లోక కళ్యాణం
ఆరోజు కాలేజీ లైబ్రరీలో గాంధీజీ ఆత్మ కథలో నుంచి కొన్ని పేజీలు చదివాడు నందలాల్. అవి పేజీల్లా అనిపించలేదు అతనికి. మనసును విశాలం చేసే వెలుగు కిరణాల్లా తోచాయి. మరుసటి రోజు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేశాడు, నచ్చిన వాక్యాలను డైరీలో నోటు చేసుకున్నాడు. ఇక ఆ రాత్రంతా ఏవేవో ఆలోచనలు! ‘‘ఇతరుల సేవలోనే నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోగలుగు తావు’’... గాంధీజీ మాటల్ని పదేపదే మననం చేసుకున్నాడు.
వారణాసిలోని రాజ్‌తలాబ్ గ్రామంలో చేనేత కార్మికుల ఇంట్లో పుట్టాడు నందలాల్. కుటుంబ ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే. తండ్రి చనిపోవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో బేనిపూర్‌లోని పెద్దక్క ఇంట్లో ఉండి కాలేజీ చదువు పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తికాగానే స్వగ్రామానికి వచ్చాడు. ‘‘పట్నంలో ఏదైనా ఉద్యోగం చూసుకోక... ఇక్కడికి వచ్చి ఏంచేస్తావు?’’ అన్నారు చుట్టాలు పక్కాలు. ‘‘నేత పని’’ అని టక్కున జావాబిచ్చాడు నంద. విన్నవాళ్లు ఎగతాళిగా నవ్వారు. ఆ నవ్వులకు నందలాల్ నొచ్చుకోలేదు. తన ఇద్దరన్నలతో పాటు చేనేత పని చేయడం మొదలుపెట్టాడు. పేదరికం కారణంగా బడికి వెళ్లని పిల్లల కోసం సాయంత్ర పాఠశాలను ప్రారంభించాడు.
ప్రతిరోజూ ఇల్లిల్లూ తిరిగి పిల్లలను స్కూలుకు తీసుకువచ్చేవాడు నంద. పిల్లలకు నచ్చేలా పాఠాలు చెప్పేవాడు. దీంతో బడిలో పిల్లల సంఖ్య పెరుగుతూ పోయింది. నందను ప్రేరణగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాల యువకులు పేదపిల్లలకు, బడికి రెగ్యులర్‌గా వెళ్లని పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభిం చారు. నంద దగ్గరికి వచ్చి వివిధ విషయాల్లో సలహాలు తీసుకునేవారు. వాళ్లందరితో ఒక బృందాన్ని తయారు చేశాడు నంద. అందరూ కలిసి ‘లోక్ సమితి’ అనే పేరుతో రాజ్‌తలబ్ కేంద్రంగా ఒక స్వచ్ఛంద సంస్థను, దీనికి అనుబంధంగా ‘కళా మంచ్’ పేరుతో ఒక కళామండలిని స్థాపించారు. పాటలు, వీధినాటికలు మొదలైన కళారూపాలతో వివిధ సామాజిక సమస్యలపై గ్రామాలను చైతన్యవంతం చేసేది ‘కళా మంచ్’.
జాతీయ స్థాయిలో సామాజిక సమస్యలపై ఉద్యమాలు చేసే ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్’కు స్టేట్ కన్వీనర్‌గా పనిచేయడం వల్ల తన కార్యక్షేత్రాన్ని మరింత విస్తృతపరుచుకునే అవకాశం నందకు దొరికింది. రకరకాల ఉద్యమాల స్వరూప స్వభావాలు, భావజాలలలో నుంచి కొత్త విషయాలను నేర్చుకోవడం ప్రారంభించాడు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు అడ్డుకో వడం, స్త్రీసాధికారత, స్వయం సహాయక బృందాలు... ఒకటీ రెండూ కాదు, అనేక మంచి పనులు చేస్తోంది లోక్ సమితి.
వరకట్నం ఇచ్చుకోలేక పెళ్లికాని అమ్మాయిలను చూస్తే నందకు బాధగా అనిపించేది. దాంతో ‘లోక్ సమితి’ తరపున మొదటిసారి 13 పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించాడు. అలా నేటి వరకు 700 మంది వివాహాలు జరిగాయి. కట్నం తీసుకోవద్దంటూ మగ పిల్లలకు బోధిస్తున్నాడు. పెళ్లి పేరుతో డబ్బు వేస్ట్ చేయొద్దని, ఆ డబ్బుల్ని మిగిల్చి తనకు ఇస్తే కొందరు ఆడపిల్లల జీవితాలను నిలబెడతానని అవగాహనా సదస్సులు పెట్టి మరీ చెబుతున్నాడు. దాంతో ఎందరో ధనవంతులు తమ కుటుంబాల్లో వివాహవేడుకల ఖర్చులను తగ్గించుకొని ఆ మొత్తాన్ని పేదల పెళ్లిళ్లకు ఇస్తున్నారు. తాను చేస్తున్న మంచి పనుల గురించి ప్రస్తావించినప్పుడు ‘‘ఇది తొలి అడుగు మాత్రమే’’ అంటాడు నందలాల్ తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని ఉద్దేశించి!