అవి రాకుండా ఉండాలంటే... | sakshi health counselling | Sakshi
Sakshi News home page

అవి రాకుండా ఉండాలంటే...

Published Sat, Sep 2 2017 11:48 PM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

అవి రాకుండా ఉండాలంటే...

అవి రాకుండా ఉండాలంటే...

నా వయసు 25 సంవత్సరాలు. ఎనిమిది నెలల క్రితం పీరియెడ్స్‌లో సమస్య వచ్చింది. రిపోర్ట్‌లో సిస్టులు ఉన్నాయని వచ్చింది. మందులు వాడిన తరువాత ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదు. మళ్లీ అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాగే నా బ్రెస్ట్‌ బాగా లూజ్‌గా ఉంటోంది. మెడిసిన్‌ వాడకుండా ఇది నేచురల్‌గా ఫిట్‌ కావడనాకి ఏమి చేయాలి?
– ఎ,ఎన్, హైదరాబాద్‌

అండాశయంలో సిస్ట్‌లు అనేక రకాలు ఉంటాయి. అవి అనేక రకాల కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. కొన్ని హార్మోన్ల అసమతుల్యత వల్ల కొందరిలో, అప్పుడప్పుడు హానికరం కాని ఫాలిక్యులార్‌ సిస్ట్‌లు ఏర్పడుతుంటాయి. కొందరిలో ఇవి ఏర్పడి, అవంతట అవే రెండు మూడు నెలల్లో తగ్గిపోతాయి. అవి ఏర్పడి, తగ్గేవరకు పీరియడ్స్‌ సరిగా రాకపోవటం, బ్లీడింగ్‌ అయితే ఎక్కువ, లేదా కొందరిలో తక్కువ అవ్వటం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఫాలిక్యులార్‌ సిస్ట్‌లు 3 సెం.మీ.ల నుంచి 7–8 సెం.మీ.ల వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని అవంతట అవే తగ్గిపోతాయి. కొందరిలో వాటి పరిమాణం బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. మరీ సైజు పెద్దగా ఉండి, మందులతో తగ్గకపోతే కొందరిలో ఆపరేషన్‌ అవసరం పడవచ్చు.

సిస్ట్‌లు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి వారిలోని హార్మోన్స్‌ని బట్టి, మళ్లీ మళ్లీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇవి మళ్లీ రాకుండా ఉండటానికి పెద్దగా చెయ్యగలిగింది ఏమీ ఉండదు. కొందరిలో కొన్ని నెలలపాటు కాంట్రసెప్టివ్‌ పిల్స్‌ ఇవ్వటం జరుగుతుంది. ఆ పిల్స్‌ వారిలో కొంతకాలం పాటు హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తాయి. క్రమంగా నడక, వ్యాయామాలు, బరువు తగ్గడం, మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం, ఆహారంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బ్రెస్ట్‌ లూజ్‌గా ఉంటే, క్రమంగా బ్రెస్ట్‌ను మసాజ్‌ చేసుకోవటం వల్ల, కొందరిలో బ్రెస్ట్‌ టిష్యూ గట్టిపడి కొద్దిగా ఫిట్‌గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మరీ సన్నగా ఉంటే కొంచెం బరువు పెరగటం వల్ల రొమ్ములో కొద్దిగా కొవ్వు చేరి ఫిట్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరీ బరువు ఎక్కువగా ఉంటే, క్రమంగా వ్యాయామాలు చెయ్యటం మంచిది.

నా వయసు 23 ఏళ్లు. పెళ్లై రెండేళ్లవుతోంది. ప్రస్తుతం నేను మూడు నెలల గర్భవతిని. అయితే నన్ను చాలామంది విటమిన్‌ బి3 ట్యాబ్లెట్‌ వేసుకోవని సలహా ఇస్తున్నారు. దానివల్ల పుట్టబోయే బిడ్డకు అవయవ లోపాలు రావంటున్నారు. అది నిజమేనా?
 – రాణి, కర్నూలు

