
హీరోనొమాయ్!
ఇరవై రెండేళ్ల వయసు అంటే అంత పెద్ద వయసేమీ కాదు. ‘జీవితంలో ఎలా స్థిరపడాలి?’ అనే ఆలోచనలే ఒక కొలిక్కి రాని వయసు. హిరోనొమాయ్(అస్సాం) అలాంటి వయసులోనే ఉన్నాడు. 18 సంవత్సరాల వయసులో అతడి తల్లి చనిపోయింది. అంతా శూన్యం. ఏంచేయాలో తెలియని పెద్ద విషాదం. అప్పటి నుంచే తన గ్రామం మోతడంగ్‌లోని అమ్మలందరిలో తన అమ్మను చూసుకునేవాడు.
‘‘మా అమ్మలాగే ఎంతో మంది అమ్మలు కనీస అవసరాలకు నోచుకోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం నా వంతుగా ఏదైనా చేయాలి’’ అనుకున్నాడు హిరొనొమాయ్.
‘‘వ్యాపారం చేయడానికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. రైట్ ఐడియా, రైట్ మార్కెట్, రైట్ టైమింగ్ ఉంటే వ్యాపారంలో విజయం సాధించవచ్చు’’ అని నమ్మిన హిరోనొమాయ్ ఆలోచనలో నుంచి పుట్టిందే జీకెకె, గావ్ కా ఖానా(పల్లెభోజనం) అనే ఫుడ్‌స్టార్టప్. రాష్ట్రంలోని పట్టణ ప్రాంత వినియోగదారులకు ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా పసందైన పల్లె భోజనాన్ని అందిస్తుంది జీకెకె.వినియోగదారులకు ఆరోగ్యకరమైన భోజనం, కూరగాయలు పండించే రైతులకు అండగా నిలవడం, స్త్రీలకు ఉపాధి కల్పించడం...మొదలైనవి తన ప్రాధాన్య అంశాలుగా చేసుకున్నాడు హిరోనొమాయ్.
తన గదిలో సింగిల్ స్టౌతో మొదలైన ‘జీకెకె’ ఇప్పుడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో విస్తరించింది. శివసాగర్‌లోని సంస్థ కార్యాలయంలో పదిమంది స్త్రీలు ఫుల్‌టైం కుక్‌లుగా పని చేస్తున్నారు. కార్పొరేట్ క్లయింట్ల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని స్త్రీలకు ఔట్‌సోర్సింగ్ ఇస్తుంది జీకెకె. స్త్రీలకు సంబంధించి స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడం, వాటి గురించి ప్రచారం చేయడంలో కూడా హిరోనొమాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.రాబోయే అయిదు సంవత్సరాల కాలంలో మూడు వేల మందికి పైగా స్త్రీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు హిరోనొమాయ్.