఉషారాణి
అరుణాæరాణి పెద్ద చెల్లి ఉషారాణి 2005లో క్రీడల్లోకి అడుగు పెట్టారు. జిల్లాస్థాయిలో, అదే ఏడాది కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 48 కిలోల విభాగంలో వెండి, తర్వాతి సంవత్సరం విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీల్లో 53 కిలోల విభాగంలో రాణించారు. హైదరాబాద్‌లో జరిగిన సీఎం కప్‌లో 48 కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచారు. అలాగే మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం పీఈటీగా సరుబుజ్జీలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ క్రీడల్లో విద్యార్థినులకు చక్కటి శిక్షణ ఇస్తున్నారు.
పతకాల వేటలో లలిత
పెద్దక్క అరుణ బాటలో మూడవ చెల్లి లలితా రాణి ప్రతిభను కనబరుస్తున్నారు. అమలాపురం, కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు, వెండి పతకాలు దక్కించుకున్నారు. ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, హైదరాబాద్‌లలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పలు పతకాలు దక్కించుకున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో బంగారు, వెండి పతకాలు దక్కించుకున్నారు. 2017లో డిసెంబరులో ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ , సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించి ఉత్తమ లిఫ్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో స్థానం దక్కించుకునేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు.
ఎందులోనూ తక్కువ కాదు
మహిళలు ఎందులోనూ తక్కువకాదు. మా చిన్నతనంలో ఆడపిల్లలు బరువులు ఎత్తటం ఏమిటని మాట్లాడుకునేవారు. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అదే స్ఫూర్తితో ధైర్యంగా ముగ్గురం ముందడుగు వేశాం. మాకంటూ గుర్తింపు లభించింది.
– గార అరుణా రాణి, ఉషారాణి, లలితా రాణి
– మారోజు కల్యాణ్ కుమార్, సాక్షి, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment