ఈ సర్కారును ఆపగలిగేవాడు ఎవడూ లేడు...
ఈ సర్కారును ఆపగలిగేవాడు ఎవడూ లేడు...
Published Sun, Dec 4 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
నాకు అడ్డొచ్చిన కొరియన్స్, మలేషియన్స్, ఇండోనేషియన్స్ ఎంతో మందిని చంపి ఈ ఎంపైర్ క్రియేట్ చేశాను. ఈ సర్కార్‌ను టచ్ చేయడం అంత ఈజీ కాదు
‘విలన్ అంటే ఇలా ఉండాలి’
‘ఇలాగే ఉండాలి’ అనుకుంటే.... కచ్చితంగా అలానే ఉంటాడు. ‘అలా’ ఉండడం బానే ఉంటుంది గానీ అన్నిసార్లూ బాగుండదు. మొహం మొత్తుతుంది. అందుకే ‘రొడ్డకొట్టుడు విలన్’ పాత్రలు చేయడం అంటే కెల్లీ డోర్జీకి ఇష్టం ఉండదు.
విలనిజంలో వైవిధ్యాన్ని కోరుకుంటాడు.
అవసరమైతే దర్శకులతో చర్చలు చేస్తాడు.
‘ఇలా చేస్తే బాగుంటుందేమో’ అని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ‘హీరోగా నటించడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది. విలన్‌గా నటించడానికి మాత్రం అనేక మార్గాలు ఉంటాయి’ అని నమ్ముతాడు కెల్లీ డోర్జీ. నలుగురిని కొడితేనే హీరో, నాలుగు డ్యూయెట్లు ఉంటేనే హీరో, హోరుగాలిలోనూ క్రాఫ్ చెదరకుంటేనే హీరో... అనే అభిప్రాయం బలపడినప్పుడు... హీరోగా నటించడానికి ఒకే మార్గం ఉంటుంది!
కానీ విలన్‌కు చాలా మార్గాలు ఉంటాయి.
కత్తులతో.. కంటి సైగతో...
మీసాలతో...
తెల్లటి టాటా సుమోలతో... విలనిజాన్ని పండించవచ్చు. అయితే ఇంత శ్రమ కూడా అక్కర్లేదు అంటాడు కెల్లీ.
‘బొద్దు మీసాలతో గట్టిగా అరిస్తేనే విలనా?’ అని అడుగుతాడు.
‘విలన్ కార్నర్’ అనేది ఖాళీగానే ఉందని... అక్కడ పూరించవలసింది ‘చాలా ఉంది’ అని నమ్ముతాడు. ‘బెస్ట్ విలన్ ఎలా ఉండాలంటే హిందీలో ‘ఓంకార’ సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్ పాత్రలాగా!’ అంటాడు. కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పుడు... రావలసిన పాత్రలు వరస కట్టకపోవచ్చు. అలాంటి పరిస్థితి కెల్లీకి కూడా ఎదురైంది. ఒక సంవత్సరం అయితే అవకాశాలు లేక ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. అయితే... పాత్రలే నా దగ్గరకు నడిచి రావాలి అని అతను ఎప్పుడూ బెట్టు చేయలేదు.
‘నాకో చాన్స్ ఇవ్వండి’ అంటూ కొత్త నటులలాగే దర్శకులు, నిర్మాతల తలుపు తట్టాడు. ‘ప్రతిభ మాత్రమే అన్ని వేళలా పని చేయదు... ప్రయత్నం కూడా ముఖ్యం’ అని నమ్ముతాడు డోర్జీ. సినిమా భాషలో చెప్పాలంటే ‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలి’ అంటాడు. ‘నిన్ను నువ్వే మార్కెట్ చేసుకోవాలి’ అని చెబుతాడు... ఇవి అనుభవం నేర్పిన గుణపాఠాలు కావచ్చు. కాకపోవచ్చు. అయితే ‘విలనిజం’ అనే పుస్తకంలో ఒక్క పాఠం కాదు... రకరకాల పాఠాలు నేర్చుకోవడానికే మొగ్గు చూపుతాడు కెల్లీ డోర్జీ. అందుకే... మన తెలుగు చిత్రసీమకు కూడా ‘సుపరిచిత విలన్’ అయ్యాడు. ‘బద్రీనాథ్’ సినిమాలో సర్కార్‌గా నటించాడు కెల్లీ డోర్జి. ఈ సర్కార్ పచ్చి నెత్తురు తాగే వాడే కావచ్చు.
ఒకరిని చంపడానికి రౌడీలను పంపించి...
‘చచ్చాడా లేదా అనేది మూడుసార్లు కన్‌ఫామ్ చేసుకోండి. శరీరాన్ని చూసి కాదు... శ్వాసను చూసి’ అని క్రూరంగా జాగ్రత్తలు చెప్పేవాడే కావచ్చు.
‘నీ కంఠంలో ప్రాణముండగా
పెళ్లి జరిపించనన్నావు కదా...
అందుకే... కంఠం కోసేశాను’ అని తన పైశాచికత్వాన్ని చాటుకునేవాడే కావచ్చు...అయితే ఈ సర్కార్‌కు కూడా ఒక లవ్‌స్టోరీ ఉంటుంది. లవ్ సెంటిమెంట్ ఉంటుంది. అందుకే ఇలా అంటాడు...
‘సారీ మినిస్టర్... ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేయాలన్నావు... చేశా. తోటి కాంట్రాక్టర్లను చంపమన్నావు... చంపా. నీ పవర్ మార్చమన్నావు... మార్చా. కానీ... నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా... ప్రేమ విషయంలో ఎంటరవ్వను’తన భార్యపై మామ చేయి చేసుకున్నప్పుడు కళ్లతో సర్కార్ పలికించిన భావాలు ఎంత బలంగా ఉంటాయి!
‘డిఫరెంట్ లుక్స్’తో తనదైన విలనిజాన్ని సృష్టించుకున్న కెల్లీ డోర్జీ ‘డాన్’ ‘ద్రోణ’ ‘బిల్లా’ ‘కేడీ’ ‘గోలీమార్’ ‘బద్రీనాథ్’ ‘దడ’ ‘బాద్‌షా’... మొదలైన చిత్రాల్లో నటించారు.
భూటాన్‌లోని థింపులో జన్మించిన కెల్లీ డోర్జి, డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్ హైస్కూల్, ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకున్నాడు. ‘గ్లాడ్‌రాగ్స్ మ్యాన్‌హంట్ కాంటెస్ట్’తో వెలుగులోకి వచ్చాడు. ‘మోడల్’గా రాణించాడు. బాలీవుడ్ సినిమా ‘టాంగో ఛార్లీ’లో బోడో మిలిటెంట్ లీడర్‌గా వెండితెరకు పరిచయమయ్యాడు. తెలుగులో ‘డాన్’ సినిమాతో ‘బెస్ట్ విలన్’గా ‘మా టీవి వ్యూయర్స్ చాయిస్’ అవార్డ్ అందుకున్న కెల్లీ డోర్జి ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
Advertisement
Advertisement