పంచమి 3 | Funday story of the week 11 nov 2018 | Sakshi
Sakshi News home page

పంచమి 3

Published Sun, Nov 11 2018 1:28 AM | Last Updated on Sun, Nov 11 2018 1:28 AM

Funday story of the week 11 nov 2018 - Sakshi

ఏ వార్త వింటానో ఏమిటో?  ఇంతకీ చవితి వెళ్లిందో లేదో?!   చలిగా ఉంది. షాల్‌ నిండుగా కప్పినా చలిగానే ఉంది.  కలతగా ఉంది.  కళ్ళు తెరిచి చుట్టూ చూశాను.  ఒక పడుచు అమ్మాయి కూర్చుని కళ్ళు తుడుచుకుంటంది.  కొందరు గురక పెట్టి నిద్ర పోతున్నారు.  కొందరు చడీ చప్పుడు లేకుండా శుప్తావస్థలో ఉన్నారు.  మళ్ళీ కళ్ళు మూసుకున్నాను.  నిద్ర పోతున్నానో మేలుకుని వున్నానో తెలీడం లేదు. ఏదో కలవరం.  ఎవరో తట్టినట్లు అనిపించింది.  కళ్ళు తెరిచి చుట్టూ చూశాను.  ఎవరూ కనబడలేదు.  ఇందాక ఏడ్చిన అమ్మాయి కూడా మగతలోకి జారినట్లు ఉంది.  పెద్దావిడ ఎలా ఉందో.  ఆలోచనలన్నీ ఆమె చుట్టూతా తిరుగుతున్నాయి. మొదటగా ఆ ఇంటికి వెళ్ళిన సాయంత్రం గుర్తుకొచ్చింది.‘ఇవాళే చేరమన్నా చేరతాను’  ప్రాధేయ పూర్వకంగా  అన్నాను.  నా అవసరాలు నావి. బంగారం కొట్ల వెనక మూడో సందులో ఐదో ఇల్లు.  మనిషి కావాలంట అన్నారు. విన్నది తడవుగా వెళ్ళాను.  ఖాళీగా కూర్చుంటే జరుగుబాటు ఎలా?  వానాకాలం చివరి రోజులు. మబ్బులు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఏదో ఒక వూరిలోనో, వాగుపైనో  అడుగు బొడుగు మిగిలిన చివరి చినుకులు దులపరించుకుంటున్నాయి.  చిత్తడి నేలలో బురద చీర మీదికి  చిమ్మకుండా నిదానంగా నేను నడుచుకుంటూ వెళ్ళేప్పటికి  ఇంటి వరండాలో  కోడలు ఉంది.  పనికోసం వొచ్చానని అడిగితే అత్తగారి గది చూబించింది.  తనుగా ఏ ఆరాలూ తియ్యలేదు.   పెద్దావిడ మా కుటుంబం, కులం ఇంతకు ముందు ఎక్కడెక్కడ పని చేసిందిలాంటి కొన్ని వివరాలు అడిగింది.  మాట్లాడుతూనే గోడ గడియారం చూసుకుని నీరసంగా  బల్ల మీద మందులు తీసింది.  టాబ్లెట్‌ పైని కవర్‌ చించి లోపలి మందు బిళ్ళ తీసే ఓపిక లేక కాసేపు అలానే నిస్సత్తువగా మొహం వేలాడేసింది.  సాయం చెయ్యబోయాను.

‘ఆగు ఆగు’గట్టిగా వారించింది.  ఏవైందో అని  తెల్లబోయాను.  పక్కన ఉన్న కేలండర్‌ దగ్గరికి తీసుకుని కాసేపు పరీక్షించింది.  ఎల్లుండి సాయంకాలం వర్జం, దుర్ముహూర్తం వెళ్ళిపోతాయి.  తిధి, నక్షత్రం బావున్నాయి.  అప్పుడు ఒచ్చి చేరు అన్నది.   పెద్ద జ్యోతిష్యం తెలిసిన మనిషిలాగా ధీమాగా. నాకేమో ఇప్పటికిప్పుడే చేర్చుకోవచ్చుకదా అని ఆశ.  మంచి నీళ్లు చేతికిస్తే గ్లాసు కింద పడకుండా తాగగలదో లేదో?  అయినా సరే సాయానికి మనిషిని పెట్టుకునేదానికి ముహూర్తం చూసుకుంది!  కనీసం మాత్ర మీద కవరు చింపడానికి కూడా ఒప్పుకోలేదు.  కవర్‌ చింపితే కూడా పన్లో చేరిపోయినట్టేనా? మరీ విడ్డూరం.ఎల్లుండి చేరాలి. అంటే, నేను రెండ్రోజులు జీతం లేకుండా ఖాళీగా ఉండాలి.  సర్లే. ఎల్లుండి నుంచి నిఖార్సుగా పని దొరికింది. అంతవరకూ నయం.నా పేరు మణి.  పెద్దావిడ పేరు  ఏదో ఉంది. నేను మాత్రం‘అమ్మా’అంటాను. రోజంతా ఆవిడని కనిపెట్టుకుని ఉండటం. ఎప్పటికీ కలగని ఉపశమనాన్ని కాసేపు కలిగినట్టుగా భ్రమ పడటానికి  ఏది చెబితే అది చెయ్యడం. ఏదీ చెయ్యడానికి లేనప్పుడు ఊరికే కూచుని చూడటం. అదే నా ఉద్యోగం.  జీవన్మరణ సంధి కాలంలో మనిషికి తోడు ఉండటం. ఎప్పటి నించో ఇదే పని.  ‘మనిషి పుటక్కి తొమ్మిదే రంధ్రాలు. నాకు మాత్రం ఎన్నో లెక్కే తెలీదు. ఎప్పుడు ఏ పాపం చేశానో, ఏ పూజలో దోషం చేశానో, ఈ మందులూ, సూదులూ.  మందులు లోపలంతా రంధ్రాలు చేస్తే సూదులు పైన పైన పొడిచి చంపుతున్నాయి’  నర్స్‌ ఇంజక్షన్‌ చేయడానికి వొచ్చినప్పుడల్లా  ఇలాంటి మాటలు అనేది.  

 ‘చెయ్యి కదపకుండా ఉండాలి. మంచి మందులు ఇవ్వన్నీ.   టైముకి మందులు వాడితే రెండు రోజుల్లో లేచి ఇల్లంతా తిరిగేయ్యోచ్చు’ కుర్ర నర్సమ్మ అనేది.  ఈ మాట వినీ వినీ ఎన్ని ‘రెండు రోజులు’ గడిచాయో లెక్కే లేదు.  అయినా ఒక క్షణం కళ్ళు తళుకుమనేవి.  వినబుద్ధి పుట్టించే, నమ్మ బుద్ధి పుట్టించే నర్స్‌ కబుర్లు విని నిట్టూరుస్తుంది. పని పూర్తి అయి తను వెళ్ళిపోయినాక ఆ పిల్లని గురించి కాసేపు కోపంగానో, ప్రేమగానో, చాడీ కోరుతనంగానో నాలుగు మాటలు చెబుతుంది.   ఇంజక్షన్‌ తరవాత దూదిని స్పిరిట్‌లో ముంచి సూది గుచ్చిన దగ్గర పడిన సన్నటి రక్తం చుక్కని గంట సేపు తుడువమంటుంది.లేక పోతే ఐసు ముక్కలు తీసి రుద్దమంటుంది. కొద్దిగా ఓపిక చిక్కితే లేచి అటూ ఇటూ తిరుగుతుంది. ఆవిడ తిరిగినంత సేపూ నేనూ చెయ్యి పట్టుకుని నడవాలి. ఇవన్నీ కాలక్షేపాల్లో భాగాలు.‘ఇది అసలు రోగం కాదు. గాలేదో సోకింది నాకు. చీటాకు తెమ్మని చెప్పాలి వాడికి’‘ఎప్పుడు ఎక్కడ ఏ ఎర్ర నీళ్లు తొక్కానో.  ఇలాగ రోజు రోజుకీ తగ్గిపోతున్నా’‘గుమ్మానికి కట్టిన గుమ్మడి కాయ మార్పించాలి.  పటిక గడ్డ ఒకటి తెచ్చి కట్టాలి. నాకు దిష్టి తగిలింది’ రోజులో ఎక్కువ భాగం ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ  ఉండేది.పెద్దామె భర్త రెండేళ్ళ క్రితం కాలం చేశాడు. ఒక్కడే కొడుకు. ఎందరో దేవుళ్ళకి ముడుపులు కట్టగా కట్టగా లేక లేక పుట్టాడంట. కొడుక్కి  మొగ పిల్లలు ఇద్దరు. ఎనిమిది పదేళ్ళ లోపు వాళ్ళు. పెద్ద పిల్లాడు ఉషారుగా ఉంటాడు. చిన్న వాడు ఎక్కడున్నాడో తెలీనంత నింపాదిగా ఉంటాడు. కానీ వాడి ఉనికి మనకి తెలిసేలా వాళ్ళమ్మ చీటికీ మాటికీ వాడిని కలవరిస్తూ వుంటుంది.

‘స్నానానికి వేడి నీళ్లు రెడీ గా ఉన్నాయి’‘టిఫిన్‌ తిందువు రా నాన్నా’ ‘అన్నం వండేశాను.  నువ్వింక రావాలి’ ఏది అడిగినా గట్టి సమాధానం చెవినిపడదు  పది సార్లు పిలిస్తూనే ఉంటుంది!  పిల్లలు, అమ్మల పిలుపుకి చప్పున స్పందించపోవడం మామూలే.  కానీ, వీడు మరీ విడ్డూరం.   వినపడినా పలకడు.  ఎప్పుడు పది నిమిషాలు తీరిక దొరికినా, ఏదో ఒక మూల మందపాటి దుప్పటి కప్పుకుని నిద్రపోతుంటాడు. పది సార్లు కేకలేస్తే నింపాదిగా వొచ్చి మంపుగా వాళ్ళమ్మ భుజాలు పట్టుకుని వేలాడుతూ నీలుగుతూ ఉంటాడు.‘మంచి రోజు అని రెండ్రోజులు ముందే బొజ్జలోంచి బైటికి తీయించింది వీడి నాయనమ్మ.కడుపులో వెచ్చగా, హాయిగా ఇంకా కొన్నాళ్ళు వుండనివ్వాల్సింది. అలా చప్పున లోకం లోకి లాగేటప్పటికి వాడికి ఏం అర్ధం కాలేదు. పుట్టిన రోజు మొదలు,  నిద్ర పోతూనే ఉన్నాడు. ఆ నాలుగు రోజుల లోటు ఏళ్ల తరబడి తీర్చుకుంటూనే ఉన్నాడు’ గారాబంగా వాడి జుట్టు నిమురుతూ, అత్తగారి వంక నిరసనగా చూసింది కోడలు.‘ఇదివరకంటే అవకాశం లేదు.  ఇప్పుడు అన్నింటికీ మంచి చెడ్డ చూసుకుని నడిచే అవకాశం ఉంది కదా.  నిద్ర ఎక్కువ పోతాడని మాటే గానీ,  తొందరగా అక్షరాలు పట్టేశాడు, బుద్ధిమంతుడు అని వాడకట్టలో మంచి పేరు.  ఇంక అంతకన్నా ఏం కావాలి?’  ఆవిడ తన వాదన వినిపించింది.ఎవరు మాట్లాడితే వాళ్ళ వంక తిరిగి తల ఊపుతూ వింటాను. నేను చేసే ఆయా పనిలో అత్తా కోడళ్ళ మధ్యలో తలదూర్చి  చేసే తీర్మానాలు ఏం ఉంటాయి గనక.   చివరి వానలు కూడా కురిసి చలి రోజులు మొదలు అయ్యేప్పటికి ఆవిడలో ఉషారు తగ్గిపోసాగింది.   మంచం మీద పడుకునే ఉంటే కదుములు కడతాయని లేచి కూర్చుని ఉంటోంది.  కానీ ఇదివరకటిలా అటూ ఇటూ తిరగడం లేదు. ‘ఆస్పత్రిలో చేరాలి.  బలమైన టానిక్కులు రాయించుకుని తాగితే సత్తవ వొస్తుంది.  లేచి తిరగాలి.  ఎన్నాళ్లైందో చింతకాయ తొక్కు, నెయ్యి కలుపుకుని అన్నం తిని.  కోడలు రోలు వాడనే వాడదు.  ఆ మిక్సీలో వేసి తిప్పితే ఏం బాగుంటాయి పచ్చళ్ళు?  పోనీ నాకు అది కూడా పెట్టరు.  ఉత్త చప్పిడి కూడు.  ఏదైనా అంటే, తేడా చేస్తుంది.  ఒద్దు.  ఒంటికి మంచిది కాదు అని చెబ్తారు.  ఓపిక రానీ.  ఈ సారి వేరు పొయ్యి పెట్టుకుని నేనే వొండుకుంటాను’ నిన్నటి నుంచి ఇలా ఏదో ఒకటి మాట్లాడ్డం మొదలు పెట్టింది.  చాలా రోజులు అయ్యింది ఇన్ని మాటలు విని.  నాకు అనుమానం వొచ్చింది.  కానీ బైటికి చెప్పలేదు.  రాత్రి పది గంటలు అయ్యిందేమో. బాత్‌రూమ్‌కి తీసుకెళ్లమంది. పగటి పూట ఐతే కోడలు సాయానికి వొస్తుంది, మంచం దగ్గర నుంచి బాత్‌రూమ్‌ తలుపు దాకా. రాత్రిళ్ళు నేనే తిప్పలు పడతాను.  ‘ముందు జన్మలో నువ్వు నా బిడ్డవి మణీ’ అంది.


‘మరేనమ్మా’ నేను చిన్నగా నవ్వాను.‘ఈ నైటీలు నాకు అసలు నచ్చవు.  ఏంటో నాకు ఇవి వేస్తున్నారు.  నాలుగు రోజులాగి కాస్త ఓపిక వస్తే చీరలు కట్టుకోవాలి’.  ‘అలాగే కట్టుకుందురు గానీ’. ‘అయినా ఇప్పుడు అందరూ నైటీలే వేస్తున్నారు.  నాకే ఎందుకో నచ్చవు’నేను ఏం మాట్టాడలేదు.  ఆమె కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉంది.  పొడి బట్టలు తొడిగి మంచం మీద పడుకోబెట్టాను.   ‘ఈ రోజు తిధి ఏమిటో చూడు మణీ’ కళ్ళు మూసుకునే చెప్పింది.  నేను గమ్మునున్నాను.కాసేపు గడిచాక చిన్నగా మూలగడం మొదలు పెట్టింది.  మధ్యలో ఏదో గొణుగుడు.  సరిగా అర్ధం కావడం లేదు.  స్పష్టంగా మాట్లాడటానికి లోపల్నించి సహకారం లేదు.  కొడుకుని పిలవనా అనుకున్నాను.  గది లోంచి బైటికి వొచ్చి తలుపు తట్టబోయాను.  కొడుకూ కోడలూ మేలుకునే ఉన్నట్లున్నారు.  లోపల్నించి సన్నటి ధ్వని!  రూపమాత్రంగా రెండుగదుల్లో శబ్దం ఒకటే.  కానీ భావనలు జీవితపు భిన్న పార్శా్వలకు ప్రతీకలు.  తలుపు కొట్టడానికి మొహమాటపడి  వెనక్కి వొచ్చేశాను.  కానీ పరిస్థితి క్షణ క్షణానికీ మారుతోంది.  చెప్పక తప్పదు,  ఏకాంతానికి భంగం అయినా సరే.  ఫోన్‌ తీశాను.  ఆరేడు రింగులు మోగగానే అటునుంచి కట్‌ అయ్యింది.  నిమిషంలో కొడుకూ కోడలూ వొచ్చారు. వాళ్ళు వొచ్చేప్పటికి ఆమె కళ్ళు మూసుకుని ఉంది. నావంక ప్రశ్నార్ధకంగా చూశారు.  నేను ఆవిడ వొంక చూబించాను.  అబ్బాయి, దగ్గరికెళ్ళి ఊపిరి ఉందో లేదో అని అనుమానంగా గమనించాడు.  ఊపిరి ఆడుతోంది.‘ఏమైంది?’అన్నాడు‘బాగాలేనట్లు ఉంది’
‘హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాలా?’ అంటూనే అంబులెన్సుకి ఫోన్‌ చేశాడు.  అంబులన్స్‌ వచ్చేలోగా అవసరమైన టవలు, చీరలు కొన్ని వస్తువులూ నేను సంచిలో సర్దాను.  అన్నీ సర్దటం అయ్యాక అబ్బాయి, గోడకి తగిలించిన కేలండర్‌ ఓ సారి చూసి, తరవాత దానిని తీసి సంచిలో వస్తువుల పైన పెట్టాడు!  కాసేపటికి అంబులన్స్‌  వొచ్చింది.  నన్ను కూడా ఎక్కమన్నారు.  ఆసుపత్రి ఇంద్ర భవనంలా ఉంది.  నరకానికి అందమైన డెకరేషన్‌ చేస్తే అదే ఆసుపత్రి.  పెద్ద పెద్ద మెట్లు, ఎక్కువ మంది నిలబడగల లిఫ్టు, అందమైన పూల పూల ప్లాస్టిక్‌ కర్టెన్లు, మరక పడని గ్లాస్‌ తలుపులు, తళ తళా మెరిసే రాళ్ళు పరిచిన నేల, శుభ్రమైన డాక్టర్లు, నర్సులు.  పేషంట్లు ఏరీ?  రోగాలు ఏవీ?  ఎక్కడా కనబడవే?  వాళ్లని మాత్రం అందరికీ కనబడేలా పెట్టరు! ఖరీదైన ఆసుపత్రికదా.  నొప్పీ, రోదనా, రోగాలు జాగ్రత్తగా లోపలెక్కడో దాచి పెట్టబడతాయి.

అబ్బాయిని పెద్ద డాక్టర్‌  లోపలికి పిలిచారు.   కోడలు, పిల్లల్ని బైట కూచోబెట్టుకుని సముదాయిస్తోంది.  లోనికి రావాలంటే భయమంది.  అందుకని నన్ను తోడు పిలిచాడు.  పెద్దామె చేతికీ మోహానికీ, మూతికీ, గొంతులోకీ ఏవేవో గొట్టాలు బిగించి ఉంచారు.  సృష్టికర్తకి మనిషి విసురుతున్న  సవాల్‌.  పై వాడు ఊపిరి ఆపెయ్యాలని చూస్తాడు. మనిషి ఒప్పుకోడు.   ఆడిస్తాడు.  ప్రేమో, భయమో, రాజకీయమో. అవసరం పేరు ఏదైనా గానీ.  ఆడిస్తాడు. మరి, ఎంతకీ దేవుడికేనా చావు పుట్టుకల వినోదం?‘కండిషన్‌ సీరియస్‌. ఎంత సేపో కూడా చెప్పలేము’ డాక్టర్‌ మాటకి అబ్బాయి మొహం వాడిపోయింది.‘ఎలా ఇప్పుడు?’ ఆదుర్దాగా అడిగాడు.‘వెయిట్‌ చెయ్యడమే’ డాక్టర్‌ ప్రశాంతంగా చెప్పాడు.‘అది కాదు డాక్టర్‌ గారూ.  నక్షత్రం, తిధి రెండూ బాగాలేవు.  చవితి వెళ్ళేదాకా ఎలాగోలా ఊపిరి ఉండేలా చూడండి.  ప్లీజ్‌’ డాక్టర్ని బ్రతిమిలాడినట్లు అడిగాడు. నేను ఆశ్చర్య పోయాను. డాక్టర్‌ మాత్రం నాలాగా ఆశ్చర్య పోలేదు.‘చూద్దాం.  హామీ ఐతే ఏమీ ఇవ్వలేం.  ఒక బాటిల్‌ రక్తం ఎక్కించి, డయాలిసిస్‌ చేద్దాం!’‘అలాగే డాక్టర్‌. ఎలాగైనా చవితి వెళ్ళేదాకా ఆపి ఉంచండి’ మళ్ళీ ప్రాధేయపడ్డాడు. మిషన్లు, మొరాయిస్తున్న ఊపిరి తిత్తులని ప్రయత్నపూర్వకంగా గాలితో నింపుతున్నాయి.   గుండె చప్పుడుని పర్యవేక్షిస్తున్నాయి. మెదడు మేలుకొని ఉన్నదో లేదో గమనిస్తున్నాయి.   ఒద్దు మొర్రో, నన్ను హాయిగా చావనియ్యండి అని బిగ్గరగా మొత్తుకోలేని అశక్త దేహం.   దుర్మార్గమైన ఆట. ట్రీట్మెంట్‌ జరుగుతోంది!‘మణీ, అమ్మతో పాటు నువ్వు వుండు. పేషంట్‌తో ఒచ్చిన ఒక్కరికే బెడ్‌ ఇస్తారు.  ఇంటి దగ్గర పిల్లలు కదా.  నాకు ఇక్కడ ఉండటం కుదరదు.  ఎటువంటి అవసరం వొచ్చినా వెంటనే ఫోన్‌ చెయ్యి’ ఏమంటానో అన్నట్లు నా మొహంలోకి చూశాడు. ఒక్క ఘడియ ఆలోచించి సరే చెప్పాను.  పాత రోజుల్లో మనిషికి బాలేదంటే గుంపులుగా బంధువులు ఆస్పత్రి బైట నిలబడి అయినా ఉండేవారు.  ఇప్పుడు అందరికీ అలా సాగడం లేదు.  ఎవరి పనులు వారివి.  ఎవరి జీవితం వారిది.  చావు వేడుకలో పాలు పంచుకోవడం కోసం, బ్రతికిన వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం వుండటం లేదు.ఘడియలు ఒకదాని వెంట ఒకటి మెల్లగా కదులుతున్నాయి. రాత్రి ముప్పావు భాగం పైగా గడిచింది.  

చల్లటి గది.  తెల్లటి నున్నటి నేల.  సౌకర్యంగా పడుకోడానికి ఏర్పాట్లు. శుభ్రమైన బాత్‌ రూమ్‌.  అన్నీ బావున్నాయి.  ఆ మూల ఉన్న ఫోన్‌ బాలేదు.  అది మోగిందంటే, ఎవరో ఒక పేషంట్‌ పేరు వినబడుతుంది.  ఆ రోగి తాలూకా వాళ్ళకి పిలుపు వస్తుంది.  భయం భయంగా వాళ్ళు గదిలోంచి బైటికి వెళతారు.  మిగిలిన వాళ్ళు, మనకి సంబంధించిన పేరు కాదు అని తాత్కాలికంగా స్వాంతన చెందుతారు.  నిన్న మొన్న చేరినట్లు ఉంది.  అప్పుడే రెండు నెలలు పైనే.   ఎప్పటి ఋణానుబంధమో.  దీర్ఘ శ్వాస వొదిలి కళ్ళు మూశాను.  మళ్ళీ ఎవరో తట్టారు.  చప్పున కళ్ళు తెరిచాను.పెద్దావిడ!! ఇంటి దగ్గర రెండు అడుగుల దూరం జరగడాకి మంచాలు పట్టుకుని ఒంగి నడుస్తుంది.  ఇప్పుడు మాత్రం నిటారుగా నిలబడి ఉంది. మోహం మాత్రం పాలిపోయి ఉంది.  మచ్చుకైనా కళ లేదు.  ఇక్కడికి ఎలా వొచ్చింది? ఇన్ని రూములు దాటి నా దాకా ఎలా వొచ్చింది?  ‘మణీ, ఆ గొట్టాలు, వైర్లు అన్నీ అడ్డంగా ఉన్నాయి.  చిరాగ్గా ఉంది.  అవన్నీ పెట్టొద్దు తీసెయ్యమను.   ఇక్కడ ఉండలేను.  వాడితో చెబితే వినడం లేదు.  నువ్వొచ్చి చెప్పు మణీ.  ఏం బాలేదు మణీ.  వెళ్ళిపోవాలని ఉంది.  ఉండలేను మణీ’ బ్రతిమలాడుతుంది.‘అమ్మా, అసలు మీరు  ఇక్కడికెలా వొచ్చారు?’ హైరానాగా కేక పెట్టి నేను దిగ్గున లేచి కూర్చున్నాను.     పక్కనే మంచాల మీద నిద్ర పోతున్న వొకరిద్దరు నా చప్పుడికి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు.  చుట్టూతా చూశాను.  ఎటువెళ్ళింది?  ఒణుకు పుట్టింది.  ఉలికిపాటుకు గురి చేస్తూ ఇంతలోకి గణగణా ఫోన్‌ మోగింది.  ఇందాక కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చిన పిల్ల లేచి గబగబా ఫోన్‌ దగ్గరికి వెళ్ళింది.‘ఆవిడ తాలూకా ఎవరు?’ నా యజమానురాలి పేరు చెప్పి అడిగింది. ‘నేనే’ శాలువా తీస్తూ హడావిడిగా లేచాను. నా సెల్‌ ఫోన్‌ మోగింది. పెద్దావిడ కొడుకు.  గుండెలు దడ దడ మంటున్నాయి.  చేతులు  కంపిస్తున్నాయి. ఫోన్‌ ఎత్తాను.‘మణీ, ఐదు నిమిషాల్లో వొచ్చేస్తున్నా’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు.  టైం చూశాను.ఈ సమయంలో ఆవిడ ఎలా వొచ్చింది? ఎలా వెళ్లింది?  అబ్బాయి అర్జెంట్‌గా వస్తున్నట్లు ఫోన్‌ ఎందుకు చేశాడు. అక్కడికి వెళ్లి ఏ వార్త వింటాను? శాలువా లుంగ చుట్టి సంచిలో పెడుతుంటే పైనున్న కేలండర్‌ కింద పడింది.  చేతిలోకి తీసుకుని  చూశాను. వారం, నక్షత్రం మారాయి.  కొద్దిసేపటిక్రితమే చవితి కూడా వెళ్ళిపోయింది.
- ఎం.ఎస్‌.కె. కృష్ణజ్యోతి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement