సృజనం: మళ్లీ... మొదలయింది! | Love plays key role in human life | Sakshi
Sakshi News home page

సృజనం: మళ్లీ... మొదలయింది!

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

సృజనం: మళ్లీ... మొదలయింది!

సృజనం: మళ్లీ... మొదలయింది!

తన సహజీవులంతా తనపైన టన్నుల ప్రేమను కురిపిస్తే తన బిట్లు బిట్లుగా పొందాడు. తిరిగి ఎందరికి, ఎంత పంచాడో గుర్తే లేదు. నా ఈ బలహీనమైన గుండెకిప్పుడు ఈ ప్రపంచం అత్యంత ప్రేమాస్పదంగా గోచరిస్తోంది. నన్ను ఆప్యాయంగా తల్లిలా తడుముతోంది. ‘మానవజన్మ ఎత్తబట్టి కదా ఈ అదృష్ట ఫలాన్ని పొందాను!
 
 ‘‘డాక్టర్‌తో మాట్లాడాను నాన్నా! భయపడక్కర్లేదన్నారు,’’ అన్నాడు హరి, స్టార్ హాస్పిటల్ బెడ్ మీదున్న నా పక్కనే కూర్చుంటూ. నా అరచేతిని తన అరచేతితో వత్తుతున్న వాడి చేతుల్లో చిరుచెమట. ఆ చెప్పడంలోనే చాలా ప్రమాదకరం అన్న సంకేతాన్ని అరవయ్యయిదేళ్ల వయసున్న నేను గ్రహించాను. డాక్టర్ పర్యవేక్షణలో ఉంటున్నా ప్రమాదం ముంచుకొచ్చింది. యధాలాపంగా చేయించిన మాస్టర్ చెకప్‌లో బయటపడిన విషయం, గుండె పరిస్థితి బాగాలేదనీ నాకు అర్జెంట్‌గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయ్యాలనీ. నాకున్న బీపీ, షుగరు, కిడ్నీ సమస్యల వల్ల, నా చెయిన్ స్మోకింగ్ వల్ల ఆపరేషన్ మరీ అంత సులువు కాదనీ డేంజర్, సేఫ్‌టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనీ సారాంశంగా తేల్చారు కార్డియాలజిస్టులు.
 
 మొట్టమొదట వినగానే కలిగిన బాధ మెల్లిమెల్లిగా తగ్గుతోంది. మనసు ఎడ్జస్ట్ అవుతోంది.
 ‘‘ఈ రోజుల్లో గుండాపరేషన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కన్నా సులువయ్యిందర్రా’’ అంటూ ఫెళ్లున నవ్వుతూ కారిడార్‌లో బంధువుల మధ్య నిలబడ్డ సత్యం బాబాయ్‌కి ఎనభయ్యేళ్లు. నన్నెత్తుకుని తిప్పిన బాబాయ్ తనకుతానే ధైర్యం చెప్పుకుంటున్నాడు వాళ్లకి చెబుతున్నట్టుగా.
 నా అర్థభాగం పద్మ లేకపోవడం వల్ల, యీ శరీరానికి రాబోయే ప్రమాదాన్ని అతిశయించి చెప్పేవారు లేరు. మా అబ్బాయి అత్తగారు, మావగారు సాయంగా వచ్చారు.
 
 ‘‘నాన్నా! అమ్మని పిల్చేద్దాం’’ అన్నాడు హరి ఉద్వేగంగా. ‘‘నాకేం కాదులేరా!’’ అన్నా వాడి భుజం తడుతూ. ‘‘చెల్లాయికి డెలివరీ రోజులు. ఇలా అని తెలిస్తే అమ్మ వచ్చేస్తుంది. చెల్లాయికి కష్టం అవుతుంది. చెప్పకపోవడం మంచిదేమో కదా నాన్నా!’’ మాటల్ని పేర్చుకుంటున్నట్టుగా అన్నాడు హరి మళ్లీ.
 ఇంతలో నర్స్ వచ్చి హరిని పిల్చుకెళ్లింది. తిరిగి వచ్చి, ‘‘నాన్నా! నేను బ్యాంకుకి వెళ్లొస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు. సాయంత్రం ఏడు తర్వాత కోడలు శ్రావణి వచ్చింది క్యారియర్ తీసుకుని, బిక్క మొహం వేయబోయింది కూర్చుని. ‘‘ఏం కూరమ్మా!’’ అన్నాను నవ్వుతూ. గలగలా కబుర్లు చెబుతూ వడ్డించింది మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ. తిన్నాక, ‘‘వెళ్లమ్మా! మళ్లీ డ్రైవర్ ఇబ్బంది పడతాడు’’ అని ఆ అమ్మాయిని పంపేశాను. హరి వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చాక, ఇద్దరం పడుకున్నాం. నిద్ర రావడం లేదు. రెండేళ్ల క్రితం మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ తప్పదట. మెషిన్ అన్నాక ఏదో రోజు ఆగిపోక తప్పదు. దాన్నలా ఆగిపోనివ్వకుండా ఇంకా పనిచేయించడం అవసరమా?
 
 నేనే అమ్మాయి కడుపున పుడతానేమో! మెరుపులా ఆనందం! ‘‘మళ్లీ జన్మ కోరుకోకూడదురా. జన్మ రాహిత్యం కోరుకోవాలి’’ అనేది బోసినోటితో నానమ్మ. నానమ్మా, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ అంతా భగవద్గీత చదువుతూ ఉండేవాళ్లు నిత్యం. ‘‘కృష్ణ భగవానుడు గీతలో ఏమన్నాడంటే...’’ అంటూ తాతయ్య తన్మయత్వంతో ఎవరో ఒకరికి చెబుతూ ఉండేవాడు. ‘‘మనం ఎప్పుడు చనిపోతామో తెలియడం మహాదృష్టం’’ అనేవాడు.
 
 అవన్నీ గుర్తొస్తుంటే మరణమెంత సహజం, అనివార్యం, అనిపిస్తోంది. కానీ ఈ స్పెషలిస్టులంతా కలిసి కష్టపడి బతికించేస్తారేమో! మొదటి స్ట్రోక్ తట్టుకున్న గుండె, ఈ ఆపరేషన్ తట్టుకోలేకపోవచ్చు. ఈ జన్మకి ప్యాకప్ చెప్పుకోవచ్చిక. నా కథ ముగిసిపోతోంది అనుకోగానే ముందు ఆవేదన కలిగింది. కానీ ఇప్పుడు మనసు నిదానించింది. ఈ లోకాన్ని వదిలే ముందు నా కర్తవ్యం ఏమిటి అన్న ఆలోచన సాగింది. మెదడు వెంటనే, ‘కృతజ్ఞతలు! కృతజ్ఞతలు!’ అంది. నిజమే! ఎంతమందికి ధన్యవాదాలు చెప్పాలో, సభయ్యాక వందన సమర్పణ చేసినట్టు. నవ్వొచ్చింది.
 
 తను కడుపున పడగానే అమ్మమ్మా, నానమ్మా సంబరంగా మొక్కులు తీర్చుకున్నారట. ప్రాణం పోసుకుంటున్న వారసుడిపై వాళ్లకెంత మమకారమో! అమ్మ నొప్పులు పడుతుంటే, పిన్నులూ పెద్దమ్మలూ అంతా పక్కనే ఉన్నారట. పుట్టగానే నా బుజ్జి దేహాన్ని ముందుగా చేతితో తాకిన మిషనాసుపత్రి నర్స్, నాకు ప్రేమ స్పర్శని కానుకిచ్చింది. రోజూ నా ముక్కు నొక్కి, నలుగు పెట్టి, నీళ్లు పోసిన అవ్వకెంత ఆప్యాయతో! ఏకైక సంతానం కనుక అమ్మానాన్నలకి తను బహి ప్రాణమే! ఆడిందాట, పాడింది పాట అన్నట్టే పెంచారు. ఇద్దరు తాతయ్యలూ, మామ్మలూ తననొక మాట అన్నట్టే గుర్తులేదు. స్కూల్లో చేరాక నా ఖాళీ బుర్రలో విద్యావిత్తనాలు జల్లి చదువుల మొలకలు రప్పించిన మేష్టార్లెంత మంచివాళ్లో. స్నేహితులెంత అభిమానించారో! సైకిల్‌పై స్కూల్‌కి తీసుకెళ్లిన పాలేర్లు ఎంత ముద్దు చేసేవారో ‘బుల్లెబ్బాయ్‌గారూ’ అంటూ.
 