బి3 అనేది బి కాంప్లెక్స్‌ విటమిన్స్‌లో ఒకటైనది నియాసిన్‌ విటమిన్‌. ఇది మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, కొవ్వు పదార్థాల నుంచి శక్తిని సమకూరుస్తుంది. చర్మ సంరక్షణకు దోహదపడుతుంది. రక్తంలో కొవ్వుని నియంత్రిస్తుంది. నియాసిన్, నియాసినమైడ్‌గా మారి, జన్యువులలోని డీఎన్‌ఏని సరిచేస్తుంది. ఈ విటమిన్‌ చేపలు, సద్రులు, మాంసం, వేరుశనగపప్పులు, సోయాబీన్స్, ప్రొద్దు తిరుగుడు గింజలు, బఠాణీలలో ఎక్కువగా లభిస్తుంది.  బి3 విటమిన్‌ విడిగా కాకుండా అన్ని బి కాంప్లెక్స్‌ విటమిన్స్‌ మాత్రలలో కలిసి ఉంటుంది. గర్భిణీలలో బి3 విటమిన్‌ లోపం ఉన్నప్పుడు, వారిలో అబార్షన్లు, శిశువులో అవయవ లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బి3 విటమిన్‌ ఉన్న బి కాంప్లెక్స్‌ విటమిన్‌ గర్భిణీలు తీసుకోవటం వల్ల గర్భంలో ఉన్న శిశువులో ఏమైనా చిన్న జన్యు లోపాలను సరిచేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మిస్‌ క్యారేజీలు (అబార్షన్లు), అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా.

నా వయసు 26. బరువు 60 కిలోలు. నాకు ఆరు నెలల బాబు ఉన్నాడు. డెలివరీ సమయంలో బరువు 72 కిలోలు ఉన్నాను. సిజేరియన్‌ కావడంతో డెలివరీ తర్వాత పొట్ట తగ్గడానికి క్లాత్‌ లేదా బెల్ట్‌ లాంటివి వాడకూడదన్నారు. కానీ నాలుగో నెల నుంచి అప్పుడప్పుడు బెల్ట్‌ పెట్టుకోవడం స్టార్ట్‌ చేశాను. ఇప్పటివరకూ పొట్ట ఏమాత్రం తగ్గలేదు. చూడటానికి ప్రెగ్నెంట్‌లానే కనిపిస్తున్నాను. సన్నగానే ఉన్నాను కానీ పొట్ట మాత్రం బాగా కనిపిస్తోంది. డైట్‌ పాటించడం, జిమ్‌కి వెళ్లడం లాంటివి చేయొచ్చా? అసలు పొట్ట కచ్చితంగా తగ్గుతుందా లేదా అని భయంగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు.
– లహరి, అంబర్‌పేట్‌

గర్భంతో ఉన్నప్పుడు తొమ్మిది నెలల పాటు పెరిగే శిశువు కోసం గర్భాశయం పెరుగుతుంది. దాంతోపాటు పొట్ట, పొట్ట కండరాలు సాగుతాయి. కాన్పు తర్వాత సాగిన పొట్ట కండరాలు మొత్తంగా సాధారణ స్థితికి వాటంతట అవే రావాలంటే కష్టం. కాన్పు తర్వాత, పొట్టకి బట్ట కట్టడం, బెల్ట్‌ పెట్టుకోవడం వల్ల పొట్ట తగ్గిపోవటం లోపలికి వెళ్లిపోయి, సాధారణ స్థితికి రావటం జరగదు. ఆపరేషన్‌ అయినవాళ్లు పొట్టను పైకిలాగి బెల్ట్‌ పెట్టుకోవడం వల్ల, కుట్ల మీద పొట్ట బరువు పడకుండా, కుట్ల నొప్పి లేకుండా, అవి తొందరగా అతుక్కోవడానికి, మానడానికి ఉపయోగపడుతుంది. అంతేకానీ పొట్ట తగ్గడానికి కాదు. మీరు ఇప్పటినుంచి బరువు తగ్గడానికి, వాకింగ్, పొట్ట వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం మెల్లగా స్టార్ట్‌ చేయండి. కేవలం డైటింగ్‌ చేయడం వల్ల పొట్ట తగ్గదు. ఆహారంలో వేపుళ్లు, స్వీట్స్, జంక్‌ ఫుడ్, కొవ్వు పదార్థాలు వంటివి తగ్గించడం మంచిది. కచ్చితంగా తగ్గుతుందా అంటే, మీ పొట్ట కండరాలు ఎంత సాగింది, శరీరంలో ఎంత కొవ్వు ఉంది, ఎంతవరకు వ్యాయామాలు చేస్తారనే అంశాలను బట్టి ఉంటుంది. కచ్చితంగా పూర్తిగా తగ్గకున్నా.. చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement