మెరుపుకాంతుల మధ్య దివ్యంగా వెలిగిపోతున్నాడు గాడ్ డైనసిస్. ఎందుకో ఆయనకు సడన్‌గా కింగ్ మిడాస్ గుర్తుకు వచ్చాడు. తనలో తాను నవ్వుకున్నాడు. '‘మిడాస్...ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరిలో కంటే నీ దగ్గరే బంగారం ఎక్కువగా ఉంది. అయినా నీకు బంగారం మీద మమకారం పోలేదు...ఇంకెంత బంగారం కావాలి?’’ అని తాను అడిగితే... ‘‘నేను ముట్టిందల్లా బంగారం కావాలి’’ అని ఆశ పడి ఎలా దెబ్బతిన్నాడో గుర్తు తెచ్చుకొని మరోసారి గట్టిగా నవ్వుకున్నాడు డైనసిస్. మిడాస్ కథ ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది. ఈ కథ నుంచి మనుషులు ఏమైనా గుణపాఠం నేర్చుకున్నారా? ఆశకు అంతు ఉండాలని గ్రహించారా? ఒక్కసారి చెక్ చేద్దాం అనుకున్నాడు డైనసిస్. తన ముందున్న గ్లోబ్‌ను గిర్రున తిప్పాడు. అది కరాచి దగ్గర ఆగింది. వెంటనే కరాచీ సందుగొందుల్లో కనిపించీ కనిపించనట్లు ఉన్న ఒక తెల్లటి భవంతిలోకి ప్రత్యక్షమయ్యాడు డైనసిస్. ఆ భవంతిలో దావూద్ ఇబ్రహీం ‘బాంబ్‌బ్లాస్ట్ టుడే’ పత్రికను శ్రద్ధగా చదువుకుంటున్నాడు.
‘‘నాయానా దావూదూ’’ అని వినబడడంతో తలెత్తి చూసి ‘‘క్యాజీ ఎవరు జీ మీరు?’’ అని అడిగాడు దావూద్ కళ్లద్దాలు సవరించుకుంటూ. ‘‘నా పేరు డైనసిస్ నాయనా. నువ్వు కోరిన వరం ఇద్దామని వచ్చాను’’ అని బదులిచ్చాడు డైనసిస్. ‘‘షుక్రియా డైనసిస్ జీ...నేను ఏ వస్తువును టచ్ చేసినా అది తుపాకీ కావాలి. ఈ వరం ఇవ్వండి చాలు’’ అని తన్మయంగా అడిగాడు దావూదు. ‘‘అలాగే నాయనా. రేపు ఉదయం నుంచి నేనిచ్చిన వరం అమల్లోకి వస్తుంది’’ అన్నాడు డైనసిస్. ఈలోపే...‘‘అయ్యయ్యో! కాస్త ఆగండి’’ అని అందోళన పడ్డాడు దావూద్. ‘‘ఏమైంది?’’ అని అడిగాడు డైనసిస్. ‘‘టచ్ చేసినవన్నీ తుపాకులైపోతే నేనేం తిని బతకాలి?’’ కింగ్ మిడాస్‌ను గుర్తు చేసుకుంటూ భయంగా అన్నాడు దావూద్. ‘‘డోండ్ వరీ దావూదూ...అబ్రకదబ్రక...కబ్రకదిబ్రక...దిబ్రకఅబ్రక అనే మంత్రం చదివి టచ్ చేస్తేగానీ నువ్వు టచ్ చేసినా వస్తువులు తుపాకులుగా మారవు’’ అని అభయం ఇచ్చాడు డైనసిస్.
పట్టలేనంత సంతోషంతో ఉదయం కోసం వేచి చూస్తున్నాడు దావూద్ ఇబ్రహీం. డైనసిస్ మరోసారి గ్లోబ్ తిప్పాడు. అది లండన్ దగ్గర ఆగింది. వెంటనే లండన్‌లో ప్రత్యక్షమయ్యాడు డైనసిస్. అది లండన్‌లోని ఖరీదైన ప్రాంతం. ఆ ఖరీదైన ప్రాంతంలో ఖరీదైన ఇంట్లో అతి ఖరీదైన మద్యం తాగుతూ... ‘అప్పు చేసి బిర్యానికూడు తినరా బ్రదరూ’ అని పాడుకుంటున్నాడు విజయ్ మాల్యా. తనని తాను పరిచయం చేసుకొని... ‘‘ఏ వరం కావాలో కోరుకో నాయనా’’ అడిగాడు డైనసిస్. ‘‘ నాకంటూ పెద్ద కోరికలేమీ లేవు. చిన్న కోరిక...అంతే’’ అంటూ సిగ్గుతో మెలికలు తిరిగాడు మాల్యా. ‘‘సిగ్గు లేకుండా అడుగు నాయనా’’ అని ఆఫర్ ఇచ్చాడు డైనసిస్. ‘‘ఏంలేదు...నేను ఏ బిల్డింగ్‌ని టచ్ చేసినా అది బ్యాంక్ కావాలి. నువ్వే కావాలి అంటూ పాట అందుకోవాలి’’ అన్నాడు ఆశగా మాల్యా. ‘‘అలాగే నాయనా’’ అన్నాడు డైనసిస్. ఈలోపే దావూద్‌కు వచ్చిన డౌటే మాల్యాకు వచ్చి అడిగాడు. మంత్రం గురించి చెప్పి ‘డోంట్‌వరీ’ అని ధైర్యం చెప్పాడు డైనసిస్. మరుసటి రోజు మార్నింగ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు మాల్యా.