 జీవితంపై అవగాహన కలిగించి, ధైర్యం కలిగించే సాహిత్యాన్ని అందించిన సాహితీ స్రష్టలందరికీ నమో వాకాలు! చిన్నప్పటినుండీ చూసిన సినిమాలు ఎంత ఉత్సాహాన్నిచ్చేవో! నిత్యం విని పాడుకునే పాటలు ఎంత ఆనందాన్నిచ్చేవో! వాటి రచయితలూ, సంగీతం ఇచ్చినవారూ, సినీ నిర్మాతలూ, దర్శకులూ, నటీనటులకూ తను బాకీ పడ్డట్టే కదా!
 
 ఉద్యోగ ప్రస్థానంలో ముప్ఫై అయిదేళ్లకి పైగా ఎంతమంది బాసులు, కొలీగ్స్ సహకరించారో! నౌకరీ వచ్చినప్పుడొచ్చిన జీవన సహచరి రమ తన ప్రాణంలో ప్రాణమైపోయింది. పెళ్లితో ముడిపడిన అత్తమామలు కుటుంబం అంతా నన్నెంత అభిమానించారో... సహృదయుడిననీ, మంచి ఉద్యోగంలో సెక్రటేరియట్‌లో ఉన్నాననీ కుటుంబపరంగా, హోదాపరంగా. అమ్మాయీ, అబ్బాయీ, అల్లుడూ, కోడలూ నన్ను గౌరవించారు. బంధువులు, స్నేహితులు, వారి కుటుంబాలు కూడా. ఇరుగు పొరుగువారు, ఇంట్లో పనిచేసేవారు కూడా ఎన్నడూ ఒక్క మాటతో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు.
 
 ఈ సుదీర్ఘ జీవితంలో జబ్బుపడ్డప్పుడు ఎంతమంది డాక్టర్లు, నర్సులు తమ సేవాభావంతో నన్ను ఆరోగ్యవంతుణ్ని చేశారో! అలా ఎంతమందికి రుణపడ్డానో! ఈ ప్రాణం పోయాక కూడా ఇంకా ఎంతమంది తమ దయను నాపై కురిపిస్తారో! ఈ దేహాన్ని మట్టిలో కలిపే కార్యక్రమంలో కాటికాపరి వరకూ కరుణ చూపుతారు కదా. నా నిర్యాణ కార్యక్రమం తెలిసి ఎంతమంది శ్రమకోర్చి ఇంటికొచ్చి పరామర్శిస్తారో! నా ఫొటోకి వెయ్యబోయే పూలమాల కూడా ఒక ప్రేమమూర్తి కట్టాలి కదా!
 
 ఆలోచిస్తూండగానే మాగన్నుగా కునుకు పట్టింది. తెలతెలవారుతుండగా వచ్చే లేతగాలి మొహానికి తగులుతోంది. అసలీ ప్రకృతి ప్రతి రుతువులోనూ తనకెంత అనుకూలత కలిగించిందో రకరకాలుగా. అందుకే ప్రకృతికి ప్రణతి. తన సహజీవులంతా తనపైన టన్నుల ప్రేమను కురిపిస్తే తన బిట్లు బిట్లుగా పొందాడు. తిరిగి ఎందరికి, ఎంత పంచాడో గుర్తే లేదు. నా ఈ బలహీనమైన గుండెకిప్పుడు ఈ ప్రపంచం అత్యంత ప్రేమాస్పదంగా గోచరిస్తోంది. నన్ను ఆప్యాయంగా తల్లిలా తడుముతోంది. ‘మానవజన్మ ఎత్తబట్టి కదా ఈ అదృష్ట ఫలాన్ని పొందాను! నా కళ్లు ఆనందంగా చెమర్చాయి.
 
 కృతజ్ఞతా కుసుమాలను మనసుతో అందరికీ అర్చన చేశాక నా మనసుకు నిమ్మళంగా ఉంది. గాయానికి చల్లని మందు వేసి కట్టుకున్నంత కుదురుగా, నిశ్చింతగా ఉంది. నాతో సుదీర్ఘకాలం కాపురం చేసిన రమకి నేనిప్పుడు కొత్తగా చెప్పేదేముంది వీడ్కోలు తప్ప! అదెలాగూ ఇద్దరికీ భారం కలిగించే సంగతే. ఈ విషయం ఎదురుగా చెప్పీ ఆమె బాధపడీ... అది చూసి తను దుఃఖించే అవసరం లేకపోయింది. ఇదీ కూడా ఒకందుకు మంచిదే. ఆపరేషన్ టైమవుతోంది.
 
  కోడలి తల్లిదండ్రులూ, హరీ, శ్రావణీ పక్కనే ఉన్నారు. ఇంతలో పరుగుపరుగున వచ్చాడు నా మిత్రుడు, బాల్య స్నేహితుడు రామరాజు. నన్ను కళ్లనిండుగా చూస్తూ ప్రియమార కౌగిలించుకున్నాడు. వాడి పరిష్వంగంలో అప్పుడొచ్చింది దుఃఖం... గుండె పగిలినట్టు! వాడికర్థం అయినట్టుంది. అలాగే ఒక నిమిషం వదలకుండా ఉండిపోయాడు. ‘‘నువ్వొచ్చేశావ్ కదరా! ఇంక ఈ అవతార సమాప్తికి శుభం కార్డ్ వేసేస్తా ప్రశాంతంగా...’’ అన్నాను నవ్వుతూ. ‘‘నోర్ముయ్‌రా! పిచ్చిమాటలు’’ అంటూ వాడూ గట్టిగా నవ్వేశాడు. అందరికీ చెయ్యి ఊపి ఆపరేషన్ థియేటర్‌వైపు నడిచాను. ‘అందరికీ గుడ్ బై’ అనుకున్నా మనసులో.
    
 నా వళ్లంతా పుండులా ఉంది. తల దిమ్ముగా ఉంది. మెలకువ రెపరెపమంటోంది. ఎవరెవరో పిల్లుల్లా ఒక్కొక్కళ్లే వచ్చి ఇన్‌టెన్సివ్ కేర్‌లో ఉన్న నన్ను చూసిపోతుండటం నాకు మగతలో తెలుస్తోంది.
 మరికొన్ని గంటలు గడిచాయి. చాలా చాలా గంటలు కూడా గడిచినట్టున్నాయి. ఎవరో డాక్టర్లు కాబోలు ఆపరేషన్ సక్సెస్ అవడానికి చాలా కష్టపడ్డామని చెబుతుండటం, ‘థాంక్స్ డాక్టర్‌గారూ’ అని చాలా గొంతులు అనడం విన్నాను.
 
 ఇంకా కొన్ని గంటల తర్వాత నాకు బాగా తెలివొచ్చింది. హరి ఆప్యాయంగా నా చేతిని తడిమి తన గుండెలకానించుకుని, ఆపై ముద్దుపెట్టుకున్నాడు. ఒకరొకరూ మెల్లగా మా వాళ్లంతా నవ్వుతూ నా బెడ్ చుట్టూ నిలబడ్డారు. ‘ఎలా ఉంది?’ అని కళ్లతోనే మృదువుగా అడుగుతున్నారు.
 నాకు మాత్రం అందరికీ వీడ్కోలు పలికి, అన్నీ సర్దుకుని రైల్వేస్టేషన్‌కి వెళ్లి ట్రైన్ మిస్సయిందని వెనక్కి తిరిగి వచ్చినట్టుగా ఉంది. అయితేనేం! అనూహ్యంగా నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను.
 ఈ ప్రపంచానికీ, నా వారందరికీ హృదయపూర్వకంగా, వినమ్రంగా సమర్పించాలని నేను తయారుచేసిపెట్టిన కృతజ్ఞతాపత్రం చివర్న పెట్టిన ఫుల్‌స్టాప్, కామాగా మారిపోయింది.
 నా చుట్టూ ఉన్న అందరి కళ్ల నుండీ ఒక లాంటి వాత్సల్యపు జల్లు కురుస్తోంది. అందాల ఈ లోకం, ప్రియమైన నా తోటివారూ నిత్యం నాపై చూపే అనురాగపు పరంపర మళ్లీ... మొదలయింది.
 - అల్లూరి గౌరీలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement