మధురాతి మధురం పీబీ స్వరం | PB Srinivas Sweet Voice | Sakshi
Sakshi News home page

మధురాతి మధురం పీబీ స్వరం

Published Sun, Sep 22 2013 12:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

మధురాతి మధురం  పీబీ స్వరం

మధురాతి మధురం పీబీ స్వరం

 నేడు పీబీ శ్రీనివాస్ జయంతి

ఓహో గులాబిబాల.. అందాల ప్రేమమాల, అందాల ఓ చిలకా... అందుకో నా లేఖ... వంటి మరెన్నో అపురూప గీతాలకు తన గళంతో జీవం పోసి తెలుగు సినీ అభిమానులను పరవశింపజేసిన గాయకుడు పీబీ శ్రీనివాస్. ఈరోజు ఆ మధుర గాయకుని జయంతి. మధురమైన స్వరంతో తెలుగువారిని అలరించిన పిబి చిన్నప్పటి నుండి సినిమా, సినిమా పాటలను వింటూ పెరిగారు. ఆయన తల్లి గారికి సంగీతంలో ప్రవేశముండటంతో కొంత సంగీతంలో మెళకువులను నేర్చుకొని అప్పటికప్పుడు పాటలను కంఠతా పెట్టి నేర్చుకునేవారు. వీళ్ల కుటుంబానికి సన్నిహితులైన శంకరశాస్త్రి  పీబీ గొంతు విని జెమిని సంస్థకు తీసుకెళ్లారు. అప్పటికప్పుడు ఒక పాటపాడి  అందరినీ మెప్పించారు. మొదట్లో హిందీ సినిమాలలో చిన్న చిన్న కవిత్వపు పంక్తులు పాడే అవకాశాలు వచ్చాయి.
 
తెలుగులో మొదటిసారిగా ‘జాతకఫలం’సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఆనాటి నుండి ఆయన స్వరప్రస్థానం సాగుతూ ఎన్నో పాటలకు జీవం పోశారు. గాయకుడుగానే కాకుండా ఆయనకు సాహిత్యంలో కూడా ప్రవేశం ఉంది.   తెలుగులో కొత్త చంధస్సును కనుగొని ‘శ్రీనివాస గాయిత్రీ వృత్తాలు’ పేరిట  పీబీ ఒక పుస్తకం కూడాప్రచురించారు. అలాగే గజల్స్‌ను కూడా రాసి వాటిని ప్రచురించారు. దాదాపు ఎనిమిది బాషల్లో ఆయన సాహితీ ప్రస్థానం కొనసాగింది. ఎన్నో పద్యాలను కూడా రచించారు. వాటిని పుస్తకాలు అచ్చుకూడా వేశారు.
 
 పీబీ శ్రీనివాస్ ప్రొఫైల్
 పూర్తి పేరు : ప్రతివాది భయంకర శ్రీనివాస్
 జననం : 22-09-1930
 జన్మస్థలం : కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
 తల్లిదండ్రులు : శేషగిరమ్మ, ఫణీంద్రస్వామి
 తోడబుట్టినవారు : తమ్ముడు రామానుజం, చెల్లెళ్లు సీత, చూడామణి
 చదువు : బి.కాం., ఎల్.ఓ.ఎల్.
వివాహం  : 24-05-1950
భార్య :జానకి
 సంతానం : అబ్బాయిలు : ఫణీంద్ర, విజయరాఘవ, నందకిషోర్, రాజ గోపాల్.
  అమ్మాయి: సంగీత లత.  అందరూ సంగీతంలో  ప్రావీణ్యులే
 తొలిచిత్రం - పాట : మిస్టర్ సంపత్ (1952-హిందీ),
 జాతకఫలం (1954-తెలుగు) - ఏలా దిగులేలా బేల...
 పాటలు : కొన్ని వేలకు పైగా (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, పంజాబీ... మొదలగునవి)
 సంగీత దర్శకునిగా : మహాసాధ్వి (కన్నడం) (ఇంకా రిలీజ్ కాలేదు)


 అవార్డులు : తమిళనాడు నుండి కలైమామణి, కన్నడం నుండి నడోజా అవార్డు, లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డులు, ఎన్‌టీఆర్, అక్కినేని, శివాజీ గణేశన్, మరెన్నో సంగీత అవార్డులు అందుకున్నారు.


 ఇతరవిషయాలు :  చిన్నప్పటి నుండే సినిమాల మీద మక్కువ పెంచుకున్నారు. చాలామంది గాయనీ గాయకులను అనుకరిస్తూ పాటలు పాడుతూ  ఉండేవారు. లతామంగేష్కర్ గొంతు అంటే ఆయనకు ప్రాణం. చాలా భక్తి ఆల్బమ్స్‌కు సంగీతం అందించారు. అసంఖ్యాక కవితలను 8 భాషలలో రాశారు. ఉర్దూలో గజల్స్, 8 భాషలలో ప్రణవం (ఓంకారం) అనే పుస్తకాన్ని రాశారు. ‘దశగీతసందేశం’ అని తల్లిదండ్రులపై చిత్ర కవిత్వం రాసి, పాడారు. ‘మెన్ టూ మూన్, మూన్ టూ గాడ్’ అనే ఇంగ్లిష్ రికార్డును ఆర్మ్‌స్ట్రాంగ్‌కు, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్‌కు పంపించారు. అందుకు వారు పి.బి.శ్రీనివాస్‌ను అభినందించారు. శాస్త్రీయ సంగీతం అంటే తెలియని శ్రీనివాస్, ఈ జనరేషన్‌కు సులువుగా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడానికి రాగాల స్వరాలకు సంబంధించి ఆరోహణ, అవరోహణలతో ‘డైమండ్ కీ’ ని రూపొందించారు. ఆయన గాత్ర మాధుర్యానికి మెచ్చి కన్నడ ప్రభుత్వం 500 గజాల స్థలాన్ని కేటాయించింది. ఒక తెలుగు గాయకుడికి ఇటువంటి గౌరవం దక్కడం ఇదే ప్రథమం. ఆయన ‘మెలోడీ కింగ్’గా సంగీత అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.

 మరణం : 14-04-2013
 
 

Advertisement

పోల్

Advertisement