ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయా?
నాకు వక్షోజాల్లో గడ్డలు ఉన్నాయి. నెలసరి రావడానికి ముందు నొప్పిగా ఉంటుంది. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయా? అసలు వక్షోజాల్లో గడ్డలు ఎందుకు ఏర్పడతాయి? క్యాన్సర్ గడ్డలను గుర్తించడం ఎలా?
– ఆర్‌వీ, విజయనగరం
సాధారణంగా కొందరి శరీరతత్వాన్నిబట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాలలో గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటిలో 90 శాతం వరకూ క్యాన్సర్ కానివి అయి ఉంటాయి. వాటిలో కూడా ఎక్కువగా ఫైబ్రో అడినోమా గడ్డలే ఉంటాయి. ఇవి ఒక్కొక్కరిలో రకరకాల పరిమాణాలలో ఉంటాయి. పీరియడ్స్ వచ్చే వారానికి ముందు వక్షోజాలలో కొద్దిగా నొప్పి ఉంటుంది. వక్షోజాలలో ఉన్న ఫైబ్రస్ టిష్యూ కొద్దిగా గట్టిపడి, అది కొద్ది కొద్దిగా పెరగడం వల్ల ఫైబ్రో అడినోమా గడ్డలు ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉండవు. ఇవి చాలావరకు మెల్లిగా, కొద్దిగానే పెరుగుతాయి. అదే క్యాన్సర్ గడ్డలు మాత్రం, అతిత్వరగా పెద్దగా పెరుగుతాయి, చుట్టూ పాకుతాయి. అలాగే నొప్పి కూడా ఉంటుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు గర్భం దాల్చడం రిస్క్ అనే మాట విన్నాను. అయితే ఇటీవల ఒక చోట ‘బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు గర్భం దాల్చితే ఎలాంటి రిస్క్ లేదని, క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు’ అనే వార్త చదివాను. ఏది నిజం?
– యస్‌ఎన్, అమలాపురం
బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి, దానికి చికిత్స పూర్తిగా తీసుకొని, క్యాన్సర్ తగ్గినవాళ్ళు. వీళ్ళలో ఉన్న క్యాన్సర్ రకాన్ని బట్టి, వయస్సు, ఏ స్టేజ్‌లో నిర్ధారణ అయింది, చికిత్స పూర్తిగా తీసుకున్నారా ఇలా అనేక అంశాలను బట్టి ప్రెగ్నెన్సీ తర్వాత క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు ఎంత ఉన్నాయన్నది కొంచెం అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ఆధునిక పరికరాలు, చికిత్సతో చాలావరకు తొలిదశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడం, అలాగే చికిత్సను అందించడం జరుగుతోంది. చికిత్స పూర్తయిన తర్వాత, క్యాన్సర్‌ను బట్టి, కనీసం 6నెలలు–2 సంవత్సరాలు ఆగి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన∙అధ్యయనాలలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు గర్భం దాల్చితే, వారిలో క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని తేలింది. కాబట్టి చికిత్స అందించిన డాక్టర్ ఆధ్వర్యంలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చు.
షాపింగ్ చేయడం కోసం టూ వీలర్ వెహికిల్‌ను డ్రైవ్ చేస్తాను. సైకిలింగ్ కూడా చేస్తుంటాను. ప్రెగ్నెన్సీ సమయంలో డ్రైవింగ్ చేయడం మంచిది కాదంటున్నారు. ప్రస్తుతం నాకు మూడో నెల. ఈ సమయంలో డ్రైవింగ్, సైకిలింగ్ చేయవచ్చా?
– జీఎన్, వరంగల్
గర్భిణీ సమయంలో టూ వీలర్ వెహికల్‌ను డ్రైవ్ చేయకూడదు అని ఏమీ లేదు, నెమ్మదిగా డ్రైవ్ చేయవచ్చు. సడన్‌గా బ్రేక్‌లు వెయ్య కుండా చూసుకోవాలి. ముందు స్పీడ్ బ్రేకర్‌లు ఉన్నప్పుడు మెల్లగా బ్రేక్ వేసి నడపాలి. గర్భంతో ఉన్నప్పుడు సైక్లింగ్ చేయడం అంత మంచిది కాదు. సైక్లింగ్ చేసేటప్పుడు పొట్ట మీద, తొడల మీద ఎక్కువ బరువు, ప్రెజర్ పడుతుంది. సైక్లింగ్ వల్ల ఒంట్లో గ్లూకోజ్ ఖర్చవుతుంది. ఆ కొద్దిసేపు ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒంటిలో వేడి కొద్దిగా ఉత్పత్తి అవుతుంది. అది పెరిగితే శిశువుకి అంత మంచిది కాదు. ఒకవేళ చెయ్యాలనుకున్నా నిటారుగా కూర్చుని వంగకుండా, మెల్లగా, మంచి రోడ్డుపైన చల్లని వాతావరణంలో కొన్ని నిమిషాలు మాత్రమే చెయ్యవచ్చు. అది కూడా మీది, మీ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే గైనకాలజిస్ట్ ఒప్పుకుంటేనే.
సాధారణంగా కొందరి శరీరతత్వాన్నిబట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాలలో గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటిలో 90 శాతం వరకూ క్యాన్సర్ కానివి అయి ఉంటాయి.