ఈసారి గ్లోబ్ ముంబై దగ్గర ఆగింది. ముంబైలో ఉన్న ‘ఏసియన్ హార్ట్ హాస్పిటల్’లో విశ్రాంతి తీసుకుంటున్న లాలూప్రసాద్‌యాదవ్ ముందు ప్రత్యక్షమయ్యాడు డైనసిస్. తనని తాను పరిచయం చేసుకొని... ‘‘నీకేం వరం కావాలో కోరుకో లాలూ’’ అని అడిగాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా.... ‘‘నేను ఏ కుర్చీని టచ్ చేసినా అది పీయం కుర్చీ కావాలి’’ ఆశగా అడిగాడు లాలు. ‘‘అలాగే’’ అని మంత్రం గురించి చెప్పి మాయమయ్యాడు డైనసిస్. కట్ చేస్తే... విక్రమార్కుడి భుజం మీద ఉన్న శవం మాట్లాడడం మొదలుపెట్టింది. ‘‘ఇదెక్కడి అన్యాయం రాజా! విపరీతమైన కోరికలు కోరుకున్న వాళ్లను మందలించాల్సింది పోయి ఆ డైనసిస్ ఎడాపెడా వరాలు ఇవ్వడం ఏమిటి? అసలు మరుసటి రోజు మార్నింగ్ ఏం జరిగింది?’’ అడిగింది శవం. అప్పుడు విక్రమార్కుడు ఇలాచెప్పాడు: ‘‘ఆరోజు మార్నింగ్ లేవడం లేవడంతోనే మంత్రం చదువుతూ కనిపించిన వస్తువునల్లా టచ్ చేశాడు దావూద్. ఇంటి నిండా, ఇంటి బయట ఎటు చూసినా తుపాకులే తుపాకులు.
కానీ...అవి పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకులు! ఇది అన్యాయం! నన్ను మోసం చేశాడు... అని గట్టిగా అరిచాడు దావూద్. అప్పుడు డైనసిస్ ప్రత్యక్షమై... ఒరేయ్ శుంఠా... నువ్వు టచ్ చేసినవన్నీ తుపాకులవుతాయని వరం ఇచ్చానేగానీ... అవి అసలు సిసలు ఒరిజినల్ తుపాకులని చెప్పలేదే... అన్నాడు. నాలిక కర్చుకున్నాడు దావూద్. ఇక మాల్యా సంగతి. ఉదయం లేవడం లేవడంతోనే బ్రష్ కూడా చేసుకోకుండా... కనిపించిన బిల్డింగ్‌నల్లా టచ్ చేస్తూ పోయాడు. ఇంకేముంది? ఎటు చూసిన బ్యాంకులే బ్యాంకులు. అవి మాల్యాను చూస్తూ....రారా సరసకు రారా...అని పాడడం మొదలెట్టాయి. దీంతో పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని ఆ బ్యాంకుల్లోకి దూరాడు మాల్యా. షాక్! ఆ బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఎటు చూసిన పుర్రెలే పుర్రెలు! ఒకవైపు స్కల్ బ్యాంక్ అనే బోర్డ్‌ను చూసి జడుసుకున్నాడు మాల్యా. ఇది అన్యాయం అని అరిచాడు.
డైనసిస్ ప్రత్యక్షమై... నేను టచ్ చేసిందల్లా బ్యాంక్ కావాలి అన్నావేగానీ... ఏ బ్యాంక్ అనేది క్లియర్‌గా చెప్పలేదు. కాబట్టి నాదేం తప్పులేదు... అని అక్కడి నుంచి మాయమైపోయాడు డైనసిస్. ఇక లాలూ సంగతి. లాలు లేవడం లేవడంతోనే బెడ్ మీది నుంచి దునికి తనకు కనిపించిన కుర్చీని మంత్రం చదువుతూ టచ్ చేశాడు. అంతే.... ఆ కుర్చీలో నుంచి ఒక అస్థిపంజరం ప్రత్యక్షమై.... నమస్తే లాలూ భయ్యా! అని విష్ చేసింది. ఓరియనాయనో... అంటూ పరుగెత్తి ఒక మూల దాక్కున్నాడు లాలు. కొద్దిసేపటి తరువాత... దాక్కున్న మూల నుంచి బయటికి వచ్చి ఇది మోసం అని అరిచాడు. డైనసిస్ ప్రత్యక్షమై... ఇందులో మోసం ఏముంది? నువ్వు పీయం కుర్చీ కావాలి అని అడిగావు ఇచ్చాను అన్నాడు.
ఇది పీయం కుర్చీ ఎలా అవుతుంది? ఆక్రోశించాడు లాలు. నువ్వు జడుసుకున్న కుర్చీని పీయం కుర్చీ అని ఈ హాస్పిటల్ వాళ్లు పిలుచుకుంటారు. పింటూ ముఖర్జీ... అంటే షార్ట్‌కట్‌లో పీయం అనే బెంగాలీ వాడు ఈ కుర్చీలో కూర్చొనే తన తుది శ్వాస విడిచాడు. అందుకే ఈ కుర్చీకి పీయం కుర్చీ అని పేరు... అని వివరించాడు డైనసిస్. బిత్తరపోయి పిచ్చిచూపులు చూస్తూ జుట్టు పీక్కున్నాడు లాలు!’’ చెప్పడం ముగించాడు విక్రమార్కుడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే బేతాళుడు నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నాడు!
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment