health counseling
-
సిగరెట్‌తో ఎముకలూ దెబ్బ తింటాయా?
నా వయసు 35 ఏళ్లు. రోజుకు రెండు పాకెట్ల సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. ఫ్రెండ్స్ మాట్లాడుతూ సిగరెట్లతో ఎముకలు కూడా బలహీనమవుతాయని అంటున్నారు. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా? – ఆర్. సమీర్, హైదరాబాద్ పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకలు క్యాల్షియమ్‌ను గ్రహించడం కూడా తగ్గుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... ∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. ∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతోపాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామి ప్యాసివ్ స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. సన్నగా ఉన్నాను... ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా? నా వయసు 29 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. బరువు కేవలం 48 కేజీలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. – ఎ. సిద్ధార్థ, కర్నూలు కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ∙జన్యుపరమైనవి ∙సరిగా తినకపోవడం ∙చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ∙అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ∙మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) ∙మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు ∙ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు: ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ∙మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు ∙మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి ∙ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ∙ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి ∙వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి ∙మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి ∙అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానినిక ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఫ్యామిలీ హెల్త్ కౌన్సెలింగ్
డర్మటాలజీ కౌన్సెలింగ్ ఎండ పడే చోట్లా ఫెయిర్‌గా కావాలంటే...? నా వయసు 18 ఏళ్లు. నా ఒంటిలో దుస్తులు కవర్ చేస్తున్న ప్రాంతం తెల్లగానే ఉంది. మిగతాచోట్ల నల్లగా ఉంది. కనిపిస్తుంది. ఈ దుస్తులు కవర్ చేయని చేతులు వంటి భాగాలు కూడా నిగారింపుతో కనిపించడానికి తగిన సూచనలు ఇవ్వండి. – సంజన, హైదరాబాద్ శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు నల్లబడకుండా ఉండటానికి సూచనలు ఇవి... - సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి. - సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల ప్రతి మూడు గంటలకోసారి 50 ఎస్పీఎఫ్ ఉండే సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. - సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా దేహానికీ అదే నిగారింపు వస్తుంది - గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళ మీ చర్మంపై పూసుకోండి. - పై సూచనలు పాటించినా ప్రయోజనం కనిపించకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. వేలిపై దురద, గీరుకుంటే నలుపు... ఏం చేయాలి? నా కుడి చేతి మధ్యవేలిపై వెంట్రుకలు ఉండే భాగంలో తీవ్రమైన దురద వస్తోంది. దాంతో అక్కడ గీరుకున్న కొద్దీ అక్కడి చర్మం నల్లబారిపోయింది. నాకు తగిన పరిష్కారం చూపండి. – జగదీష్‌ప్రసాద్, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఆ భాగంలో బహుశా మీకు అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చిందేమోనని అనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అక్కడ ఉంగరం ధరించడం లేదా మీరు వాడుతున్న హ్యాండ్ వాష్ కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు కారణాలు కావచ్చు, మీకు దేనివల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి దానికి దూరంగా ఉండటం నివారణ అంశాల్లో ప్రధానమైనది. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ కింది సూచనలు పాటించండి. - ప్రతిరోజూ మీకు దురద వస్తున్న భాగంలో మాయిశ్చరైజింగ్ క్రీమును రోజుకు రెండుసార్లు రాయండి. - మెమటోజోన్ ఫ్యూరోయేట్ లాంటి మాడరేట్ కార్టికోస్టెరాయిడ్ క్రీమ్‌ను ప్రతిరోజూ మీకు దురద వస్తున్న ప్రాంతంలో రాయండి. దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున 3–5 రోజుల పాటు రాయాలి. అప్పటికీ దురద రావడం తగ్గకపోతే ఒకసారి మీ డర్మటాలజిస్ట్‌కు చూపించండి. మొటిమలు విపరీతంగా వస్తున్నాయి... తగ్గేదెలా? నా వయసు 19 ఏళ్లు. నా ముఖం మీద మొటిమలు, మచ్చలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా తగ్గడం లేదు. నేను బెట్నోవేట్ అనే క్రీమ్ వాడుతున్నాను. దాంతోపాటు ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్ కూడా తీసుకుంటున్నాను. అయినా ఎలాంటి మార్పూ రావడం లేదు. దయచేసి మొటిమలు, మచ్చలు తగ్గడానికి నేనేం చేయాలో సూచించండి. – కె. రవి, విశాఖపట్నం మీ వయసు వారిలో ఇలా మొటిమలు రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. ఈ వయసు పిల్లల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ల పాళ్లు పెరగడం వల్ల చర్మంపై మొటిమలు రావడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మీ విషయంలో ఇది స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్నే లా అనిపిస్తోంది. మీరు బెట్నోవేట్ క్రీమ్ రాస్తున్నట్లు చెబుతున్నారు. బెట్నోవేట్ అనే క్రీమ్‌లో స్టెరాయిడ్ ఉంటుంది. దీనిలోని స్టెరాయిడ్ వల్ల మొదట్లో కొంచెం ఫలితం కనిపించినట్లు అనిపించినా... ఆ తర్వాత మొండిమొటిమలు (ఒక పట్టాన తగ్గనివి) వస్తాయి. అందుకే మీరు ఈ కింది సూచనలు పాటించండి. - మొదట బెట్నోవేట్ క్రీమ్ వాడటాన్ని ఆపేయండి. - క్లిండామైసిన్ ప్లస్ అడాపలీన్ కాంబినేషన్‌తో తయారైన క్రీమ్‌ను రోజూ రాత్రిపూట మొటిమలపై రాసుకొని పడుకోండి. - అజిథ్రోమైసిన్–500 ఎంజీ క్యాప్సూల్స్‌ను వరసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోండి. ఇలా మూడు వారాలు వేసుకోవాలి. అంటే మొదటివారం సోమ, మంగళ, బుధ వారాలు తీసుకున్నారనుకోండి. దీన్నే రెండో వారం, మూడోవారం కూడా కొనసాగించాలి. ఈ అజిథ్రోమైసిన్ క్యాప్సూల్‌ను ఖాళీ కడుపుతో అంటే భోజనానికి ముందుగానీ... ఒకవేళ భోజనం చేస్తే... రెండు గంటల తర్వాత గానీ వేసుకోవాలి. - మీరు వాడుతున్న ఐసోట్రెటినాయిన్ 20 ఎంజీ క్యాప్సూల్స్‌ను అలాగే కొనసాగించండి. - అప్పటికీ మొటిమలు తగ్గకపోతే కాస్త అడ్వాన్స్డ్ చికిత్సలైన సాల్సిలిక్ యాసిడ్ పీలింగ్ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండువారాలకు ఒకసారి చొప్పున కనీసం ఆరు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. - ఒకవేళ మీ మొటిమల వల్ల ముఖంపై గుంటలు పడినట్లుగా ఉంటే, వాటిని తొలగించడానికి ఫ్రాక్షనల్ లేజర్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. -డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్ -
ఎంత సేపు నిలబడాలి?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను. ఎండలో నిలబడాలని అనిపించదు. ఒకవేళ నిలబడడం తప్పనిసరి అయితే ఎంతసేపు ఉండాలి? గర్భిణీ స్త్రీలకు విటమిన్–డి ఏ రకంగా ఉపయోగపడుతుంది? – పీఎన్, రామగుండం ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో ఉండటం, బయటికి కారుల్లో వెళ్లడం, ఆఫీసులోనే ఉండడం వల్ల ఎండలోకి చాలావరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం గడిచిపోతోంది. రోజూ ఉదయాన్నే వచ్చే ఎండలో ఓ పదిహేను నిమిషాలు ఉండడం వల్ల సూర్యరశ్మిలో ఉండే విటమిన్–డి.. మన చర్మం ద్వారా శరీరంలోకి, రక్తంలోకి చేరుతుంది. ఈ విటమిన్–డి మన రక్తంలోకి క్యాల్షియం, ఫాస్ఫరస్ ఖనిజాలను ఎక్కువగా చేరేటట్లు దోహదపడుతుంది. దానివల్ల ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. వాటి పనితీరు మెరుగ్గా ఉంటుంది. విటమిన్–డి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గర్భంలో పెరిగే శిశువుకు అవయవాలు పెరగడానికి, ఎముకలు, కాళ్లు, చేతులు, వెన్నుపూస ఎదుగుదలకు క్యాల్షియం ఎంతో అవసరం. శిశువు ఎదుగుదలకు కావలసిన క్యాల్షియం తల్లి రక్తం నుంచే వెళ్లాలి. దానివల్ల తల్లిలో కూడా క్యాల్షియం తగ్గి నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి ఏర్పడతాయి. తల్లిలో క్యాల్షియం తక్కువగా ఉంటే శిశువు కండరాలు, ఎముకల ఎదుగుదలలో ఇబ్బందులు రావొచ్చు. అంతేకాకుండా అవి దృఢంగా ఉండలేకపోవచ్చు. కాబట్టి విటమిన్–డి గర్భిణీలలో ఎంతో అవసరం. ఎండలో నిలుచోలేకపోతే ఆహారంలో గుడ్డు, పాలు, పెరుగు, ఆకుకూరలు, కాలేయం, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్యాల్షియం, విటమిన్–డి కలిగిన మాత్రలు రోజుకొకటి తొమ్మిది నెలలు తీసుకోవాలి. గర్భిణీలు కేవలం ఎండలోనే ఉండటం వల్ల తల్లికి, బిడ్డకీ సరిపడా విటమిన్–డి దొరకదు. కాబట్టి ఆహారం, మాత్రలు తప్పనిసరి. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు లేదా ఫంక్షన్లకు వెళ్లాల్సివచ్చినప్పుడు నాలో టెన్షన్ మొదలవుతుంది. ఇలా తరచుగా టెన్షన్‌కు గురి కావడం వల్ల నెలసరి క్రమం తప్పుతుందని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? టెన్షన్ ప్రభావం నెలసరి మీద ఏ రకంగా ఉంటుంది? నివారణ ఏమిటి? – జీయస్, నూజివీడు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా రావాలంటే గర్భాశయ, అండాశయాలు, మెదడు నుంచి వచ్చే హార్మోన్స్ అన్నీ సక్రమంగా పని చెయ్యాలి. తరచూ టెన్షన్ పడడం, డిప్రెషన్లోకి వెళ్లడం, ఉన్నట్టుండి బరువు పెరగడం, తగ్గడం వంటి ఎన్నో సమస్యల వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్ఎస్హెచ్, సీహెచ్, ప్రొలాక్టిన్, టీఎస్‌హెచ్ వంటి ఎన్నో హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోవచ్చు. ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం జరుగుతుంది. కొందరిలో పీరియడ్స్ ఆలస్యంగా రావడం, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం లేదా తొందరగా రావడం, బ్లీడింగ్ తక్కువ అవ్వడం వంటివి జరగవచ్చు. దీర్ఘకాల టెన్షన్ వల్ల కొందరిలో కొన్ని నెలల పాటు పీరియడ్స్ ఆగిపోవచ్చు కూడా. మానసిక ఒత్తిడి, టెన్షన్ తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, వాకింగ్, వ్యాయామాలు చెయ్యడం ఉత్తమం. వీటితో మార్పు లేకపోతే ఇవి పాటిస్తూనే, డాక్టర్ సలహాలు పాటించడం మంచిది. ఫైబ్రోమయాల్జియా అంటే ఏమిటి? ఏ సందర్భంలో ఇది వస్తుంది? దీని వల్ల హాని ఏమైనా జరుగుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయగలరు. –సీకె, ఖమ్మం ఫైబ్రోమయాల్జియా అనే పరిస్థితిలో ఒళ్లు నొప్పులు, అలసి పోవడం, ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పి, నిద్ర పట్టకపోవడం, కడుపులో నొప్పి, డిప్రెషన్, ఆందోళన వంటి లక్షణాలు ఉంటాయి. ఇది చాలా వరకు జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. దీని నిర్ధారణకు ఎటువంటి పరీక్షలు లేవు. ఇటువంటి లక్షణాలు ఉన్న వేరే వ్యాధుల నిర్ధారణకు చేసే పరీక్షలు మామూలుగా ఉన్నప్పుడు, ఇది ఫైబ్రోమయాల్జియా లక్షణాలు అని నిర్ధారించడం జరుగుతుంది. ఇందులో మెదడు, వెన్నుపూస, నరాలు.. చిన్ననొప్పికి, స్పర్శకి కూడా పెద్ద నొప్పిగా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి, ఇన్ఫెక్షన్స్, శారీరక ఒత్తిడి వంటి పరిస్థితులలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చికిత్సలో భాగంగా మందులతో పాటు వ్యాధి గురించి అవగాహన, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి కొద్దిగా ఉపయోగపడతాయి. -
అలా చేస్తే ప్రమాదమా?
నాకు బ్లాక్ టీ తాగడం బాగా అలవాటు. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ సమయంలో బ్లాక్ టీ తీసుకోవడం ప్రమాదమని ఒకరు సలహా ఇచ్చారు. ప్రెగ్నెన్సీ సమయంలో బ్లాక్ టీ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? –డి.కె, హైదరాబాద్ ప్రెగ్నెన్సీ సమయంలో బ్లాక్ టీ ఎక్కువగా తాగడం వల్ల, దానిలో ఉండే కెఫీన్ ప్రభావం వల్ల అబార్షన్లు అవ్వడం, పుట్టే పిల్లల్లో అవయవ లోపాలు, నెలలు నిండకుండా కాన్పు అవ్వడం, బిడ్డ ఎక్కువగా బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవటం, కాన్పు సమయంలో చనిపోవడం వంటి ప్రమాదాలు ఏర్పడవచ్చు. బ్లాక్ టీ ఎక్కువగా తాగడం వల్ల, దాంట్లో ఉండే టానిన్ అనే పదార్థం, ఆహారంలో ఉన్న ఐరన్‌ను రక్తంలోకి చేరనీయకుండా చేస్తుంది. దీని ద్వారా రక్తహీనత ఏర్పడవచ్చు. కెఫిన్ ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల మూత్రంకి ఎక్కువసార్లు వెళ్లవలసి రావటం, నిద్ర సరిగా పట్టకపోవటం, బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు, బ్లాక్ టీ తాగటం మానేయడం మంచిది. కుదరకపోతే, ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఒక కప్పు బ్లాక్ టీలో 40–60 ఎం.జి. కెఫీన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో రోజుకి 20–30 ఎం.జి. కెఫీన్ కంటే ఎక్కువ తీసుకోవటం వల్ల దుష్ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరీ తాగకుండా ఉండలేనప్పుడు, రోజుకి ఒక కప్పు తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు, కోలా, చాకొలేట్ వంటివాటికి దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే వాటిలో కూడా కెఫీన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మరణించడానికి ‘హైపర్ టెన్షన్’ కారణం అనే వాదన ఒకటి ఉంది. అది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? నివారణ గురించి తెలియజేయగలరు. –బి.విమల, విజయవాడ ప్రెగ్నెన్సీ సమయంలో హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగడాన్ని, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. కొంతమందిలో ప్రెగ్నెన్సీ రాక ముందునుంచే బీపీ ఉండి ప్రెగ్నెన్సీలో ఇంకా పెరుగుతుంది. బరువు ఎక్కువగా పెరగడం, మరీ చిన్న వయసు లేదా ఎక్కువ వయసులో ప్రెగ్నెన్సీ రావటం, కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉండటం, కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల, రక్తనాళాలు సరిగా వెడల్పు కాకపోవటం వంటి, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ పెరగవచ్చు. బీపీ పెరగటం మొదలైన తర్వాత, డాక్టర్ పర్యవేక్షణలో సరైన బీపీ మందులు వాడటం, చెకప్స్ చెప్పిన సమయానికి చెయ్యించుకోవటం, బీపీ మానిటర్ చెయ్యించుకోవటం, బిడ్డ పరిస్థితి గురించి చెకప్‌లు వంటివి క్రమం తప్పకుండా చెయ్యించుకోవటం వల్ల, బీపీ మరీ పెరిగిపోకముందే కాన్పు చేయించుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్లిష్ట సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. బీపీ మరీ ఎక్కువగా పెరిగితే, తల్లిలో ఫిట్స్ రావటం (గుర్రపు వాతం), కిడ్నీలు, లివర్ పాడవటం, కళ్లు కనిపించకపోవటం, శరీరం నిండా నీరు చేరడం, తర్వాత ప్రాణాపాయం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీపీ వల్ల బిడ్డకు కూడా రక్తప్రసరణ సరిగా లేకపోవటం, బిడ్డ బరువు పెరగకపోవటం, ఉమ్మనీరు తగ్గిపోవటం, మాయ ముందుగానే విడిపడి, బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవటం, బిడ్డ కడుపులోనే చనిపోవటం వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉంటే, ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవటం వల్ల కొంతమందిలో బీపీ మరీ ఎక్కువగా పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారంలో ఉప్పు తగ్గించుకుని తీసుకోవటం, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం, యోగ, ధ్యానం వంటివి చెయ్యటం వంటి వాటివల్ల కొందరిలో బీపీ ఎక్కువ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. గర్భిణి స్త్రీలకు ‘స్వైన్ ఫ్లూ’ సోకకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రత్యేకమైన వ్యాక్సిన్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? మొదలైన వివరాలు తెలియజేయగలరు. – సుమతి, వేటపాలెం స్వైన్ ఫ్లూ అనేది హెచ్.ఎన్. అనే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకటం వల్ల వచ్చే వ్యాధి. దీని లక్షణాలు జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటివి. గర్భిణీలలో రోగ నిరోధకశక్తి మామూలు వారితో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల వీరిలో ఈ వైరస్ తొందరగా సంక్రమించి, వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి, కొన్నిసార్లు ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. అలాగే అబార్షన్లు, అధిక జ్వరం వల్ల, బిడ్డ కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పులు వంటివి జరగవచ్చు. గర్భిణీలు, స్వైన్ ఫ్లూ ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది, చేతులు ఎప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి, రద్దీ ప్రదేశాలకు వీలైనంతవరకు వెళ్లకుండా ఉండటం మంచిది. వెళ్లినా, జలుబు, దగ్గు ఉన్నవాళ్లకి దూరంగా ఉండటం, నోరు, ముక్కు, టిష్యూతో కప్పుకొని ఉండటం మంచిది. ఒకవేళ పైన చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి, పరీక్ష చేయించుకుని చికిత్స మొదలుపెట్టడం మంచిది. స్వైన్ ఫ్లూకి వాడే మందుల వల్ల తల్లికి, బిడ్డకు ఎటువంటి హాని కలుగదు. చుట్టుపక్కల స్వైన్ ఫ్లూ ఎక్కువగా ఉన్నప్పుడు, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది. ఇది మార్కెట్లో కొన్ని మందుల షాపులలో అందుబాటులో ఉంది. ఇది గర్భిణీలు ఏ నెలలో అయినా తీసుకోవచ్చు. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఎటువంటి దుష్ఫలితాలు లేవని పరిశోధకులు వెల్లడించడం జరిగింది. -
మానడం కష్టంగా ఉంది
నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ను. ప్రెగ్నెంట్ ఉమెన్ స్మోకింగ్ చేయడం ప్రమాదం అనే విషయం నాకు తెలిసినా... ఈ అలవాటును మానడం కష్టంగా ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్ పొగ మానేయడానికి ప్రత్యేక పద్ధతులు ఏమైనా ఉన్నాయా? "text4baby' లాంటి పోగ్రామ్ల ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా? – వి, హైదరాబాద్ స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాటికి బానిస అయిన తర్వాత, వాటి నుంచి బయటపడటం చాలా కష్టం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్మోకింగ్వల్ల సిగరెట్లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, లెడ్, ఆర్సినిక్ వంటి పదార్థాల వల్ల అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, బిడ్డ కడుపులో చనిపోవడం, బిడ్డ బరువు పెరగకపోవటం, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, బిడ్డ పుట్టిన తర్వాత మానసిక ఎదుగుదలలో లోపాలు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. స్మోకింగ్ నుంచి బయటపడటానికి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్, మోటివేషన్ ఎంతో అవసరం. అలాగే కొన్ని సపోర్ట్ గ్రూప్స్‌లో కలసి మాట్లాడటం మంచిది. స్మోకింగ్ నుంచి దృష్టి మళ్లించటానికి, పనిలో ఎక్కువగా నిమగ్నమవడం, స్నేహితులని, బంధువులని కలవడం, వాకింగ్, వ్యాయామాలు, యోగ, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల కొన్నిసార్లు మొత్తంగా ఒకేసారి మానలేకపోయినా, అప్పుడప్పుడు తీసుకున్నా, గుడ్డిలో మెల్లలాగా కొంతవరకు ప్రెగ్నెన్సీలో సమస్యల తీవ్రత కొద్దిగా అయినా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకేసారి మానేయడం వల్ల తల్లిలో చిరాకు, కోపం, ఆరాటం, తలనొప్పి వంటివాటితో ఇబ్బందిపడటం జరుగుతుంది. ఇవి మెల్లగా 10–14 రోజులకు సర్దుకుంటాయి. ఈ సమయంలో కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరం. ఎంత ప్రయత్నించినా వీలు కానప్పుడు, నికోటిన్ గమ్స్, నేసల్ స్ప్రే వంటివి అతి తక్కువగా వాడవచ్చు. వీటి ప్రభావం స్మోకింగ్‌తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. text4baby ప్రోగ్రామ్ అనేది ప్రెగ్నెన్సీ సంబంధిత విషయాలను, తెలియజేసే ఒక ఫోన్ అప్లికేషన్ లాంటిది. దీంతో నీ వివరాలను లాగిన్ చేస్తే, తద్వారా నీ సందేహాలకు సలహాలను ఫోన్లో మెసేజ్‌ల ద్వారా అందజేయడం జరుగుతుంది. నీకు క్రమం తప్పకుండా సలహాలను, ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్లను గుర్తుచేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకొని చూడవచ్చు. స్మోకింగ్ నుంచి బయటపడటానికి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్, మోటివేషన్ ఎంతో అవసరం. అలాగే కొన్ని సపోర్ట్ గ్రూప్స్‌లో కలసి మాట్లాడటం మంచిది. స్మోకింగ్ నుంచి దృష్టి మళ్లించటానికి, పనిలో ఎక్కువగా నిమగ్నమవడం, స్నేహితులని, బంధువులని కలవడం, వాకింగ్, వ్యాయామాలు, యోగ, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాల్లో ఇవి వస్తాయి? ముందు జాగ్రత్తలు తీసుకునే వీలుందా? తెలియజేయగలరు. – కె.సుమతి, విజయవాడ కాన్పు తర్వాత, ప్రెగ్నెన్సీ హార్మోన్ల, శారీరక మార్పుల వల్ల, కాన్పు సమయంలో జరిగే మార్పుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ అంటారు. వీటిలో కొన్ని ప్రాణాంతకంగా కూడా మారుతాయి. మొదటిది పోస్ట్‌పార్టమ్ హేమరేజ్ అంటే కాన్పు తర్వాత అధికంగా, అదుపులో లేకుండా బ్లీడింగ్ అయిపోవడం, తర్వాత గర్భాశయ, జననేంద్రియాలలో, మూత్రాశయం, కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ సోకటం, అది మొత్తం రక్తం ద్వారా అన్ని అవయవాలకు సోకటం, బీపీ పెరిగి ఫిట్స్ రావటం, రక్తనాళాలలో రక్తం గూడుకట్టి, (ఎంబోలిసమ్) పల్మనరీ ఊపిరి ఆడకుండా ఆయాసపడుతూ, ప్రాణాంతకంగా మారడం, రొమ్ములలో పాలు గడ్డకట్టి ఇన్ఫెక్షన్లు రావటం, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యలు ఎవరికి, ఎప్పుడు, ఎందుకు వస్తాయి అనేది చాలావరకు చెప్పటం కష్టం. అలాగే ముందు తెలుసుకోవటం కూడా కష్టం. రక్తహీనత, బరువు ఎక్కువ ఉండటం, మరీ బలహీనంగా ఉండటం, గర్భిణీ సమయంలో సరిగా జాగ్రత్తలు పాటించకపోవటం, రెగ్యులర్‌గా డాక్టర్ని సంప్రదించకపోవటం వంటి కారణాల వల్ల, పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, వయసుని బట్టి, శరీర తత్వాన్ని బట్టి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల కాన్పు తర్వాత కాంప్లికేషన్స్ రావచ్చు. కాన్పు తర్వాత కాంప్లికేషన్స్ ఏవీ రాకుండా నివారించలేకపోవచ్చు కాని, ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల, చాలా వరకు కాంప్లికేషన్స్ రాకుండా, ఒకవేళ వచ్చినా, వాటి నుంచి చాలావరకు బయటపడే అవకాశాలు ఉంటాయి. ♦ ప్రెగ్నెన్సీ రాక ముందు నుంచే డాక్టర్ని సంప్రదించి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం. ♦ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత క్రమంగా చెకప్‌లకు వెళ్లడం, డాక్టర్ సలహాలు పాటిస్తూ, పౌషికాహారం, ఐరన్, క్యాల్షియం మందులు వాడటం, ఇంకా అవసరమైన మందులు వాడటం, అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చెయ్యించుకోవడం. ♦ కాన్పు సమయానికి రక్తహీనత లేకుండా చూసుకోవడం, బీపీ సాధారణంగా ఉందా లేదా అని గమనించుకోవటం. బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవటం. ♦ కాన్పు ఇంట్లో కాకుండా, వసతులు సరిగా ఉన్న హాస్పిటల్లో చెయ్యించుకోవటం మంచిది. -
ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
గర్భధారణకు ముందు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలియజేయగలరు. ‘అల్ట్రాసౌండ్ స్కాన్’ ఎందుకు చేయించుకోవాలి? గర్భధారణకు ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – ఆర్.రేఖ, తుని గర్భం కోసం ప్రయత్నం చేయకముందు నుంచే కొన్ని జాగ్రత్తలు, పరీక్షలు చేయించుకోవటం వల్ల, గర్భం దాల్చిన తర్వాత, తల్లికి, బిడ్డకి చాలావరకు సమస్యలు ఎక్కువ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ముందుగా అధిక బరువు ఉంటే తగ్గటం, మరీ సన్నగా బలహీనంగా ఉంటే పౌష్టికాహారం తీసుకుని కొంచెం బరువు పెరగటం మంచిది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, షుగర్ లెవెల్స్, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ వంటి అవసరమైన పరీక్షలు గర్భం కోసం ప్రయత్నించక ముందే చేయించుకుని, వాటిలో సమస్య ఉంటే ముందుగానే చికిత్స తీసుకోవటం మంచిది. ముందు నుంచే షుగర్, బీపీ, ఫిట్స్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే, వారు డాక్టర్ని సంప్రదించి, వాడే మందులలో ఏమైనా మార్పులు ఉంటే గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు, మార్పులు చేసుకొని వాడటం మంచిది. గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పనిసరిగా చేసుకోవలసిన అవసరం లేదు. పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, ఇంకా పీరియడ్స్‌లో ఇతర సమస్యలు ఉంటే, హార్మోన్ల సమస్యలు, గర్భాశయం, అండాశయాలలో నీటితిత్తులు, సిస్ట్లు వంటివి ఉన్నాయేమో అని తెలుసుకోవటానికి స్కానింగ్ చేయించుకోవచ్చు. సమస్యలు నిర్ధారణ అయితే, గర్భధారణకు ముందే చికిత్స తీసుకుంటే, అబార్షన్లు అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆహారంలో అన్నం తక్కువగా తీసుకుని, ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం తీసుకోవటం మంచిది. గర్భధారణకు మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి తీసుకోవటం మంచిది. దీనివల్ల పుట్టబోయే బిడ్డలో చాలా వరకు మెదడుకి, వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. ఎప్పుడూ శాంతంగా కనిపించే నేను కొన్ని సమయాల్లో మాత్రం చీటికీ మాటికీ అందరితో గొడవ పడుతుంటాను. హర్మోన్ల అసమతౌల్యం వల్ల నెలసరికి ముందు కోపం, విసుగులాంటి లక్షణాలతో ఇలా జరగడం సహజమేనని అంటున్నారు. ఇది ప్రకృతి సహజమని సరిపెట్టుకోవాలా? లేక ఆ సమయంలో కూడా సాధారణంగా ఉండటానికి ఏమైనా పరిష్కారాలు, మందులు ఉన్నాయా? – ఎన్.సి, చిత్తూరు పీరియడ్స్ వచ్చే వారం పది రోజుల ముందు నుంచే కొందరిలో కొన్ని హార్మోన్ల అసమతుల్యత, మినరల్స్ లోపం వంటి కొన్ని ఇంకా తెలియని కారణాల వల్ల విసుగు, కోపం, ఆందోళన, ఏడుపు, డిప్రెషన్, ఒంట్లో నీరు రావడం, రొమ్ములలో నొప్పి వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. దీనినే ప్రిమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (pట్ఛఝ్ఛnట్టటu్చ∙టynఛీటౌఝ్ఛ, pఝట) అంటారు. వ్యాయామాలు, వాకింగ్, ధ్యానం వంటివి చేయడం వల్ల చాలామందిలో ఈ లక్షణాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి ప్రైమ్రోజ్ ఆయిల్, విటమిన్స్, మినరల్స్ కలిగిన మాత్రలు 3 నుంచి 6 నెలలు వాడి చూడవచ్చు. ఆ సమయంలో ఉప్పు, ఆహారంలో చక్కెర, కాఫీలు తగ్గించి తీసుకోవటం మంచిది. విసుగు, కోపం వంటి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి కొన్ని రోజులు యాంటీ డిప్రెసెంట్, టెన్షన్ తగ్గించే మందులు వాడి చూడవచ్చు. ఆటిజమ్ కలిగిన స్త్రీలు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ కూడా ఆటిజమ్‌తో జన్మిస్తుందా? ఇతర సమస్యలు ఏమైనా ఉంటాయా? దీనికి ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయా? – డి.కె, జిమ్మకుంట ఆటిజమ్ అంటే పుట్టుకలో వచ్చే మెదడు లోపం, వినికిడి లోపం, దాని ద్వారా బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. ఆటిజమ్ అనే సమస్య, జన్యుపరమైన సమస్యలు, పర్యావరణంలో మార్పులు, పుట్టుకతో వచ్చే మెదడు నిర్మాణం, పనితీరులో లోపాలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల మందులు వాడటం వంటివి, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడుతుంది. తల్లిలో ఆటిజమ్ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చి ఉండి, ఆ లోపం కలిగిన జన్యువు బిడ్డకు కూడా సంక్రమించి దానికి ఇంకో లోపం గల జన్యువు జతకలిస్తే బిడ్డలో ఆటిజమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు సమయంలో ఇబ్బందుల వల్ల కూడా కొన్నిసార్లు ఆటిజమ్ ఏర్పడవచ్చు. పుట్టబోయే బిడ్డలో ఆటిజమ్ ఉందా లేదా అని గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవటం కష్టం. ఐదవ నెల చివరిలో చేసే టిఫా స్కానింగ్‌లో బిడ్డలో మెదడు నిర్మాణంలో కొన్ని లోపాలను తెలుసుకోవచ్చు కాని, మెదడు పనితీరును కనుక్కోవటం కష్టం. బిడ్డ పుట్టి పెరిగే కొద్దీ కొన్ని లోపాలు బయటకు తెలుస్తాయి. -
అవి రాకుండా ఉండాలంటే...
నా వయసు 25 సంవత్సరాలు. ఎనిమిది నెలల క్రితం పీరియెడ్స్లో సమస్య వచ్చింది. రిపోర్ట్‌లో సిస్టులు ఉన్నాయని వచ్చింది. మందులు వాడిన తరువాత ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదు. మళ్లీ అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాగే నా బ్రెస్ట్ బాగా లూజ్‌గా ఉంటోంది. మెడిసిన్ వాడకుండా ఇది నేచురల్‌గా ఫిట్ కావడనాకి ఏమి చేయాలి? – ఎ,ఎన్, హైదరాబాద్ అండాశయంలో సిస్ట్లు అనేక రకాలు ఉంటాయి. అవి అనేక రకాల కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. కొన్ని హార్మోన్ల అసమతుల్యత వల్ల కొందరిలో, అప్పుడప్పుడు హానికరం కాని ఫాలిక్యులార్ సిస్ట్లు ఏర్పడుతుంటాయి. కొందరిలో ఇవి ఏర్పడి, అవంతట అవే రెండు మూడు నెలల్లో తగ్గిపోతాయి. అవి ఏర్పడి, తగ్గేవరకు పీరియడ్స్ సరిగా రాకపోవటం, బ్లీడింగ్ అయితే ఎక్కువ, లేదా కొందరిలో తక్కువ అవ్వటం వంటి ఇబ్బందులు ఉంటాయి. ఫాలిక్యులార్ సిస్ట్లు 3 సెం.మీ.ల నుంచి 7–8 సెం.మీ.ల వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని అవంతట అవే తగ్గిపోతాయి. కొందరిలో వాటి పరిమాణం బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. మరీ సైజు పెద్దగా ఉండి, మందులతో తగ్గకపోతే కొందరిలో ఆపరేషన్ అవసరం పడవచ్చు. సిస్ట్లు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి వారిలోని హార్మోన్స్‌ని బట్టి, మళ్లీ మళ్లీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇవి మళ్లీ రాకుండా ఉండటానికి పెద్దగా చెయ్యగలిగింది ఏమీ ఉండదు. కొందరిలో కొన్ని నెలలపాటు కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ పిల్స్ వారిలో కొంతకాలం పాటు హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తాయి. క్రమంగా నడక, వ్యాయామాలు, బరువు తగ్గడం, మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం, ఆహారంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బ్రెస్ట్ లూజ్‌గా ఉంటే, క్రమంగా బ్రెస్ట్‌ను మసాజ్ చేసుకోవటం వల్ల, కొందరిలో బ్రెస్ట్ టిష్యూ గట్టిపడి కొద్దిగా ఫిట్‌గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మరీ సన్నగా ఉంటే కొంచెం బరువు పెరగటం వల్ల రొమ్ములో కొద్దిగా కొవ్వు చేరి ఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరీ బరువు ఎక్కువగా ఉంటే, క్రమంగా వ్యాయామాలు చెయ్యటం మంచిది. నా వయసు 23 ఏళ్లు. పెళ్లై రెండేళ్లవుతోంది. ప్రస్తుతం నేను మూడు నెలల గర్భవతిని. అయితే నన్ను చాలామంది విటమిన్ బి3 ట్యాబ్లెట్ వేసుకోవని సలహా ఇస్తున్నారు. దానివల్ల పుట్టబోయే బిడ్డకు అవయవ లోపాలు రావంటున్నారు. అది నిజమేనా? – రాణి, కర్నూలు బి3 అనేది బి కాంప్లెక్స్ విటమిన్స్‌లో ఒకటైనది నియాసిన్ విటమిన్. ఇది మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, కొవ్వు పదార్థాల నుంచి శక్తిని సమకూరుస్తుంది. చర్మ సంరక్షణకు దోహదపడుతుంది. రక్తంలో కొవ్వుని నియంత్రిస్తుంది. నియాసిన్, నియాసినమైడ్‌గా మారి, జన్యువులలోని డీఎన్ఏని సరిచేస్తుంది. ఈ విటమిన్ చేపలు, సద్రులు, మాంసం, వేరుశనగపప్పులు, సోయాబీన్స్, ప్రొద్దు తిరుగుడు గింజలు, బఠాణీలలో ఎక్కువగా లభిస్తుంది. బి3 విటమిన్ విడిగా కాకుండా అన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ మాత్రలలో కలిసి ఉంటుంది. గర్భిణీలలో బి3 విటమిన్ లోపం ఉన్నప్పుడు, వారిలో అబార్షన్లు, శిశువులో అవయవ లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బి3 విటమిన్ ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్ గర్భిణీలు తీసుకోవటం వల్ల గర్భంలో ఉన్న శిశువులో ఏమైనా చిన్న జన్యు లోపాలను సరిచేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మిస్ క్యారేజీలు (అబార్షన్లు), అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. నా వయసు 26. బరువు 60 కిలోలు. నాకు ఆరు నెలల బాబు ఉన్నాడు. డెలివరీ సమయంలో బరువు 72 కిలోలు ఉన్నాను. సిజేరియన్ కావడంతో డెలివరీ తర్వాత పొట్ట తగ్గడానికి క్లాత్ లేదా బెల్ట్ లాంటివి వాడకూడదన్నారు. కానీ నాలుగో నెల నుంచి అప్పుడప్పుడు బెల్ట్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పటివరకూ పొట్ట ఏమాత్రం తగ్గలేదు. చూడటానికి ప్రెగ్నెంట్లానే కనిపిస్తున్నాను. సన్నగానే ఉన్నాను కానీ పొట్ట మాత్రం బాగా కనిపిస్తోంది. డైట్ పాటించడం, జిమ్‌కి వెళ్లడం లాంటివి చేయొచ్చా? అసలు పొట్ట కచ్చితంగా తగ్గుతుందా లేదా అని భయంగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. – లహరి, అంబర్పేట్ గర్భంతో ఉన్నప్పుడు తొమ్మిది నెలల పాటు పెరిగే శిశువు కోసం గర్భాశయం పెరుగుతుంది. దాంతోపాటు పొట్ట, పొట్ట కండరాలు సాగుతాయి. కాన్పు తర్వాత సాగిన పొట్ట కండరాలు మొత్తంగా సాధారణ స్థితికి వాటంతట అవే రావాలంటే కష్టం. కాన్పు తర్వాత, పొట్టకి బట్ట కట్టడం, బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట తగ్గిపోవటం లోపలికి వెళ్లిపోయి, సాధారణ స్థితికి రావటం జరగదు. ఆపరేషన్ అయినవాళ్లు పొట్టను పైకిలాగి బెల్ట్ పెట్టుకోవడం వల్ల, కుట్ల మీద పొట్ట బరువు పడకుండా, కుట్ల నొప్పి లేకుండా, అవి తొందరగా అతుక్కోవడానికి, మానడానికి ఉపయోగపడుతుంది. అంతేకానీ పొట్ట తగ్గడానికి కాదు. మీరు ఇప్పటినుంచి బరువు తగ్గడానికి, వాకింగ్, పొట్ట వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం మెల్లగా స్టార్ట్ చేయండి. కేవలం డైటింగ్ చేయడం వల్ల పొట్ట తగ్గదు. ఆహారంలో వేపుళ్లు, స్వీట్స్, జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు వంటివి తగ్గించడం మంచిది. కచ్చితంగా తగ్గుతుందా అంటే, మీ పొట్ట కండరాలు ఎంత సాగింది, శరీరంలో ఎంత కొవ్వు ఉంది, ఎంతవరకు వ్యాయామాలు చేస్తారనే అంశాలను బట్టి ఉంటుంది. కచ్చితంగా పూర్తిగా తగ్గకున్నా.. చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. -
ఎందుకిలా అవుతోంది?
నా వయసు 22. రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. తర్వాత ఆరు నెలలకు కడుపులో గడ్డ ఉందని తెలిసింది. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్‌కి ముందు నా జననాంగం వద్ద చిన్న చిన్న పింపుల్స్‌లాగా వచ్చి, అవంతటవే తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు మూడు నెలలుగా పీరియడ్స్ వచ్చే ముందు వస్తున్నాయి. పీరియడ్స్ అయిపోయాక తగ్గి పోతున్నాయి. ఎందుకిలా అవుతోంది? చాలా భయంగా ఉంది. – ప్రత్యూష, కరీంనగర్ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జననాంగం వద్ద చిన్న చిన్న గుల్లల్లాగా రావచ్చు. రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా ఇలాంటివి మాటిమాటికీ రావచ్చు. పీరియడ్స్ ముందు శరీరంలో ఉండే హార్మోన్స్‌లో మార్పుల వల్ల ఆ సమయంలో జననాంగం వద్ద ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశం ఉంది. కలయిక ద్వారా భర్తకు ఉన్న ఇన్ఫెక్షన్ భార్యకు సోకే అవకాశం కూడా ఉంది. జననాంగాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అక్కడ ఉన్న వెంట్రుకలు రెగ్యులర్‌గా తొలగించుకోక పోవడం వల్ల కూడా రావచ్చు. కొందరిలో ఏ్ఛటp్ఛట్డౌట్ట్ఛట అనే వైరస్ కొన్ని నరాల్లో దాగుండి, అప్పుడప్పుడూ నరాలు స్పందించే చోట నీటిగుల్లల్లాగా (ఠ్ఛిటజీఛిu ్చట ట్చటజి) ఏర్పడి, నొప్పిగా ఉంటాయి. కానీ వారం పది రోజుల్లో తగ్గిపోతుంటాయి. అవి తగ్గకుండా అలాగే ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు కొన్ని రక్త పరీక్షలు చేసి వైరస్ ఉన్నట్లు నిర్ధారిస్తే, దానికి తగ్గ చికిత్స తీసుకోండి. మహిళల్లో రక్తహీనత ఏర్పడడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటాయా? గర్భిణులకు రక్తహీనత సమస్య ఉంటే, ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుందని విన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఐరన్‌మాత్రలు తీసుకోవడం మంచిదేనా? తీసుకుంటే ఏ మోతాదులో తీసుకోవాలి. సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – జి.స్వాతి, వరంగల్ రక్తహీనత (్చn్ఛఝజ్చీ) అంటే రక్తంలో ఎర్ర రక్తకణాలు, అందులోని హిమోగ్లోబిన్ శాతం తగ్గడం. ఈ హిమోగ్లోబిన్ అనే పదార్థం రక్తం ద్వారా ఆక్సిజన్ వాయువును అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ ఎంతో అవసరం. చాలామందికి రక్తంలో ఐరన్ తక్కువ ఉండటం వల్ల రక్తంలోని ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలో ఐరన్, బి12 విటమిన్, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉండటం, రక్తకణాలు ఏర్పడటంలో సమస్యలు, రక్తకణాలు త్వరగా నశించిపోవటం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం వంటి ఎన్నో కారణాల వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఆడవారిలో పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, కాన్పులలో రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువ ఏర్పడుతుంది. గర్భిణీలలో పెరిగే శిశువు అవసరాలకు తగ్గట్లు రక్తంలో మార్పులు జరుగుతాయి. దానివల్ల గర్భిణీలలో చాలామంది రక్తహీనత ఏర్పడుతుంది. గర్భిణీలలో హిమోగ్లోబిన్ 11 గ్రాములు ఉండటం సాధారణ సంఖ్య. కనీసం 10 గ్రాములు అన్నా ఉండటం మంచిది. నెలలు నిండే కొద్దీ, బిడ్డ, తల్లి అవసరాలకు తగ్గట్లు హిమోగ్లోబిన్ పెరగకపోవచ్చు. హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి రక్తహీనత తీవ్రత ఉంటుంది. రక్తహీనత తీవ్రతను బట్టి, తల్లిలో ఆయాసం, కాళ్లవాపులు, ముఖం ఉబ్బడం, నెలలు నిండకుండా కాన్పులు, బిడ్డ బరువు తక్కువ పుట్టడం వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. రక్తహీనత ఉండి, కాన్పు తర్వాత రక్తస్రావం ఎక్కువ అయితే, సరైన సమయంలో రక్తం ఎక్కించకపోతే ప్రాణహాని ఉండే అవకాశాలు ఉంటాయి. ఐరన్ మాత్రలు గర్భిణీ సమయంలో రక్తహీనత లేకపోయినా తీసుకోవటం మంచిది. లేకపోతే గర్భంలో పెరిగే బిడ్డ, తల్లి నుంచి కావలసిన పోషక పదార్థాలు, రక్తం అన్నీ తీసేసుకుంటూ ఉంటుంది. దాంతో తల్లిలో రక్తం తగ్గుతూ ఉంటుంది. రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్ మాత్రలు, తీవ్రతను బట్టి రోజుకు రెండుసార్లు వేసుకోవలసి ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉండి ఐరన్ మాత్రలు వేసుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్ల రూపంలో కూడా తీసుకోవలసి ఉంటుంది. కొంతమందికి ఐరన్ మాత్రలతో మలబద్ధకం, వాంతులు, మలం నల్లరంగులో రావటం వంటివి జరుగుతుంటాయి. ఐరన్ మాత్రలు అనేక రకాల కాంబినేషన్లలో దొరుకుతాయి. ఒకటి పడకపోతే, వేరేది మార్చి వేసుకొని చూడవచ్చు. మాత్రలతో పాటు ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పప్పులు, బీన్స్, క్యారట్, బీట్రూట్, ఖర్జూర, దానిమ్మ, వేరుశనగ ముద్దలు, మాంసాహారులయితే లివర్, బోన్ సూప్ వంటివి తీసుకోవటం మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి హెచ్చరిక సూచనలు (warning signs) వివరంగా తెలియజేయగలరు. – విఆర్, శ్రీకాకుళం Cancer warning signs అంటే ఇది చాలావరకు క్యాన్సర్ అయ్యే అవకాశం లేదా క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. క్యాన్సర్ రావటం, అరికట్టడం కష్టం. కనీసం కొద్దిగా ముందుగా గుర్తించటం వల్ల, చికిత్సతో చాలావరకు అది ముదరక ముందే తొలగించవచ్చు. బ్రెస్ట్‌లో కనిపించే కొన్ని warning signs బట్టి బ్రెస్ట్ క్యాన్సర్‌ను కొద్దిగా ముందుగా గుర్తించవచ్చు. రొమ్ములో గట్టిగా కదలకుండా ఉండే గడ్డ, రొమ్ముపైన చర్మం లోపలకు లాగుకున్నట్లు ఉండటం, రొమ్ము మొన నుంచి స్రవాలు రావటం, చంకల్లో గడ్డలు రొమ్ము మొన లోపలకు వెళ్లటం, పీరియడ్స్‌తో సంబంధం లేకుండా రొమ్ములలో నొప్పి, వాపు వంటివి కనిపించినప్పుడు, డాక్టర్ని కలసి అవసరమైన స్కానింగ్, మామొగ్రామ్ వంటి పరీక్షలు చెయ్యించుకుని, అది క్యాన్సర్ కాదా అని నిర్ధారణ చేయించుకోవటం మంచిది. పైన చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు, 100% క్యాన్సర్ ఉండాలని ఏమీలేదు. కాకపోతే క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిర్ధారణ చేసుకొని, ముందుగా చికిత్స తీసుకోవటం మంచిది. -
దానివల్ల సంతానం కలగదా?
పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అనే దాని గురించి విన్నాను. ఇది ఉంటే సంతానం కలగదా? టీనేజర్లకు మాత్రమే ఈ సమస్య వస్తుందా? ఈ సిండ్రోమ్ గురించి వివరంగా చెప్పగలరు. కె.నళిని, రామగుండం పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటే గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాలలో ఎక్కువగా నీటి బుడగలు ఏర్పడటం, వాటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఏర్పడే లక్షణాలను పీసీఓఎస్ అంటారు. కేవలం అండాశయాలలో నీటి బుడగలు ఎక్కువగా ఉండటాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ (పీసీఓ) అంటారు. ఇవి అధిక బరువు, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల ఏర్పడతాయి. వీటివల్ల మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఆడవారిలో ఎక్కువగా విడుదల అవ్వటం, తద్వారా కొందరిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, అవాంఛిత రోమాలు, మొటిమలు రావటం, మెడ చుట్టూ చర్మం మందంగా అయ్యి నల్లబడటం, కొందరిలో అండం విడుదల అవ్వకపోవటం, తద్వారా సంతానం కలగడంలో ఇబ్బంది, అబార్షన్లు అవ్వటం, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మధుమేహ వ్యాధి రావటం వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, బరువుని బట్టి వారిలో విడుదలయ్యే హార్మోన్స్‌ని బట్టి, సమస్యల తీవ్రత ఆధారపడి ఉంటుంది. రజస్వల కాక ముందు నుంచి, టీనేజర్ల దగ్గర నుంచి, మధ్య వయస్సు వరకు పీసీఓయస్ ఎప్పుడైనా ఏర్పడవచ్చు. దీనికి చికిత్స, లక్షణాలని బట్టి ఇవ్వడం జరుగుతుంది. చికిత్సతో పాటు, క్రమంగా వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు ఎంతో అవసరం. ఈమధ్య ఒక చోట carrying multiple babies అనే వాక్యం చదివాను. దీని గురించి గతంలో ఎప్పుడూ విని ఉండలేదు. దీని గురించి వివరంగా చెప్పగలరు. ఝu ్టజీp ్ఛ b్చbజ్ఛీటవల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? – వి.పల్లవి, కర్నూల్ గర్భం దాల్చినప్పుడు, సాధారణంగా గర్భాశయంలో ఒక పిండం ఏర్పడి, మెల్లగా అది శిశువుగా మారి పెరుగుతుంది. కొందరికి గర్భంలో ఒకటి కంటే ఎక్కువ శిశువులు పెరగవచ్చు. దీనినే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అని లేదా మల్టిపుల్ బేబీస్‌ని క్యారీ చేయడం అని అంటారు. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ సంతానం కోసం చికిత్స తీసుకునేవాళ్లలో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇందులో ఇద్దరు, ముగ్గురు ఇంకా ఎక్కువ శిశువులు పెరగవచ్చు. సాధారణంగా ఆడవారిలో గర్భాశయం ఒక బిడ్డ పెరగటానికి ఉద్దేశించబడినది. అందులో ఇద్దరు లేక ఇంకా ఎక్కువ మంది శిశువులు ఏర్పడినప్పుడు, గర్భాశయంలో ఆ శిశువులు పెరగటానికి స్థలం సరిపోకపోవచ్చు. దానివల్ల కొందరిలో ఐదవ నెలలో అబార్షన్లు, శిశువుల బరువు సరిగా పెరగకపోవటం, నెలలు నిండకుండానే పుట్టడం, ఒకరు పెరగటం, ఇంకొకరు పెరగకపోవటం, తల్లిలో పొట్ట బాగా ఎత్తుగా పెరగకపోవటం వల్ల బీపీ, షుగర్, ఆయాసం, నడుంనొప్పి వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే సైడ్ ఎఫెక్ట్‌లలో ‘బ్యాక్ పెయిన్’ ఒకటని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ఒకవేళ నిజం అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? herniated disc అంటే ఏమిటి? – ఎన్.తులసి, తాడేపల్లిగూడెం ప్రెగ్నెన్సీ సమయంలో, గర్భం నెలనెలా పెరగటం వల్ల పొట్ట ముందుకు పెరగటం, దాని బరువు మొత్తం నడుంపైన భారం పడటం వల్ల, బ్యాక్ పెయిన్ (నడుం నొప్పి) రావడం జరుగుతుంది. ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, గర్భిణీలలో జరిగే మార్పుల వల్ల కలిగే ఇబ్బంది. అలాగే గర్భిణీలలో ప్రొజెస్టరాన్ హార్మోన్ ప్రభావం వల్ల, పెల్విక్ ఎముకలు, జాయింట్స్, లిగమెంట్స్ కొద్దిగా వదులవుతాయి. వాటి మీద బరువు పడటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. నొప్పి తీవ్రత, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, పెరిగే బరువుని బట్టి, ఇంకా ఇతర అంశాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. నడిచేటప్పుడు ఒంగి నడవకుండా, నిటారుగా నడవడం, హీల్స్ లేని మెత్తటి చెప్పులు వేసుకోవటం, గంటలు తరబడి నిలుచోకుండా మధ్యమధ్యలో కూర్చోవటం, అలాగే కూర్చున్నప్పుడు నడుంకి మంచి సపోర్ట్ తీసుకుని, కుర్చీకి ఆనుకుని కూర్చోవడం, అవసరమయితే కింది నడుము వెనకాల దిండు పెట్టుకోవడం, కాళ్లు మరీ కిందకి వేళ్లాడకుండా కొద్దిగా పైకి పెట్టుకోవడం వంటివి పాటించడం మంచిది. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవటం మంచిది. నొప్పి ఉపశమనానికి అప్పుడప్పుడు నడుంపైన వేడినీళ్లతో గుడ్డ తడిపి కాపడం పెట్టుకోవచ్చు. రోజూ కొంతసేపు నడక, ప్రాణాయామం, చిన్న చిన్న వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చెయ్యటం వల్ల కూడా నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కొందరిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్, తొందరగా కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు కూడా నడుంనొప్పి ఎక్కువగా ఉండవచ్చు. నొప్పి అధికంగా ఉన్నప్పుడు అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది. వెన్నుపూసలో 33 వర్టెబ్రా అనే ఎముకలు ఒక దాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి. రెండు వర్టెబ్రాలు ఒకదానికొకటి రాసుకోకుండా వంగటానికి ఇబ్బంది లేకుండా మధ్యలో వర్టెబ్రల్ డిస్క్ అనే రబ్బర్‌లాంటి పదార్థం ఉంటుంది. నడుం మీద ఎక్కువ బరువు పడడం, వెన్నుపూస అరగటం వంటి అనేక కారణాల వల్ల కొందరిలో వర్టెబ్రల్ డిస్క్ రెండు వర్టెబ్రాల మధ్య నుంచి జారి కొద్దిగా బయటకు రావడాన్ని herniated disc అంటారు. -
బరువు తగ్గడానికి మార్గాలేంటి?
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఫిజికల్ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వాలా? రిక్రియేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? caesarean section (సి–సెక్షన్) అనే మాట గురించి విన్నాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. డి.సునీత, పీలేరు ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు మొత్తంగా విశ్రాంతి తీసుకోవలసిన అవసరం లేదు. మొదటి మూడు నెలలలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మామూలుగా కూర్చొని చేసుకునే పనులు, వంట పనులు వంటి తేలిక పనులు చేసుకోవచ్చు. మరీ బరువు పనులు, ఎక్కువ వంగి లేవడం వంటివి తగ్గించుకోవలసి ఉంటుంది. కొందరిలో ముందు ప్రెగ్నెన్సీలు అబార్షన్లు అవ్వడం, మాయ కిందకి ఉండటం, గర్భసంచీ ముఖద్వారం చిన్నగా, లూజుగా ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పుడు, ఎక్కువగా విశ్రాంతి తీసుకోమనడం జరుగుతుంది. పైన చెప్పిన సమస్యలు ఏమీ లేనప్పుడు, డాక్టర్ సలహా మేరకు, ఇంటి పనులు, వాకింగ్ వంటివి మూడు నెలలు దాటిన తర్వాత చేసుకోవచ్చు. ఐదవ నెల నుంచి చిన్న చిన్న వ్యాయామాలతో మొదలుపెట్టి, కొద్దికొద్దిగా పెంచుకుంటూ వ్యాయామాలు చేయవచ్చు. రిక్రియేషన్ ఎక్సర్సైజ్ అంటే ప్రెగ్నెన్సీలో ఒక పద్ధతి ప్రకారం ఎరోబిక్ ఎక్సర్సైజ్ (నడక, రన్నింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్) చేయడం, దీనివల్ల గర్భిణీలు మెల్లగా గర్భం వల్ల వచ్చే మార్పులకు అలవాటుపడతారు. దాంతో అలసట, టెన్షన్స్, మానసిక ఒత్తిడి, నడుంనొప్పి వంటి సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. సిజేరియన్ అంటే గర్భంతో ఉన్నప్పుడు, శిశువుని యోని నుంచి కాకుండా పొట్ట కోసి, గర్భాశయాన్ని కోసి శిశువుని బయటకు తీసి, మళ్లీ గర్భాన్ని, పొట్టను కుట్టివేయడం. గర్భిణిగా ఉన్న సమయంలో స్త్రీలు లావు పెరగడం సహజంగా జరుగుతుంటుంది. డెలివరీ తరువాత వారి రూపురేఖలు మారిపోతాయి. అలా కాకుండా... ప్రెగ్నెన్సీ తరువాత బరువు తగ్గడానికి సులువైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? ప్రెగ్నెన్సీ తరువాత ఎంత కాలానికి బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు? – శ్రీ, విజయవాడ గర్భిణిగా ఉన్నప్పుడు స్త్రీలలో హార్మోన్ల ప్రభావం వల్ల, ఇంకా ఇతర మార్పుల వల్ల బరువు పెరగటం, ఒంట్లో నీరు చేరటం, కొద్దిగా నల్లబడటం వంటి ఎన్నో మార్పులు జరుగుతాయి. కాన్పు తర్వాత 50% మార్పులు 2–3 నెలలకి అవంతటవే మెల్లగా తగ్గిపోతాయి. బరువు ఎవరూ అంత సులువుగా తగ్గరు. సాధారణ కాన్పు అయితే ఒకటిన్నర నెల నుంచి చిన్నగా వాకింగ్, పొట్ట వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. సిజేరియన్ ఆపరేషన్ అయితే ఒక్కొక్కరి ఆరోగ్యాన్ని బట్టి, కుట్ల దగ్గర నొప్పి లేకుండా ఉంటే, రెండు నెలల తర్వాత నుంచి వాకింగ్ మొదలుపెట్టవచ్చు. ఇబ్బంది ఏమీ లేకపోతే నాలుగో నెల నుంచి ప్రాణాయామం వంటి చిన్న చిన్న వ్యాయామాలతో మొదలుపెట్టి, మెల్లగా అబ్డామినల్ వ్యాయామాలు చేయవచ్చు. వీటిలో ఎటువంటి అసౌకర్యం లేకపోతే ఐదవ నెల నుంచి వ్యాయామాలను పెంచుకుంటూ చేసుకోవచ్చు. వీటివల్ల తొమ్మిది నెలల పొట్ట పెరిగి, వదులైన పొట్ట కండరాలు గట్టిపడి, పొట్టమీద ఉన్న కొవ్వు తగ్గి, చాలావరకు శరీరంలో జరిగిన మార్పులు సాధారణ స్థాయికి వస్తాయి. అలాగే ఆహారంలో కూడా పాపకు పాలు ఇవ్వాలి కాబట్టి సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకుంటూ, కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మిస్క్యారేజ్ గురించి హెచ్చరించే ‘బ్లడ్‌టెస్ట్’ వస్తున్నట్లు విన్నాను. నిజమేనా? ఇది కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమా? ఒకవేళ ఇలాంటి బ్లడ్‌టెస్ట్ అనేది ఉంటే ఏ నెలలో చేయించుకోవాలి? ‘కీ హార్మోన్’ అనే దాని గురించి తెలియజేయగలరు. – విమల, ఆదిలాబాద్ మిస్క్యారేజ్ అంటే 6 నెలల లోపల అబార్షన్, గర్భంలో పిండం పెరగకుండా ఆగిపోవటం వంటి అనేక పరిస్థితులను కలిపి అనడం జరుగుతుంది. గర్భంలో పిండం మొదటి మూడు నెలల లోపల పెరగటానికి బీటా హెచ్‌సీజీ అనే హార్మోన్ ఎంతో కీలకం. దీనినే కీ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ గర్భం దాల్చిన నెలలో, పీరియడ్ మిస్ అవ్వకముందు నుంచే మెల్లగా విడుదల అవ్వడం మొదలై, 4 రోజులకు ఒకసారి రెట్టింపు అవుతూ ఉండి, 12 వారాలకు గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ హార్మోన్ ప్రభావంతో పిండం పెరుగుదల సక్రమంగా ఉంటుంది. పిండం పెరుగుదల సరిగా లేనప్పుడు, ఈ హార్మోన్ లెవల్ రక్తంలో తగ్గిపోవటం లేదా పెరగకపోవటం జరుగుతుంది. స్కానింగ్‌లో గర్భం సరిగా తెలియనప్పుడు, సరిగా పెరగనప్పుడు బ్లడ్‌టెస్ట్‌లో సీరమ్ బీటా హెచ్‌సీజీ అనే పరీక్ష ద్వారా ఈ హార్మోన్ ఎంత శాతంలో విడుదల అవుతుంది, ఇది పెరుగుతుందా లేదా అనేదాన్ని బట్టి మిస్క్యారేజ్ అవకాశాలను, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశాలను అంచనా వేయడం జరుగుతుంది. -
ఇదేమైనా క్యాన్సరా?
నా వయసు నలభై దాటింది. కొన్ని నెలలుగా నెలసరి కావడం లేదు. దీనికి కారణం వయసు మాత్రమేనా? గర్భాశయ ముఖద్వారం దగ్గర ఏర్పడిన సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుందని విన్నాను. ఇదేమైనా క్యాన్సర్ సంకేతమా? పాప్‌స్మియర్ అంటే ఏమిటి? – ఎల్,ఆర్, జగిత్యాల నలభై దాటిన తర్వాత నెలసరి కాకపోవటానికి కారణాలు అనేకం ఉంటాయి. అండాశయాలలో కంతులు, నీటిగడ్డలు (సిస్ట్లు), అధిక బరువు, ఉన్నట్లుండి బరువు ఎక్కువగా పెరగడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, తద్వారా హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్య, కొందరిలో చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోవటం (ప్రీమెచూర్ మెనోపాజ్) వంటి ఎన్నో కారణాలు ఉండవచ్చు. గర్భాశయ ముఖద్వారం దగ్గర ఏర్పడిన సమస్యలకి, పీరియడ్స్ ఆగిపోవటానికి ఎటువంటి సంబంధం లేదు. పీరియడ్స్ తొందరగా ఆగిపోయినంత మాత్రాన క్యాన్సర్ కారణం కావాలని ఏమీలేదు. చాలావరకు హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఆగిపోవటం జరుగుతుంది. సెర్వికల్ క్యాన్సర్ వచ్చే పది సంవత్సరాల ముందు నుంచే, గర్భాశయ ముఖద్వారం దగ్గర జరిగే మార్పులను పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఇందులో గర్భాశయ ముఖద్వారం పైన ఉండే మ్యూకస్‌ని, చిన్న స్పాటులా, సైటో బ్రష్ ద్వారా తీసి, మైక్రో స్కోప్‌లో సైటాలజీ పరీక్ష ద్వారా, అందులోని కణాలలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షని పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్క మహిళ మూడు సంవత్సరాలకి ఒకసారి చేయించుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు అధిక బరువు పెరుగుతారు అని అంటుంటారు. ఇది అందరికీ వర్తిస్తుందా? వర్తిస్తే గనుక ఏ కారణాల వల్ల బరువు పెరగడం జరుగుతుంది? బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బరువుకు సంబంధించి ‘గైడ్‌లైన్స్’ లాంటివి ఏమైనా ఉన్నాయా? – టి.శ్రీలత, బాన్సువాడ ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో బిడ్డతో పాటు మాయ, ఉమ్మ నీరు, రొమ్ముల పరిమాణం, శరీరంలో కొవ్వు, రక్తం వాల్యూమ్ అన్నీ ఏర్పడి పెరుగుతూ ఉంటాయి కాబట్టి, గర్భంతో ఉన్నప్పుడు, బరువు పెరగడం జరుగుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారిలోని హార్మోన్స్‌ని బట్టి, తీసుకునే ఆహారం, విశ్రాంతి, చేసే పనిని బట్టి, బరువు ఒక్కొక్కరు ఒక్కోలా పెరుగుతారు. ప్రెగ్నెన్సీలో బరువు అసలు పెరగకుండా కేవలం బిడ్డ మాత్రమే పెరగాలంటే కుదరదు. గర్భం మొదలయ్యేటప్పటికి సాధారణ బరువు ఉండేవాళ్లు 14 నుంచి 15 కేజీల వరకు అధిక బరువు ఉండేవాళ్లు, 6–9 కేజీల వరకు, సన్నగా ఉండేవాళ్లు 12–18 కేజీల వరకు బరువు పెరగవచ్చు. ప్రెగ్నెన్సీలో అందరూ ఇద్దరికి సరిపడా తినాలి అంటుంటారు. అది కరెక్ట్ కాదు. మొదటి మూడు నెలలు మామూలుగా తినే ఆహారం సరిపోతుంది. 4వ నెల నుంచి రోజూ తీసుకునే ఆహారం కంటే కేవలం 300 క్యాలరీలు అదనంగా సరిపోతాయి. ప్రెగ్నెన్సీలో ఎక్కువ బరువు పెరగకుండా ఉండాలంటే అన్నం తక్కువగా తీసుకుంటూ, ఎక్కువగా కూరలు, కూరగాయలు, పండ్లు, మంచినీళ్లు 3–4 లీటర్లు తీసుకోవలసి ఉంటుంది. వీలైనంత వరకు జంక్ ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు, స్వీట్స్‌కి దూరంగా ఉండటం మంచిది. మా చెల్లి ప్రెగ్నెంట్. చిన్నచిన్న విషయాలకే స్ట్రెస్‌కు గురయ్యే స్వభావం ఆమెది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదుగానీ.... మొన్నో వార్త చదివినప్పటి నుంచి భయం పట్టుకుంది. స్ట్రెస్‌కు గురయ్యే గర్భిణులకు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ కంటే ఎక్కువ ప్రమాదం ఉంటుందనేది ఆ వార్తలో ఉంది. ఇది ఎంత వరకు నిజం? – జీడి, తుని గర్భం దాల్చిన తర్వాత, తొమ్మిది నెలలు, తల్లి మానసికంగా, శారీరకంగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే గర్భంలో శిశువుతో పాటు తల్లిలో కూడా బీపీ, షుగర్, ఇంకా ఇతర కాంప్లికేషన్స్ చాలావరకు లేకుండా ఉండి, పండంటి బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మానసిక ఒత్తిడి ఫర్వాలేదు కానీ, క్రానిక్ స్ట్రెస్.. ఎక్కువ కాలంపాటు ఉండే ఒత్తిడి వల్ల, బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవటం, నెలలు నిండకుండా కాన్పు జరగటం, కాన్పు తర్వాత బిడ్డ మానసిక ఎదుగుదలలో కొద్దిగా లోపాలు, తల్లిలో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు గర్భిణీ సమయంలో టెన్షన్ లేకుండా, మనసుని ఆహ్లాదకరంగా ఉంచుకోవటం మంచిది. దీనికోసం మెడిటేషన్, ప్రాణాయామం, చిన్న చిన్న యోగాసనాలు, నడక, మ్యూజిక్ వినడం వంటివి చెయ్యడం మంచిది. అలానే కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. -
ఇది ఎంత వరకు నిజం?
నేను ప్రెగ్నెంట్‌ని. అయితే నాకు స్వీట్లు, తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో తినడం వల్ల పుట్టబోయే బిడ్డలకు అలర్జీ, ఆస్తమా సమస్యలు ఎదురవుతాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? స్వీట్లు తినడం పూర్తిగా మానేయమంటారా? – ఆర్.వి, తిరుపతి ప్రెగ్నెన్సీ సమయంలో స్వీట్లు, తీపి పదార్థాలు తినడం వల్ల బిడ్డకు ఎటువంటి అలర్జీ సమస్యలు రావు. కాకపోతే, ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు ఎక్కువగా పెరగటం, శరీర తత్వాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహ వ్యాధి రావడం, బీపీ పెరగడం, అధిక బరువు వల్ల ఆయాసం, ఇబ్బంది ఏర్పడతాయి. అలాగే బిడ్డ బరువు పెరిగి కాన్పు సమయంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. నీ బరువును బట్టి స్వీట్లు అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు. బరువు అధికంగా ఉంటే, స్వీట్లు పూర్తిగా మానేయకపోయినా ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. తీసుకున్న రోజు, అన్నం తక్కువగా తినడం మంచిది. మీ షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని, దాన్ని బట్టి స్వీట్లు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ర్యాడికల్ సర్జరీ అనే మాటను ఈమధ్య విన్నాను. ఇది ఏ పరిస్థితుల్లో చేస్తారు? అండాశయం, గర్భసంచిలను ఏ పరిస్థితుల కారణంగా తొలగించడం జరుగుతుంది. ఒకవేళ తొలగిస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై ప్రతికూలంగా ఏమైనా ఉంటుందా? – డి.వనజ, కర్నూల్ ర్యాడికల్ సర్జరీ అంటే మీరు చెప్పేది ర్యాడికల్ హిస్టెరెక్టమీ సర్జరీ అయితే, ఇందులో గర్భాశయంతో పాటు అండాశయాలు, ట్యూబ్‌లు, లింఫ్‌నోడ్స్, ఒమెన్టమ్ వంటి గర్భాశయం చుట్టూ ఉండే పెల్విక్ టిష్యూ, కణజాలం తీసివేయడం జరుగుతుంది. ఇది గర్భాశయం, అండాశయం, సెర్వికల్ క్యాన్సర్ నిర్ధారణ అయినవాళ్లకి చెయ్యడం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ ఇంకా ఎక్కువ పాకకుండా దోహదపడుతుంది.గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో కంతులు, ఇంకా ఎన్నో సమస్యలు, వాటివల్ల కలిగే ఇబ్బందులూ ఎక్కువ ఉన్నప్పుడు, గర్భాశయం, అండాశయాలను తొలగించడం జరుగుతుంది. వీటిని 40–45 సం.ల కంటే ముందుగా తొలగించడం వల్ల శరీరానికి కావలసిన అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోయి, ఒంట్లో నీరసంగా, ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు, మానసిక మార్పులు, కాల్షియం తగ్గిపోవడం, ఎముకలు బలహీన పడటం, సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి వివిధ రకాల తీవ్రతతో ఏర్పడవచ్చు. కానీ వాటిని తొలగించకుండా ఉంటే వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, వయసుతో సంబంధం లేకుండా తొలగించవలసి ఉంటుంది.గర్భాశయం, అండాశయాలు తీసివేసిన తర్వాత వచ్చే సమస్యలకు తీవ్రతను బట్టి, విటమిన్స్, కాల్షియం, ఆహారంలో మార్పులు, అవసరమైతే ఈస్ట్రోజన్ మాత్రలు వంటివి డాక్టర్ పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది. పదహారేళ్ల వయసులో నెలసరి రాకపోతే భవిష్యత్‌లో క్యాన్సర్ ముప్పు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందా? జన్యుపరమైన లోపాల వల్ల ‘గొనాడ్స్’ అనేవి అండాశయంగా మారకపోవడం వల్ల క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంది అనే విషయం చదివాను. ఇది ఎంత వరకు నిజం? – ఎన్.కీర్తి, సంగారెడ్డి పదహారేళ్ల లోపల నెలసరి రాకపోతే, భవిష్యత్‌లో క్యాన్సర్ ముప్పు ఉండాలని ఏమీలేదు. కాకపోతే పదహారేళ్లు వచ్చినా పీరియడ్స్ ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ చికిత్స తీసుకోవలసి ఉంటుంది. తల్లి కడుపులో శిశువు ఉన్నప్పుడు తొమ్మిది వారాలకే శిశువులో జన్యువులను బట్టి, గొనాడ్స్ ఎక్స్ ఎక్స్ జన్యువులు అయితే అండాశయాలుగా లేదా ఎక్స్ వై అయితే టెస్టిస్ (వృషణం)గా మెల్లగా ఏర్పడటం మొదలవుతుంది. అవి పైపొట్టలో మొదలై, శిశువు జన్మించే సమయానికి వాటి స్థానం అంటే కిందకి జారుతాయి. ఆడబిడ్డలో అయితే పొత్తికడుపులోకి జారుతాయి. మగబిడ్డలో రెండు వృషణాలు బిడ్డ జన్మించేటప్పటికి కడుపులో నుంచి బయటకు వచ్చి స్క్రోటమ్‌లోకి చేరుతాయి. అన్‌డిసెండెడ్ టెస్టికల్స్ 10% మందిలో వృషణాలు స్క్రోటమ్‌లోకి దిగవు. వీరిలో కొంతమందిలో 9–12 నెలల లోపల దిగుతాయి. వృషణాలు కిందకి దిగకుండా ఎక్కువ కాలం కడుపులో ఉండటం వల్ల, లోపల వాతావరణానికి, వేడికి అవి పాడవటం, అలాగే వాటిలో క్యాన్సర్ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఆడవారిలో కూడా జన్యుపరమైన కారణాల వల్ల గొనాడ్స్ అండాశయంగా మారకపోయినా, ఒకవేళ మారినా, అవి పూర్తి స్థాయిలో మారకుండా, వాటిలో టిష్యూ, ఫాలికల్స్ సరిగా ఏర్పడకపోయినా, కొందరిలో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు అవసరమైతే, సర్జరీ ద్వారా వాటిని తొలగించడం జరుగుతుంది. -
అమెనోరియా అంటే?
కొందరికి నెలసరి విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నెలసరి సక్రమంగా రాకపోవడానికి కారణం ఏమిటి? శారీరకతత్వాన్ని బట్టి ఉంటుందా? ఆహార అలవాట్లను బట్టి ఉంటుందా? అమెనోరియా అంటే ఏమిటి? – డి.జానకి, నెల్లిమర్ల నెలసరి క్రమంగా రాకపోవటానికి, శరీర తత్వాన్ని బట్టి, బరువుని బట్టి, మానసిక స్థితి, హార్మోన్లలో లోపాలు, మెదడు, గర్భాశయం, అండాశయాల పనితీరు, వాటి నిర్మాణంలో లోపాలు వంటి అనేక కారణాలు, ఇంకా ఎన్నో తెలియని కారణాలు ఉంటాయి. ఆహారం సరిగా తీసుకోకుండా, మరీ ఎక్కువ డైటింగ్ చేస్తూ, మరీ సన్నగా ఉండి, శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటే కూడా పీరియడ్స్ సక్రమంగా రావు. ఆహారంలో ఎక్కువ జంక్‌ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ అధిక బరువు ఉంటే కూడా పీరియడ్స్ సక్రమంగా ఉండవు. అమెనోరియా అంటే పీరియడ్స్ అసలుకే రాకపోవడం, ఇందులో ప్రైమరీ అమెనోరియా అంటే 0–16 సంవత్సరాలు దాటినా రజస్వల కాకపోవటం, సెకండరీ అమెనోరియా అంటే ముందు పీరియడ్స్ వస్తూ, మూడు నెలలపాటు అంత కంటే ఎక్కువ నెలలు పీరియడ్స్ రాకపోవటం, మెదడులో కంతులు, తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి, థైరాయిడ్ సమస్య, ఇతర హార్మోన్లలో లోపాలు, జన్యుపరమైన సమస్యలు, గర్భాశయం, అండాశయాలు లేకపోవటం, లేదా మరీ చిన్నగా ఉండటం, అండాశయాలలో కంతులు, నీటి బుడగలు, గర్భాశయంలో టీబీ, యోని ద్వారం పూర్తిగా మూసుకపోయి ఉండటం వంటి ఎన్నో కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, లేదా అసలుకే రాకుండా ఉండటం జరగవచ్చు. నేను కొంత కాలంగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. బుగ్గలు, నుదరుపై మచ్చలు వస్తున్నాయి. ఇలా రావడం సహజమేనా? లేక సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇలా వస్తాయా? మచ్చలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గర్భనిరోధక మాత్రలు ఎక్కువ కాలం తీసుకోవడం ప్రమాదమా? – కేఆర్, రామగుండం కొంతమందిలో హార్మోన్లలో సమస్యల వల్ల, ఎండకు ఎక్కువగా తిరగడం వల్ల, నుదురుపైన, బుగ్గల పైన మచ్చలు ఏర్పడుతుంటాయి. దీనినే మెలాస్మా అంటారు. కొంతమందిలో గర్భంతో ఉన్నప్పుడు వస్తాయి. కొంతమందిలో గర్భ నిరోధక మాత్రలు దీర్ఘకాలం వాడటం వల్ల కూడా మచ్చలు రావచ్చు. అందరికీ వీటివల్ల మచ్చలు రావాలని ఏమీలేదు. మచ్చలు ఏర్పడేటప్పుడు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ క్రీములు వాడుకోవాలి. ఒకసారి చర్మవ్యాధుల డాక్టర్‌ను సంప్రదించి దానికి తగ్గ చికిత్స తీసుకోవాలి. గర్భ నిరోధక మాత్రలలో, తక్కువ హార్మోన్ మోతాదు ఉన్న వాటిని వాడి చూడవచ్చు. వాటితో కూడా మచ్చలు ఎక్కువ అవుతుంటే, మాత్రలు వాడటం మానేసి, వేరే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించవచ్చు. గర్భ నిరోధక మాత్రలు ఒక్కొక్క శరీరతత్వాన్ని బట్టి, బరువుని బట్టి, వారి మెడికల్, ఫ్యామిలీ హిస్టరీని బట్టి, కొంతమందికి బాగానే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. కొంతమందిలో మటుకే ఇబ్బందులు ఏర్పడవచ్చు. సమస్యలు లేనప్పుడు దీర్ఘకాలం కాకుండా, 2–3 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా వాడవచ్చు. ‘హెల్తీ ప్రెగ్నెన్సీ’కి సంబంధించి ప్రత్యేకమైన మార్గదర్శక సూత్రాలు ఏమైనా ఉన్నాయా? దీని గురించి వివరంగా చెప్పండి. వినికిడి సమస్య, తక్కువ బరువుతో శిశువు పుట్టడానికి కారణం ఏమిటి? – జె.సుహాసిని, మండపేట హెల్తీ ప్రెగ్నెన్సీకి, ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ రాక ముందు నుంచే బరువు నియంత్రణలో ఉండేటట్లు చూసుకోవాలి. థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి ఇతర మెడికల్ సమస్యలు ఉన్నాయా లేవా చూపించుకోవాలి. ఒకవేళ ఉంటే అవన్నీ నియంత్రణలోకి తెచ్చుకున్న తర్వాత, డాక్టర్ సలహా మేరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి, లేదా ఇంకా ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రోజూ ఒకటి వేసుకోవటం మంచిది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గటం, మరీ సన్నగా ఉంటే కొద్దిగా పెరిగి ప్లాన్ చేసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ వచ్చిన తరువాత డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవటం, ఐరన్, కాల్షియం, ఇతర అవసరమైన మెడిసిన్స్ వాడుకుంటూ, అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ చెయ్యించుకుంటూ, మనసుని ఉల్లాసంగా ఉంచుకుంటూ సాగితే పండంటి బిడ్డను కనవచ్చు. కొంతమందిలో ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అనుకోని, కొన్ని తెలియని కారణాల వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఏర్పడుతుంటాయి. వాటి నుంచి కొంతమంది బయటపడతారు, కొంతమంది బాగా ఇబ్బందిపడతారు. దీనికి డాక్టర్స్ కూడా ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోవచ్చు. వినికిడి సమస్య, బిడ్డ పుట్టుకలో వచ్చే లోపం వల్ల, జన్యుపరమైన కారణాలు, తల్లిలో తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడవచ్చు. తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవటం, రక్తహీనత, బీపీ పెరగటం, తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరా సరిగా లేకపోవటం, ఉమ్మనీరు తగ్గటం, తల్లి గర్భాశయంలో లోపాలు వంటి ఇంకా ఎన్నో కారణాల వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టవచ్చు. -
వీటి కోసం మాత్రలు ఉంటాయా?
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లు స్త్రీలకు చాలా ముఖ్యం అనే విషయం చదివాను. వీటి కోసం ప్రత్యేక మాత్రలు ఏమైనా ఉంటాయా? మాత్రలు లేకపోతే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకుంటే ఈ హర్మోన్లు బలపడతాయి అనేది తెలియజేయగలరు. – ఎన్.జయ, ఖమ్మం ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు స్త్రీల ఆరోగ్యానికి, పీరియడ్స్ సరిగా రావటానికి, గర్భం నిలవటానికి ఎంతో ముఖ్యం. అవి ఆడవారిలో అండాశయాల నుంచి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి రకరకాల మోతాదులో విడుదల అవుతూ ఉంటాయి. విటమిన్ టాబ్లెట్స్లాగా, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ మాత్రలని ఆరోగ్యం కోసం వాడకూడదు. ఈ హార్మోన్స్ మరీ అధికంగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా మంచిది కాదు. ఈ హార్మోన్లు శరీర బరువుని బట్టి, మానసిక, శారీరక ఒత్తిడిని బట్టి విడుదల అవుతూ ఉంటాయి. ఈ మాత్రలు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు, అండాశయాలలో సిస్ట్లు... ఇంకా కొన్ని సమస్యలకు డాక్టర్ సలహా సంరక్షణలో వాడవలసి ఉంటుంది. పరిమితమైన పౌష్ఠికాహారం, సక్రమంగా వాకింగ్, వ్యాయామాలు చేసుకుంటూ సాధారణ బరువుతో ఉంటే, ఈ హార్మోన్స్, శరీరంలో కావాల్సిన మోతాదులో విడుదల అవుతాయి. సాధారణంగా పీరియడ్స్ ఆగిపోయినవారిలో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది కాబట్టి, వారికి ఆహారంలో సోయా బీన్స్, సోయా పాలు, సోయా ఉత్పత్తులలో ఈస్ట్రోజన్లాగా పనిచేసే ఫైటో ఈస్ట్రోజన్స్, ఐసోఫ్రావోన్స్ ఉంటాయి కాబట్టి, వాటిని తీసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. సోనోగ్రఫీ టెస్ట్ (sonography test) గురించి మొదటి సారిగా విన్నాను. గర్భిణులకు ఇది ముఖ్యమైన టెస్ట్ అనే విషయం తెలిసింది. ఈ టెస్ట్ ఏ రకంగా గర్భిణులకు ఉపయోగం అనేది కాస్త వివరంగా తెలియజేయగలరు. – యస్.ఎన్, నెల్లిమర్ల సోనోగ్రఫీ టెస్ట్ అంటే అల్ట్రా సౌండ్ స్కానింగ్. దీనిని అల్ట్రా సౌండ్ మెషిన్ ద్వారా చేస్తారు. పిండం గర్భంలో పెరుగుతుందా లేదా గర్భాశయంలో పెరుగుతుందా లేదా ట్యూబ్‌లో పెరుగుతుందా, పిండంలో గుండె కొట్టుకోవడం మొదలైందా అనేవి మొదటి మూడు నెలల సమయంలో ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. మూడవ నెల చివరిలో, బిడ్డలో చిన్నగా చేతులు, కాళ్లు, ఏర్పడి బిడ్డ రూపం ఏర్పడుతుంది. ఎన్టీ స్కాన్ ద్వారా బిడ్డలో కొన్ని జన్యులోపాలు ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల వరకు పొట్ట పైనుంచి గర్భంలో పిండం పెరుగుతుందా లేదా అనేది తెలియదు. నాలుగో నెల చివరి నుంచి పొత్తికడుపు పైన, కొద్దిగా గర్భాశయం పెరిగి పైకి గట్టిగా తెలుస్తుంది. డాప్లర్ అనే పరికరం ద్వారా బిడ్డ గుండె కొట్టుకోవడం వినిపిస్తుంది. అదే పొట్టమీద కొవ్వు ఎక్కువగా ఉంటే బిడ్డ గుండె శబ్దం వినిపించకపోవచ్చు. అలాంటప్పుడు స్కానింగ్ ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. కొందరిలో మొదటి మూడు నెలలలో కొద్దిగా బ్లీడింగ్, స్పాటింగ్ కనిపిస్తుంది. అప్పుడు కూడా పిండం ఎలా ఉంది అనేది స్కానింగ్ ద్వారానే తెలుస్తుంది. ఐదవ నెల చివరిలో బిడ్డలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి టిప్ఫా స్కానింగ్ చేయించుకోవలసి ఉంటుంది. అవసరమయితే బిడ్డ గుండెలో చిన్న రంధ్రాలు, గుండెకు సంబంధించిన వేరే లోపాలు సరిగ్గా తెలుసుకోవటానికి ఫీటల్ 2డి ఎకో స్కాన్ ఉంటుంది. 8, 9 నెలలలో బిడ్డ బరువు, ఉమ్మ నీరు, పొజిషన్ తెలుసుకోవటానికి గ్రోత్ స్కాన్ చేయించుకోవచ్చు. బిడ్డ బరువు తక్కువగా ఉండి, ఉమ్మ నీరు తగ్గుతుంటే, డాప్లర్ స్కాన్ ద్వారా బిడ్డకి తల్లి నుండి రక్త ప్రసరణ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. -
శాకాహారం తప్పనిసరా?
నాకు చిన్నప్పటి నుంచి నాన్‌వెజ్ మాత్రమే తినే అలవాటు ఉంది. నాన్‌వెజ్ మానేసి శాకాహారం తినడానికి ప్రయత్నించాను గానీ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ప్రెగ్నెన్సీ సమయంలో నాన్‌వెజ్ తినడం మంచిది కాదు అంటున్నారు. నేను తప్పనిసరిగా శాకాహారం తీసుకోవాలా? – జీ.యం, విశాఖపట్నం ప్రెగ్నెన్సీ సమయంలో శాకాహారంతో పాటు, నాన్‌వెజ్ కూడా తినవచ్చు. మొత్తంగా నాన్‌వెజ్ కాకుండా రెండూ కలిపి తీసుకోవాలి. నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, కొద్దికొద్దిగా బాగా ఉడకబెట్టుకుని మసాలా ఎక్కువ లేకుండా తీసుకోవచ్చు. నీ బరువు తక్కువగా ఉంటే రోజూ ఒక గుడ్డు ఉడక బెట్టుకుని తినవచ్చు. బరువు ఎక్కువగా ఉంటే గుడ్డులో పచ్చసొన కాకుండా తెల్లసొన రోజూ తీసుకోవచ్చు లేదా గుడ్డు వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. నాన్‌వెజ్‌లో ప్రొటీన్స్, ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తల్లికి, బిడ్డకి ఇద్దరికీ ఎంతో ముఖ్యం. వీటివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కాబట్టి ఎంతో కొంత నాన్‌వెజ్ ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవటం మంచిది. అంతేకాని అసలు తీసుకోకూడదు అని ఏమీలేదు. కాకపోతే ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారి అరుగుదలలో ఏమైనా సమస్యలు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, డాక్టర్ సలహా మేరకు నాన్‌వెజ్ తీసుకోవటం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో అదనంగా ఐరన్ అవసరం అని విన్నాను. ఈ సమయంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? ‘ప్రెగ్సెన్సీ డైట్’ అంటే ఏమిటి? దీని గురించి కాస్త వివరంగా చెప్పండి. – ఆర్.డి, ఏలూరు ప్రెగ్నెన్సీ సమయంలో, జరిగే మార్పులలో భాగంగా, రక్తం పల్చబడుతుంది. అలాగే తల్లి నుంచి రక్తప్రసరణ ద్వారా బిడ్డకి కావాల్సిన పోషకాహారం, గాలి, శ్వాస అన్నీ అందుతాయి. రక్తంలో ఉండే ఐరన్ శాతం బట్టి హిమోగ్లోబిన్ అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా ఐరన్ ఎక్కువ అవసరమవు తుంది. ఐరన్ ఖనిజం ఆహారం ద్వారా రక్తంలోకి చేరుతుంది. ఆహారంలో ఉన్న ఐరన్‌లో కేవలం 15–25% మటుకే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో అదనంగా ఐరన్ అవసరమవుతుంది. అది కేవలం పోషకాహారం ఎక్కువగా తీసుకోవడంతో సరిపోదు. తాజా కూరగాయలు, పప్పులు, క్యారెట్, బీట్రూట్, బీన్స్, ఖర్జూరం, అంజీర, దానిమ్మ, బొప్పాయి పండ్లు, బెల్లం, వేరుశనగపప్పు వంటివి క్రమంగా తీసుకుంటూ ఉంటే ఐరన్ శాతం పెరుగుతుంది. అదే మాంసాహారులు అయితే, కీమా, మటన్, లివర్, ఎముకల సూప్ వంటివి తీసుకోవచ్చు. శాకాహారంలో కంటే మాంసాహారంలో ఉండే ఐరన్ ఎక్కువగా రక్తంలోకి చేరుతుంది. ప్రెగ్నెన్సీలో తల్లికి, బిడ్డకి సరిపడే పౌష్టికాహారం ఒకేసారిగా ఎక్కువగా కాకుండా, కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఈ సమయంలో పైన చెప్పిన ఆహారంతో పాటు పాలు, పెరుగు, మజ్జిగ, మంచినీళ్లు కనీసం 3 లీటర్లు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ డైట్ అనేది ఒక్కొక్కరి బరువును బట్టి, వారి తల్లిదండ్రులలో బీపీ, షుగర్ వంటివి ఉన్నాయా అనే అనేక అంశాలను బట్టి చెప్పటం జరుగుతుంది. నాకు ఆటలంటే చాలా ఇష్టం. ఎక్సర్సైజ్లు కూడా ఎక్కువగా చేస్తుంటాను. అయితే నాకు ఈమధ్య ఒక విషయం తెలిసింది. ఆటలు, ఎక్సర్సైజ్ల వల్ల పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందని. ఇది ఎంత వరకు నిజం? hypothalamic amenorrhea అంటే ఏమిటి? – జి.కె. నిజామాబాద్ రెగ్యులర్‌గా ఆడే ఆటలు, ఎక్సర్సైజ్లు చేస్తూ, ఆహారం మితంగా తీసుకోవటం వల్ల పీరియడ్స్‌లో ఇబ్బందులు ఉండవు. విపరీతమైన ఎక్సర్సైజులు, అతిగా డైటింగ్, శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, తర్వాత తర్వాత పీరియడ్స్ మొత్తానికే ఆగిపోవడం జరుగుతుంది. అధిక శారీరక ఒత్తిడి, ఒంట్లో కొవ్వు లేకపోవటం వల్ల, కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది మెదడులోని హైపోథలామస్ అనే భాగంపై ప్రభావం చూపి, దాని నుంచి వచ్చే జీఎన్ఆర్హెచ్ హార్మోన్ విడుదలని మెల్లగా ఆపేస్తుంది. దానివల్ల పిట్యుటరీ గ్లాండ్, అండాశయాలు విడుదలయ్యే ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరోన్ వంటి హార్మోన్ల విడుదల మెల్లగా తగ్గిపోయి, పీరియడ్స్ క్రమం తప్పుతూ వచ్చి, అసలుకే రాకుండా ఆగిపోతాయి. అలా హైపోథలామస్ వంటి హార్మోన్లు తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఆగిపోవడాన్ని hypothalamic amenorrhea అంటారు. విపరీతమైన డైటింగ్, బరువు ఉన్నట్లుండి బాగా తగ్గిపోవడం, తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడి, మెదడులో కంతులు, జన్యుపరమైన కారణాలు వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా హైపోథలామస్ సరిగా పనిచెయ్యకపోవడం వల్ల hypothalamic amenorrhea వస్తుంది. -
ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయా?
నాకు వక్షోజాల్లో గడ్డలు ఉన్నాయి. నెలసరి రావడానికి ముందు నొప్పిగా ఉంటుంది. ఇవి క్యాన్సర్‌కు దారి తీస్తాయా? అసలు వక్షోజాల్లో గడ్డలు ఎందుకు ఏర్పడతాయి? క్యాన్సర్ గడ్డలను గుర్తించడం ఎలా? – ఆర్వీ, విజయనగరం సాధారణంగా కొందరి శరీరతత్వాన్నిబట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాలలో గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటిలో 90 శాతం వరకూ క్యాన్సర్ కానివి అయి ఉంటాయి. వాటిలో కూడా ఎక్కువగా ఫైబ్రో అడినోమా గడ్డలే ఉంటాయి. ఇవి ఒక్కొక్కరిలో రకరకాల పరిమాణాలలో ఉంటాయి. పీరియడ్స్ వచ్చే వారానికి ముందు వక్షోజాలలో కొద్దిగా నొప్పి ఉంటుంది. వక్షోజాలలో ఉన్న ఫైబ్రస్ టిష్యూ కొద్దిగా గట్టిపడి, అది కొద్ది కొద్దిగా పెరగడం వల్ల ఫైబ్రో అడినోమా గడ్డలు ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉండవు. ఇవి చాలావరకు మెల్లిగా, కొద్దిగానే పెరుగుతాయి. అదే క్యాన్సర్ గడ్డలు మాత్రం, అతిత్వరగా పెద్దగా పెరుగుతాయి, చుట్టూ పాకుతాయి. అలాగే నొప్పి కూడా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు గర్భం దాల్చడం రిస్క్ అనే మాట విన్నాను. అయితే ఇటీవల ఒక చోట ‘బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు గర్భం దాల్చితే ఎలాంటి రిస్క్ లేదని, క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు’ అనే వార్త చదివాను. ఏది నిజం? – యస్ఎన్, అమలాపురం బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి, దానికి చికిత్స పూర్తిగా తీసుకొని, క్యాన్సర్ తగ్గినవాళ్ళు. వీళ్ళలో ఉన్న క్యాన్సర్ రకాన్ని బట్టి, వయస్సు, ఏ స్టేజ్‌లో నిర్ధారణ అయింది, చికిత్స పూర్తిగా తీసుకున్నారా ఇలా అనేక అంశాలను బట్టి ప్రెగ్నెన్సీ తర్వాత క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు ఎంత ఉన్నాయన్నది కొంచెం అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ఆధునిక పరికరాలు, చికిత్సతో చాలావరకు తొలిదశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడం, అలాగే చికిత్సను అందించడం జరుగుతోంది. చికిత్స పూర్తయిన తర్వాత, క్యాన్సర్‌ను బట్టి, కనీసం 6నెలలు–2 సంవత్సరాలు ఆగి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన∙అధ్యయనాలలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లు గర్భం దాల్చితే, వారిలో క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని తేలింది. కాబట్టి చికిత్స అందించిన డాక్టర్ ఆధ్వర్యంలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చు. షాపింగ్ చేయడం కోసం టూ వీలర్ వెహికిల్‌ను డ్రైవ్ చేస్తాను. సైకిలింగ్ కూడా చేస్తుంటాను. ప్రెగ్నెన్సీ సమయంలో డ్రైవింగ్ చేయడం మంచిది కాదంటున్నారు. ప్రస్తుతం నాకు మూడో నెల. ఈ సమయంలో డ్రైవింగ్, సైకిలింగ్ చేయవచ్చా? – జీఎన్, వరంగల్ గర్భిణీ సమయంలో టూ వీలర్ వెహికల్‌ను డ్రైవ్ చేయకూడదు అని ఏమీ లేదు, నెమ్మదిగా డ్రైవ్ చేయవచ్చు. సడన్‌గా బ్రేక్‌లు వెయ్య కుండా చూసుకోవాలి. ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు మెల్లగా బ్రేక్ వేసి నడపాలి. గర్భంతో ఉన్నప్పుడు సైక్లింగ్ చేయడం అంత మంచిది కాదు. సైక్లింగ్ చేసేటప్పుడు పొట్ట మీద, తొడల మీద ఎక్కువ బరువు, ప్రెజర్ పడుతుంది. సైక్లింగ్ వల్ల ఒంట్లో గ్లూకోజ్ ఖర్చవుతుంది. ఆ కొద్దిసేపు ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒంటిలో వేడి కొద్దిగా ఉత్పత్తి అవుతుంది. అది పెరిగితే శిశువుకి అంత మంచిది కాదు. ఒకవేళ చెయ్యాలనుకున్నా నిటారుగా కూర్చుని వంగకుండా, మెల్లగా, మంచి రోడ్డుపైన చల్లని వాతావరణంలో కొన్ని నిమిషాలు మాత్రమే చెయ్యవచ్చు. అది కూడా మీది, మీ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే గైనకాలజిస్ట్ ఒప్పుకుంటేనే. సాధారణంగా కొందరి శరీరతత్వాన్నిబట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాలలో గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటిలో 90 శాతం వరకూ క్యాన్సర్ కానివి అయి ఉంటాయి. -
గర్భిణులు ఒత్తిడికి గురైతే..?
నేను చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ‘గర్భిణులు తరచుగా ఒత్తిడికి గురైతే పుట్టబోయే బిడ్డలు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ లాంటివి ఎదుర్కోవలసి వస్తుంది’ అనే విషయం చదివాను. ఇది నిజమేనా? – యస్.యం, ఆదిలాబాద్ ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) అనేది చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించిన మానసిక వ్యాధి. ఈ సమస్య ఉన్న పిల్లలు బాగా హైపర్ యాక్టివ్‌గా, అల్లరిగా, ఒక దగ్గర కుదురుగా కూర్చోలేక పోవటం, కాన్సన్ట్రేషన్ లేకపోవటం, మెమరీ తక్కువ ఉండటం, సరిగా చదవలేకపోవటం... వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనికి గల కారణాలు అనేకం ఉంటాయి. అందులో ముఖ్యంగా జన్యుపరమైన కారణం ఒకటి. జన్యుపరమైన కారణంతో పాటు కొన్ని రకాల పర్యావరణ సమస్యలు జత కలిసి నప్పుడు ఏడీహెచ్‌డీ ఎక్కువగా బయటపడే అవకాశాలు ఉంటాయి. తల్లులు గర్భంతో ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి మరీ తీవ్రంగా ఉంటే, వారికి పుట్టబోయే పిల్లలలో కొంత మందిలో ఏడీహెచ్‌డీ సమస్య ఏర్పడవచ్చు. మానసిక ఒత్తిడితో పాటు, వారిలో కాని, భర్తలో కాని జన్యుపరమైన సమస్య ఉన్నప్పుడు ఏడీహెచ్‌డీ ఏర్పడే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి వల్ల గర్భిణీలలో ఏడీహెచ్‌డీ కంటే కూడా ఎక్కువగా గర్భిణీలలో బిడ్డ బరువు ఎక్కువగా పెరగక పోవడం, బీపీ, షుగర్ పెరగడం వంటి ఇతర సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భిణీలు వీలైనంతవరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది. దీనికి కుటుంబ సభ్యుల సహకారం అవసరం. హైపోగ్లైసీమియా (hypoglycaemia) అనేది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్పై ప్రభావం చూపుతుందని, బ్రెయిన్ డ్యామేజీ కూడా దారి తీయవచ్చునని... ఇలా రకరకాలుగా విన్నాను. అసలు ఈ హైపోగ్లైసీమియా అనేది ఎందుకు వస్తుంది? ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా? – పి.ఈశ్వరి, గుంటూరు హైపోగ్లైసీమియా అంటే రక్తంలో షుగర్ శాతం బాగా తగ్గిపోవడం అన్నమాట. రక్తంలో షుగర్ శాతం సమపాళ్లలో ఉన్నప్పుడే శరీరంలో అన్ని అవయవాలకు కావలసిన శక్తి చేకూరుతుంది. మెదడు చురుకుగా పనిచెయ్యాలి అంటే, దానికి కావలసిన శక్తి రక్తంలో షుగర్ శాతాన్ని బట్టి అందుతుంది. హైపోగ్లైసీమియా వల్ల మెదడు చురుకుదనం తగ్గడం, కళ్లు తిరగడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలు ఉంటాయి. మీ ప్రశ్నలో హైపోగ్లైసీమియా బిడ్డ కడుపులో ఉండగా తల్లికా లేక పుట్టిన తర్వాత బిడ్డకా అనేది వివరంగా రాయలేదు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, తల్లి సరైన పౌష్ఠికాహారం తీసుకోకపోవడం, తల్లిలో షుగర్ ఉండి, ఇన్సులిన్ సరైన మోతాదులో తీసుకోకపోవడం, కాన్పు సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవటం, లివర్‌లో సమస్యలు, ఇన్ఫెక్షన్లు, షుగర్ మెటబాలిజమ్‌లో సమస్యలు వంటి అనేక కారణాల వల్ల బిడ్డలో హైపోగ్లైసీమియా ఏర్పడవచ్చు. ఎక్కువ కాలంపాటు బిడ్డ మెదడుకి షుగర్ వల్ల వచ్చే శక్తి తగ్గిపోవడం వల్ల, బిడ్డ బ్రెయిన్ మెల్లగా దెబ్బతినటం మొదలవుతుంది. దానివల్ల ఫిట్స్, బ్రెయిన్ పెరుగుదల లేకపోవటం, మానసిక అభివృద్ధి లేకపోవటం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గర్భిణిగా ఉన్నప్పటినుంచే తొమ్మిది నెలలపాటు తల్లి సరైన పౌష్ఠికాహారం తీసుకుంటూ, డాక్టర్ దగ్గర సరిగా చెకప్‌లు చేయించుకుంటూ అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకుంటూ, సరైన మందులు తీసుకోవటం వల్ల కొంత హైపోగ్లైసీమియా సమస్యను నివారించవచ్చు. పుట్టగానే బిడ్డకు పాలివ్వడం, బిడ్డ చురుకుగా ఉందా లేదా అని చూసుకుని, అవసరమైన షుగర్ టెస్ట్ చేసుకుని, షుగర్ మరీ తక్కువగా ఉంటే గ్లూకోజ్ సెలైన్ పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు. మా అత్తయ్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది. ఆమె కూతురికి పెళ్లయిన అయిదు సంవత్సరాలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, తల్లీ కూతుళ్లకు వచ్చింది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అనువంశీకమా? లేక యాదృచ్ఛికంగా ఇద్దరికీ వచ్చి ఉంటుందా? తెలియజేయగలరు. – ఎన్.రమ్య, నర్సీపట్నం బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. అందులో ముఖ్యమైనవి జన్యుపరమైన కారణాలు. ఆడవారిలో బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యువులలో మార్పుల వల్ల కొందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఈ జన్యువులు వారి పిల్లలకు సంక్రమించటం వల్ల, వారి అమ్మాయిలకు, మనవరాళ్లకు వంశపార పర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారి కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు, కొంతమంది ఈ బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 జన్యు మార్పులను ముందుగానే తెలుసుకుని, క్యాన్సర్ రాకముందే రొమ్ములను, అండాశయాలను తొలగించుకుంటూ ఉంటారు. జన్యుపరమైన కారణాలు కాకుండా, కొందరిలో అధిక బరువు, హార్మోన్లలో మార్పులు, ఈస్టోజన్ హార్మోన్ అధిక కాలం తీసుకోవడం వంటి ఇతర కారణాల వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. మీరు చెప్పిన సందర్భంలో తల్లికి, కూతురికి బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి ఖచ్చితంగా జన్యుపరంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించిందని, ఎటువంటి పరీక్షల రిపోర్ట్స్ తెలియకుండా చెప్పటం కష్టం. యాదృచ్ఛికంగా కూడా వచ్చి ఉండవచ్చు. ఇద్దరికీ బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 జెనెటిక్ పరీక్షలు, మిగతా పరీక్షలు చేసిన తర్వాతే కారణం తెలుస్తుంది. -
అలాంటి ఎక్సర్సైజ్లు చేయొచ్చా?
ప్రెగ్నెంట్ స్త్రీలు ‘బేబీ పంపింగ్ ఎక్సర్సైజ్’ చేయడం మంచిదని చదివాను. ఇదొక న్యూ ట్రెండ్ అని విన్నాను. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి ఎక్సర్సైజ్లు చేయడం ఎంత వరకు క్షేమం? తెలియజేయగలరు. – శ్రీవాణి, నెల్లూరు బేబీ పంపింగ్ ఎక్సర్సైజ్ అంటే ఒక రకంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటిది. ఊపిరి లోపలికి పీల్చుకుంటూ పొట్టలో బిడ్డతో పాటు పొట్టని లోపలికి తీసుకోవడం, తర్వాత ఊపిరితో పాటు పొట్టని వదిలివెయ్యడం. ఇలా రోజూ క్రమంగా టీవీ చూస్తూ, పని చేసుకుంటూ, చదువుకుంటూ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల పెల్విక్, పొట్ట కండరాలు గట్టిపడటం, మానసిక ఒత్తిడిని, శారీరక ఒత్తిడిని తగ్గి, సాధారణ కాన్పు సులువుగా త్వరగా అయ్యే అవకాశాలు పెరిగి నడుంనొప్పి తగ్గడం, కాన్పు తర్వాత కూడా అలసట లేకుండా కడుపు కండరాలు గట్టిగా ఉండటం వల్ల, పొట్ట వదులు అవ్వకుండా ఉండటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే ఈ ఎక్సర్సైజ్లు తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా మేరకు చెయ్యవలసి ఉంటుంది. గర్భాశయం ముఖద్వారం చిన్నగా ఉండటం, మాయ కిందకి ఉండటం వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇవి చెయ్యకపోవడం మంచిది. ∙నా వయసు 26 సంవత్సరాలు. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. పరీక్షలు చేయించుకుంటే ‘గర్భసంచి ఉబ్బింది’ అని చెప్పారు. ఇది ప్రమాదకరమా? ఏ పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పి.ఆర్, కర్నూలుæ గర్భసంచి ఉబ్బింది అనేది సైంటిఫిక్ పదం కాదు. సామాన్యులకు అర్థం కావడానికి గర్భసంచిలో ఏర్పడే ఇబ్బందికి సంబంధించి అనేక నేపథ్యాలలో ఈ పదం వాడటం జరుగుతుంది. కొందరు డాక్టర్లు గర్భసంచిలో మరియు దాని చుట్టూ ఇన్ఫెక్షన్ ఉంటే దానిని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) అని, వాడుక భాషలో గర్భసంచి వాచింది లేదా గర్భసంచికి వాపు వచ్చింది అని చెప్పటం జరుగుతుంది. కొంతమందిలో రెండు, మూడు కాన్పుల తర్వాత గర్భసంచి సాగి కొద్దిగా పెద్దగా అవుతుంది. దీనిని బల్కీ యుటరస్ అని వాడుక భాషలో గర్భసంచి పెరిగింది అంటారు. కొందరిలో ప్రతి నెలా బ్లీడింగ్, గర్భసంచి నుంచి బయటకు వచ్చినట్లే, గర్భసంచి కండరాలలో కూడా బ్లీడింగ్ అవుతూ ఉండి, రక్తం గూడుకట్టి అది మెల్లమెల్లగా గర్భసంచిని గట్టిగా చేసి, దాని పరిమాణం పెరుగుతుంది. దీనిని అడినోమయోసిస్ అని, వాడుక భాషలో గర్భసంచి ఉబ్బింది అని అనటం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య ఏ నేపథ్యంలో చెప్పటం జరిగింది అనేది తెలియట్లేదు. ఒకవేళ పీఐడీ (ఇన్ఫెక్షన్) ఉంటే దానికి తగ్గ యాంటీ బయాటిక్స్‌తో కూడిన చికిత్స తీసుకుని చూడవచ్చు. మీకు పెళ్లి అయ్యిందా, పిల్లలు ఉన్నారా అనేది తెలియజేయలేదు. కాన్పుల వల్ల గర్భసంచి సాగి ఉండే ప్రమాదం ఏమీలేదు. బ్లీడింగ్ ఎక్కువయ్యే రోజులలో, అది కొద్దిగా తగ్గడానికి మాత్రలు వాడితే సరిపోతుంది. ఇక అడినోమయోసిస్ వల్ల గర్భసంచి ఉబ్బి ఉంటే, దీనికి చికిత్స కొద్దిగా క్లిష్టమైనది. ఒక్కొక్కరి లక్షణాల తీవ్రతను బట్టి, గర్భసంచి ఉబ్బిన పరిమాణం బట్టి, రకరకాల హార్మోన్లతో, మందులతో చికిత్స చేయవలసి ఉంటుంది. బ్లీడింగ్ తగ్గడానికి రెండు మూడు రోజులపాటు ప్రతి నెలా ట్రానెక్సిమిక్, మెఫినోమిక్ యాసిడ్ మాత్రలు రోజుకు మూడు చొప్పున వాడి చూడవచ్చు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారి శరీరంలో ఉండే హార్మోన్ల మోతాదును బట్టి వచ్చే సమస్యలకు, జాగ్రత్తలు చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండవు. కాకపోతే శారీరక పరిశుభ్రత, మానసిక ఒత్తిడి లేకుండా, ఆరోగ్యకరమైన ఆహారం, అధిక బరువు లేకుండా ఉండటం, సక్రమంగా వ్యాయామాలు చెయ్యడం వంటి లైఫ్ సై్టల్లో మార్పులు చేసుకోవడం. చాలా సమస్యలను ఎదుర్కొనే శక్తి, అవి తీవ్రం అవకుండా ఉండే అవకాశాలు పెరుగుతాయి. ∙ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌ని. నాకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఇల్లు ఊడవడం దగ్గరి నుంచి రకరకాల పనులు చేస్తుంటాను. ఈ సమయంలో ఇలాంటి పనులు చేయవద్దని పెద్దలు చెబుతున్నారు. ఇది నిజమేనా? ఏ నెల నుంచి జాగ్రత్తగా ఉండాలి? – కె.ఎన్, విజయవాడ సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత పనులు ఎంతవరకు చెయ్యడం అనేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి గర్భాశయం ముఖద్వారం పరిమాణం బట్టి, మాయ పొజిషన్ అంటే అది కిందకి ఉందా పైకి ఉందా అనే కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. గర్భంతో ఉన్న మొదటి మూడు నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కాంప్లికేషన్స్ ఏమీ లేనప్పుడు, డాక్టర్ సలహా మేరకు రోజువారి చేసుకునే పనులు, వంట పనులు, కూర్చునే చేసుకునే పనులు, అలసట ఇబ్బంది లేనంత వరకు మెల్లగా ఆగి ఆగి చేసుకోవచ్చు. మరీ వంగి చేసే పనులు, ఎక్కువ బరువులు లేపడం వంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఇల్లు ఊడవటం వంటివి, మరీ వంగి కాకుండా పెద్ద చీపురుతో మెల్లమెల్లగా చేయవచ్చు. గర్భం అనేది ప్రకృతి పరంగా జరిగే ఒక ప్రక్రియ. ఇది జబ్బు కాదు, ఇందులో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ఇబ్బందులు కొందరిలో చిన్నవి, కొందరిలో పెద్దవి తలెత్తుతుంటాయి. కాబట్టి నువ్వు ఒకసారి డాక్టర్ని సంప్రదించి నీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని దానిబట్టి పనులు చేసుకోవచ్చు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని కొంతమందికి మాత్రమే వారి పరిస్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. గర్భిణులు మధ్యాహ్నం ఒక గంట, రాత్రి 8 గంటలు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. -
ఆ సమయంలో చిరాకు, కోపం...
నెలసరి రావడానికి ముందు చిరాగ్గా, కోపంగా ఉంటుంది. ఏదీ తినాలనిపించదు. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడాలనిపించదు. చిన్న విషయాలకే కోపం వస్తుంది. అందరి విషయంలో ఇలాగే ఉంటుందా? లేకపోతే నా శారీరక స్థితిని బట్టి ఇలా జరుగుతుందా? పరీక్షలు చేయించుకుంటే మంచిదా? తెలియజేయగలరు. – డి.ఎన్, వనపర్తి కొందరి మహిళలలో నెలసరి ముందు జరిగే అనేక రకాల హార్మోన్లలో మార్పుల వల్ల, రక్తంలో కొన్ని విటమిన్స్, మినరల్స్ లోపాల వల్ల, నెలసరి మొదలయ్యే 10–15 రోజుల ముందు నుంచే, వక్షోజాలలో నొప్పి, పొట్ట ఉబ్బరం, వికారం, కోపం, చిరాకు, డిప్రెషన్ వంటి లక్షణాలు అనేక రకాల తీవ్రతలలో ఏర్పడతాయి. దీనినే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. దీనిని లక్షణాలను బట్టి పీఎంఎస్ అని నిర్ధారించడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ పరీక్షలు లేవు. పీఎంఎస్ అనేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారిలో జరిగే హార్మోన్ల మార్పుల తీవ్రతను బట్టి, కొందరిలో పీఎంఎస్ లక్షణాలు ఉంటాయి, కొందరిలో ఏమీ ఉండవు. దీనికి చికిత్సలో భాగంగా ప్రైమ్ రోజ్ ఆయిల్ క్యాప్సూల్స్‌తో పాటు విటమిన్, మినరల్స్ వంటివి మూడు నెలలపాటు వాడుతూ యోగా, వాకింగ్, మెడిటేషన్ వంటివి చెయ్యడం వల్ల ఆర్ఎంఎస్ లక్షణాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి లేదా తీవ్రత చాలావరకు తగ్గుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరం. మా బంధువు ఒకరికి గర్భసంచిలో గడ్డలు ఉన్నట్లు చెప్పారు. గర్భసంచిలో గడ్డలు అంటే... అది కచ్చితంగా క్యాన్సరే అంటున్నారు కొందరు. మరికొందరేమో...ఫైబ్రాయిడ్ గడ్డలేమో అంటున్నారు. గర్భసంచిలోని గడ్డలకు క్యాన్సర్‌కు ఏమైనా సంబంధం ఉందా? – జె.ఎల్, వరంగల్ గర్భసంచిలో గడ్డలు అంటే 95 శాతం ఫైబ్రాయిడ్ గడ్డలే ఉంటాయి. ఈ గడ్డలు 99 శాతం క్యాన్సర్ గడ్డలు కావు. 1 శాతం మందిలో ఈ గడ్డలు ఉన్నట్లుండి చాలా పెద్దగా పెరుగుతూ ఫైబ్రోసార్కోమా అనే క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. 4 శాతంలో అడినోమయోమా గడ్డలు ఉంటాయి. ఇవి కూడా క్యాన్సర్ గడ్డలు కాదు. ఫైబ్రాయిడ్స్ సైజును బట్టి, గర్భాశయంలో ఉండే పొజిషన్‌ను బట్టి, బ్లీడింగ్‌లో ఇబ్బంది, కడుపులో నొప్పి లేకుండా ఉంటే, 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఒకసారి మళ్లీ స్కానింగ్ చేయించుకుని, వాటి సైజు ఎంత పెరుగుతుంది అనేది గమనించుకోవలసి ఉంటుంది. తర్వాత సంవత్సరానికి ఒకసారి స్కానింగ్ చేయించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం వల్ల హైపర్టెన్సివ్ డిజార్డర్లు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చదివాను. ఇది ఎంత వరకు నిజం? ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరిగితే తగ్గే ప్రయత్నం చేయవచ్చా? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – సరిత, విజయవాడ గర్భిణీ సమయంలో బీపీ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు పెరగడం, గర్భం దాల్చక ముందు నుంచే అధిక బరువు ఉండి, మరలా గర్భం దాల్చిన తర్వాత పెరగడం వల్ల గర్భం దాల్చిన తర్వాత బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. కాకపోతే, బరువు ఎక్కువగా పెరగకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది.మామూలు బరువు ఉన్నవారికి నెలకు రెండు కేజీల వరకు పెరగవచ్చు. కానీ బరువు ఎక్కువగా ఉన్నవారు నెలకు అర కేజీ నుండి కేజీ వరకు పెరగవచ్చు. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుని కూరలు ఎక్కువ తీసుకోవడం, స్వీట్లు, షుగర్, అరటిపండ్లు, సపోటాలు వంటి షుగర్ ఎక్కువ ఉండే పండ్లు వీలైనంతవరకు తీసుకోకపోవటం, నూనె, నెయ్యి తక్కువ తీసుకోవటం, డాక్టర్ సలహా మేరకు నడక, వ్యాయామం చెయ్యటం వంటి నిబంధనలు పాటించడం వల్ల అధిక బరువు పెరగకుండా ఉండి ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే అవకాశాలు తగ్గుతాయి. -
ఆ ప్రభావం నాపై పడుతుందా?
ప్రెగ్నెన్సీ సమయంలో సిగరెట్ తాగడం వల్ల ‘హైపటైటిస్–సి’ వస్తుందని చదివాను. నేను గర్భవతిని. సిగరెట్ తాగే అలవాటు లేదు. అయితే మా ఆయన ఇంట్లోనే విపరీతంగా సిగరెట్లు కాలుస్తారు. ఈ ప్రభావం నాపై ఏమైనా ఉంటుందా? – జి.కె., నర్సాపూర్ హెపటైటిస్–సి అనేది వైరస్ వల్ల లివర్ (కాలేయం)కి వచ్చే ఇన్ఫెక్షన్. ఇది సిగరెట్ తాగడం వల్ల రాదు. వాడిన సిరంజ్‌లు వాడడం, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ల రక్తం ఎక్కించడం, వాళ్ల రేజర్లు వాడడం, కలయిక ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది. హెపటైటిస్–సి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీవారు తాగి వదిలే సిగరెట్ పొగ నువ్వు రోజూ పీల్చడం వల్ల, గర్భంలోని బిడ్డపై దుష్ఫ్రభావం పడుతుంది. దీనివల్ల అబార్షన్లు, బిడ్డ బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండానే కాన్పులు అవ్వడం, పుట్టిన బిడ్డలో మానసిక లోపాలు తలెత్తే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మెల్లగా మీ ఆయనకు సిగరెట్ పొగ వల్ల ఏర్పడే దుష్ఫలితాల గురించి వివరించి చెప్పి చూడటం మంచిది. వినకపోతే ఆయన సిగరెట్ తాగే సమయంలో, పొగకు దూరంగా నువ్వు వేరే గదిలో ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ మధ్య బాలింతల మరణాల గురించి ఎక్కువగా వింటున్నాం. ఆస్పత్రులు, పరికరాల అపరిశుభ్రత వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? ఏ కారణాల వల్ల బాలింతల మరణాలు సంభవిస్తాయి? – డి.జానకి, హైదరాబాద్ బాలింత మరణాలు కాన్పు సమయం నుంచి 42 రోజుల లోపల ఎప్పుడైనా జరగవచ్చు. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం (పోస్ట్‌పార్టమ్ హేమరేజ్), బీపీ పెరగటం, గుర్రపు వాతం (ఫిట్స్ రావటం), ఇన్ఫెక్షన్స్, రక్తనాళాలలో రక్తం గూడుకట్టి, ఊపిరితిత్తులలోకి పాకి శ్వాస ఆగడం (పల్మనరీ ఎంబోలిజమ్), గుండె పెరిగి, దానిమీద భారం (పోస్ట్‌పార్టమ్ కార్డియో మయోపతి) వంటి ఎన్నో కారణాల వల్ల బాలింత మరణాలు జరగవచ్చు. బాలింతలో రక్తహీనత వల్ల, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, ఇన్ఫెక్షన్ కారక క్రిములు తొందరగా వ్యాప్తి చెంది ఇన్ఫెక్షన్లు రావటానికి కారణమవుతాయి. కాన్పు తర్వాత, గర్భాశయం లోపల పచ్చిగా ఉండటం, కుట్లు పడటం వల్ల మలద్వారం దగ్గర నుంచి క్రిములు, గర్భాశయంలోకి, పొట్టలోకి, రక్తంలోకి పాకే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆస్పత్రిలో వాడే పరికరాలు, ఇతర ఇన్స్ట్రుమెంట్స్ సరిగా శుభ్రపరచకుండా, స్టెరిలైజ్ చెయ్యకుండా తిరిగి వాడటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు రావచ్చు. సాధారణంగా అన్నీ ఆస్పత్రులలో పరిశుభ్రతను పాటిస్తారు. కాన్పు తర్వాత, డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్స్ కోర్సును తప్పక వాడాల్సి ఉంటుంది. అలాగే వారు చెప్పిన జాగ్రత్తలు పాటించడం వల్ల చాలావరకు ఇన్ఫెక్షన్లను, సమస్యలను అరికట్టవచ్చు. కొన్ని సందర్భాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సమస్య డాక్టర్ల చెయ్యిదాటి బాలింత మరణాలు జరుగుతుంటాయి. నా ఫ్రెండ్ ఒకరికి ఎండోమెట్రియోసి ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. ‘ఎండోమెట్రియోసి’ వల్ల రకరకాల క్యాన్సర్లు రావచ్చు అనే మాట కూడా విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ‘ఎండోమెట్రియోసి’ అంటే ఏమిటి? – కె.అరుణ, ఖమ్మం ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొర బ్లీడింగ్ రూపంలో చిన్న చిన్న ముక్కలుగా బయటకు వచ్చేస్తుంది. కొందరిలో ఈ పొర గర్భాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్‌ల ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కొందరిలో కరిగిపోతుంది. కొందరిలో ఈ పొర చిన్న చిన్న ముక్కలుగా గర్భాశయం పైన, వెనుక భాగంపైన, అండాశ యాల పైన, పేగుల పైన, మూత్రాశయం పైన... ఇలా అనేక ప్రదేశాలలో అతుక్కుని, ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో ఇక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. దీనినే ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇలా ప్రతి నెలా అయిన బ్లీడింగ్, గడ్డకట్టి పైన చెప్పిన ప్రదేశాలలో పేరుకుంటూ ఉంటుంది. దీని వల్ల గర్భాశయం, అండాశయాలు, పేగులు మెల్లమెల్లగా దగ్గరికి వచ్చి అంటుకుపోతాయి. ఎండోమెట్రియోసిస్ వల్ల పీరియడ్ సమయంలో పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి, కలయికలో నొప్పి, గర్భం దాల్చడానికి ఇబ్బంది వంటి అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఎండోమెట్రియోసిస్ అండాశయాలలో ఏర్పడి, రక్తం గడ్డకట్టడం వల్ల తయారయ్యే గడ్డలను చాక్లెట్ సిస్ట్ అంటారు. ఎండోమెట్రియోసిస్ వల్ల క్యాన్సర్ రావడం చాలా అరుదు. l -
నేను పెళ్లి చేసుకోవచ్చా?
నా వయసు 20 సంవత్సరాలు. నాకు ‘యుటిఐ’ సమస్య ఉంది. తరచుగా యూరిన్ అవుతుంది. ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకోవచ్చా? పిల్లలు పుడతారా? ఇంకా ఇతర సమస్యలేమైనా ఎదురవుతాయా? నా సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఏ డాక్టర్‌కి చూపించుకోవాలి? ఒక సోదరి యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. కిడ్నీల దగ్గర నుండి యూరేటర్ అనే గొట్టాల ద్వారా మూత్రం (యూరిన్) మూత్రాశయంలో (యూరినరీ బ్లాడర్) చేరి, అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వస్తాయి. ఆడవారిలో యురెత్రాకి దగ్గరగా యోని, మలద్వారం ఉంటాయి. అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ క్రిములు, యురెత్రా ద్వారా పైకి పాకి ఇన్ఫెక్షన్కి కారణం కావచ్చు. నీరు సరిగా తాగకపోయినా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్కి, పెళ్లికి, పిల్లలకి సంబంధం లేదు. కాకపోతే నీకు తరచుగా యూటీఐ వస్తుంది కాబట్టి, ఎందుకు ఇన్ఫెక్షన్ మాటిమాటికీ వస్తుంది అని తెలుసుకోవటానికి డాక్టర్ని సంప్రదించి సీయూబీ, యూరినల్స్, యూఎస్జీ అబ్డామెన్, సీబీపీ, ఎస్ఆర్ క్రెటైనిన్ వంటి పరీక్షలు చేయించుకుని దానికి తగ్గ చికిత్స పూర్తిగా తీసుకోవలసి ఉంటుంది. ఇన్ఫెక్షన్ తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేస్తే, అది మెల్లగా కిడ్నీలకి, రక్తంలోకి పాకి కిడ్నీలు పాడవడం, ప్రాణ హాని కలిగే ప్రమాదం ఉంటుంది. రక్తహీనత ఉన్నా, షుగర్ ఉన్నా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా, కిడ్నీలో రాళ్లు ఉన్నా కిడ్నీలు, యురేటర్, యూరినరీ బ్లాడర్ నిర్మాణంలో సమస్యలు ఉన్నా, పరిశుభ్రత పాటించకపోయినా, నీరు సరిగా తాగకపోయినా తరచుగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తరచుగా యూటీఐ వస్తుంటే యూరాలజిస్ట్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని కారణానికి తగ్గ చికిత్స చేయించుకోవటం మంచిది. రోజూ నీరు 2 నుంచి 4 లీటర్లు తాగాలి. ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తిగా వాడాలి, సగం వాడి ఆపేయకూడదు. యోగాసనాలు వేయడం వల్ల బహిష్టు సమయంలో తలెత్తే కడుపు నొప్పి, అధిక రక్తస్రావంలాంటి సమస్యలకు ఉపశమనం దొరుకుతుందని నెలసరి క్రమం తప్పడం ఉండదని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? దీని కోసం మామూలు యోగాసనాలు సరిపోతాయా? ప్రత్యేక యోగాసనాలు ఏమైనా ఉన్నాయా? తెలియజేయగలరు. జి.ఆర్, రాజమండ్రి క్రమంగా యోగాసనాలు చెయ్యడం వల్ల కండరాలు గట్టిపడటం, రక్త ప్రసరణ మెరుగుపడటం, అదనపు కొవ్వు కరగటం, దాని ద్వారా నొప్పి తట్టుకునే శక్తి పెరగడం వంటి ప్రయోజనాలుంటాయి. బరువు నియంత్రణలో ఉండటం వల్ల హార్మోన్ల పని తీరు మెరుగు పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడే బ్లీడింగ్ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కడుపులో నొప్పి వంటి ఇతర లక్షణాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. యోగాసనాలు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారి బరువు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని యోగా నిపుణుల ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకుని, తర్వాత సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు. రోజు ప్రాణాయామం చెయ్యడం చాలా మంచిది. యోగసాధన చెయ్యడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి తగ్గి, హార్లోన్మ అసమతుల్యత తగ్గి, పీరియడ్ సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ, ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పీరియడ్స్‌లో వచ్చే ఇబ్బందులకు గర్భాశయంలో గడ్డలు, ఒవేరియన్ సిస్ట్ వంటి కారణాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవడానికి, హార్మోన్ పరీక్షలు, అల్ట్రా సౌండ్ పెల్విస్ చేయించుకోవటం మంచిది. నాకు అప్పుడప్పుడూ రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ తర్వాత రక్తస్రావం కావడాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటున్నారు. నెలసరి ఆగిపోయిన తరువాత రక్తస్రావం కావడం ప్రమాదమా? డాక్టర్‌కు చూపించుకోవాలా? కె.సి, హైదరాబాద్ మీ వయసు, పీరియడ్స్ ఆగిపోయి ఎన్ని సంవత్సరాలు అయినాయి అనే వివరాలు రాయలేదు. మెనోపాజ్‌కు చేరిన తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అంటారు. హార్మోన్ల అసమతుల్యత ఇన్ఫెక్షన్, గర్భాశయంలో పుండ్లు, పాలిప్, అండాశయంలో సిస్ట్లు, క్యాన్సర్ వంటి అనేక కారణాల వల్ల పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అవ్వవచ్చు. కాబట్టి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అయ్యే బ్లీడింగ్‌ను నిర్లక్ష్యం చెయ్యకుండా, గైనకాలజిస్ట్‌కు చూపించుకుని సీబీపీ, ఆర్బీఎస్, టీఎస్‌హెచ్, స్పెక్యులమ్ పరీక్ష, అల్ట్రా సౌండ్ పెల్విస్, ట్రాన్స్ వెజైనల్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొంతమందికి యాంటీ బయాటిక్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ వంటి మందులతో చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. కొందరికి డి అండ్ సి చేసి, ఎండోమెట్రియల్ పొరను బయాప్సీకి పంపించి, ఆ రిపోర్ట్‌ను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. గడ్డలు, ఒవేరియన్ ట్యూమర్లు వంటివి ఉండే గర్భాశయం, అండాశయాలు ఆపరేషన్ ద్వారా తీసివేసి, వాటిని బయాప్సీకి పంపించి, దాని రిపోర్ట్‌ను బట్టి తర్వాత ఇంకా ఏమన్నా చికిత్స అవసరమా అని కూడా చూడవలసి ఉంటుంది. -
అది ఎంతవరకు నిజం?
పదిహేను సంవత్సరాల వరకు నెలసరి మొదలు కాకపోతే ‘సీరియస్ ప్రాబ్లం’ అన్నట్లుగా విన్నాను. ఒకవేళ ఇది నిజమే అయితే, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలియ జేయగలరు. – శ్రీ, ఆదిలాబాద్ సాధారణంగా ఆడపిల్లలు 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల రజస్వల అవుతారు (అంటే పీరియడ్స్ మొదలవ్వడం). ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, అధిక బరువు, పర్యావరణ మార్పులు, ఆధునిక పోకడలతో, హార్మోన్లలో మార్పులవల్ల ఆడపిల్లలు 10 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. దీనివల్ల తోటిపిల్లలు తొందరగా రజస్వల అయినప్పుడు, 15 సంవత్సరాలైన మిగతా పిల్లలు రజస్వల అవనప్పుడు కంగారుగా అనిపిస్తుంది. పిల్లలు ఎత్తుకి తగ్గ బరువు ఉండి, రొమ్ములు ఏర్పడి, బాహుమూలల్లో, జననేంద్రియాల వద్ద వెంట్రుకలు వచ్చి ఉండి, చూడటానికి మామూలుగా ఉంటే గరిష్టంగా 16 సంవత్సరాల వరకు రజస్వల అయ్యే అవకాశాలు ఉంటాయి. కాని 15 సంవత్సరాలు వచ్చినా రజస్వల కాకపోతే అమ్మాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేక ఇంకా ఒక సంవత్సరం ఆగవచ్చా అని తెలుసుకోవటానికి డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. కొందరిలో హార్మోన్ల లోపం (థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్) జన్యుపరమైన సమస్యలు, గర్భాశయం లేదా అండాశయాలు లేకపోవటం, చిన్నగా ఉండటం, అధిక బరువు ఉండటం, పీసీఓడీ, బరువు మరీ తక్కువగా ఉండటం, యోని భాగాన్ని కన్నెపొర పూర్తిగా మూసి వేయటం వంటి ఎన్నో కారణాల వల్ల రజస్వల కాకపోవచ్చు. కొన్ని సమస్యలకు మనం జాగ్రత్తలు తీసుకోవటానికి ఏమీ ఉండదు. పుట్టుకతో లోపాలు, జన్యుపరమైన లోపాలకు చాలావరకు చికిత్స ఏమీ ఉండదు. కాకపోతే మారుతున్న కాలంలో ఆడపిల్లలను చిన్నప్పటి నుంచే వ్యాయామాలు, ఆహారంలో జంక్‌ఫుడ్ తగ్గించి, సరైన పౌష్ఠికాహారం ఇవ్వడం ద్వారా, అధిక బరువు, కొన్ని హార్మోన్ల మార్పులను అరికట్టవచ్చు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ఒక్కోసారి అకారణంగా మూడీగా మారిపోతాను. ఎవరితో మాట్లాడాలనిపించదు. డిప్రెషన్లో ఉన్నానా? అనిపిస్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు డిప్రెషన్‌కు చికిత్స తీసుకోవచ్చా? యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్, యాంటీ డిప్రెసెంట్స్ అంటే ఏమిటి? – బి.ఆర్, శ్రీకాళహస్తి గర్భిణీతో ఉన్నప్పుడు 100లో పదిమంది అనేక రకాల తీవ్రతతో డిప్రెషన్లోకి వెళ్తారు. ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల, శారీరక మార్పుల వల్ల, గర్భం పెరిగేకొలదీ కలిగే అసౌకర్యం, నొప్పులు, గర్భధారణ మీద భయం, అపోహలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ముందు గర్భంలో వచ్చిన సమస్యల వల్ల, ఇలా అనేక కారణాల వల్ల, కొందరు గర్భిణీలలో డిప్రెషన్ కొద్దిగా నుంచి తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల దేనిమీద ఆసక్తి లేకపోవటం, కోపం, భయం, ఏడుపు, ఎవరితో మాట్లాడకపోవటం, నిద్రలేకపోవటం, లేక అతిగా నిద్రపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, లేక అతిగా తినడం వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. దీనివల్ల కడుపులో బిడ్డ సరిగా పెరగకపోవటం, కొన్నిసార్లు పుట్టిన బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు తలెత్తే సమస్యలు ఉంటాయి. దీనికి చికిత్సలో భాగంగా మొదట కుటుంబసభ్యులు ఈ లక్షణాలని గుర్తించగలగాలి. ఈ సమయంలో వీరికి కుటుంబసభ్యుల మద్దతు ఎంతగానో అవసరం. వారిలో ప్రేమగా మాట్లాడాలి, ఎక్కువ సమయం గడపాలి, బయట చల్లగాలికి వాకింగ్‌కు తీసుకువెళ్లటం, వాళ్లకి నచ్చిన ప్రదేశాలకు తీసుకువెళ్లటం, ప్రాణాయామం, మెడిటేషన్ చెయ్యించటం వంటి వాటివల్ల చాలావరకు ఈ లక్షణాలకు ఉపశమనం కలుగుతుంది. ఇంకా కూడా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు, డాక్టర్ని సంప్రదించి వారి పర్యవేక్షణలో యాంటి డిప్రెసెంట్ మందులు వాడవలసి ఉంటుంది. వీటిని డిప్రెషన్ తగ్గించడానికి వాడుతారు. వీటిలో కొన్ని ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఎక్కువ ముప్పు వాటిల్లకుండా ఉండేవి ఎంచుకుని తక్కువ మోతాదులో ఇవ్వటం జరుగుతుంది. డిప్రెషన్ లక్షణాలు అధికంగా ఉండి, వాటివల్ల వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు, యాంటీ డిప్రెసెంట్స్ వల్ల రిస్క్ కొద్దిగా ఉన్నా కూడా వాడవలసి ఉంటుంది. నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, డిప్రెషన్ లక్షణాలు ఇప్పుడు ఇప్పుడే మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. ఒకసారి డాక్టర్ని సంప్రదించి కౌన్సిలింగ్ ఇప్పించుకోవటం మంచిది. మీవారిలో మీ సమస్య గురించి చెప్పవలసి ఉంటుంది. రోజూ కొంచెంసేపు యోగ, మెడిటేషన్, బయటకు వెళ్లి కొద్దిగా వాకింగ్ చెయ్యటం వల్ల ఈ లక్షణాల నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి. -
ఏదైనా సమస్య ఉందంటారా?
నా వయసు 26. పెళ్లై ఏడాదైంది. ప్రతినెలా పీరియడ్ మిస్ అయితే బాగుండని ఎదురు చూస్తున్నాను. కానీ పీరియడ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ భయంగా ఉంటోంది. మార్నింగ్ సిక్నెస్ తరచూ ఉంటోంది. అది ప్రెగ్నెన్సీకి ఒక లక్షణం అని నెట్లో చదివాను. పీరియడ్ మిస్ కాకముందే నేను ప్రెగ్నెంట్ అవ్వబోతున్నానని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? గత నెలలో పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ పీరియడ్ రావడంతో కుంగిపోయాను. త్వరగా పిల్లలు కావడానికి, ఎందుకు కావట్లేదో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – స్వాతి, కర్నూలు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తూ ఉండి, భార్యాభర్తలు క్రమంగా కలుస్తూ ఉండి, ఇద్దరిలో వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు... నూటికి ఎనభై శాతం మంది ఏడాది లోపల గర్భం దాల్చుతారు. మిగతా 20 శాతంలో 10–15 శాతం మందికి రెండేళ్ల సమయం పట్టొచ్చు. మిగతా 5–10 శాతం మందికే కొన్ని సమస్యల వల్ల, ఎక్కువ సమయం లేదా చికిత్స అవసరం కావొచ్చు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి వారం ముందు నుంచి కొందరిలో వికారం, నీరసం, రొమ్ముల్లో నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు. అలా అని అందరికీ ఉండాలనేమీ లేదు. ఈ లక్షణాలు హార్మోన్ల ప్రభావం వల్ల గర్భంలేని వారిలో పీరియడ్ వచ్చే ముందు కూడా రావచ్చు. నెలనెలా సక్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్ మిస్ అయిన వారం రోజుల్లో యూరిన్‌లో ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పరీక్ష చేసి గర్భం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీకు గత నెల పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చిందన్నారు. ఏమైనా హార్మోన్ల సమస్య ఏర్పడుతుందేమో తెలుసుకోవడం మంచిది. పెళ్లై ఏడాదైంది. త్వరగా పిల్లలు కావాలని ఆశ పడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా... మీరు, మీవారు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. జననేంద్రియాల దగ్గర నాకు చిన్న చిన్న నీటి పొక్కులు వచ్చాయి. దీని గురించి ఒక స్నేహితురాలికి చెబితే ‘హెర్పిస్ సింప్లెక్స్ కావచ్చు’ అని ఆందోళన పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఆందోళనంగా ఉంది. హెర్పిస్ సింప్లెక్స్ గురించి, చికిత్సా విధానం గురించి తెలియజేయగలరు. – డి.అరుణ కుమారి, విశాఖపట్నం హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది శరీరం పైన ఎక్కడైనా రావచ్చు. ఇందులో హెస్ఎస్వీ 1, హెస్ఎస్వీ 2 అనే రెండు రకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. హెస్ఎస్వీ 1 అనేది ఇన్ఫెక్షన్ ఎక్కువ మటుకు మూతి చుట్టూ, ముఖం మీద వస్తుంది. హెస్ఎస్వీ 2 జనేంద్రియాల మీద వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద చిన్న చిన్న నీటి గుల్లలు లేదా వీటి పొక్కులులాగా వస్తుంది. అది క్రమేణా మందులు వాడకపోయినా, వారం పది రోజులకు తగ్గిపోతుంది. అది తగ్గేవరకు, చర్మం మీద మంట, నొప్పి ఎక్కువగా ఉంటుంది. హెస్ఎస్వీ 2 ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి, సెక్స్ ద్వారా పాకే అవకాశాలు ఉంటుంది. ఈ గుల్లలు ఎక్కువ పాకకుండా ఉండటానికి ఎసైక్లోవీర్ అనే మాత్రలు, క్రీమ్ వాడవచ్చు. హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిన తర్వాత, హెర్పిస్ వైరస్ ఒంట్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, రోగ నిరోధక శక్తి బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి, వైరస్ యాక్టివేట్ అయ్యి మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మళ్లీ వచ్చే ఇన్ఫెక్షన్ చాలా తక్కువ తీవ్రతలో ఉంటుంది. నాకు ఈ మధ్యనే బిడ్డ పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. అయితే నాకు పాలివ్వడంలోనే సమస్యగా ఉంటోంది. కుడివైపు ఓకే కానీ ఎడమవైపు స్తనం నుంచి అస్సలు పాలు రావడం లేదు. అలా ఎందుకవుతోంది? ఏదైనా సమస్య ఉందంటారా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? – శశికళ, మెయిల్ సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రొమ్ములో పాల ఉత్పత్తి మొదలవుతుంది. బిడ్డ రొమ్ము మొనను (నిపుల్) చీకడం మొదలు పెట్టిన తర్వాత ఆక్సిటోసిన్ హార్మోన్ మరింతగా విడుదలై పాల ఉత్పత్తిని మరింతగా ప్రేరేపించి, వాటిని నిపుల్ ద్వారా బయటకు పంపిస్తుంది. పైన చెప్పిన హార్మోన్స్, బిడ్డ చీకడం, మానసిక, శారీరక ప్రశాంతత అన్నీ సరిపడా ఉన్నప్పుడు, బిడ్డకు సరిపడా పాలు చక్కగా వస్తాయి. మీకు ఒకవైపు వస్తున్నాయి, మరోవైపు రావట్లేదు అంటున్నారు కాబట్టి కొన్ని విషయాలు పరిశీ లించాలి. కొంతమందిలో నిపుల్పైన ఉన్న రంధ్రాలపై పొక్కు కట్టి, మూసుకుపోతాయి. అలాంటప్పుడు పొక్కులను తడిబట్టతో మెల్లిగా తీసేసే ప్రయత్నం చేయొచ్చు. ఒకవైపే పాలు వస్తున్నాయని, అటే బిడ్డకు పాలు ఇస్తూ పోతే, ఇటువైపు ప్రేరేపణ లేకపోవడం వల్ల కూడా రాకపోవచ్చు. కాబట్టి ఈసారి బిడ్డ బాగా ఆకలిగా ఉన్నప్పుడు మొదట పాలు రాని రొమ్మును శుభ్రం చేసి పట్టిస్తే, బిడ్డ చీకే కొద్దీ, అది ప్రేరేపణకు గురై పాలు మెల్ల మెల్లగా రావడం మొదలవుతుంది. అయినా రాకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.a -
ఆ వైరస్‌కు చికిత్స లేదు
cytomegalo virus(cmv) గురించి ఈ మధ్య విన్నాను. దీని గురించి గర్భిణి స్త్రీలు తగిన జాగ్రత్తతో ఉండాలంటున్నారు. ఈ వైరస్ సమస్య పాశ్చాత్య దేశాల్లోనే ఉందా? మన దేశంలో కూడా ఉందా? ఈ వైరస్ గురించి సవివరంగా తెలియజేయగలరు. – వి.జానకి, మందమర్రి సైటోమెగలో వైరస్ (సీఎంవీ) అనేది హెర్పిస్ జాతికి చెందిన వైరస్. ఇది పాశ్చాత్య దేశాలలోనే కాకుండా, మన భారతదేశంలో కూడా ఉంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి లాలాజలం, రక్తం, మూత్రం, వీర్యం, యోని ద్రవాల ద్వారా సంక్రమిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, కీళ్లనొప్పులు, లింఫ్‌నోడ్ వాపులు వంటి లక్షణాలు ఏర్పడి, తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల మామూలు వాళ్లకు ఇబ్బంది ఉండదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, ఎయిడ్స్ ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండవచ్చు. అలానే దీనివల్ల గర్భిణులకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ, సీఎంవీ వైరస్ తీవ్రంగా వస్తే గర్భంలోని శిశువుకి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10% శిశువులలో సీఎంవీ ఇన్ఫెక్షన్ వల్ల అవయవ లోపాలు, చూపులో ఇబ్బంది, వినికిడి లోపాలు, మానసిక, శారీరక లోపాలు ఉండవచ్చు. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ తల్లి నుంచి బిడ్డకు మాయ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్‌కు చికిత్స లేదు. గర్భిణీ స్త్రీలు, ఈ వైరస్ నుంచి వీలైనంత దూరంగా ఉండటానికి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, శారీరక శుభ్రతను పాటించడం ఉత్తమం. ఛాతీ తక్కువ ఉన్నవాళ్లు పుష్ అప్ బ్రాలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? పుష్ అప్ బ్రాలు వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? కుడి, ఎడమ రొమ్ముల్లో తేడా ఉండటం అనేది అనారోగ్యానికి సూచనగా భావించాలా? – సి.కె., నెల్లూరు పుష్ అప్ బ్రాలు ఛాతీని సపోర్ట్ చేస్తూ ఎత్తి పెట్టినట్లు చేసి కొద్దిగా పైకి, ముందుకి వచ్చినట్లు చేస్తూ, రొమ్ము పరిమాణం గుండ్రంగా, పెద్దగా కనిపించేటట్లు చేస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కేవలం ఈ బ్రాలు వేసుకోవడం వల్లే రాదు. సాధారణంగా బ్రాను రెగ్యులర్‌గా, సంవత్సరాల తరబడి రోజంతా వేసుకుంటూ ఉండటం వల్ల, కొద్దిగా రొమ్ముకి రక్త ప్రసరణ తగ్గడం, రక్తంలోని, లింఫ్లోని మలినాలు సరిగా సర్క్యులేట్ అవ్వకపోడం, దాని ద్వారా రొమ్ములో మలినాలు పేరుకొని, శరీర తత్వాన్ని బట్టి కొందరిలో అనేక సంవత్సరాల తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనేది కొంతమంది పరిశోధకుల అంచనా. రెగ్యులర్‌గా బ్రా వేసుకోవడం వల్ల మెలటోనిన్ అనే పదార్థం తక్కువగా తయారవుతుంది. మెలటోనిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్, ఇది మంచి నిద్రని ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముసలితనాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఇది కొద్దిగా క్యాన్సర్ బారి నుంచి తగ్గిస్తుంది. పుష్ అప్ బ్రాలు అనే కాకుండా వేరే ఏ బ్రా అయినా కూడా, మరీ బిగుతుగా కాకుండా, కరెక్ట్ సైజు వేసుకోవటం మంచిది. అవసరం లేదనుకున్నప్పుడు వేసుకోకపోవటం మంచిది. రాత్రిపూట బ్రాలు ధరించకపోవడం మంచిది. కొందరిలో పుట్టుకతోనే రొమ్ములు పరిమాణంలో తేడా ఉండవచ్చు. ఒక రొమ్ము పెద్దగా, ఒకటి చిన్నగా ఉండవచ్చు. దానివల్ల ఎటువంటి అనారోగ్యం, ప్రమాదం ఉండదు. నాకు ఆస్థమా ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో ఇన్హేలర్ ఉపయోగించవచ్చా? ఉపయోగించవచ్చని కొందరు, వద్దని కొందరు అంటున్నారు. ఏది నిజం? ఒకవేళ ఉపయోగిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – జి.సుమన, ఆదిలాబాద్ ఆస్థమా ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు, హార్మోన్లలో మార్పుల వల్ల, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి కొందరిలో ఆస్థమా తక్కువగా ఉంటుంది. కొందరిలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆస్థమా ఉన్నవాళ్లలో ఏదైనా అలర్జీ వల్ల, ఊపిరితిత్తులోకి గాలిని పంపించే గొట్టాలలో వాపు ఏర్పడి, అవి సన్నగా అయ్యి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ఊపిరితిత్తులలో నీరు చేరడం, తద్వారా తల్లికి, బిడ్డకి ఆక్సిజన్ సరఫరా తక్కువగా అందుతుంది. (ఈ సమయంలో ఆస్థమా అటాక్ ఎక్కువగా రావటం వల్ల, తల్లి నుంచి బిడ్డకి ఆక్సిజన్ సరఫరా తక్కువ అందుతుంది. దీనివల్ల గర్భంలో బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవటం, నెలలు నిండకుండానే పుట్టడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.) తల్లిలో కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ సమయంలో ఇన్హేలర్స్ వాడటం తప్పనిసరి. వీటిని వాడటం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఒకవేళ చిన్నచిన్నవి ఉన్నా అవి వాడకపోతే తల్లికి, బిడ్డకు వచ్చే ప్రమాదాలతో (సమస్యలతో) పోలిస్తే చాలా తక్కువే. కాకపోతే ఒకసారి గర్భిణీ సమయంలో డాక్టర్ని సంప్రదించి, తగిన మోతాదు, మందులతో కూడిన ఇన్హేలర్ను వాడటం మంచిది. ఇన్హేలర్తో పాటు, వీలైనంత వరకు చల్లని పదార్థాలు, ఆస్థమాకు పడని వస్తువులు, దుమ్ము, ధూళి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. -
ఈ సమయంలో అది తాగవచ్చా?
మా బంధువుల్లో ఒక అమ్మాయికి కడుపులోనే బిడ్డ చనిపోయింది. దీని గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అమ్మాయి బలహీనంగా ఉండడం వల్ల ఇలా జరిగిందని, ప్రెగ్నెన్సీ సమయంలో సరిౖయెన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగిందని, గుర్రపు వాతమని... ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. వీటిలో ఏది నిజం? కడుపులో బిడ్డ చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? అనేది తెలియజేయగలరు. – పి. శైలజ, తెనాలి కడుపులో బిడ్డ ఏ నెలలో చనిపోయింది అనేదాన్ని బట్టి కారణం అంచనా వేయడం జరుగుతుంది. కడుపులో బిడ్డ చనిపోవడానికి, తల్లిలో సమస్యలు, బిడ్డలో సమస్యలు, మాయ (ప్లాసెంటా) సమస్యలు కారణం కావచ్చు. తల్లిలో బీపీ పెరగడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు పెరగకుండానే తల్లి నుండి బిడ్డకు రక్తసరఫరా సరిగా లేకపోవడం, బిడ్డకు సరిగా శ్వాస అందకపోవడం, అదుపులో లేని మధుమేహ వ్యాధి, అధిక తీవ్రతతో ఉన్న జ్వరం, ఇన్ఫెక్షన్లు. నెలలు పూర్తిగా నిండిపోయినా (40 వారాలు) ఇంకా నొప్పులు రాలేదని ఎదురుచూడటం దాని ద్వారా, ఉమ్మనీరు ఎండిపోయి మాయ పనితీరు తగ్గి, బిడ్డకు రక్తసరఫరా ఆగిపోయి, శ్వాస ఆగిపోవచ్చు. తల్లి నుంచి బిడ్డకు రక్తసరఫరా చేసే రక్తనాళాలలో రక్తం గూడు కట్టడం, బిడ్డలో అవయవ లోపాలు, జన్యుపరమైన లోపాలు, నెలలు నిండకుండానే గర్భంలో మాయ విడిపోవడం, గర్భంలో బ్లీడింగ్ అవ్వడం బిడ్డకు రక్తసరఫరా ఆగిపోవడం, బొడ్డుతాడులో (అంబలీకల్ కార్డ్) ముడులు (ట్రూ నాట్స్) బిడ్డ మెడ చుట్టూ బొడ్డుతాడు గట్టిగా బిగుసుకోవడం వంటి కారణాల వల్ల బిడ్డ కడుపులో చనిపోవచ్చు. కొందరిలో కాన్పు సమయంలో నొప్పుల తీవ్రతను బిడ్డ తట్టుకోలేకపోవడం బిడ్డకు శ్వాస అందకపోవడం వల్ల బిడ్డ కడుపులో చనిపోవచ్చు. కొంతమందిలో కారణాలు తెలియకుండానే బిడ్డ కడుపులో చనిపోవచ్చు. కొందరిలో ఈ విషయాన్ని ముందుగా కనిపెట్టలేము. కొందరి బిడ్డ ఎదగకపోవడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, తల్లిలో అధిక బీపీ లాంటి సమస్యలు ఉన్నప్పుడు బిడ్డ కడుపులో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు వేసుకుని, కొందరిలో కాన్పు ముందుగానే చేసి బిడ్డను బయటకు తీయడం జరుగుతుంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. నాకు చిరుతిండ్లు తినే అలవాటు ఎక్కువగా ఉంది. ఈ సమయంలో తినవచ్చా? నేను నాన్‌వెజ్ తినను. గుడ్లు మాత్రం తింటాను. వీటిని ఎక్కువగా తినడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందా? నాకు మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టం. ఈ సమయంలో తాగవచ్చా? గర్భిణిగా ఉన్నవాళ్లు ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచింది? – ఎన్.ఆర్, పొద్టుటూరు గర్భం లేని సమయంలో కూడా చిరుతిండ్లు జంక్‌ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. గర్భిణీ సమయంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. గ్యాస్ తయారవడం, ఎసిడిటీ సమస్య మామూలుగానే ఎక్కువ ఉంటుంది. చిరుతిండ్ల వల్ల వాటిలో వాడే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఇంకా ఇతర పదార్థాల వల్ల పొట్ట ఉబ్బరం, అరగకపోవడం, అధికంగా బరువు పెరగడం వంటి దుష్ఫలితాలే తప్ప ఉపయోగాలు ఏమీ ఉండవు. మరీ తినాలనిపిస్తే, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. ఈ కాలంలోనే దొరికే మామిడిపండ్లను చూస్తే ఎవరికైనా మిస్ అవ్వకుండా ఈ నెల రోజులు బాగా తినాలనిపిస్తుంది. కాని గర్భిణీలలో ఎక్కువగా మామిడి పండ్లు లేక జ్యూస్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం, లూజ్ మోషన్స్ షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు పెరగడం, రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తినాలనిపిస్తుంది కాబట్టి, జ్యూస్ కంటే కూడా కొన్ని కొన్ని ముక్కలు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఎండాకాలంలో గర్భిణీలు ఎండలకు ఎక్కువ చెమట్లు పట్టడం, ఒంట్లో నీరు శాతం తగ్గిపోయి, అలసటగా ఉండటం, ఓపిక లేకుండా చిరాకుగా ఉంటారు. గర్భిణీలు ఎండాకాలంలో ఎక్కువగా మంచినీరు కనీసం 3–4 లీటర్లు ఒకేసారిగా కాకపోయినా కొంచెం కొంచెంగా, మజ్జిగ, లస్సీ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. పండ్లలో అధికంగా నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దాని జ్యూస్, దానిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్ వంటివి తీసుకోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం మంచిది. కారం, మసాలా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కోడిగుడ్డులో ప్రొటీన్స్, విటమిన్స్ ఎ,డి,ఇ,బి1, బి2,బి5,కె, ఫోలిక్ యాసిడ్, అమైనో యాసిడ్స్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బాగా సన్నగా ఉన్నవారు రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. బరువు అధికంగా ఉంటే పచ్చసొన తీసివేసి తెల్లసొన రోజూ తీసుకోవడం మంచిది. లేదా వారానికి రెండు మూడుసార్లు మొత్తం గుడ్డు తీసుకోవచ్చు.