స్త్రీలోక సంచారం | Woman's Wandering | Sakshi

స్త్రీలోక సంచారం

Published Mon, Aug 27 2018 12:00 AM | Last Updated on Mon, Aug 27 2018 12:00 AM

Woman's Wandering - Sakshi

♦  ‘‘మనుషులు మాంసాన్ని తినడం లేదు. మాంసమే మనుషుల్ని తింటోంది. పశువులు.. హిందువులను, ముస్లింలను విభజిస్తున్నాయి’’ అని ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ ప్రొటీన్‌ ఫుడ్‌ టెక్‌ రివల్యూషన్‌’ అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన తొలి సదస్సులో కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆలోచన రేకెత్తించాయి. పశువుల కారణంగానే మూక హత్యలు జరుగుతున్నాయని అంటూ, లేబరేటరీలలో వృద్ధి చేసిన మాంసాన్ని తినడం అలవాటు చేసుకుంటే.. భవిష్యత్తులో మనుషుల మధ్య విభేదాలు రావని, పశువుల వధ కారణంగా వెలువడే మిథేన్‌ వాయువులు కూడా తగ్గుతాయి కనుక కేరళలో ఇప్పుడొచ్చిన వరదలు, గతంలో తమిళనాడుకొచ్చిన సునామీల వంటి విపత్తులు కూడా ఆగిపోయి, గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గుముఖం పడుతుందని మనేకా సూచించారు.
  మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలల్లో ఒక సమగ్ర జాతీయ పథకాన్ని రూపొందించబోతోంది! మొదట 2021–22 వరకు మూడేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకం కింద లైంగిక దాడి బాధితులకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు, వారి తరఫున వాదించేందుకు ప్రభుత్వ న్యాయవాదులను ఏర్పాటు చేసి, త్వరితగతిన న్యాయం అందేలా దేశంలోని అన్ని రాష్ట్రాలోనూ కలిపి 1,023 ఫాస్ట్‌–ట్రాక్‌ కోర్టులను నెలకొల్పుతారు.
  ఏటా రాఖీ వేడుకలు జరుపుకునే ‘రాజ్‌భవన్‌’.. కేరళలో వచ్చిన కనీవినీ ఎరుగని వరదల కారణంగా ఈసారి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేస్తూ, కేరళ వరద బాధితులను రెండు తెలుగు రాష్ట్రాలవారూ పెద్ద మనసుతో సహాయం అందజేయాలని గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ విజ్ఞప్తి చేశారు.
 ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ప్రభుత్వం నెట్‌లో తాజాగా అప్‌లోడ్‌ చేసిన ఓటర్ల సవరణ జాబితాలో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ను పోలిన ఒక యువతి ఫొటోతో పాటు.. ఒక ఏనుగు, ఒక పావురం, ఒక జింక బొమ్మలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో జిల్లా ఎన్నికల సంఘం అవకతవకల్ని సరిచేసే పనిలో పడింది. తక్షణ నష్ట నివారణ చర్యగా జిల్లా ఎన్నికల సంఘం అధికారులు విష్ణుదేవ్‌ వర్మ అనే డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను బదలీ చేసి, అతడిపై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేశారు.
♦  ఏ ప్రభుత్వ సౌకర్యాలూ, సదుపాయాలకు అందుబాటులో లేకుండా మావోయిస్టుల గుప్పెట్లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల దోర్నపాల్‌ ప్రాంతం నుంచి మాయా కాశ్యప్‌ ఒక నిరుపేద గిరిజన యువతి ఏ విధమైన కోచింగ్‌ లేకుండానే తనకు తానే కష్టపడి చదివి, ‘నీట్‌’ ప్రవేశ పరీక్ష రాసి మెడికల్‌ సీటు సాధించి.. కృషికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ఎస్టీ కేటగిరీలో 154వ ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో 12,315 ర్యాంకు సాధించి, అంబికాపూర్‌ మెడికల్‌ కాలేజీలో సీటు సంపాదించిన మాయ.. కనీస వైద్య వసతుల్లేని పల్లె ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడమే తన జీవితాశయమని, ఆ కారణంగానే మెడికల్‌ సీట్‌ కోసం దీక్షగా ప్రిపేర్‌ అయ్యానని చెప్పారు.  
♦  ఇండోనేషియాలో.. 54 ఏళ్ల ద్వి సుసిలార్టో అనే వ్యక్తి.. భరణంగా తన మాజీ భార్యకు ఇవ్వవలసిన పది వేల డాలర్లను నాణేల రూపంలో పన్నెండు బస్తాలలో కోర్టుకు మోసుకు వచ్చి.. ప్రతి న్యాయవాదిని, న్యాయమూర్తిని నివ్వెరపరిచాడు. తనకు రావలసిన భరణాన్ని తరచు ఎగవేస్తున్నాడని తన భార్య కోర్టులో కేసు వేసినందుకు అసహనం చెందిన సుసిలార్డో.. ఆమెను, ఆమె తరఫు లాయరును ఇబ్బంది పెట్టడం కోసం పది వేల డాలర్లకు సమానమైన 15 కోట్ల 30 లక్షల ‘రుపయా’లను నాణేలుగా 12 సంచులలో నింపుకుని తెచ్చి, ‘అమౌంట్‌ కరెక్టుగా ఉందో లేదో లెక్కపెట్టుకోండి’ అని అన్న మాటపై స్పందించిన లాయర్, ‘‘నా క్లయింట్‌ను అవమానపరిచేందుకే ఇతడు ఇలా చిల్లర నాణేలను ముఖాన విసిరికొట్టినట్లుగా చెల్లించాడు’’ అని సుసిలార్టో ఆగ్రహం చేశారు.
♦  ఒక మహిళను రేప్‌ చేసిన కేసులో గత ఏడాది ఆగస్టు 25న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (డేరా బాబా)ను అరెస్టు చేసినప్పుడు హర్యానాలోని పంచకులలో హింస చెలరేగి పోలీస్‌ ఫైరింగ్‌లో 35 మంది మరణించిన ఘటన వెనుక కుట్రకు ఒక పాత్రధారి అయిన ‘డేరా సచ్చా సౌదా’ సంస్థ చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌.. కళ్ల ముందు తిరుగుతున్నప్పటికీ హరియాణ పోలీసులు నేటివరకు అరెస్టు చెయ్యకపోవడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెండుసార్లు ఆమె చండీగఢ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు హాజరైనప్పటికీ, పోలీసులు మాత్రం ఆమె ఇంకా పరారీలోనే ఉన్నారని అనడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని భావిస్తున్నారు.
♦  చైనాలో పనిచేస్తున్న భారతీయ సంతతి అమెరికన్‌ జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌ వీసా గడువును చైనా పొడిగించకపోవడంతో చైనా, అమెరికా దేశాల దౌత్య సంబంధాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘‘అమెరికన్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘బజ్‌ఫీడ్‌ డాట్‌ కామ్‌’ ప్రతినిధిగా  చైనాలో పనిచేస్తున్న మేఘ.. అక్కడి జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని పాలనాపరమైన అవకతవకలపై విమర్శనాత్మక వ్యాసం రాయడంతో ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆమెపై కక్ష కట్టి ఆమె వీసాను పొడిగించకపోవడం చూస్తుంటే.. చైనాకు మీడియా పొడగిట్టడం లేదన్న మాటలో అబద్ధమేమీ లేదనిపిస్తోందని’’ అమెరికా చేసిన తాజా వ్యాఖ్య రెండు దేశాల మధ్య విభేదాలకు మరికాస్త ఆజ్యం పోసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement