రాహుల్ అనుమానం నిజమవుతుందా?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవిపై చేపట్టే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇన్నాళ్లు ఈ విషయంపై పెదవి విప్పని సోనియా గాంధీ తనయుడు మౌనం వీడారు. ప్రధాని పీఠం అధిష్టించేందుకు తాను సిద్ధమని సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే అందుకు అవకాశం రావాలంటూ మెలిక పెట్టారు. అందుకు ఎన్నికలు అయ్యేదాకా వేచిచూడాలని వెల్లడించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే పీఎం సీటులో కూర్చునే విషయం గురించి ఆలోచిస్తానని చెప్పారు.
తాను ప్రధానమంత్రి కావాలని ఎంపీలు కోరితే ఆలోచిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల తర్వాత లోక్సభ సభ్యులు, పార్టీ తనను ప్రధాని పదవి చేపట్టమని కోరితే కచ్చితంగా దీనిపై ఆలోచిస్తానని 'చినబాబు' సెలవిచ్చారు. అయితే తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే పీఎం పోస్టు చేపట్టే అంశం గురించి కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటానని అన్నారు. సొంత నియోజకవర్గం అమేథిలో రెండు రోజు పర్యటిస్తున్న రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ను కూడా లోక్సభ సభ్యులే ఎన్నుకున్నారని రాహుల్ గుర్తుచేశారు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించే సంప్రదాయం తమ పార్టీలో లేదన్న తన తల్లి వాక్కును రాహుల్ పునరుద్ఘాటించారు. ప్రధానిగా ఎవరు ఉండాలని ఎన్నుకునే హక్కు ఎంపీలకు ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ను ప్రధానిగా ప్రకటించాలని పలు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు కోరారు. ఇలాంటి సంప్రదాయం కాంగ్రెస్లో లేదని సోనియా ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు.
రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ వెనుకడుగు వేయడాన్ని విపక్షాలు ఎద్దేవా చేశాయి. మోడీని చూసి కాంగ్రెస్ భయపడుతోందని బీజేపీ ఆరోపించింది. ఓడిపోయే పార్టీకి ప్రధాని అభ్యర్థిగా తన కుమారుడి పేరు ప్రకటించడం ఇష్టంలేక సోనియా అడ్డుచక్రం వేశారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాహుల్‌ను రాజకీయ బలిపీఠంపై ఎక్కించేందుకు ఇష్టంలేకే సోనియాగాంధీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదన్నారు.
అయితే రాహుల్ చేసిన తాజా వ్యాఖ్యలు మోడీ మాటలను నిజం చేసేవిగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదన్న అనుమానం రాహుల్ మాటల్లో వ్యక్తమయిందని విశ్లేషిస్తున్నారు. అధికారంలోకి వస్తేనే తాను ప్రధాని పదవి చేపడతానని రాహుల్ పరోక్షంగా అంగీకరించారని అంటున్నారు. రాహుల్ అనుమానం నిజమవుతుందా, లేదా తెలియాలంటే సాధారణ ఎన్నికల వరకు ఆగాల్సిందే.