ఇదేమైనా క్యాన్సరా?
నా వయసు నలభై దాటింది. కొన్ని నెలలుగా నెలసరి కావడం లేదు. దీనికి కారణం వయసు మాత్రమేనా? గర్భాశయ ముఖద్వారం దగ్గర ఏర్పడిన సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుందని విన్నాను. ఇదేమైనా క్యాన్సర్ సంకేతమా? పాప్‌స్మియర్ అంటే ఏమిటి?
– ఎల్,ఆర్, జగిత్యాల
నలభై దాటిన తర్వాత నెలసరి కాకపోవటానికి కారణాలు అనేకం ఉంటాయి. అండాశయాలలో కంతులు, నీటిగడ్డలు (సిస్ట్‌లు), అధిక బరువు, ఉన్నట్లుండి బరువు ఎక్కువగా పెరగడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, తద్వారా హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్య, కొందరిలో చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోవటం (ప్రీమెచూర్ మెనోపాజ్) వంటి ఎన్నో కారణాలు ఉండవచ్చు. గర్భాశయ ముఖద్వారం దగ్గర ఏర్పడిన సమస్యలకి, పీరియడ్స్ ఆగిపోవటానికి ఎటువంటి సంబంధం లేదు. పీరియడ్స్ తొందరగా ఆగిపోయినంత మాత్రాన క్యాన్సర్ కారణం కావాలని ఏమీలేదు. చాలావరకు హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఆగిపోవటం జరుగుతుంది. సెర్వికల్ క్యాన్సర్ వచ్చే పది సంవత్సరాల ముందు నుంచే, గర్భాశయ ముఖద్వారం దగ్గర జరిగే మార్పులను పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఇందులో గర్భాశయ ముఖద్వారం పైన ఉండే మ్యూకస్‌ని, చిన్న స్పాటులా, సైటో బ్రష్ ద్వారా తీసి, మైక్రో స్కోప్‌లో సైటాలజీ పరీక్ష ద్వారా, అందులోని కణాలలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షని పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్క మహిళ మూడు సంవత్సరాలకి ఒకసారి చేయించుకోవటం మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు అధిక బరువు పెరుగుతారు అని అంటుంటారు. ఇది అందరికీ వర్తిస్తుందా? వర్తిస్తే గనుక ఏ కారణాల వల్ల బరువు పెరగడం జరుగుతుంది? బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బరువుకు సంబంధించి ‘గైడ్‌లైన్స్’ లాంటివి ఏమైనా ఉన్నాయా?
– టి.శ్రీలత, బాన్సువాడ
ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో బిడ్డతో పాటు మాయ, ఉమ్మ నీరు, రొమ్ముల పరిమాణం, శరీరంలో కొవ్వు, రక్తం వాల్యూమ్ అన్నీ ఏర్పడి పెరుగుతూ ఉంటాయి కాబట్టి, గర్భంతో ఉన్నప్పుడు, బరువు పెరగడం జరుగుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారిలోని హార్మోన్స్‌ని బట్టి, తీసుకునే ఆహారం, విశ్రాంతి, చేసే పనిని బట్టి, బరువు ఒక్కొక్కరు ఒక్కోలా పెరుగుతారు. ప్రెగ్నెన్సీలో బరువు అసలు పెరగకుండా కేవలం బిడ్డ మాత్రమే పెరగాలంటే కుదరదు. గర్భం మొదలయ్యేటప్పటికి సాధారణ బరువు ఉండేవాళ్లు 14 నుంచి 15 కేజీల వరకు అధిక బరువు ఉండేవాళ్లు, 6–9 కేజీల వరకు, సన్నగా ఉండేవాళ్లు 12–18 కేజీల వరకు బరువు పెరగవచ్చు. ప్రెగ్నెన్సీలో అందరూ ఇద్దరికి సరిపడా తినాలి అంటుంటారు. అది కరెక్ట్ కాదు. మొదటి మూడు నెలలు మామూలుగా తినే ఆహారం సరిపోతుంది. 4వ నెల నుంచి రోజూ తీసుకునే ఆహారం కంటే కేవలం 300 క్యాలరీలు అదనంగా సరిపోతాయి. ప్రెగ్నెన్సీలో ఎక్కువ బరువు పెరగకుండా ఉండాలంటే అన్నం తక్కువగా తీసుకుంటూ, ఎక్కువగా కూరలు, కూరగాయలు, పండ్లు, మంచినీళ్లు 3–4 లీటర్లు తీసుకోవలసి ఉంటుంది. వీలైనంత వరకు జంక్ ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు, స్వీట్స్‌కి దూరంగా ఉండటం మంచిది.
మా చెల్లి ప్రెగ్నెంట్. చిన్నచిన్న విషయాలకే స్ట్రెస్‌కు గురయ్యే స్వభావం ఆమెది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదుగానీ.... మొన్నో వార్త చదివినప్పటి నుంచి భయం పట్టుకుంది. స్ట్రెస్‌కు గురయ్యే గర్భిణులకు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ కంటే ఎక్కువ ప్రమాదం ఉంటుందనేది ఆ వార్తలో ఉంది. ఇది ఎంత వరకు నిజం?
– జీడి, తుని
గర్భం దాల్చిన తర్వాత, తొమ్మిది నెలలు, తల్లి మానసికంగా, శారీరకంగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే గర్భంలో శిశువుతో పాటు తల్లిలో కూడా బీపీ, షుగర్, ఇంకా ఇతర కాంప్లికేషన్స్ చాలావరకు లేకుండా ఉండి, పండంటి బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మానసిక ఒత్తిడి ఫర్వాలేదు కానీ, క్రానిక్ స్ట్రెస్.. ఎక్కువ కాలంపాటు ఉండే ఒత్తిడి వల్ల, బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవటం, నెలలు నిండకుండా కాన్పు జరగటం, కాన్పు తర్వాత బిడ్డ మానసిక ఎదుగుదలలో కొద్దిగా లోపాలు, తల్లిలో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు గర్భిణీ సమయంలో టెన్షన్ లేకుండా, మనసుని ఆహ్లాదకరంగా ఉంచుకోవటం మంచిది. దీనికోసం మెడిటేషన్, ప్రాణాయామం, చిన్న చిన్న యోగాసనాలు, నడక, మ్యూజిక్ వినడం వంటివి చెయ్యడం మంచిది. అలానే కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం.